రానున్నది జన రంజక బడ్జెట్టేనట!


 

Manmohan

ప్రధాని మన్మోహనుడు

మరో నాలుగు రోజుల్లో ఫిబ్రవరి 28 తేదీన 2011-12 ఆర్ధిక సంవత్సరం నిమిత్తం ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ప్రవేశ పెట్టనున్న బడ్జెట్ జన రంజకంగా ఉండనున్నదని విశ్లేషకులు, వార్తా సంస్ధలు, ఉత్సాహ పరులు అంచనా వేస్తున్నారు. ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కూడా ఆ మేరకు సూచనలు ఇస్తున్నాడని గురువారం నాటి ఆయన ప్రకటన ద్వారా అంచనా వేస్తున్నారు. జన రంజక బడ్జెట్ వలన కొత్త ఆర్ధిక సంవత్సరాంతానికి కోశాగార లోటు ప్రకటిత లక్ష్యం అయిన 4.8 శాతం మించిపోవచ్చని అంతర్జాతీయ శ్రేయోభిలాషులు అప్పుడే నిట్టూర్పులు కూడా విడుస్తున్నారు.

ప్రస్తుతం ఆర్ధిక రంగంలో తక్షణ లక్ష్యం ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తేవటమేనని ప్రధాన మంత్రి గురు వారం లక్ష్య ప్రకటన కావించారు. దానికోసమేనేమో అన్నట్లుగా బడ్జెట్ సెషన్ లోనే ప్రజా రంజకమైన, కలకాలం నిలిచి పోయే అద్భుత “ప్రజా పంపిణీ వ్యవస్ధ”కు శ్రీకారం చుట్టనున్నామని ఆయన ఊరించారు. ప్రజా పంపిణీ వ్యవస్ధను మరింతగా ప్రజా రంజకంగా మలిచి పటిష్టం చేయటం వలన సరఫరా సంబంధిత ఆటంకాలు తొలగి ద్రవ్యోల్బణం తగ్గటానికి దోహద పడుతుందని ఆయన ధైర్యం. ప్రజా పంపిణీ వ్యవస్ధను “ఆహార భద్రతా చట్టం” ద్వారా మరింత పటిష్టం చేస్తామని ఆయన చెపుతున్నారు.

ఇండియాలో ప్రభుత్వ పధకాలు ప్రజల దాకా చేరటానికి చాలా అడ్డంకులు ఎదురవుతున్నాయని ఆర్ధిక పండితుల అభిప్రాయం. అంతవరకు నిజం కూడా. ఏమంటే, ప్రజా పంపిణీ వ్యవస్ధ ద్వారా పేదల కోసం కేంద్రం సబ్సిడీ ధరలకు అందజేస్తున్న నిత్యావసర సరుకులు వారి వరకు సరిగ్గా చేరడంలేదని ప్రభుత్వం, పండితుల అభిప్రాయం. ప్రజలకు చేరేలోపు దళారులు, అనినీతి పరులు, బ్లాక్ మార్కెటీర్లు చేరి సరుకులు తమ లక్ష్యం చేరకుండానే పక్కదారి పట్టిస్తున్నారనేది వీరి స్ధూల అభిప్రాయం. ఈ ఆటంకాలను ఇంగ్లీషులో “సప్లై సైడ్ బాటిల్ నెక్స్” అంటారు. అంటే “సరఫరా సంబంధిత ఆటంకాలు” అని అర్ధం. ఈ ఆటంకాల వలన సరుకులు బ్లాక్ మార్కెట్ కు తరలివెళ్ళి ధరలు పెరుగుతున్నాయి. పెరిగిన ధరలు ద్రవ్యోల్బణం పెరగటానికి దోహద పడుతున్నాయి.

