ట్యునీషియాలో జన్మించి ఈజిప్టులొ ఇసుక తుఫాను రేపి పశ్చిమాసియా, ఉత్తరాఫ్రికాలను గడ గడా వణికిస్తున్న అరబ్ ప్రజా ఉద్యమ మహోత్తుంగ తరంగం అరేబియా అఖాతంలో ఓ చిన్న ద్వీప దేశం ఐన బహ్రెయిన్ ను సైతం తాకింది. ట్యునీషియా, ఈజిప్టు దేశాల్లో దశాబ్దాల పాటు అధ్యక్షులుగా చెలామణి అవుతూ వచ్చిన నియంతృత్వ పాలకులను కూలదోసిన ఈ పోరాట తరంగం ఇప్పుడు బహ్రెయిన్ లో మత వివక్షకు వ్యతిరేకంగా, రాజకీయ సంస్కరణల కోసం ప్రజలను వీధుల్లోకి లాక్కొచ్చింది.
ఇంటర్నెట్ ద్వారా, బ్లాగింగ్ చేసే యువకుల చొరవతో ప్రారంభమైన ఈ రాజకీయ సంస్కరణోద్యమంలో అప్పుడే ఇద్దరు యువకులు అమరులయ్యారు. ఫిబ్రవరి 14 ను ప్రపంచమంతా “ప్రేమికుల రోజు” గా జరుపుకుంటుంటే బహ్రెయిన్ లో షియా మతస్ధులు “ఆగ్రహ దినం” (డే ఆఫ్ రేజ్)గా ప్రకటించి గ్రామీణులను సమీకరించి ప్రదర్శనలు నిర్వహించారు. భద్రతా దళాలతో జరిగిన ఘర్షణలో సోమవారం ఒక యువకుడు మృతి చెందాడు. మృతి చెందిన యువకునికి అంతిమ సంస్కారాలు జరపడంకోసం అంతిమ యాత్ర ప్రారంభమవుతుండగా మళ్ళీ భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో మరొక యువకుడు చనిపోయాడు. మొదట టియర్ గ్యాస్ తో ప్రదర్శకులను చెదరగొట్టినప్పటికీ మరలా గుమికూడడంతో భద్రతా దళాలు కాల్పులు జరిపాయి.
కేవలం 530,000 మంది జనాభా గల బహ్రెయిన్ లో 70 శాతం మంది షియా ముస్లింలు అయినప్పటికీ రాజు మాత్రం సున్నీ మతస్ధుడు. రాజు, ప్రభుత్వం మత వివక్షను పాటుస్తున్నారనీ సౌకర్యాలూ, ఉద్యోగాలూ సున్నీలకు ఇవ్వడానికే ప్రాధాన్యం ఇస్తున్నారనీ అక్కడి షియాలు చాలా కాలం నుండి ఆక్షేపిస్తున్నారు. షియాల మెజారిటీని తగ్గించడానికి ప్రభుత్వం ఇతర దేశాల సున్నీలు బహ్రెయిన్ లో స్ధిరపడటానికి అనేక ప్రోత్సాహకాలను ప్రకటించింది. ఈ నేపధ్యంలో ఆయిల్ ఉత్పత్తి చేసే బహ్రెయిన్ లో షియా మతస్తుల ఆందోళనలు కొత్తేమీ కాదు. కానీ ఇప్పటికే ఇద్దరు నియంతలను మట్టి కరిపించిన ప్రజా ఉద్యమం అరబ్బు నియంతలనూ రాజులనూ భయపెడుతున్నది.
బహ్రెయిన రాజూ, ప్రభుత్వమూ అమెరికాకు నమ్మిన బంట్లు. అమెరికా సైనిక స్ధావరం కూడా ఇక్కడ ఉంది. అరబ్బు పాలకులు అమెరికా కనుసన్నల్లో ఉన్నందు వలన అరబ్బు పాలకులతో పాటు అమెరికా కూడా తాజాగా చెలరేగిన ప్రజా ఉద్యమం పట్ల వ్యతిరేకతతో ఉంది. ఈ ఉద్యమం వలన ప్రజాస్వామ్యం గురించి తాను బోధించే సూక్తులన్నీ ఒఠ్ఠి డొల్లే అన్న సంగతి వెల్లడి కావడం కూడా అమెరికా కు కంటగింపుగా ఉంది. గత సంవత్సరం ఆగస్టులో టెర్రరిస్టు ముద్ర వేసి, రాజును కూలదోసే ప్రయత్నం చేశారన్న నేరం మోపి దాదాపు 23 మంది యువకులను నిర్బంధించారు. వారిలో మైనర్లు కూడా ఉన్నట్లు సమాచారం.
ప్రజలు సోమవారం ఊరేగింపులో పాల్గొనకుండా నిరోధించటానికి బహ్రెయిన్ రాజు ‘హమద్ బిన్ ఈసా ఆల్-ఖలీఫా’ గ్రామీణులకు కుటుంబానికి 1000 దీనార్ లు (2650 డాలర్లు) ఇస్తున్నట్లు ప్రకటింఛాడు. గత సంవత్సరం ఆగస్టులో అరెస్టు చేసిన మైనర్లను విడుదల చేస్తానని ఆశ చూపాడు. అయినప్పటికీ ప్రదర్శన జరగకుండా ఆపలేక పోయాడు. ప్రదర్శకులు ప్రధానంగా మరిన్ని రాజకీయ హక్కుల కోసం డిమాండ్ చేశారు. షియాల తరపున ఏర్పాటయిన రాజకీయ పార్టీ పట్ల కూడా వారు అసంతృప్తిగా ఉన్నారు. షియా ఎం.పిలు పార్లమెంటును వదిలి తమతో కలిస్తేనే తమ సమస్యల పట్ల వారికి చిత్తశుద్ధి ఉన్నట్లని ప్రకటించినప్పటికీ షియా ఎం.పిలు ప్రకటనలతో సరి పెట్టారు.
బహ్రెయిన్ లో షియా యువకులు తమ మీద అమలవుతున్న వివక్షకు వ్యతిరేకంగా తరచుగా రాత్రుళ్ళ సమయంలో భద్రతా సైనికులతో తలపడటం నిత్యకృత్యం. దాన్ని నిరోధించే ఉద్దేశంతోనే రాజు గత సంవత్సరం ఆగస్టులో షియా గ్రూపుల పైన విరుచుకు పడ్డాడు.
