మధ్యంతర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్యునీషియా ప్రజల భారీ ప్రదర్శన


 

French protests in Tunisia

ట్యునీషియాలో తాజా ప్రదర్శనలు

ప్రజల తిరుగుబాటుతో దేశం వదిలి పారిపోయిన ట్యునీషియా మాజీ అధ్యక్షుడు బెన్ ఆలీ మద్దతుదారులే తాత్కాలిక ప్రభుత్వం నడుపుతుండడంతో మొదటినుండి నుండి అసంతృప్తితో ఉన్న ట్యునీషియా ప్రజలు తాత్కాలిక ప్రధాన మంత్రి మహమ్మద్ ఘన్నౌచీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రాజధాని ట్యునీస్ లో భారీ ప్రదర్శన నిర్వహించారు. బెన్ ఆలీ ప్రభుత్వంలో ఉన్నవారెవరూ ప్రభుత్వంలో ఉండకూడదని ప్రజలు మాజీ అధ్యక్షుడు సౌదీ అరేబియా పారిపోయిన దగ్గర్నుండీ డిమాండ్ చేస్తున్నారు. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినప్పటికీ కొంతమంది ఆందోళనకారులు తమ ఆందోళనలను కొనసాగించారు. శుక్రవారం లక్ష మంది ప్రజలు ప్రదర్శనలో పాల్గొని, “ఘన్నౌటీ, వెళ్ళిపో” అని నినాదాలు చేశారు. పోలీసులు భాష్పవాయు గోళాలను ప్రయోగించి ప్రదర్శకులను చెదరగొట్టారు. వారు జరిపిన హెచ్చరికా కాల్పుల్లో ఒక ఆందోళనకారుడు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.

ఆదివారం నుండీ…

గత ఆదివారంనుండి ఆందోళనకారులు ప్రధానమంత్రి కార్యాలయం పక్కన గుడారాలు వేసుకొని నివసిస్తూ ఆందోళన జరుపుతున్నారు. అయితే ఈ ఆందోళనలు పశ్చిమ సామ్రాజ్యవాదుల చేతుల్లో ఉన్న వార్తా సంస్ధల దృష్టిని ఆకర్షించలేక పోతున్నాయి. పశ్చిమ దేశాల మద్దతుదారులే ప్రభుత్వం నడుపుతున్నందున ఇక ట్యునీషియన్ల ఆందోళనలను తమ వార్తల్లో తెలియజేయాల్సిన అవసరం వార్తా సంస్ధలకు లేదు. దానితో ట్యునీషియన్ల అసంతృప్తి ప్రపంచానికి తెలియడం లేదు. తాము తెస్తామని హామీ ఇచ్చిన సంస్కరణలను తాత్కాలిక ప్రభుత్వం తెస్తుందని ప్రజలకు నమ్మకం కలగడం లేదు. ప్రజాస్వామిక సంస్కరణలకు కావాల్సిన చర్యలను చాలా నెమ్మదిగా తీసుకుంటున్నట్లుగా ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు.

జులైలో ఎన్నికలు నిర్వహిస్తామని తాత్కాలిక ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రజాస్వామిక సంస్కరణలకోసం వివిధ పార్టీలతో జరుపుతున్న సంప్రతింపులు మార్చి మధ్యకాలం దాట కూడదని నిర్ణయించినట్లుగా ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. మాజీ అధ్యక్షుడి ప్రభుత్వంలోని 110 మంది ఆస్తులను స్తంభింపజేసినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. ఆందోళనకారులపైకి కాల్పులు జరిపి వారు మరణించడానికి కారకుడైనందుకు బెన్ ఆలీతో పాటు అతని భార్యపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేసామని ప్రకటించింది. కానీ ప్రధానమంత్రి పైనే వ్యతిరేకతో ఉన్నందున ఈ చర్యలేవీ ప్రజలను సంతృప్తిపరచలేదు. తమ ఉద్యమం హైజాక్ కు గురైందన్న అసంతృప్తి వారిలో పేరుకుపోయింది.

పాక్షికత పాటిస్తున్న పశ్చిమ దేశాల మీడియా

శుక్రవారం నాటి ప్రదర్శనలను రిపోర్టు చేసినప్పటికీ బిబిసి ఆందోళనకారుల డిమాండ్లకు వ్యతిరేకంగా పరిస్ధితిని విశ్లేషించింది. ట్యునీషియా ప్రభుత్వం శక్తికోద్దీ పని చేస్తున్నట్లుగా పేర్కొంది. ప్రజల

ఫిర్యాదులు అనంతంగా వస్తుండటంతో వాటన్నిటినీ పరిష్కరించడం ప్రభుత్వానికి కష్టంగా ఉందని తెలిపింది. పోలీసు కాల్పుల్లో ఒక్కరు మాత్రమే గాయపడ్డారని బిబిసి తెలుపగా, రాయిటర్స్ సంస్ధ అనేకమంది గాయపడినట్లుగా తెలిపింది. ప్రదర్శనకారులు అంతర్గత మంత్రిత్వ శాఖ భవనం కిటికీల్లోనుంచి రాళ్ళు విసిరి ధ్వంసం చేయటానికి ప్రయత్నించారనీ, వారి రాళ్ళదాడుల్లో పోలీసులు గాయపడి ఆసుపత్రిలో చేరారని రాయిటర్స్ తెలిపింది. శుక్రవారం రోజును “ఆగ్రహదినం” గా పాటించినట్లు రాయిటర్స్ తెలపగా, బిబిసి ఆ ఊసే ఎత్తలేదు. పోలీసులు కాల్పులు జరిపాక ప్రదర్శకులు వెళ్ళిపోయారని బిబిసి రాయగా రాయిటర్స్ పోలీసుల కాల్పులకు ప్రజలు ఏ మాత్రం కదల్లేదని తెలిపింది. మిలిటరీ హెలికాప్టర్లు ప్రదర్శనకారులపై చక్కర్లుకొడుతూ బెదరగొట్టాలని ప్రయత్నించినా ప్రజలు బెదరలేదని తెలిపింది.

వ్యాఖ్యానించండి