శుక్రవారం “ఆగ్రహ దినం” గా పాటిస్తూ రాజధాని ట్యునిస్ లో లక్ష మందితో సాగిన ప్రజా ప్రదర్శనలు శనివారం కూడా కొన సాగాయి. శనివారం పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు పౌరులు జరిపారు. ప్రదర్శకుల రాళ్ళ దాడిలో పోలీసులు కూడ గాయ పడ్డారు. తాత్కాలిక ప్రభుత్వానికి ప్రధాన మంత్రి గా ఉన్న ఘన్నౌచీ రాజీనామా కోరుతూ ట్యునీషియా ప్రజలు ఆందోళనలు జరుపుతున్నారు. కొంతమంది రాజధాని ట్యునిస్ లో గుడారాలు వేసుకుని నిరసన కొనసాగిస్తున్నారు. ప్రధాన మంత్రి, పదవీచ్యుతుడైన బెన్ అలీ ప్రభుత్వంలో 1999 నుండీ ప్రధానిగా పనిచేసి ఆయనకు విధేయుడుగా పేరుబడ్డాడు. ఇంకా ప్రభుత్వంలో ఉన్న బెన్ ఆలీ అనుచరులంతా రాజీనామా చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.ప్రధాని సంస్కరణలు వేగవంతంగా అమలు చేయటం లేదని ట్యునీషియన్ లు ఫిర్యాదు చేస్తున్నారు.
శనివారం, ప్రదర్శకులకూ పోలీసులకూ మధ్య ఘర్షణ చాలా గంట్లపాటు కొనసాగింది. పోలీసులు, మొఖాలకు తొడుగులు ధరించి పౌరుల దుస్తుల్లో ఉన్నవారు లాఠీలు ధరించినవారు వీధుల్లో తిరుగుతూ ప్రదర్శకులను టియర్ గ్యాస్, తుపాకిలతో చెదరగొట్టటానికి తీవ్రంగా ప్రయత్నించినట్లు బిబిసి తెలిపింది. అయితె మాజీ అధ్యక్షుని మద్దతుదారలు ప్రభుత్వాన్ని అస్ధిరపరచాలని కుట్రతో డబ్బులిచ్చి ప్రదర్శనలను నిర్వహిస్తున్నారని రాయిటర్స్ తెలిపింది.
తాత్కాలిక ప్రభుత్వం కొన్ని సంస్కరణలను తెచ్చినప్పటికీ అవి ప్రజలను సంతృప్తిపరచలేదు. వేగంగా సంస్కరణలు అమలు చేయాలని వారు కోరుతున్నారు. ట్యునీషియా ఉద్యమం అరబ్ దేశాల్లో ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. ట్యునీషియా ఉద్యమ స్ఫూర్తితో ఈజిప్టు ప్రజలు కూడా ఆందోళనలు నిర్వహించి అధ్యక్షుడు ముబారక్ ను వెళ్ళగొట్టారు. ఇప్పుడు లిబియాలో గడ్డాఫీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఉధృతంగా పోరాటం చేస్తున్నారు.
ట్యునీషియాలో ఆందోళనల తర్వాత కూడా తమ మాట వినే మనుషులతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటంలో అమెరికా, ఫ్రాన్స్ సామ్రాజ్యవాదులు సఫలమయ్యాయి. ఇపుడున్న ప్రధాన మంత్రి సాధ్యమైనంత వరకూ సంస్కరణలను తక్కువ అమలు చేయటానికే ప్రయత్నిస్తున్నట్లు ప్రజలు అనుమానిస్తున్నారు. ప్రజల అనుమానాలు తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనే ఉన్నది. ఎన్నికలు జరిగే వరకూ ట్యునీషియా ప్రజలు శాంతించక పోవచ్చు.