ఐక్యరాజ్య సమితిలో శక్తివంతమైన సంస్ధ ఐన భద్రతా సమితి లిబియా పై ఆంక్షలు విధిస్తూ తీర్మానాన్ని ఏకగ్రీవంగా అమోదించింది. దానితో పాటు లిబియా పౌరులపై సైనికులు పోలీసులచేత విమాన దాడులు చేసినందుకు గడ్డాఫీపై “మానవతపై నేరపూరిత దాడులు” (క్రైమ్స్ ఎగైనెస్ట్ హ్యూమానిటీ) చట్టం కింద విచారణ జరపాలని అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుకు సిఫారసు చేస్తూ ఆమోదించింది. అటువంటి సిఫారసు తర్వాత తమను కూడా ఇబ్బందుల్లోకి నెడుతుందని కొంతమంది సంశయించినప్పటికీ చివరికి ఆమోదముద్ర వేశారు. చైనా అభిప్రాయంపై అనుమానాలు వ్యక్తం అయినప్పటికీ అదికూడా ఆంక్షలను సమర్ధించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అమెరికా తన రాయబార కార్యాలయాన్ని మూసివేసినట్లే బ్రిటన్ కూడా తాత్కాలికంగా తన రాయబార కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లుగా ప్రకటించింది.
లిబియాకు ఆయుధ సరఫరాపై నిషేధం, గడ్డాఫీ ప్రభుత్వంలోని ముఖ్య అధికారుల ఆస్తుల స్తంభన, వారి ఆర్ధిక కార్యకలాపాల తిరస్కరణ మొదలైన చర్యలు ఆంక్షల్లో ఉన్నాయి. గడ్డాఫీపై అంతర్జాతీయ న్యాయ స్ధానానికి రిపోర్టు చేయడం ద్వారా గడ్డాఫీ చుట్టూ ఉన్న అనుచర గణాన్ని గడ్డాఫీకి వ్యతిరేకులుగా మార్చవచ్చని భావిస్తున్నారు. అమెరికా, ఐక్యరాజ్య సమితిలలోని లిబియా రాయబారులు భద్రతా సమితి ఆంక్షలకు మద్దతు తెలిపారు. ఆందోళనలకు మద్దతు తెలిపిన లిబియా న్యాయ శాఖా మంత్రి ముస్తఫా అబ్దెల్-జలిలీ, మిలట్రీ, పౌర నాయకులతో కలిపి ఒక కమిటీ ఏర్పాటు చేసి దాని ద్వారా రానున్న మూడునెలల్లో ఎన్నికలు జరిపించాలని యోచిస్తున్నట్లుగా తెలిపాడు. బెంఘాజీలో ఆ కమిటీ రూపుదిద్దుకుంటున్నదని తెలిపాడు.
దేశంలో మూడొంతులు తమ ఆధినంలో ఉన్నట్లు గడ్డాఫీ తనయుడు సైఫ్ అల్-ఇస్మాయిల్ తెలిపాడు. తిరుగుబాటుదారులు మాత్రం ఎనభై శాతం ప్రాంతాన్ని తాము అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఈ లెక్కలను ధృవీకరించే వనరులేవీ అందుబాటులో లేవు. రాజధాని ట్రిపోలి గడ్డాఫీ మద్దతుదారుల అదుపులో ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాలను తిరుగుబాటుదారులు అదుపు చేస్తున్నట్లు తెలుస్తోంది. లిబియాలో 65 లక్షల్ జనాభా ఉండగా 20 లక్షల మంది ట్రిపోలీవాసులే.
విదేశీయులు లిబియా విడిచి వెళ్ళటానికి శత విధాలా ప్రయత్నిస్తునారు. విమానాశ్రాయాలు చాలా వరకు నిండి పోయాయి. తమ వంతు రావటానికి ప్రయాణికులు రోజుల తరబది ఎదురు చూస్తున్నారు. తమ వస్తువులను చాలామంది వదిలిపెట్టి వెళ్తున్నారు. లిబియాలో సైన్యాన్ని మొదటినుండీ గడ్డాఫీ బలహీనంగా ఉంచడంతో గడ్డాఫీకి వ్యతిరేకంగా అధి ముఖ్యమైన పాత్రను నిర్వహించలేక పోతున్నది.