వికీలీక్స్ ఛీఫ్ ఎడిటర్ ను స్వీడన్ కు అప్పగించడానికి బ్రిటన్ కోర్టు ఆమోదం


 

Julian

జులియన్ అస్సాంజ్

వికీలీక్స్ ఛీఫ్ ఎడిటర్ జులియన్ అస్సాంజ్ కు ప్రపంచ వ్యాపింతంగా ఉన్న అభిమానులకు నిరాశ కలిగిస్తూ బ్రిటన్ కోర్టు అతనిని స్వీడన్ పోలీసులకు అప్పగించడానికి ఆమోదం తెలిపింది. స్వీడన్ లో తనకు నిష్పక్షపాత న్యాయం దొరకదని జులియన్ వాదించినప్పటికీ కోర్టు అంగీకరించ లేదు. అయితే కోర్టు రూలింగ్ పై అప్పీలుకు వెళ్ళటానికి జులియన్ నిర్ణయించుకున్నట్లుగా అతని లాయర్లు తెలిపారు. స్విడన్ లో రేప్ చట్టాలు స్త్రీలకు మనోభావాలకు అనుగుణంగా సున్నితంగా ఉంటాయన్న పేరుంది. సహచరి అయినప్పటికీ అనుమతి లేకుండా, ఇష్టం లేని విధంగా సంగమం లో పాల్గొంటే అది మానభంగం కిందికే వస్తుంది.

స్వీడన్ లో ఇద్దరు మహిళలు జులియన్ పై మానభంగ నేరాన్ని మోపిన సంగతి విదితమే. తాను ఎటువంటి నేరానికి పాల్పడలేదనీ, పరస్పర అమోదంతోనే తాము కలుసుకున్నామనేది జులియన్ వాదన. వాస్తవానికి మహిళలిద్దరూ అప్పటివరకు జులియన్ అభిమానులే అయినప్పటికీ కండోమ్ ధరించనందున మహిళలు ఎయిడ్స్ పరీక్ష చేసుకోమని అడిగారనీ అందుకు జులియన్ ఒప్పుకోక పోవడంతో మహిళలు సలహా కోసం పోలీసుల్ని సంప్రదించారనీ పోలీసులు మానభంగ నేరారోపణకు తగిన పునాది ఉందని భావించి కేసు నమోదు చేసారనీ స్వీడన్ పత్రికలు అప్పటిలో తెలిపాయి. తర్వాత ఛీఫ్ ప్రాసిక్యూటర్ రేప్ నేరానికి తగిన ప్రాతిపదిక లేదని భావించి కేసు రద్దు చేశాడు.

తర్వాత వేరే పట్టణ ప్రాసిక్యూటర్ కేసును మళ్ళీ తెరిచి రేప్ అభియోగం నమోదు చేశాడు. అయితే జులియన్ స్వీడన్ లో ఉండగానే పోలీసులకు వివరణ ఇవ్వటానికి ప్రయత్నించినప్పటికీ అవకాశం ఇవ్వలేదని చెపుతున్నాడు. స్వీడన్ నుంచి వచ్చేశాక కేసు విషయమై ప్రశ్నించాలి రమ్మని పిలవడంతో అనుమానం వచ్చి జులియన్ నిరాకరించాడు. అప్పటికే జులియన్ అమెరికా రాయబారులు తమ ప్రభుత్వానికి పంపే కేబుల్స్ ను లీక్ చేయటం ప్ర్రారంభించాడు. రద్ధు చేసిన కేసును తిరిగి తెరవటం వెనుక అమెరికా ఒత్తిడి పని చేసిందని జులియన్, అతని లాయర్లతో పాటు అతని అభిమానులు కూడా అనుమానిస్తున్నారు.

స్వీడన్ పోలీసులు కేవలం ప్రశ్నించటానికి మాత్రమే రమ్మంటున్నారు. అంతవరకే అయితే ఇంటర్నెట్ ద్వారానో, వీడియో కాన్ఫరెన్స్ ద్వారనో, పోస్టు ద్వారానో ప్రశ్నించవచ్చు అని జులియన్ లాయర్లు వాదిస్తున్నారు. స్వీడన్ వెళ్ళాక అక్కడి ప్రభుత్వం తనను అమెరికాకు అప్పగించవచ్చని జులియన్ ఆందోళన చెందుతున్నాడు. జులియన్ ను ఎలాగయినా రప్పించి జైల్లో పెట్టాలని అమెరికా ప్రయత్నిస్తోంది. గూఢచర్యం కేసు పెట్టే అవకాశం ఉందీ లేనిదీ పరిశీలించడానికి అమెరికా ఒక గ్రాండ్ జ్యూరీనే నియమించింది. ఇవన్నీ జులియన్ అనుమానాలను నిజమనిపించేలా ఉన్నాయి.

వ్యాఖ్యానించండి