ధాన్యం ఎగుమతికి వ్యవస్యాయ మంత్రి శరద్ పవార్ అత్యుత్సాహం


 

Traditional cleansing of grain

కల్లంలో ధాన్యాన్ని తూర్పారబెడుతున్న శ్రామిక మహిళ

రెండున్నర సంవత్సరాల నుండి ధాన్యం ధరలు చుక్కల్లో కొనసాగుతుండటం వలన ఆహార ద్వవ్యోల్బణం, దానివల్ల ప్రదాన ద్రవ్యోల్బణం అధికంగా ఉన్నప్పటికీ, దాన్ని తగ్గించే విషయం ఏ మాత్రం పట్టించుకోని కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి శరద్ పవార్, ఇప్పుడు దేశంలోని ధాన్యాన్ని ఎగుమతి చేయటానికి మాత్రం తెగ ఉత్సాహపడి పోతున్నాడు. అంతర్జాతీయంగా బియ్యం, గోధుమల ధరలు పెరగడంతో, పెరిగిన ధరల్ని సొమ్ము చేసుకోవటానికి ఇదే మంచి సమయమని ఆయన బుధవారం ప్రకటించాడు. ఇప్పుడు ఎగుమతి చేస్తే లాభపడేది మిల్లర్లు, దళారీలు, ఎగుమతిదారులు తప్ప ఆరుగాలం కష్టించే రైతులకు ఏ మాత్రం ప్రయోజనం ఉండదు. మన మంత్రులు, అధికారులు పని చేసేది కూడా దళారీలు, వ్యాపారుల కోసమే తప్ప ప్రజల కోసం కాదు కనక ధాన్యం ఎగుమతి చేద్దామంటూ శరద్ పవార్ ఉత్సాహంగా ప్రకటిస్తున్నాడు.

అమెరికా తర్వాత వరి, గోధుమలకు సంబంధించి అతి పెద్ద ఉత్పత్తిదారు అయిన భారత దేశం 2007 నుండి ధాన్యం ఎగుమతులపై నిషేధం విధించింది. కేవలం దౌత్య ఒప్పందాల ద్వారా మాత్రమే పరిమిత ఎగుమతులను అనుమతి ఇస్తూ వచ్చింది. ఆ తర్వాత గత మూడు సంవత్సరాలనుండి ధాన్యం ఉత్పత్తి బాగా పెరగడం వలన దేశంలో ధాన్యం నిల్వలు బాగా పెరిగాయి. దేశంలో గిడ్డంగులన్నీ నిండిపోయి నిలవ చేయటానికి చోటు లేక గిడ్డంగుల బయట నిలవ చేయటం మొదలు పెట్టారు. వర్షాలకు తడిసి ఆరుబయట నిలవ ఉంచిన ధాన్యం కుళ్ళిపోతుండటంతో వాటిని పేదలకు ఉచితంగా పంపిణీ చేయాలంటూ గత సంవత్సరం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. సుప్రీం కోర్టు దానిపై విచారణ జరుపుతూ ధాన్యాన్ని కుళ్ళబెట్టే బదులు పస్తులుంటున్న పేదలకు ఉచితంగా పంపిణీ చేయమని ప్రభుత్వాన్ని కోరింది. దానికి అప్పటి ఆహార, వ్యవసాయ శాఖల మంత్రి “అలా కుదరద”ని నిష్కర్షగా సమాధానం ఇచ్చాడు. దాంతో సుప్రీం కోర్టు సీరియస్ అయ్యింది. దరిద్రం అనుభవిస్తున్న వారికి పంపిణీ చేయటం కంటే కుళ్ళబెట్టడానికే ప్రాధాన్యం ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తూ, ఉచిత పంపిణీకి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. రెండంకెల జి.డి.పి పెరుగుదల రేటు కోసం రాత్రింబవళ్ళు కలలు కంటూ దేశాన్ని త్వర త్వరగా ప్రైవేటు, బహుళజాతి కంపెనీలకు అమ్మి పారేయటానికి కంకణం కట్టుకున్న ప్రధాన మంత్రి ఈ సారి జోక్యం చేసుకున్నాడు. “ప్రభుత్వానికి మాత్రమే సంబంధించిన విధాన నిర్ణయాల ప్రక్రియల్లో కోర్టులు జోక్యం చేసుకోవడం సరికాదని ప్రకటించాడు. దానితో సుప్రీం కోర్టు మరింత కోపగించుకొని “పంచడానికి చర్యలు తీసుకోమన్నాం తప్ప, మీ తీర్పుని మేం అడగలేదు” అన్నది. అలా అన్నదే కానీ, ఆ తర్వాత పేదలకు కుళ్ళి పోతున్న ధాన్యాన్ని ఉచితంగా పంచే విషయం ఏమయ్యిందీ ఇంతవరకూ తెలియలేదు.

