అరబ్ దేశాల్లో ప్రజాస్వామిక సంస్కరణల కోసం చెలరేగుతున్న తిరుగుబాట్ల గురించి సమాచారం ఉన్న కర పత్రాలను ఉత్తర కొరియాలో జారవిడవడం ఆపకపోతే దక్షిణ కొరియాపై మిలట్రీ చర్య తీసుకోవలసి ఉంటుందని ఉత్తర కొరియా హెచ్చరించింది. ఉత్తర కొరియా తన పౌరులకు బయటి ప్రపంచం నుండి ఎటువంటి సమాచారం అందకుండా గట్టి చర్యలు తీసుకొంటుంది. బయటి దేశాలకు ఫోన్ సౌకర్యాలను సైతం అనుమతించదు. దానితో ఉత్తర కొరియా ప్రజలకు ప్రపంచంలో ఏం జరుగుతున్నదీ తెలిసే అవకాశం లేదు. అరబ్ దేశాల్లో తిరుగుబాట్ల సమాచారం కరపత్రాల ద్వారా అందిస్తే ఉత్తర కొరియాలో సైతం ప్రజాస్వామిక డిమాండ్లతో ప్రజలు ఉద్యమాలు చేస్తారని దక్షిణ కొరియా ఆశిస్తున్నది.
దక్షిణ కొరియా సైన్యం ఆహార పదార్ధాలు, మందులు, రేడియోలు కూడా ఉత్తర కొరియా ప్రజలకు వివిద మార్గాల్లొ చేర వేస్తున్నది. దానితోపాటు త్వరలో దక్షిణ కొరియా, అమెరికాలు సంయుక్తంగా మిలట్రీ డ్రిల్ జరపనున్నాయి. “దక్షిణ కొరియా జరుపుతున్న మానసిక ప్రచారం కొరియాల శాంతియుత విలీనం కోసం జరుగుతున్న ప్రయత్నాలకూ, ఉభయ కొరియాల ప్రజల సర్వతోముఖాభివృద్ధికీ తీవ్ర విఘాతం. ప్రచారాన్ని ఆపకుంటే దక్షిణ కొరియా భూభాగంపైకి నేరుగా కాల్పులు జరుపుతాం,” అని ఉత్తరకొరియా అధికారిక వార్తా సంస్ధ ఐన కె.సి.ఎన్.ఎ న్యూస్ ఏజెన్సీ ప్రకటించింది. కరపత్రాలు తయారు చేస్తున్న ప్రాంతాన్ని నాశనం చేస్తామని కూడ హెచ్చరించింది.
గత సంవత్సరం మార్చి నెలలో దక్షిణ కొరియాకి చెందిన జలాంతర్గామిపై టార్పెడో దాడి జరిగి రెండు దేశాల సముద్ర జలాల సరిహద్దు వద్ద నీటిలో మునిగి పోయింది. దాన్లో ఉన్న 46 మంది దక్షిణ కొరియా సైనికులు చనిపోయారు. టార్పెడో దాడి ఉత్తర కొరియా జరిపిందని దక్షిణ కొరియా ఆరోపిస్తున్నది. అయితే ఉత్తర కొరియా ఆ ఆరోపణలను తిరస్కరించింది. గత నవంబరు నెలలో సముద్ర జలాల్లో సరిహద్దు వద్ద ఉన్న “యోన్ ప్యాంగ్” ద్వీపంలొ దక్షిణ కొరియా మిలట్రీ డ్రిల్లు నిర్వహిస్తుండగా ఉత్తరకొరియా ద్వీపంపైకి కాల్పులు జరిపడంతో ముగ్గురు పౌరులు చనిపోయారు. తర్వాత కొద్దిరోజుల్లోనే అమెరికాతో కలిసి అదే ద్వీపంలో దక్షిణ కొరియా సంయుక్త మిలట్రీ డ్రిల్లు జరిపింది. దానికి ముందు డ్రిల్లు ఆపాలని ఉత్తర కొరియా డిమాండి చేసింది. లేకుంటే మళ్ళీ దాడులు చేస్తామని హెచ్చరించింది. కొరియా ప్రాంతంలో అప్పట్లో తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి. కాని ఉత్తర కొరియా చివరి నిమిషంలో వెనక్కి తగ్గడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఉత్తర కొరియా ఆరు పార్టీల చర్చలు తిరిగి ప్రారంభించాలని కోరుతోంది. రెండు కొరియాలు, జపాన్, రష్యా, చైనా, అమెరికా దేశాలు కలిసి కొరియాల భవిష్యత్తు పైన చర్చలు జరుపుతున్నాయి. చాలా ఏళ్ళనుండి జరుపుతున్న ఈ చర్చలనుండి ఉత్తర కొరియా ఏక పక్షంగా ఉపసంహరించుకొంది. చర్చల్లో ఉత్తర కొరియా అణువిధానం కూడా ఒక అంశం. ఉత్తర కొరియా అణు బాంబుల కోసం ప్రయత్నాలు నివారించడానికి చర్చలకు ఒప్పుకున్నందుకుగాను ఉత్తరకొరియాకు దక్షిణ కొరియా కొంతకాలం వివిధ రకాలుగా సాయం అందించింది. అమెరికా కుడా సాయం అందించింది. ఉత్తర కొరియా చర్చల నుంది వెళ్ళీపోయాక ఈ సాయం ఆగిపోయింది. దానితో పాటు అంతర్జాతీయ ఆంక్షలు కూడా విధించారు.
గత సంవత్సరం నుండి ఉ.కొరియా చర్చలు తిరిగి ప్రారంభించాలని డిమాండ్ చేస్తోంది. కాని ఉత్తర కొరియా మళ్ళీ మోసం చేయదనటానికి గ్యారంటీ ఏమిటని అమెరికా ద.కొరియాలు ప్రశ్నిస్తున్నాయి. చైనా ఉత్తర కొరియాకు మద్దతు పలుకుతోంది. దక్షిణ కొరియాలోని అమెరికా రాయబారి అమెరికాకు పంపిన లేఖలో చైనా, ఉత్తర కొరియా చర్యలతో విసిగిపోయిందనీ దక్షిణ కొరియా నేతృత్వంలో కొరియాల విలీనం జరపటానికి చైనా కూడా సుముఖంగా ఉందనీ రాశాడు. ఈ లేఖను వికీలీక్స్ గత డిసెంబరులో వెల్లడించింది. దీనిపై చైనా ఏమీ స్పందించ లేదు. ప్రైవేటు లేఖపై మేము స్పందించవలసిన అవసరం లేదని పేర్కొంది.
ఉత్తర కొరియా గత సంవత్సరం అణు పరీక్ష జరిపినట్లు ప్రకటించింది. కాని దానికి సంబంధించిన భూతల స్పందనలు చైనాలో కాని, రష్యా, అమెరికాలలో కానీ రికార్డు కాలేదు. లేదా చాలా బలహీనంగా రికార్డు అయ్యాయి. అవి అణు పరీక్షలు కావని అమెరికా కొట్టి పారేసింది. లేదా అణుపరీక్ష కోసం ప్రయత్నించి విఫలమయి ఉండవచ్చు అని కొందరు విశ్లేషకులు పేర్కొన్నారు. అణుపరీక్షల బూచి చూపి అమెరికా నుండి సాయం పొందాలని ఉత్తర కొరియా ప్రయత్నిస్తున్నదని రాజకీయ పరిశీలకుల్లో దాదాపు ఏకాభిప్రాయం వ్యక్తం అవుతున్నది. అయితే అణు రియాక్టర్లు ఉన్న చోట ఉత్తర కొరియా సొరంగం తవ్వుతున్నదనీ, దానర్ధం మళ్ళీ అణుపరీక్ష కోసం ప్రయత్నిస్తున్నదనీ ద.కొరియా ఆరోపిస్తున్నది.
ఈ నేపధ్యంలోనే త్వరలో అమెరికా, ద.కొరియాలు ఉమ్మది సైనిక విన్యాసాలు జరుపనున్నాయి.
