ఒక్క నెలలో 32 లక్షల సెల్ ఫోన్ల అమ్మకం


 

cell phone addict

సెల్ ఫోన్ వ్యసనపరుడు

అనీల్ ధీరూబాయ్ అంబానీ గ్రూప్ (ఎ.డి.ఎ.జి – అడాగ్) కి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ కంపెనీ ఒక్క జనవరి నెలలోనే 3.2 మిలియన్ ల (32 లక్షలు) మొబైల్ ఫోన్లు అమ్మినట్లుగా శుక్రవారం తెలిపింది.  జనవరి నెలలో అమ్మిన ఫోనలతో కలిపి రిలయన్స్ కాం కంపెనీ ఇప్పటికి మొత్తం ఇండియాలో 128.9 మిలియన్ల (12.89 కోట్లు) సెల్ ఫోన్లు అమ్మినట్లుగా ఆ కంపెనీ తెలిపింది. అంటే జనవరి ఆఖరుకల్లా భారతీయుల చేతుల్లో కేవలం రిలయన్స్ కంపెనీ సెల్ ఫోన్లే 12.89 కోట్లు ఉన్నాయన్న మాట.

భారత దేశంలో సెల్ ఫోన్ అనేది ఇటీవలి వరకు లగ్జరీ వస్తువు. ఇప్పుడది అత్యవసరం ఐపోయింది. కాన్పూర్ ఐ.ఐ.టి నిర్వహించిన సర్వే ప్రకారం 2015-16 నాటికి ఇండియాలో వంద మందిలో 71 మందికి సెల్ ఫోన్లు ఉంటాయని అంచనా. అయితే 2022-23 నాటికి ఇండియా జనాభా కంటే సెల్ ఫోన్ల సఖ్య ఎక్కువవుతుందని కూడా ఈ సర్వే తెలిపింది. గత ఏప్రిల్ 2010లో ఐక్యరాజ్య సమితి ఒక నివేదిక వెలువరించింది. దాని ప్రకారం 2008 సంవత్సరాంతానికి ఇండియాలో 54.5 కోట్ల మందికి సెల్ ఫోన్లు ఉన్నాయని తెలిపింది. కాని ఆరోగ్యకరమైన టాయిలెట్లు మాత్రం 36.6 కోట్ల మందికి మాత్రమే అందుబాటులో ఉన్నట్లు ఆ నివేదిక తెలిపింది.

సరళీకరణ, గ్లోబలీకరణ తెచ్చిన లక్షణం ఇది. ఆరోగ్యకరమైన టాయిలెట్లు ఏర్పాటు చేసుకోనేలా తగిన చైతన్యాన్ని ప్రభుత్వం ఇవ్వలేకపోయింది కానీ సెల్ ఫోన్లు కొనటానికి కావలిసినంత ప్రచారాన్ని మాత్రం మారుమూల పల్లెవాసి ఇంటి లోపలి దాకా తీసుకెళ్ళ గలిగింది. 15 నుండి 18 సంవత్సరాల వయసు పిల్లల్లో 88 శాతం మంది సెల ఫోన్ లేకుండా బయటికి కదలడం లేదనీ, 13 నుండి 15 సంవత్సరాల పిల్లల్లో 40 శాతం మంది సెల్ ఫోన్ సొంతదారులని గత డిసెంబరు సర్వేలో తేలినట్లు ఆసోఛామ్ సంస్ధ తెలిపింది.

పిల్లలు ఏంచేస్తున్నదీ తల్లి దండ్రులు శ్రద్ధ పెట్టక పోవటం, పశ్చిమ దేశాల సంస్కృతి తీవ్రంగా వ్యాప్తి చెందడం, పిల్లలను కూడా సెల్ ఫోన్ సొంతదారుల్ని చేయటాన్ని ఉన్నత స్దాయిగా తల్లిదండ్రులు భావించటం, పట్టణీకరణ, పాకెట్ మనీ ఎక్కువగా ఇవ్వటం, అతి గారాబం మొదలైన కారణాలు పిల్లల్లో సెల్ ఫోన్ సంస్కృతి పెరగడానికి కారణాలుగా ఆ సంస్ధ తెలిపింది. సామాజికంగా వ్యక్తుల మధ్య నేరుగా జరిగే సంభాషణలు తగ్గిపోవటానికి ఫోన్లు ఓ కారణంగా ఉన్నాయి. తద్వారా వివిధ సామాజిక పాత్రల మధ్య సామీప్యత చెరిగిపోతున్నదని కొన్ని సర్వేలు తెలుపుతున్నాయి.

ఇదిలా ఉండగా సెల్ ఫోన్లను వాడడం వలన అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని వైద్య పరిశోధకులు తెలుపుతున్నారు. సెల్ ఫోన్ లేక పోతే ఏదో పోగొట్టుకున్నట్లుగా అనిపించడం, పదే పదే కాల్ వచ్చిందేమోనని ఫోన్ చెక్ చేసుకోవటం, ఫోన్ మోగక పోయినా మోగినట్లు అనిపించి సెల్ ఫోన్ ఉన్న చోటికి పరుగెత్తడం, టాయిలెట్ లోకి వెళ్తూ కూడా సెల్ ఫోన్ తీసుకెళ్ళాలని అనిపించడం ఇవన్నీ సెల్ ఫోన్ వాడకందారుల్లో తలెత్తే మానసిక వైపరీత్యాలు కాగా, నెమ్మదిగా కేన్సర్ కు దారి తీసే లక్షణాలు పేరుకు పోతుండటం శారీరక ప్రభావాలని బ్రిటన్ వైద్య పరిశోధకులు గత సంవత్సరం తెలిపారు. సెల్ ఫోన్ నుండి వెలువడే విద్యుదయస్కాంత తరంగాలు మెదడుపై ప్రతికూల ప్రభావం చూపి ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందని వారు తెలిపారు.

వ్యాఖ్యానించండి