చైనాలో ప్రదర్శనకు పిలుపు, ఉక్కుపాదం మోపిన చైనా పోలీసులు


 

Police arrest a man in Shangai

షాంఘైలో ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న దృశ్యం

అరబ్ దేశాల్లో ప్రజాస్వామిక హక్కుల కోసం చెలరేగుతున్న ప్రజా ఉద్యమాలు చైనా ప్రభుత్వానికి సమస్యలను తెచ్చి పెడుతున్నాయి. ఆదివారం ట్యునీషియా తరహాలో చైనాలోని బీజింగ్, షాంగై నగరాల్లో జాస్మిన్ గేదరింగ్ జరపాలని అమెరికానుండి నిర్వహించబడుతున్న ఒక వెబ్ సైట్ చేసిన ప్రచారానికి ఎవరూ గుమిగూడకుండా చైనా పోలీసులు కట్టుదిట్టం చేశారు. విదేశీ విలేఖరులను కూడా వదల కుండా కెమెరాలను లాక్కొని ఫోటోలను తొలగించారు. ప్రదర్శన కోసం పిలుపునిచ్చిన ప్రాంతంలో ఎవరూ ఎక్కువ సేపు ఆగకుండా చీపుర్లతో తరిమివేశారు. ఒక అమెరికా విలేఖరిపై పిడిగుద్దులు కురిపించి నిర్బంధంలోకి తీసుకున్నారు.

బోక్సున్ డాట్ కామ్ (boxun.com) అనే వెబ్ సైట్ ఆదివారం ఫిబ్రవరి 27న ప్రదర్శనలు నిర్వహించవలసిందిగా పిలుపునిచ్చింది. బీజింగ్ లోని “వాంగ్ ఫూజింగ్ షాపింగ్ వీధి”లో ఉన్న మెక్ డొనాల్డ్స్ షాపు వద్ద గుమికూడాలని ఆ వెబ్ సైట్ పిలుపిచ్చింది. 40 పోలీసు వాహనాలు ఆ వీధిలో ఆదివారం అంతా కాపలా కాశాయి. షాంగై నగరంలో ఒక వ్యక్తిని పోలీసు వ్యాన్లోకి ఎత్తి కుదేశారు. ఈ దృశ్యాన్ని ఫోటోలు తీయకుండా గొడుగులు అడ్డం పెట్టారు. అయితే రాయిటర్స్ సిబ్బంది ఈ దృశ్యాన్ని కెమెరాలో బంధించగలిగారు. పోలీసులే సఫాయి కార్మికుల వేషం వేసుకుని చీపుర్లను సెంటర్లో ఎవరూ ఆగకుండా తరిమివేయటానికి ఉపయోగించారు. తైవాన్ విలేఖరులను కూడా కొట్టి నిర్బందంలోకి తీసుకున్నారు.

వారం రోజుల క్రితం ఇలాగే ఇంటర్నెట్ ద్వారా చైనాలో ప్రదర్శనలు జరపడానికి ఇచ్చిన పిలుపుతో కొద్దిమంది చేరారు. వారిలో కొంతమందిని హెచ్చరించి వదిలేయగా మరికొంతమందిని నిర్బంధంలోకి తీసుకున్నారు. అసమ్మతివాదులు, పౌరహక్కుల కార్యకర్తలు వారిలో ఉన్నారు. అరబ్ దేశాల్లోవలే చైనాలో ఉద్యమాలు తలెత్తే విషయాన్ని చైనా అధికారులు కొట్టి పడేస్తున్నప్పటికీ వారు తీసుకుంటున్న చర్యలు వారు ఈ విషయాన్ని తీవ్రంగానే తీసుకుంటున్నట్లు తెలియ జేస్తున్నాయి.

చైనాలో అరబ్ ప్రజా ఉద్యమాలపై సమాచారాన్ని ఇంటర్నెట్ లో చూడకుండా సెన్సార్ విధించారు. జాస్మిన్ విప్లవం, జాస్మిన్ ఇలాంటి పదాలతో ఇంటర్నెట్లో ఎవరన్న పోస్ట్ చేస్తే తొలగిస్తున్నారు. అరబ్ దేశాల్లోని పరిణామాలపై మెసేజ్ లు పంపకుండా నిషేధిస్తున్నారు. ఇవన్నీ చైనా అధికారులు ఏదో మేరకు ఆందోళనలో ఉన్న సంగతిని తెలుపుతున్నాయి. చైనాలో ఏకపార్టీ పాలన ఉండటం, ప్రజాస్వామ్యం పేరుతో గతంలో కొన్ని ఉద్యమాలు రావటం చైనా ఆందోళనకు కారణాలు కావచ్చు. కానీ 1.2 బిలియన్ పైగా జనాభా ఉన్న చైనాలో తక్కువ సమయంలో ఉద్యమాలు తలెత్తడం సాధ్యం కాక పోవచ్చు.

వ్యాఖ్యానించండి