బలహీన పడుతున్న గడ్డాఫీ, వదిలి వెళ్తున్న మద్దతుదారులు


 

libya protests

బెంఘాజీ పట్టణంలో లిబియన్ల ఆందోళన

42 సంవత్సరాల నుండి లిబియాను ఏకచ్ఛత్రాధిపత్యంతో ఏలిన కల్నల్ మహమ్మద్ గడ్డాఫీని మద్దతుదారులు ఒక్కొక్కరు వదిలి ఆందోళనకారులకు మద్దతు తెలుపుతుండడంతో క్రమంగా బలహీన పడుతున్నాడు. రెండు తెగలు కూడా ఆందోళనకారులకు మద్దతు తెలిపాయి. ఆందోళనకారులపై హింసను ప్రయోగించడాన్ని ఆ తెగల పెద్దలు తప్పు పట్టారు. లిబియాలో అది పెద్ద తెగ “వార్ఫ్లా” కూడా ఆ తెగల్లో ఉండటం గమనార్హం. లిబియా తరపున ఇండియా కు రాయబారిగా ఉన్న అలీ అల్-ఎస్సావీ భద్రతా దళాల దాడులను, కాల్పులను ఖండించడంతో ప్రభుత్వంలో విభేదాలు బైట పడ్డాయి.

లిబియా తరపున అరబ్ లీగ్ కు రాయబారిగా ఉన్న ఆబ్దెల్ మొనీమ్ అల్-హోనీ, తాను విప్లవం చేరుతున్నట్లు ప్రకటించాడు. కొంతమంది సైనికులు సైతం గడ్డాఫీ పట్ల విధేయతను వదిలేసి ఆందోళనకారుల్లో చేరిపోయారు. సైన్యంపై నమ్మకం లేక గడ్డాఫీ ప్రభుత్వం విదేశాలనుండి అద్దెకు సాయుధులను రప్పించినట్లు వార్తలు వచ్చాయి. ఆందోళనకారులకు మద్దతు తెలిపిన ఇండియాలోని లిబియా రాయబారి విదేశాలనుండి సాయుధులను రప్పించడాన్ని తీవ్రంగా ఖండించడాన్ని బట్టి అది నిజమేనని స్పష్టమయ్యింది.

గడ్డాఫీ ప్రభుత్వానికి ప్రధాన ప్రతినిధిగా వ్యవహరిస్తూ వచ్చిన మహమ్మద్ బాయోవ్, ప్రభుత్వం ఆందోళనకారులను హింస జరుగుతుందంటూ హెచ్చరించడం సరైంది కాదని ప్రకటించి తాను కూడా ఆందోళనకారుల వైపేనని పరోక్షంగా తెలియ జేశాడు. లిబియాలో ప్రజామోదం పొందిన ప్రతిపక్షం ఉందన్న సంగతి గడ్డాఫీ ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించాలని బాయోవ్ కోరాడు. వారితో చర్చలు జరపడం ఉత్తమమని సూచించాడు. గడ్డాఫీ, రాజధాని ట్రిపోలీని వదిలి తన సొంత పట్టణానికి వెళ్ళినట్లుగా పుకార్లు ప్రచారంలోకి వచ్చాయి.

రెండో పెద్ద పట్టణం ‘బెంఘాజీ’ ఇప్పటికే ఆందోళనకారుల వశంలో ఉంది. సాయుధులైన యువకులు పట్టణంలో గస్తీ నిర్వహిస్తున్నట్లు రాయిటర్స్ వార్తా సంస్ధ తెలిపింది. రాజధాని ట్రిపోలీలో కూడా వేలమంది గడ్డాఫీ దిగిపోవాలంటూ ఆదివారం సాయంత్రం ప్రదర్శన నిర్వహించారు. పార్లమెంటు భవనానికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ట్రిపోలీలోని గ్రీన్ స్క్వేర్ వద్ద గడ్డాఫీ మద్దతుదారులు ప్రదర్శన నిర్వహిస్తున్నారు. శనివారం సాయంత్రం గ్రీన స్క్వేర్ వద్ద ప్రదర్శన నిర్వహిస్తున్న ఆందోళనకారులపై సైన్యం, పోలీసులు కాల్పులు జరిపారు. డజన్ల సంఖ్యలో ఆందోళనకారులు చనిపోయారనీ, సైన్యం హత్యాకాండకు పాల్పడిందని బిబిసి తెలిపింది. కాల్పులతో ఆందోళనకారులు చెల్లాచెదురు అయిన అనంతరం గ్రీన్ స్క్వేర్ ను గడ్డాఫీ మద్దతుదారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అయితే దేశంలోని తూర్పు ప్రాంతంలో పరిస్ధితులు గడ్డాఫీకి పూర్తిగా ప్రతికూలంగా ఉన్నాయి. తూర్పు భాగంలో గడ్డాఫీకి మొదటినుండీ పట్టు తక్కువ. బెంఘాజీ తూర్పు ప్రాంతంలోనే ఉంది.

