
ఆందోళనలు ప్రధానంగా రెండో పెద్ద పట్టణమయిన బెంఘాజి పట్టణంలోనే కేంద్రీకృతమైనట్లుగా తెలుస్తోంది. ఆందోళనకారులు అనేక ప్రభుత్వ భవనాలకు నిప్పంటించారు. సైనికులు, పోలీసులు క్రమంగా వెనక్కి తగ్గి తమ కమాండ్ సెంటర్ కాంప్లెక్స్ లోపలికి వెళ్ళిపోయారనీ, అక్కడినుంచే అప్పుడప్పుడూ ఆందోళనకారులపై కాల్పులు కొనసాగిస్తున్నారనీ రాయిటర్స్ తెలిపింది. సామాజివ వెబ్ సైట్ల నుండి మాత్రమే ధృవపడని వార్తలు బైటికి వస్తున్నాయి. బెంఘాజీ పట్టణం దాదాపు ఆందోళనకారుల వశంలో ఉన్నట్లుగా కొందరు సామాజిక వెబ్ సైట్లలోని తమ ఎకౌంట్లలో సమాచారం ఉంచారు. రాజధాని ట్రిపోలిలో ఒకటి రెండు స్వల్ప సంఘటనలు మినహా ఆందోళనలు జరగడం లేదు.
ఆందోళనలు ప్రధానంగా ప్రాంతీయ కారణాల వలన జరుగుతున్నాయనీ ఈజిప్టులో జరిగినట్లు దేశవ్యాపిత ఆందోళన జరగటానికి ఆస్కారం లేనట్లుగా రాయిటర్స్ తెలపగా, గడ్డాఫీ తన పాలనలో ఎదుర్కొన్న అతిపెద్ద వ్యతిరేకతగా ప్రస్తుత ఆందోళనలు బిబిసి అభివర్ణించింది. లిబియాలో ఇప్పటివరకు మొత్తం 167 మంది సైన్యం, పోలీసుల కాల్పుల్లో చనిపోయినట్లుగా హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్ధ తెలిపినట్లుగా బిబిసి తెలిపింది. బిబిసి, రాయిటర్స్ వార్తా సంస్ధలు రెండూ హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్ధనే ఉటంకించినప్పటికీ రెండింటి కధనాల్లో మరణించినవారి సంఖ్య తేడాగా ఉన్నది. బహుశా రాయిటర్స్ సంస్ధ ఒక్క శనివారం నాటి మరణాలనే రిపోర్టు చేసి ఉండవచ్చు.
ఇదిలా ఉండగా ఆందోళనలు ఇప్పుడు మరిన్ని దేశాలకు విస్తరించింది. బహ్రెయిన్, యెమెన్ లతో పాటు మొరాకో, ఒమన్, కువైట్, అల్జీరియా, ద్జిబౌటి, సౌదీ అరేబియా లకు కూడా విస్తరించింది. ఆందోళనకారులు మరిన్ని రాజకీయ హక్కులను డిమాండ్ చేస్తూ నిరుద్యోగం, పేదరికం సమస్యల సత్వర పరిష్కారాన్ని కోరుతున్నారు. సౌదీ అరేబియాలో కొంతమంది మొట్ట మొదటి రాజకీయ పార్టీని స్ధాపించాలని ప్రయత్నిస్తుండగా వారిని నిర్బంధంలోకి తీసుకున్నారు. ట్యునీషియా, ఈజిప్టులాంటి తీవ్రమైన ఆందోళనల స్ధాయికి ఈ దేశాల్లొ సంభవించే అవకాశాలు లేవని పరిశీలకులు భావిస్తున్నారు.
