ఇండియా జపాన్ ల మధ్య కుదిరిన స్వేఛ్చా వాణిజ్య ఒప్పందం


ఇండియా, జపాన్ లు టోక్యోలో స్వేఛ్చా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఇండియా ప్రతినిధిగా వాణిజ్య మంత్రి ఆనంద శర్మ, జపాన్ ప్రతినిధిగా విదేశాంగ మంత్రి సీజీ మాయెహారా ఒప్పందం పై సంతకాలు చేశారు. రానున్న దశాబ్ద కాలంలో రెండు దేశాల మధ్య వాణిజ్యం జరిగే సరుకుల్లో 94 శాతం పైన పన్నులు ఈ ఒప్పందం ప్రకారం రద్దవుతాయి. టెక్స్ టైల్స్, మందులు, ఆటో లాంటి రంగాలతో పాటు సర్వీసు రంగాలు కూడా ఈ ఒప్పందం పరిధి లోకి వస్తాయి.

జపాన్, ఇండియాల మధ్య వాణిజ్యం 2009లో 23 శాతం పడిపోయి 10 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లుగా “జపాన్ విదేశీ వాణిజ్య సంస్ధ” తెలిపింది. ఒప్పందం ముందు రోజే ప్రపంచ వాణిజ్య సంస్ధ “మరిన్ని బహిరంగ మార్కెట్లు సంపాదించ గలిగితే జపాన్ ఆర్ధిక వ్యవస్ధ కోలుకుంటుంద”ని పేర్కోన్నాడు. ఆ వ్యూహంలో భాగంగానే భారత ప్రభుత్వం మరింత సరళీకరణకు పూనుకుంది.

సరళీకరణ విధానాల్లో భాగమే ఈ ఒప్పందం. జపాన్ లో ఆర్ధిక మాంద్యం కారణంగా జపాన్ సరుకులకు అంతర్జాతీయంగా డిమాండ్ పడిపోయి ఆర్ధిక వ్యవస్ధ 2010 చివరి క్వార్టర్లో కుచించుకు పోయిన ప్రస్తుత సమయంలో ఈ ఒప్పందం జపాన్ కు వరదాయని లాంటిదని చెప్పుకోవచ్చు. అధికంగా ఉన్న యెన్ విలువ కారణంగా జపాన్ సరుకులు అధిక ధరలు పలుకుతున్నాయి. దాంతో జపాన్ సరుకులకు మార్కెట్ పడిపోయి దాని ఆర్ధిక వృద్ధి పై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఈ నేపధ్యంలో మార్కెట్ ఎకానమీగా అభివృద్ధి చెందుతున్న ఇండియాతో స్వేఛ్చా వాణిజ్య ఒప్పందం జపాన్ కు బాగా లాభిస్తుంది.

మరోవైపు ఇండియా జారీ చేస్తున్న ఇన్ ఫ్రాస్ట్రక్చర్ బాండ్లలో పెట్టుబడులు పెడతానని జపాన్ హామీ ఇచ్చింది. ఇండియా వేగంగా వృద్ధి చెందుతున్నప్పటికీ రోడ్లు, రైళ్ళు, ఓడరేవులు అభివృద్ధి చెందక పోవటం వలన ప్రపంచం స్ధాయిలో పోటీ పడగల సరుకులను ఉత్పత్తి చేయలేక పోతున్నదనీ, విదేశీ కంపేనీలు కూడా ఆ కారణంగా పెట్టుబడులు పెట్టడానికి వెనకాడుతున్నారనీ చాలా కాలంగా విశ్లేషణలు చేస్తున్నారు. ఆ విశ్లేషణలకు స్పందనగా ఇండియా 2007లో ఇన్ ఫ్రాస్ట్రక్చర్ బాండ్లను జారీ చేస్తామని ప్రకటించింది. తద్వారా సమకూరిన డబ్బును మౌలిక సౌకర్యాల నిర్మాణానికి ఉపయోగించాలని ఇండియా ప్రయత్నం. ఆ బాండ్లలోనే పెట్టుబడులు పెడతానని జపాన్ హామీ ఇస్తోంది. తన మార్కెట్ ను ఇండియా మరింతగా బహిరింగ పరిచినందుకు బహుమతిగా జపాన్ ఈ మేలు చేస్తానంటోంది.

వ్యాఖ్యానించండి