గడ్డాఫీ తనయుల్లో ఒకరయిన సైఫ్ అల్-ఇస్లాం లిబియా ప్రభుత్వ టీవిలో ఆందోళనకారులకు హెచ్చరికలు జారీ చేశాడు. చివరి మనిషి వరకూ, చివరి స్త్రీ వరకూ గడ్డాఫీ పోరాడుతూనే ఉంటాడని ప్రకటించాడు. దేశంలో అంతర్యుద్ధం చెలరేగే అవకాశం ఉందని హెచ్చరించాడు. మరిన్ని రాజకీయ సంస్కరణలు చేపడతామని ఆశ చూపాడు. అయితే తూర్పు ప్రాంత పట్టణాలయిన బెంఘాజీ, ఆల్-బయిదా లు ఆందోళనకారుల వశంలో ఉన్నాయని సైఫ్ తన ప్రసంగంలో అంగీకరించాడు. ప్రవాసంలో ఉన్న లిబియా నాయకులే దేశంలో అల్లర్లు చెలరేగడానికి కారణమని విమర్శించాడు. బెంఘాజీ పట్టణంలో ఆందోళనకారులు సైఫ్ ప్రసంగాన్ని హేళన చేశారు. సైఫ్ అబద్దాలకోరు అని నిందించారు. రాజకీయ సంస్కరణలు తెస్తామని గతంలోనూ ప్రకటించి తర్వాత పట్టించుకోలేదని విమర్శించారు.

గురువారం, ఫిబ్రవరి 17 నుండి ఇప్పటి వరకు 233 మంది, సైన్యం, పోలీసుల కాల్పుల్లో చనిపోయారని అమెరికా మానవ హక్కుల సంస్ధ “హ్యూమన్ రైట్స్ వాచ్” తెలిపింది.  అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ లు ఆందోళనకారులను అణచివేయడాన్ని ఖండిస్తూ ప్రకటించాయి. లిబియా అంతర్యుద్ధంలోకి జారకుండా అంతర్జాతీయ సమాజం అన్ని ప్రయత్నాలు చేయాలని ప్రాన్స్ కోరింది. “మధ్యధరా ప్రాంతం, మధ్య ప్రాచ్యం ప్రాంతాలకు యూరోపియన్ యూనియన్ ఒక సమగ్ర యాక్షన్ ప్లాన్ రూపొందించాల”ని ఇటలీ విదేశాంగ మంత్రి ఫ్రాంకో ఫ్రాట్టిని తన ప్రకటనలో కోరాడు. “మధ్యధరా, మధ్య ప్రాచ్యం ప్రాంతాల మార్షల్ ప్లాన్” గా ఆ పధకాన్ని ఫ్రాట్టిని అభివర్ణించాడు. “లిబియా ఇస్లాం పాలకుల చేతిలో వెళ్తుందేమోన”ని ఆయన ఆందోళన వ్యక్తం చేశాడు. “యూరోపియన్ యూనియన్ సరిహద్దులో ఒక ఇస్లామిక్ అరబ్ రాజ్యం ఏర్పడటం చాలా తీవ్ర విషయం. అందుకే లిబియాను చాలా ముఖ్యమైన ప్రాంతంగా మనం గుర్తించాలి” అని కోరాడు.

అరబ్ లీగ్ అధిపతి అమీర్ మౌస్సా, లిబియా ఆందోళనకారుల డిమాండ్లు న్యాయమైనవని ప్రకటించాడు. “సంస్కరణలు, అభివృద్ధి, మార్పు లను కోరుతున్న అరబ్ ప్రజల ఆకాంక్షలు చాలా న్యాయమైనవి. చరిత్రలోని ప్రస్తుత నిర్ణయాత్మక సమయంలో అరబ్ దేశాలన్నింటి భావాలు, అరబ్ ఆందోళనకారుల ఆకాంక్షలలో భాగం పంచుకుంటున్నాయి” అని ప్రకటించాడు.

ఇదిలా ఉండగా అరబ్ దేశాల్లోని ఆందోళనలు, అనిశ్చితి ప్రభావం ఆయిల్ ధరలపై ప్రభావం చూపుతోంది. లిబియా పరిణామాలతో బ్యారల్ కు ఒక డాలరు మేరకు ధర పెరిగింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ లో బ్యారల్ కు 104 డాలర్ల వరకూ పలుకుతోంది. బిపి లాంటి ఆయిల్ కంపెనీలు తమ సిబ్బందిని లిబియానుండి వెనక్కి రప్పించుకుంటున్నాయి. టర్కీ తమ దేశీయులను రప్పించడానికి విమానం పంపింది. కాని విమానశ్రయం ఆందోళనకారుల ఆధీనంలో ఉందని తెలియటంతో ఆ విమానం కిందికి దిగకుండానే వెనక్కు వెళ్ళిపోయింది.

వ్యాఖ్యానించండి