రెండో రోజూ కొనసాగిన ఇండియా షేర్ల పతనం, ఆశలన్నీ బడ్జెట్ పైనే


సోమవారం లాభాల్లో ముగిసిన ఇండియా షేర్ మార్కెట్లు మంగళ, బుధ వారాల్లో మళ్ళీ నష్టాల బాట పట్టాయి. ఇటీవలి వరకూ ఈజిప్టు ఆందోళనలు ప్రపంచ షేర్ మార్కెట్లపై ప్రభావం చూపగా ప్రస్తుతం లిబియా పరిణామాలు ప్రభావం చూపుతున్నాయి. ప్రజాందోళనలు ఆయిల్ ఉత్పత్తి చేసే ఇతర దేశాలకు సైతం విస్తరించవచ్చనే భయం నెలకొనడంతో ఆయిల్ ధరలు చుక్కల్ని తాకుతున్నాయి. దానితో ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశాలు ఉండడంతో బ్యాంకుల షేర్లు మార్కెట్ పతనానికి దోహదం చేశాయి.

30 షేర్ల సూచి సెన్సెక్స్ 0.64 శాతం (118 పాయింట్లు) కోల్పోయి 18,178 పాయింట్ల వద్ద ముగియగా, 50 షేర్ల నిఫ్టీ సూచి 0.6 శాతం (32 పాయింట్లు) నష్టపోయి 5,437 పాయింట్ల వద్ద ముగిసింది. బుధవారం నాటి పతనం ప్రధానంగా ప్రపంచ పరిణామాలు, వాటి వలన ప్రపంచ షేర్ మార్కెట్ల పతనం ఇండియా షేర్లపై ప్రభావం చూపడం వలన సంభవించిందని చెప్పవచ్చు. 2011 సంవత్సరంలో ఎఫ్.ఐ.ఐ లు (ఫారెన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్) ఇప్పటివరకు 1.6 బిలియన్ డాలర్లు (7,360 కోట్ల రూపాయలు) ఉపసంహరించుకోవటంతో ఇండియా షేర్ మార్కెట్లు 11.4 శాతం నష్టపోయాయి. ఎమర్జింగ్ మార్కెట్ ఎకానమీలుగా ఉన్న దేశాల్లో ఇండియా ఒక్కటే కొత్త సంవత్సరంలో ఇంతగా నష్టపోయింది. వరుసగా ఎగురౌతున్న అవినీతి ఆరోపణలు, నేరుగా ప్రధాన మంత్రి సైతం అవినీతి ఆరోపణల్లో ఇరుక్కోవటం, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించలేక పోవటం తదితర కారణాలతో ఎఫ్.ఐ.ఐలతో పాటు, స్వదేశీ మదుపుదారులు సైతం షేర్ల కొనుగోళ్ళకు దూరంగా ఉంటున్నారు. దానితో కొనుగోళ్ళ మద్దతు కొరవడి షేర్లు పతనం అవుతున్నాయి. బుధవారం ఉదయం షేర్లు 0.4 శాతం లాభపడినప్పటికీ కొనుగోళ్ళ మద్దతు లేకపోవటంతో నష్టాలతో ముగిశాయి.

అతిపెద్ద ఋణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేరు 3.8 శాతం నష్టపోగా అతిపెద్ద ప్రైవేటు బ్యాంకు ఐ.సి.ఐ.సి.ఐ షేరు 1.9 శాతం నష్టపోయింది. రెండో పెద్ద ప్రైవేటు బ్యాంకు హెచ్.డి.ఎఫ్.సి షేరు 1.4 శాతం నష్టపోయింది. అయితే “రిలయన్స్ ఇండస్ట్రీస్” కి చెందిన కెజి గ్యాస్ బేసిన్లో కెనడా కంపెనీ “నికో రిసోర్సెస్”, మంగళవారం సాయంత్రం తన వాటాను 10 శాతం నుండి 13 శాతానికి పెంచుకుంటున్నట్లు ప్రకటించడంతో రిలయెన్స్ కంపెనీలు పెద్ద ఎత్తున లాభపడ్డాయి. ఇండెక్స్ మరింత పడిపోకుండా రిలయెన్స్ కంపెనీలు అడ్డుపడ్డాయని చెప్పవచ్చు. కాని ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీల షేర్లు నష్టాల్లో ముగిసాయి. బడ్జెట్ లో షేర్ మార్కెట్ కు ఊపునిచ్చే చర్యల ప్రకటన పైనే షేర్ మార్కెట్ వ్యాపారులు ఆశలు పెట్టుకుని ఉన్నారు.

భారత ద్రవ్యోల్బణాన్ని తగ్గించే చర్యలు బడ్జెట్ లో చేపడతారని మార్కెట్లు ఎదురు చూస్తున్నాయి. అటువంటి చర్యలు లేనట్లయితే ఇండియా షేర్ మార్కెట్లు మరింత పతనమయ్యే అవకాశాలు ఉన్నాయి. సరళీకరణ వైపుగా మరిన్ని చర్యల కోసం అంతర్జాతీయ కంపెనీలు ముఖ్యంగా పశ్చిమ సామ్రాజ్యవాద దేశాల బహుళజాతి కంపెనీలు ఎదురు చూస్తున్నాయి. జీవిత భీమా రంగంలో విదేశీ కంపెనీల వాటా 49 శాతానికి పెంచటం, రిటైల్ మార్కెట్ రంగంలో విదేశీ పెట్టుబడులు అనుమతించటం, ఫైనాన్స్ (బ్యాంకింగ్, ఇన్సూరెన్స్) రంగాన్ని మరింత సరళీకరించడం మొదలైన చర్యలకోసం బడ్జెట్ లో బలమైన హామీలు ఇవ్వాలని కూడా అవి కోరుకుంటున్నాయి. ఫిబ్రవరి 28 తేదీన ప్రవేశపెట్టనున్న బడ్జెట్, విదేశీ బహుళజాతి కంపెనీలకూ, స్వదేశీ ప్రైవేటు కంపెనీలకు వరంగానూ, జన సామాన్యానికి మరో గుదిబండగానూ ఉంటుందని ప్రత్యేక చెప్పే రోజులు ఎప్పుడో దాటిపోయాయి.

వ్యాఖ్యానించండి