మొరాకోలో రాజకీయ సంస్కరణలు కోరుతూ ప్రదర్శనలు


గత డిసెంబరులో ట్యునీషియాలో ప్రారంభమై అక్కడి అధ్యక్షుడిని జనవరికల్లా దేశం నుండి పారిపోయేలా చేసిన అరబ్ ప్రజా ఉద్యమ తుఫాను కొద్దో గొప్పో ధనిక దేశమైన మొరాకోను సైతం తాకింది. మొరాకో రాజు మొహమ్మద్ VI, తన అధికారాల్లో కొన్నింటిని వదులుకొని ప్రజాస్వామిక పరిపాలనకు మార్గం సుగమం చేయాలని డిమాండ్ చేస్తూ మొరాకో ప్రజలు దేశం లోని వివిధ పట్టణాలలో ప్రదర్శనలు నిర్వహించారు. రాజధాని “రాబత్” లో ప్రదర్శన పార్లమెంటు వరకు వెళ్ళటానికి పోలీసులు అనుమతించారు. “బానిసలకోసం తయారు చేసిన రాజ్యాంగాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం” అంటూ వారు నినాదాలు చేశారు.

మొరాకోలోని మరో పెద్ద నగరమైన “కాసబ్లాంకా” లోనూ ప్రదర్శనలు జరిగాయి. “మరాకేష్” పట్టణంలో కూడా ప్రదర్శనలు నిర్వహించాలని ఆందోళనకారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం జరిగిన ప్రదర్శనలకు “మార్పుకోసం ఫిబ్రవరి 20 ఉద్యమం,” “బారకా (ఇక చాలు)” మొదలైన సంస్ధలు నాయకత్వం వహించాయి. “ఫేస్ బుక్” వెబ్ సైట్ లో 23,000 మంది వరకు నిరసన ప్రదర్శనలకు మద్దతు తెలియజేసినట్లుగా బిబిసి తెలిపింది. ప్రదర్శకులు రాజు రాజీనామాను డిమాండ్ చేయనప్పటికీ అతని అధికారాలను తగ్గించివేయాలని కోరారు. “రాజ్యాంగ సంస్కరణలు, అవినీతి అంతం ల కోసం మేము ఈ శాంతియుత ప్రదర్శన తలపెట్టాము,” అని బారకా సంస్ధ ప్రతినిధి తెలిపాడు.

మొరాకోలో విజయవంతం ఐనట్లుగా చెప్పబడుతున్న ఆర్ధిక వ్యవస్ధ, ఎన్నుకోబడిన పార్లమెంటు, సంస్కరణాయుత మయిన రాచరికం ఉన్నాయనీ, కనుక అక్కడ పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని కూలదోసే నిరసనలు తలెత్తే అవకాశం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. రాజకీయ మార్పులు, స్వేచ్ఛ, సంస్కరణలు, రాజ్యాంగంలో మార్పులు… వీటి పైనే ప్రదర్శకుల దృష్టి కేంద్రీకృతమై ఉంది. దేశంలో సాధారణంగా ప్రదర్శనలకు అనుమతి ఇచ్చే వాతావరణం ఉంది. ఇటీవలనే రాజు ఆహార సబ్సిడీని రెట్టింపు చేస్తానని హామీ ఇచ్చాడు. కానీ ప్రజలు అసంతృప్తి చెందటానికి తగిన కారణాలు పైకి కనపడకుండా పుష్కలంగానే ఉన్నాయి.

దేశంలో అత్యధికులు యువకులు. వారిలో ఎక్కువమంది నిరుద్యోగం, పేదరికం తగితర సమస్యల్లో కూరుకొని ఉన్నారు. ఆర్ధిక వ్యవష్ద వృద్ధి చెందుతున్నప్పటికీ అది ధనికులు, పేదల మధ్య అగాధాన్ని మరింతగా పెంచే వృద్దే తప్ప ప్రజలకు ఉపయోగపడేది కాదు. పార్లమెంటు ఎన్నికలు అక్కడి అప్రజాస్వామిక వ్యవస్ధను కప్పి పెట్టేవే తప్ప ప్రజాస్వామ్యాన్ని ప్రతిబింబించేవి కావు. ప్రపంచ వాణిజ్య సంస్ధ సమావేశాలను ప్రపంచంలో ఎక్కడ జరిపినా పెద్ద ఎత్తున నిరసనలు ఎదుర్కోవలసిన పరిస్ధితుల్లో ఎటువంటి నిరసనలకు తావు లేని చోటు కోసం చూసి మొరాకో లోని మరాకేష్ పట్టణాన్ని ఎన్నుకున్న చరిత్ర ఉంది. దాన్ని బట్టే మొరాకోలో ప్రజాస్వామ్యం మేడిపండు లాంటిదని తెలుస్తుంది.

రాజు అలౌయితే రాజ వంశానికి చెందిన వాడు. మొరాకోను ఈ రాజ వంశం దాదాపు 350 సంవత్సరాలనుండి మొరాకోలో అధికారం చెలాయిస్తోంది. మహమ్మద్ ప్రవక్త వంశంతో దానికి నేరుగా సంబంధాలున్నాయన్ని నమ్మకం వ్యాప్తిలో ఉంది. దానితో రాచరికాన్నీ రాజు నిర్ణయాలనూ ప్రశ్నించడం చాలా అరుదు.

వ్యాఖ్యానించండి