ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం కోసం రిజర్వ్ రేట్లను మళ్ళీ పెంచిన చైనా


China inflation

చైనా ద్వవ్యోల్బణం (రాయటర్స్ సౌజన్యం)

ప్రపంచంలో రెండో పెద్ద ఆర్ధిక వ్యవస్ధను కలిగి ఉన్న చైనా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం కోసం ఆర్.ఆర్.ఆర్ ను మళ్ళీ 50 బేసిస్ పాయింట్ల మేరకు (0.5 శాతం) పెంచింది. బ్యాంకు ఖాతాదారుల సొమ్ము భద్రత కోసం  బ్యాంకులు సేకరించే డిపాజిట్లలో కొంత శాతాన్ని సెంట్రల్  బ్యాంకు వద్ద రిజర్వ్ డబ్బుగా ఉంచాలి. అలా రిజర్వు డబ్బుగా డిపాజిట్లలో ఎంత శాతం ఉంచుతారో దాన్ని చైనాలో ఆర్.ఆర్.ఆర్ (రిజర్వ్ రిక్వైర్మెంట్  రేషియో) అనీ, ఇండియాలో సి.ఆర్.ఆర్ (కేష్ రిజర్వ్ రేషియో) అనీ అంటారు. గత అక్టోబరు నుండి చైనా దీనిని ఇప్పటికి ఐదు సార్లు పెంచింది. వడ్డీ రేటు మూడు సార్లు పెంచింది. డిశెంబరు తో ముగిసే సంవత్సరానికి చైనా ద్రవ్యోల్బణం 4.6 శాతం ఉండగా జనవరితో ముగిసే సంవత్సరానికి అది 4.9 శాతానికి పెరిగింది.

దేశంలో డబ్బు చెలామణి పెరగడం వలన ద్రవ్యోల్బణం చైనా, ఇండియాల్లో పెరుగుతున్నది. ఇండియాలోలాగే చైనాలో కూడా ద్వవ్యోల్బణం అధికంగా ఉంటోంది. దాన్ని కట్టడి చేయడానికి చైనా తంటాలు పడుతోంది. బ్యాంకుల్ని ఆచి తూచి ఋణం మంజూరు చేయాల్సిందిగా సెంట్రల్ బ్యాంకు ఆదేశించింది. ద్రవ్యోల్బణం నియంత్రించటానికి చైనా మరిన్ని సార్లు రిజర్వ్ రేటు, వడ్డీ రేటు పెంచాల్సి ఉంటుందని పరిశీలకు భావిస్తున్నారు. దానితో పాటు కరెన్సీ విలువ కూడా చైనా పెంచాల్సి ఉంటుందని వారి అభిప్రాయం. కరెన్సీ విలువ పెంచితే అంతర్జాతీయ మార్కెట్ లో యువాన్ విలువ పెరిగడం వలన చైనా సరుకుల విలువ పెరిగి ఎగుమతులు తగ్గి తద్వారా వాణిజ్య మిగులు తగ్గుతుందనీ, అది దేశంలో కరెన్సీ చెలామణిని తగ్గిస్తుందని వారి అభిప్రాయం. కాని ఆ చర్య అంతిమంగా చైనా ఆర్ధిక వ్యవస్ధకు నష్టకరంగా పరిణమించవచ్చు.

పెంచిన ఆర్.ఆర్.ఆర్ రేటు ఫిబ్రవరి 24 నుండి అమలులోకి వస్తుందని సెంట్రల్ బ్యాంకు ప్రకటించింది. తాజా పెంపుతో చైనా ఆర్.ఆర్.ఆర్ రేతు 19.5 శాతానికి చేరుకుంటుంది. రిజర్వ్ రేటు పెంచటం వలన చైనా ఈక్విటీలలో పెట్టుబడుల ప్రవాహం తగ్గి ఆ మేరకు చైనా మార్కెట్ లోకి ప్రవహించే డబ్బు తగ్గుతుంది. దానితో పాటు యువాన్ విలువ పెరిగి వాణిజ్య మిగులు తగ్గుతుంది. తద్వారా చైనా మార్కెట్ లోకి వచ్చి చేరే డబ్బుకు అడ్డుకట్ట పడి ద్రవ్యోల్బణం కొంతమేరకు అదుపులోకి వస్తుంది. దేశంలో నిత్యావసరాల ధరలు పెరుగుతుండడంతో అల్లర్లు చెలరేగుతాయేమో నన్న భయం కూడా చైనా పాలకుల్లో కలుగుతోంది. ఓ వైపు కోట్లాది మందికి కడుపు నిండా తిండి, చేయటానికి పని, సరైన వసతి లేక దారిద్ర్యంతో కునారిల్లుతోంటే మరోవైపు దేశంలో డబ్బు ప్రవాహం తగ్గించడానికి ప్రభుత్వం సతమతమవుతుండటం పెట్టుబడిదారి వ్యవస్ధ విపరీత లక్షణాల్లో ఒకటి. కొద్ది మంది చేతిలో సంపదను నింపి కోట్లాదిమందిని దరిద్రం లోకి నెట్టివేసే ఈ వ్యవస్ధను 62 సవత్సరాల కితం కూలదోసి కూడా దానిని తిరిగి నెత్తిమీద పెట్టుకోవటం మరో వైపరీత్యం.

వ్యాఖ్యానించండి