గరిష్ట స్ధాయికి ఆయిల్ ధరలు, షేర్ మార్కెట్ కు భారీ నష్టాలు


 

NSE

నేషనల్ స్టాక్ ఎక్ఛేంజ్

ఇండియా షేర్ మార్కెట్లు గురువారం భారీ స్ధాయిలో నష్ట పోయాయి. అసలే అధిక ద్రవ్యోల్బణం, వరుసగా చుట్టుముడుతున్న అవినీతి ఆరోపణల కారణంగా కొత్త సంవత్సరం ప్రారంభం నుండీ ఒడిదుడుకులకు లోనవుతున్న భారత షేర్లు లిబియా ఆందోళనలు ఆశనిపాతంగా పరిణమించాయి. పదహారు నెలల గరిష్ట స్ధాయిలో నష్టాలను నమోదు చేశాయి. బోంబే స్టాక్ ఎక్ఛేంజ్ 546 పాయింట్లు (3 శాతం) నష్టపోయి 17,632 పాయింట్ల వద్ద క్లోజ్ కాగా నేషనల్ స్టాక్ ఎక్ఛేంజ్ 175 పాయింట్లు (3.2 శాతం) నష్టపోయి 5,263 పాయింట్ల వద్ద క్లోజ్ అయ్యింది.

లిబియాలోని ప్రజాందోళనలు, అనిశ్చితి ఇతర ఆయిల్ ఉత్పత్తిదారులయిన అరబ్ దేశాలకు కూడా పాకనున్నాయని భయాలు సర్వత్రా వ్యాపించటంతో షేర్ మార్కెట్ లో ఇటీవల ఎన్నడూ లేనంతగా అమ్మకాలు జరిగాయి. ప్రధానంగా ఫైనాన్స్ కంపెనీలు తీవ్రంగా నష్టపోయి పతనం వైపుకి మార్కెట్ ని తీసుకెళ్ళాయి. ఫైనాన్స్ షేర్ల ప్రభావం ‘ఋణాలు అవసరమయ్యే’ రియల్ ఎస్టేట్, ఆటో మొబైల్ రంగాలు అధిక వడ్డీ రేట్ల భయంతో ఫైనాన్స్ షేర్లను అనుసరించాయి. లిబియా పరిణామాల ప్రభావం ప్రపంచ మార్కెట్లన్నింటి పైన ప్రతికూలంగా పడుతున్నది.

ఆయిల్ ధరలు మాత్రం ఉత్పత్తి తగ్గిపోతుందన్న అంచనాతొ అధిక లాభాలను ఆర్జించాయి. నిమెక్స్ క్రూడ్ ఆయిల్ ఎన్నడూ లేనంతగా ఆరు పాయింట్లు పెరిగింది. బ్రెంట్ క్రూడ్ సైతం 7.5 శాతం పెరిగి రెండున్నర సంవత్సరాల గరిష్ట స్ధాయికి (బ్యారెల్ కు 120 డాలర్లు) చేరింది. లిబియా రోజుకు 400,000 (20 శాతం) బ్యారెళ్ళ ఉత్పత్తిని తగ్గించింది. ఒక మిలియన్ బ్యారెళ్ళ వరకు తగ్గించిందని మరి కొందరు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాయిటర్స్ సంస్ధ లిబియా 25 శాతం ఉత్పతి తగ్గించినట్లుగా లెక్కించింది. లిబియా రోజుకి 1.8 మిలియన్ బ్యారెళ్ళ ఆయిల్ ను రోజుకు ఉత్పత్తి చేస్తుంది. ప్రపంచ ఆయిల్ ఎగుమతుల్లో లిబియా వాటా రెండు శాతం ఉంది.

ఆయిల్ ధరలపై అనిశ్చిత పరిస్ధితి మరింత అధికం కావటం వలన ఒక్క గురువారం రోజే ఎఫ్.ఐ.ఐలు 600 మిలియన్ల డాలర్లను ఇండియా షేర్ మార్కెట్ల నుండి ఉపసంహరించుకున్నట్లుగా సి.ఎన్.బి.సి వెబ్ సైట్ తెలిపింది. భారత ప్రధాన మంత్రి ద్రవ్యోల్బణం తగ్గించి తీరుతామని ఈ సారి పార్లమెంట్ లోనే ప్రకటించాడు. మరోవైపు రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లండ్ ఇండియా ద్రవ్యోల్బణం ఇంతకంటే నియంత్రణలోకి రావటం కష్టమేనని తెలిపింది. ఆయిల్ ఉత్పత్తి, ధరలపై నెలకొని ఉన్న అనిశ్చిత పరిస్ధితి చైనా షేర్ మార్కెట్ల పై అంతగా ప్రభావం చూపకపోవడం గమనార్హం. ఇప్పుడు అందరూ బడ్జెట్ వైపు ఆశగా చూస్తున్నారు. బడ్జెట్ లో సంక్షేమ పధకాలకు కేటాయింపులు ఎక్కువ ఉండొచ్చని భావిస్తున్నారు.

వ్యాఖ్యానించండి