గడ్డాఫీ చేజారుతున్న లిబియా, లిబియానుండి వెళ్ళిపోతున్న విదేశీయులు


 

Libya unrest

లిబియా ఆందోళన -బిబిసి ఫొటో

65 లక్షల జనాభా గల ఎడారి దేశం లిబియా క్రమంగా గడ్డాఫీ చేజారుతోంది. విదేశాల్లో లిబియా తరపున నియమించబడిన రాయబారులు ఒక్కొక్కరు గడ్డాఫీకి ఎదురు తిరుగుతున్నారు. సైనికులు గడ్డాఫీకి వ్యతిరేకంగా ఆందోళనకారుల్లో చేరిపోతున్నారు. వ్యతిరేకులుగా మారిన సైనిక బ్యారక్ లపై ప్రభుత్వ దళాలు విమానాలనుండి బాంబు దాడులు చేస్తున్నారు. హింసాత్మకంగా మారుతున్న లిబియానుండి విదేశీయులు తమ తమ స్వస్ధలాలకు వెళ్ళిపోతున్నారు. వివిధ దేశాల ప్రభుత్వాలు విమానాల ద్వారా, ఓడల ద్వారా తమ దేశీయులను వెనక్కి రప్పించుకుంటున్నాయి. గడ్డాఫీ తాను ఎక్కడికి పారిపోలేదనీ లిబియాలోనే ఉన్నానని టీవిలో కనపడి మరీ ప్రకటించాడు.

రాజధాని ట్రిపోలిలోని గ్రీన్ స్క్వేర్ వద్ద ఆందోళనకారులపై నేరుగా కాల్పులు జరిపి డజన్ల మందిని చంపివేయటాన్ని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘం ముఖ్యాధికారి “నవీ పిళ్ళై” తీవ్రంగా ఖండించారు. అటువంటి చర్యలు “మానవత్వంపై జరిపే నేరపూరిత దాడుల కిందికి వస్తాయ”ని ప్రకటించారు. శాంతియుత ప్రదర్శనకారులపై లిబియా అధికారులు, వారు అద్దెకు తెచ్చుకున్న సాయుధ దుండగులు కాల్పులు జరిపి చంపివేయటం చాలా తీవ్రమైందని” తన ప్రకటనలో పేర్కొన్నారు. మంగళ వారం ఐక్యరాజ్య సమితి భద్రతా సమితి లిబియా పరిణామాలపై అంతర్గతంగా సమావేశం కానుంది. అరబ్ లీగ్ కూడా అత్యవసర సమావేశం జరపాలని నిర్ణయించుకుంది.

లిబియా తూర్పు ప్రాంతం మొత్తం ఆందోళనకారుల వశంలో ఉందని బిబిసి తెలియజేసింది. ఆ ప్రాంతంలోని సైనికులు కూడా గడ్డాఫీకి వ్యతిరేకంగా మారారు. దానితో వారి స్ధావరాలపై ప్రభుత్వ సైన్యం యుద్ధ విమానాల నుండి బాంబు దాడులు చేస్తున్నారు. పూర్తిగా ఆందోళనకారుల వశంలో ఉన్న బెంఘాజీ పట్టణ పౌరులపై బాంబుదాడులు జరుపుతున్నామన్న వార్వలను గడ్డాఫీ కుమారుడు సైఫ్ ఖండించాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారిన సైనికులపైనే బాంబు దాడులు చేస్తున్నాం తప్ప ప్రజలపై కాదని తెలిపాడు. ఈజిప్టుతో ఉన్న సరిహద్దు వద్ద ఉన్న లిబియా గార్డులను ఉపసంహరించుకోవటంతో ఈజిప్టు తన గార్డులను అక్కడికి పంపినట్లుగా ఈజిప్టు తెలిపింది.

లిబియాలో 10,000 మందికి పైగా ఈజిప్టు దేశీయులు సరిహద్దు దాటి తమ దేశానికి వెళ్ళిపోతున్నారు. ఇప్పటికే వేలమంది వచ్చేశారనీ సరిహద్దు దాటి వస్తున్న తమ దేశస్ధుల సౌకర్యార్ధం అక్కడ తాత్కాలిక వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామనీ ఈజిప్టు తెలిపింది. తమ పౌరుల కోసం రెండు విమానాలను పంపిస్తున్నామని కూడా ఈజిప్టు ప్రభుత్వం తెలిపింది. బెంఘాజీ పట్టణంలోని విమానాశ్రయం ధ్వంసం కావడంతో లిబియాలో 15 లక్షల వరకు ఉన్న తమ పౌరుల తరలింపు క్లిష్టంగా మారినట్లు ఈజిప్టు విదేశాంగ మంత్రి “అహ్మద్ అబౌల్ ఘీత్” తెలిపాడు. 300 మంది వరకు ఉన్న దక్షిణ కొరియా నిర్మాణ కార్మికులను ఆందోళనకారులు నిర్బంధించారు. వారిలో వందమంది బంగ్లాదేశ్ కు చెందినవారు. బంగ్లాదేశ్ దేశీయులు 50,000 మంది లిబియాలో కార్మికులుగా పని చేస్తున్నారని రాయిటర్స్ తెలిపింది.