వంద కోట్లకు పైగా జనాభా గల భారత దేశంలో మూడొంతులు వ్యవసాయంపై ఆధారపడ్డవారే. అటువంటి ముఖ్య శాఖకు కేబినెట్ మంత్రి అయి ఉండి కూడా కాసులు విరగ కాస్తున్న క్రికెట్ రంగం లోకి అడుగు పెట్టి భారత క్రికెట్ కౌన్సిల్ కి పోటీ చేసి గెలిచినా సంతృప్తి చెందక, ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అధ్యక్ష పదవికి కూడా పోటీ చేసి గెలిచి ప్రస్తుతం ఆ పదవిలో చక్ర తిప్పుతున్న వ్యవసాయ మంత్రి శరద్ పవార్, ధాన్యం ఎగుమతుల వలన ఇప్పటికే చుక్కలను తాకుతున్న ధాన్యం ధరలు మరింత పేట్రేగిపోతాయన్న విషయాన్ని చూడకుండా, కేవలం ఎగుమతులకు అనుమతించటం వలన వచ్చిపడే కమీషన్ లను మాత్రమే చూడటంలో ఆశ్చర్యం లేదేమో? అటువంటి వ్యక్తి ధాన్యం కుళ్ళిపోవటానికయినా ఇష్టపడతాడు తప్ప ఆకలి కడుపులను ఉచితంగా నింపడానికి ఇష్ట పడక పోవటం వారి వర్గ లక్షణం తప్ప మరొకటి కాదు. అసలు వ్యవసాయ మంత్రిగా ఉంటూ క్రికెట్ రంగంలో మరో పదవికోసం వెంపర్లాడటం ఎంతవరకు సరైనది అనేది అడిగేవాడే లేక పోవటం మరీ దారుణం.

ప్రపంచ వ్యాపితంగా అధికంగా ఉన్న ఆహార ద్రవ్యోల్బణం , 2008 సంవత్సరం నాటి ఆహార సంక్షోభం మళ్ళీ రాకుండా ఉండటానికి ఆప్రికా, మధ్య ప్రాచ్య దేశాలు ధాన్యం దిగుబడుల కోసం ఎగబడుతుండటం కారణాలతో ధాన్యం రేట్లు ప్రస్తుతం ఎక్కువ రేటు పలుకుతోంది. ఈ దేశాల్లో ఆహార సరుకుల ధరల ధరలు చుక్కలను తాకుతుండటంతో అల్లర్లు కూడా చెలరేగుతున్నాయి. అరబ్ దేశాల్లో చెలరేగుతున్న ప్రజా పోరాటాలకు అహార ధరలు అందుబాటులో లేక పోవటం వలన కడుపు నిండా తిండి దొరకని పరిస్ధితులు ఏర్పడటం కూడా ఒక కారణం. అమెరికాలో పండే గోధుమ, మొక్కజొన్న, సోయాబీన్స్ కూడా బాగా అధిక రేట్లు పలుకుతున్నాయి. అమెరికాలో ఆహార ధాన్యాలను బయో ఇంధనం అయిన ‘ఇధనాల్’ ను ఉత్పత్తి చేయటానికి కేటాయించటం పెరగడంతో ప్రపంచ వ్యాపింతంగా ఆహారధరలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. అమెరికా అధికారులు మాత్రం ఇండియా, ఆఫ్రికా లాంటి ప్రాంతాల్లో ప్రజలు ఎక్కువ తింటున్నందున ఆహార ధరలు పెరుగుతున్నాయని తమ తప్పును మరొకరిపై నెట్టే ప్రయత్నం చేస్తోంది.

