చైనా మరోసారి అమెరికాను హెచ్చరించింది. “ఇంటర్నెట్ స్వేఛ్చ పేరుతో తన అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే ఊరుకునేది లేద”ని తీవ్రంగా హెచ్చరించింది. ఇంటర్నెట్ ఫ్రీడం కి సంబంధించి అమెరికాను చైనా హెచ్చరించడం ఇది రెండో సారి. తమ ఈ-మెయిల్ ఎకౌంట్లలోకి కొన్నింటిని చైనా హ్యాకర్లు జొరబడ్డారంటూ గూగుల్ 2010 సంవత్సరంలో చైనా ప్రభుత్వంతో తలపడినపుడు గూగుల్ కు మద్దతుగా అమెరికా ముందుకొచ్చింది. అమెరికా ‘సెక్రటరీ ఆఫ్ స్టేట్’ హిల్లరీ క్లింటన్ గూగుల్ పై నిబంధనలు విధించడాన్ని వ్యతిరేకిస్తూ “ఆ నిబంధనలు ఇంటర్నెట్ స్వేఛ్చా సూత్రాలకు విరుద్ధమని ప్రకటించింది. చైనా ఆ ప్రకటనని తీవ్రంగా నిరసించి “చైనాలో వ్యాపారం చేయాలంటే చైనా చట్టాలను పాటించాల్సిందే. దీనిలో ఎవరు జోక్యం చేసుకున్నా సహించేది లేదు” అని హెచ్చరించింది. ఆ తర్వాత మళ్ళీ అదే కారణం పై మరోసారి అమెరికాను చైనా హెచ్చరించింది.మంగళవారం, ఫిబ్రవరి 15 తేదీన వాషింగ్టన్ యూనివర్సిటీలో హిల్లరీ క్లింటన్ ఇంటర్నెట్ స్వేఛ్చపై ప్రసంగించింది. “ఇంటర్నెట్ ను ఉపయోగించడంలో ప్రప్రంచ సమాజం ఉమ్మడి ప్రమాణాలను పాటించాలని పిలుపునిచ్చింది. అంతటితో ఆగితే ఏ గొడవా ఉండకపోను. కాని అగ్ర రాజ్య పెత్తనం చూపకపోతే అమెరికా అధికారులకు ఏ పని చేసినట్లు ఉండదు. “వెబ్ ఆధారిగ ఎత్తుగడలతో కొన్ని దేశాలు తమ పౌరులను అణచిపెట్టి ఉంచుతున్నాయని” విమర్శించింది.
“ప్రభుత్వాలు ఇంటర్నెట్ పై విధించే నియంత్రణలను అధిగమించటానికి ప్రపంచ వ్యాపితంగా ఉన్న అసమ్మతివాదులకు అమెరికా సహాయం అందించటానికి చొరవ చూపుతుంది,” అని హిల్లరీ క్లింటన్ ప్రకటించింది. ఇంకా మాట్లాడుతూ “ట్యునీషియా ఈజిప్టు దేశాల్లో ఇటీవల ఆందోళనకారులు ఇంటర్నెట్ ద్వారా ప్రచారం చేసి ప్రభుత్వాలు కూల్చ గలగడం గమనించినట్లయితే, ప్రభుత్వాలు తమ పౌరులకు ఏ స్వేఛ్చను ప్రసాదించాలన్న విషయాన్ని ఇక ఎంత మాత్రం నిర్ణయించలేవని అర్ధమవుతుంది. ఇంటర్నెట్ స్వేఛ్చకు అడ్డంకులు సృష్టించే ప్రభుత్వాలు -అవి సాంకేతిక ఫిల్టర్లు ఉపయోగించి అడ్డుకోవచ్చు, లేదా సెన్సారింగ్ ద్వారా అడ్డుకోవచ్చు, లేదా భావ వ్యక్తీకరణా స్వేఛ్చను ఇంటర్నెట్ ద్వారా పొందేవారిపై దాడులు చేయటం ద్వారా అడ్డుకోవచ్చు- అంతిమంగా తాము ముట్టడిలో ఉన్నామని గ్రహించక తప్పదు” అన్నది. నేరుగా చైనాను ఉద్దేశిస్తూ “చైనా, ‘నియంతల అయోమయాన్ని’ (డిక్టేటర్స్ డైలమా) ఎదుర్కొంటున్నది. మిగతా ప్రపంచం కొత్త కొత్త సాంకేతిక పరిజ్గ్నానాన్ని సొంతం చేసుకుంటుంటే చైనా వెనకబడిపోయే ప్రమాదంలో పడిపోతుంది” అని హిల్లరీ వ్యాఖ్యానించింది.
హిల్లరీ ఉపదేశం వినసొంపుగానే ఉన్నప్పటికీ, ఇంటర్నెట్ స్వేఛ్ఛ, వికీలీక్స్ ఛీఫ్ ఎడిటర్ ఐన జులియన్ అస్సాంజ్ విషయానికి వచ్చేసరికి అమెరికాకు అంత చేదుగా అనిపిస్తోందో, ఇంటర్నెట్ నే ఉపయోగించి డిప్లొమసీ మాటున అమెరికా సాగిస్తున్న గూఢచర్యం రహస్యాలను వెల్లడిస్తున్న అస్సాంజ్ ను అమెరికా రప్పించి శిక్షించాలని ఎందుకు ప్రయత్నిస్తున్నదో వివరిస్తే ఆమె ఉపదేశానికి అర్ధం ఉండేది. అమెరికా జోక్యాన్ని గత సంవత్సరం “సమాచార సామ్రాజ్యవాదం” గా అభివర్ణించిన చైనా ఈసారి కూడా అంతే ఘాటుగా స్పందించింది. “అటువంటి విషయాలపై చర్చ జరపడానికి చైనా సిద్ధంగానే ఉంది. చైనా చట్టాలను అనుసరించి చైనా ప్రజలు ఇంటర్నెట్ స్వేచ్ఛను చక్కగానే అనుభవిస్తున్నారు. ఎటొచ్చీ ఇంటర్నెట్ స్వేచ్ఛను అడ్డు పెట్టుకొని మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటానికే మేము బద్ధ వ్యతిరేకం” అని చైనా విదేశీ మంత్రిత్వ శాఖ సమాధానం ఇచ్చింది.
ప్రపంచ దేశాల పై తెగబడి ప్రకటనలు ఇవ్వడమే తప్ప వారి అభ్యంతరాలకు తిరిగి సమాధానం ఇచ్చే అలవాటు అమెరికాకు లేదు. తాను చెప్పిందే అందరూ వినాలి తప్ప తాను ఎవరి మాటా వినే ప్రశ్నే లేదని భావించే పెత్తందారు అమెరికాకు రాజ్యానికి ప్రజలే బుద్ధి చెప్పే రోజు వస్తుంది.