మంగళ వారం హింసాకాండలో చిక్కుకుని ఒక భారతీయుడు చనిపోగా, మరో ఇరవైమంది గాయపడినట్లు తెలుస్తోంది. చైనాకు చెందిన కొన్ని వందల మంది నిర్మాణ కార్మికులు సాయుధ దాడుల్లో చిక్కుకోకుండా పారిపోయారని తెలియడంతో “తమ దేశీయులను క్షేమంగా తరలించమ”ని చైనా, లిబియాను కోరింది. 3,000 మంది టర్కీ దేశీయులను రప్పించుకోవటానికి టర్కీ మూడు ఓడలను పంపింది. వెయ్యి మంది ఇప్పటికే టర్కీ చేరుకున్నారు. ఇటలీ మూడు సి-130 వైమానిక దళ విమానాలను తమ దేశీయుల కోసం పంపనున్నట్లు తెలిపింది. ఒకప్పుడు ఇటలీ వలసగా ఉన్న లిబియాలో 1,500 ఇటలీ దేశీయులున్నారు. అత్యవసర విధుల్లో లేని వారందరూ లిబియా నుండి వచ్చేయాలని అమెరికా తమ పౌరులను కోరింది.

బ్రిటన్ దేశీయులంతా వెనక్కి రావాలని బ్రిటన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కోరింది. 3,500 మంది బ్రిటిషర్లు ఇప్పటికే బ్రిటన్ కు చేరుకున్నారు. మిగిలిన వారంతా వాణిజ్య విమానాల్లో రావాలని బ్రిటన్ కోరినప్పటికీ బ్రిటన్ విమానయాన సంస్ధలు తమ లిబియా సర్వీసులన్నింటిని రద్దు చేసుకోవటంతో వారి పరిస్ధితి అయోమయంలో పడింది. హాలండ్ కి చెందిన ఆయిల్ కంపెనీ “రాయల్ డచ్ షెల్” లిబియాలోని తమ ఉద్యోగులందరిని తాత్కాలికంగా వేరే చోటకు మార్చామని తెలిపింది. ఇటలీకి చెందిన ఆయిల్ కంపెనీ “ఎని”, ఫ్రాన్స్ కి చెందిన “టోటల్” కంపెనీలు కూడా తమ ఉద్యోగులను వెనక్కి రప్పిస్తున్నామని తెలిపాయి.

బెంఘాజీ పట్టణంలో ఆందోళనకారులు, పౌరులు తమకు తామే కమిటీలు ఏర్పరుచుకుని క్రమ బద్ధతకు కృషి చేస్తున్నారు. ఐక్యరాజ్య సమితిలోని లిబియా రాయబారులు తమ దేశ ప్రభుత్వం పౌరులపై హింసాకాండకు పాల్పడుతున్నందున సమితి కలుగ జేసుకోవాలని విగ్జ్నప్తి చేశారు. సమితిలోని లిబియా సీనియర్ దౌత్యవేత్త “ఇబ్రహీం దబ్బాషీ”, అమెరికాలోని లిబియా రాయబారి “ఆలీ ఔజాలీ” గడ్డాఫీని విమర్శిస్తూ లిబియా గగనతలాన్ని “విమాన రహిత మండలం”గా ప్రకటించి అమలు చేయాలని సమితిని కోరారు. వారు పరోక్షంగా అమెరికా జోక్యాన్నే కోరుతున్నారని అర్ధం చేసుకోవచ్చు.

మౌమ్మర్ గడ్డాఫీ అమెరికా పెత్తనాన్ని వ్యతిరేకిస్తూ వచ్చాడు. గడ్డాఫీని పదవీచ్యుతుడ్ని చేయటానికి అమెరికా చాలా రకాలుగా ప్రయత్నించింది. అతని ఇంటిపై బాంబు దాడి కూడా సి.ఐ.ఏ ద్వారా జరిపించింది. కానీ దాని ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ లకు కొంతవరకు సహకరించాడు. అమెరికా సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించినప్పటికీ దేశంలో తనను వ్యతిరేకించినవారిని అణచివేసినట్లు ప్రస్తుత పరిణామాలను బట్టి అర్ధం అవుతోంది. అణచివేత పాలనలో క్రమంగా అత్యధికులు వైరి వర్గంగా మారినట్లుగా కూడా అర్ధం అవుతోంది. తిరుగుబాటు దారుల్లో అమెరికా మద్దతుదారులు ఉంటారనటంలో ఎట్టి సందేహమూ లేదు. తిరుగుబాటుకు ప్రజల మద్దతు కూడా లభిస్తున్నందున అతని పాలన మిగిలిన నియంతల పాలన లాగే కొనసాగిందని తిరుగుబాటు తెలియ జేస్తున్నది.

కాని సామ్రాజ్యవాదుల మద్దతుతో చెలరేగే తిరుగుబాట్లు అంతిమంగా సామ్రాజ్యవాదుల చేతికే దేశాన్ని అప్పగిస్తాయి కనుక ప్రజలు జాగరూకత వహించాల్సి ఉంటుంది. అరబ్ దేశాల్లో చెలరేగుతున్న తిరుగుబాట్లు సామ్రాజ్యవాదుల కనుసన్నల్లో వారి సాయుధ మద్దతు పరిధిలోనే ఉండటం పెద్ద బలహీనతగా ఉంది. ప్రజా పోరాట శక్తి తిరిగి వారిపై దోపిడీ కొనసాగింపుకే దారితీయటం బాధనూ, ఆక్రోశాన్నీ కలిగిస్తుంది. అయితే ప్రస్తుత తిరుగుబాట్ల నుండి వారు ఖచ్చితంగా పాఠాలు నేర్చుకుంటారు. భవిష్యత్తులో మరింత లక్ష్య శుద్ధితో ఉద్యమాలు నిర్వహించటానికి ఆ పాఠాలు తప్పనిసరిగా ఉపయోగపడతాయి.

 

వ్యాఖ్యానించండి