ఏతా వాతా తేలేదేమంటే దళారులు, అవినీతిపరులకు అవకాశాలు లేకుండా ప్రజా పంపిణీ వ్యవస్ధ ద్వారా వెళ్ళే సరుకులు నేరుగా వినియోగదారుని వద్దకు చేర్చగలిగితే ద్రవ్యోల్బణం ఆ మేరకు తగ్గుతుంది. కానీ పిల్లి మెడలో గంట కట్టేది ఎవరు? అవినీతి పరులు, దళారులు చట్టాలకు, చట్టాలను అమలు పరిచేవారికి దగ్గరి చుట్టాలు. కనుక వారిని అదుపు చేయటం చట్టాల పని కాదు. జనమే చొరవ తీసుకుంటే చట్టాన్ని చేతిలోకి తీసుకుంటారా? అని చట్ట దేవత ఆగ్రహిస్తుంది. తటాలున ఏ నక్సలైటో అని ముద్ర వేసినా వేస్తారు. అటు అమ్మా పెట్టదు, అడుక్కు తినానివ్వదు. మరి మన్మోహన్ గారు ఏదో కిటుకు కనిపెట్టానంటున్నాడు. ప్రజా పంపిణీ వ్యవస్ధను పటిష్టం చేయటమే ఆ కిటుకు ట!

ఇక “అహార భద్రతా చట్టం” ద్వారా దేశంలోని పేదలందరితో పాటు దిగువ మధ్య తరగతి వారికి సైతం సబ్సిడీ ధరలకు సరుకులు పంపిణీ చేయటం మొదలెడతామని ప్రధాని చెప్పారు. ఐతే అందరికి ఒకే ధర కాకుండా పేదవారికి, మిగిలిన వారికి ధరల్లో కొంత తేడా ఉంటుంది. వచ్చే సంవత్సరంలో నాలుగైదు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతాయి. అవినీతి ఆరోపణల్లో నిండా మునిగి ఉన్న యు.పి.ఏ ప్రభుత్వాన్ని ఈ పటిష్ట ప్రజా పంపిణీ వ్యవస్ధ, ఆహార భద్రతా చట్టాలు రెండూ పైకి తేలుస్తాయని హై కమాండ్ వారు విశ్వసిస్తున్నారు.

అయితే, మార్కెట్ కు గట్టి మద్దతుదారులైన వారు, విదేశీ సామ్రాజ్య వాద బాసులు, వారి అనుచర వార్తా సంస్ధలు మాత్రం ప్రజా రంజక పధకాల వలన ప్రభుత్వ వృధా ఖర్చు పెరిగి పన్నుల వసూళ్ళు తగ్గి , వసూళ్ళ ఆదాయం కంటే పధకాల ఖర్చు తడిసి మోపెడై కోశాగార లోటు ఎక్కువ ఔతుందనీ, అప్పుడు ప్రపంచ బ్యాంకు, ఐ.ఎం.ఎఫ్ ల ప్రోద్బలంతో స్వయంగా విధించుకున్న 4.8 శాతం కోశాగార లోటు లక్ష్యాన్ని చేరుకోలేరనీ సుదీర్ఘంగా నిట్టూర్పులు విడుస్తున్నారు. పాపము శమించు గాక!

ఒక ఆశ్చర్యమేంటంటే, ఉద్యోగాల పెరుగుదలకు ఆటంకం కలగని రీతిలో ద్రవ్యోల్బణం కట్టడికి మేము కంకణం కట్టుకున్నామని ప్రధాని ప్రకటించారు. ఉద్యోగాలా! ఎప్పుడో ఎక్కడో విన్నట్లుగా ఉంది గదండీ? అదే దేజా వూ అంటే. మరి ప్రధాని గారు పొరపాటున అన్నారేమో తెలియదు. ఖాళీల భర్తీ మాట అటు ఉంచి ఎన్ని ఖాళీలు ఉన్నాయో చూడటం కూడా మరిచి పోయిన ప్రభుత్వం గారు హఠాత్తుగా ఉద్యోగాలు అంటుంటే ఆశలు మోసులెత్తుతాయేమో, తస్మాత్, జాగ్రత్త! అవినీతి ఆరోపణలు ఊపిరాడికుండా చేస్తూ, తెలంగాణ అనీ ఇంకోటనీ జనాలు గొడవ చేస్తుంటే, అదే సమయం లో రాష్ట్రాల ఎన్నికలు వస్తుంటే… అటువంటి సమయాల్లో మన నాయకులు ఉద్యోగాలంటూ సంధి ప్రేలాపనలు చేయటాన్ని అంతగా పట్టించుకోనవసరం లేదు.

వ్యాఖ్యానించండి