ఫిబ్రవరి 1 నాటికి ఇండియాలో గోధుమల నిల్వలు 19.4 మిలియన్ టన్నుల వరకూ ఉన్నాయి. ఈ సంవత్సరానికి ప్రబుత్వం లక్ష్యంగా పెట్టుకున  8.2 మిలియన్ టన్నుల కంటే ఇది చాలా అధికం. వరి ధాన్యం సేకరణ లక్ష్యం ఈ సంవత్సరం 11.8 మిలియన్ టన్నులు కాగా,  27.8 మిలియన్ టన్నులను ఇండియా సేకరించింది. ఈ నిల్వలపైన వ్యవసాయ మంత్రికి కన్నుకుట్టింది. పాకిస్తాన్ కూడా గత మూడు సంవత్సరాలనుండి ధాన్యం ఎగుమతులను నిషేదించింది. గత జనవరి నెల నుండి అంతర్జాతీయ ధరలనుండి లాభం పొందటానికి ఎగుమతులు ప్రారంభించింది. పాకిస్తాన్, తన ధాన్యాన్ని టన్నుకు 320 నుండి 330 డాలర్ల వరకు అమ్ముతున్నది. అదే క్వాలిటీ ధాన్యాన్ని ఉత్పత్తి చేసే ఇండియా అధిక నిల్వల కారణంగా 310 డాలర్లకే అమ్ముకోవచ్చనీ తద్వారా పాకిస్తాన్ ని అధిగమించి మంచి లాభాలు ఆర్జించ వచ్చనీ అంతర్జాతీయ మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ ఇండియాలో రైతులు ఇప్పటికే దళారులకు అమ్ముకున్నందున ఎగుమతుల లాభాలను దళారులకో మిల్లర్లకో అందుతాయి తప్ప రైతుకి అవకాశం లేదు.

అయితే గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రత బిల్లును పార్లమెంటులో ఆమోదింప జేసింది. దాని వలన దేశ వ్యాపితంగా ప్రజా పంపిణీ వ్యవస్ధ ద్వారా సబ్సిడీ రేట్లపై ధాన్య పొందేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. అసలు జనాభా మొత్తానికి ధాన్యం సబ్సిడీ ధరలకు ఇవ్వాలని బిల్లులో మొదట ప్రతిపాదించారు. కానీ దాన్ని బిల్లు రూపంలో పార్లమెంటులో ప్రవేశపెట్టే నాటికి దానిని ఉపసంహరించుకుని పేద, దిగువ మధ్య తరగతి వర్గాల వారికి మాత్రమే సబ్సిడే ధరలకు ఇవ్వాలని చట్టం చేశారు. ఆ విధంగా చూసినా ఇప్పటికంటే ఎక్కువ ధాన్యం ప్రజా పంపిణే వ్యవస్ధకు అవసరం అవుతుంది. ఆ దృష్ట్యా సేకరణ లక్ష్యాన్ని మించిన ధాన్యాన్నంతటినీ ఎగుమతి చేయటానికి అవకాశం లేదు. దాదాపు 42 శాతం మంది ప్రజలు కేవలం రోజుకు 1.25 డాలర్ల సంపాదన పైనే బతుకులను వెళ్ళదీస్తున్నారు. వీరందరి పేరు మీద ధాన్యం నిలవ ఉంచుకోవాల్సి ఉంది. అయితే ప్రజల పేరుతో ఉన్న ధాన్యంలో గణనీయమైన  భాగం అవినీతిపరుల పాలవుతుండటం తెలిసిన విషయమే. కనుక ఆహార భద్రతా చట్టాన్ని అవినీతి భద్రతా చట్టం అన్న పేరుతో పిలవడం సరైంది.

శరద్ పవార్ లాంటి మంత్రులు ధాన్యంలో అన్నం బదులు నోట్లు చూస్తున్నంత కాలం ప్రజలకు చేరాల్సిన ధాన్యం అవినీతిపరుల పాలు కాక తప్పదు. జనం పూనుకొని ఈజిప్టు, లిబియాల లాంటి పరిణామాలను ఇక్కడా పునరావృతం చేస్తే తప్ప కల్లంలోని తిండి గింజ కంచం దాకా రాదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s