తమిళనాడులో అధికార పార్టీగా ఉన్న డి.ఎం.కె పార్టీ అధినేత కరుణానిది కుటుంబానికి చెందిన కలైజ్గ్నర్ టీ.వి చానల్ కార్యాలయాలపై శుక్రవారం సి.బి.ఐ దాడులు నిర్వహించింది. 2-జి స్పెక్ట్రం స్కాముకు సంబంధించి లైసెన్సు పొందిన టెలి కంపెనీల్లో ఒకటైన స్వాన్ టెలికం సంస్ధ లైసెన్సు పొందటం కోసం టి.వి ఛానెల్ కు 47 మిలియన్ డాలర్లు (దాదాపు 214 కోట్ల రూపాయలు) ముడుపులుగా చెల్లించినట్లుగా ఆరోపణలు రావడంతో ఈ దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది.
సి.బి.ఐ దాడులు జరిగిన వార్త వెలువడడంతో భారతీయ షేర్ మార్కెట్ల పతనం ప్రారంభమయ్యింది. మూడు రోజులుగా లాభాల్లో ఉన్న షేర్ మార్కెట్లు సి.బి.ఐ దాడుల వలన యు.పి.ఎ కూటమి భాగస్వాములైన కాంగ్రెస్ డి.ఎం.కె మధ్య సంబంధాలు చెడిపోనున్నాయన్న భయంతో షేర్ల మదుపుదారులు బ్లూఛిప్ కంపెనీల షేర్ల నుండి సైతం పెట్టుబదులను ఉపసంహరించుకోవటంతో షేర్ మార్కెట్లు పతనమయ్యాయి. స్వాన్ టెలికం (ఇప్పుడు దీని పేరు ఎతిసలాత్ డిబి) కంపెనీలో భావస్వామ్యం ఉన్న రిలయన్స్ కాం కంపెనీ షేరు 6.8 శాతం పడిపోయింది.
బి.ఎస్.ఇ (సెన్సెక్స్) సూచిక 1.6 శాతం నష్టపోయి 18,211 పాయింట్ల వద్ద ముగియగా, ఎన్.ఎస్.ఇ (నిఫ్టీ) 1.58 శాతం నష్టపోయి 5,459 పాయింట్ల వద్ద ముగిసింది. గత మూడు సెషన్ లలో లాభాలతో ముగిసిన షేర్లు ఈ వారం ముగిసేసరికి మళ్ళీ నష్టాల బాట పట్టినట్లయ్యింది. 2-జి కుంభకోణం ఇంకా ఎంత లోతున పాతుకుపోయిందో స్పష్టం కాకపోవడంతో ఎఫ్.ఐ.ఐ లు (ఫారెన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్ట్ మెంట్స్) భారతీయ షేర్ మార్కెట్ల నుండి దూరంగానే ఉన్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వంలో డి.ఎం.కె భాగస్వామిగా ఉండటం, యూ.పి.ఏ నుండి వైదొలగితే త్వరలో జరిగే తమిళనాడు రాష్ట్ర ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయం ఉండటం వలన డి.ఎం.కె పార్టీ, యూ.పి.ఏ కూటమి నుండి తప్పుకొనే అవకాశాలు లేవని పరిశీలకుల అంచనా. మరోవైపు మిస్టర్ క్లీన్ బిరుదుతో ఊరేగుతున్న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పరువు ప్రతిష్టలు కూడా 2-జి స్కాం పుణ్యమాని కనుమరుగవుతుండటం, పాత టెలికం మంత్రి ఎ.రాజా అరెస్టయి జైలులో ఉండటం షేర్ మార్కెట్ పైన ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. “వేచి చూడటమే మంచిది” అన్న ధోరణితో విదేశీ మదుపుదారులు ఇండియా షేర్ మార్కెట్ కు దూరంగా ఉంటున్నారు.
2-జి కుంభకోణం యు.పి.ఏ అస్ధిత్వానికి పరీక్షగా మారిందనటంలో సందేహం లేదు. 2-జి కి తోడు రెండు లక్షల కోట్లు ఖజానాకు నష్టం వచ్చినట్లు భావిస్తున్న ఎస్-బ్యాండ్ స్పెక్ట్రం కుంభకోణం కూడా బయట పడటం వలన కేంద్ర ప్రభుత్వానికి ఊపిరాడని పరిస్ధితి ఏర్పడింది. దానితో 2-జి కుంభకోణంపై ప్రతిపక్షాల డిమాండ్ మేరకు జె.పి.సి నియామకానికి ప్రభుత్వం అంగీకరించబోతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ప్రైవేటు కంపెనీ దేవాస్ తో ఇస్రో కి చెందిన వాణిజ్య సంస్ధ ఆంత్రిక్స్ కుదుర్చుకున్న ఒప్పందాన్ని కూడా రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం గురువారం ప్రకటించింది.
ఈ పరిణామాలతొ కేంద్ర ప్రభుత్వ పరువు అడుగుకు చేరి దాని ప్రభావం షేర్ మార్కెట్లపై పడుతున్నది.
