అమెరికా సంస్ధకు చెందిన మానవ హక్కుల సంస్ధ “హ్యూమన్ రైట్స్ వాఛ్” లిబియాలో కాల్పుల్లో ఇప్పటి వరకు 24 మంది చనిపోయినట్లుగా తెలిపింది. మృతుల అంతిమ యాత్రల సందర్భంగా మరిన్ని ఘర్షణలు జరిగే అవకాశం ఉందని బిబిసి విలేఖరి తెలిపాడు. బెల్ఘాం, అల్-బయదా లతో పాటు మరో మూడు పట్టణాల్లో ప్రదర్శనలు కేంద్రీకృతమైనట్లు తెలుస్తోంది. ఆందోళనకారులు ఇంటర్నెట్ సాయంతో సమీకృతులవుతున్నారు. గురువారం నుండి ప్రదర్శనలు జరుగుతున్న పట్టణాలలో ఇంటర్నెట్ సౌకర్యాన్ని తొలగించడం వలన తమ వద్ద ఉన్న పోలీసుకాల్పుల వీడియోను ఇంటర్నెట్ లో పెట్టలేక పోతున్నానని అల్-బయదా పట్టణవాసి ఒకరిని రాయటర్స్ సంస్ధ ఉటంకించింది.
కాల్పుల్లో గాయపడ్డవారిని ఆసుపత్రుల్లో చేరనీయనీయటం లేదనీ, ఒక వేళ చేర్చినా వారికి ఓషధాలు సరఫరా చేయనీయడం లేదనీ ఒక పౌరుడు తెలిపినట్లుగా బిబిసి తెలియజేసింది. వందల సంఖ్యలో ప్రజలు ప్రదర్శనల్లో పాల్గొన్నట్లు మరో మహిళ చెప్పినట్లుగా ఎ.ఎఫ్.పి తెలిపింది. శుక్రవారం కల్నల్ గడ్డాఫీ కి అనుకూలంగా ట్రిపోలీలోని “గ్రీన్ స్క్వేర్ ” వద్ద ప్రదర్శనలు నిర్వహించినట్లు కూడా ఎ.ఎఫ్.పి తెలిపింది. గడ్డాఫీ ఆ ప్రదర్శనను కొద్దిసేపు సందర్శించినట్లుగా తెలిసింది.
లిబియాలో 42 సంవత్సరాల నుండి అధికారం లో ఉన్న గడ్డాఫీకి వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేస్తే మొదట సంతోషించేది అమెరికా తదితర పశ్చిమ దేశాలే. కొద్దిపాటి నిరసనలు జరిగినా వాటిని భూతద్దంలో చూపే అవకాశాలను కొట్టిపారేయలేము. కాని ప్రజాస్వామిక హక్కుల కోసం గత డిసెంబరు నుండి ఉత్తరాఫ్రికా, పశ్చిమాసియాల దేశాల్లో ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న నేపధ్యంలో లిబియా ఆందోళనల వార్తలను కూడా కొట్టిపారేయలేము.
