ఈజిప్టు ప్రజాందోళనకు ఇరాన్ లోని పాలక, ప్రతిపక్షాలు రెండూ మద్దతు పలికాయి, కానీ వేర్వేరు కారణాలతో. పాలక పక్షం పశ్చిమ దేశాలు పెంచి పోషించిన నియంతకు వ్యతిరేకంగా తలెత్తిన “ఇస్లామిక్ మేలుకొలుపు” గా అబివర్ణించి మద్దతు తెలపగా, ప్రతిపక్ష పార్టీలు మాత్రం “రాజకీయ స్వేఛ్చా వాయువుల కోసం ఎగసిపడిన ప్రజా ఉద్యమం”గా అభివర్ణించి ఈజిప్టు ప్రజల ఉద్యమానికి సంఘీభావంగా ఇరాన్ లో ప్రదర్శనలు పిలుపునిచ్చాయి. సోమవారం ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో జరిగిన ప్రదర్శన సందర్భంగా చెలరేగిన ఘర్షణలో ఒక ప్రదర్శనకారుడు జరిపిన కాల్పుల్లో ఒక పోలీసు చనిపోయాడు. రాజధాని టెహ్రాన్ లో గల “ఆజాదీ స్క్వేర్” వద్ద ఇరాన్ ప్రతిపక్ష పార్టీలు నిరసన ప్రదర్శనకు ఇచ్చిన పిలుపుమేరకు వేలమంది ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు స్పందించారు. ప్రదర్శనలో పాల్గొనకుండా ప్రధాన ప్రతిపక్ష నాయకులు హొస్సేన్ మౌసావి, మెహ్దీ కరౌబీ లను ముందే గృహ నిర్బంధంలో ఉంచారు. “నియంతలకు మరణ శిక్ష” అంటూ ప్రదర్శనలో పాల్గొన్నవారు నినాదాలు చేశారు. ప్రజలను ఊరేగింపులకు ప్రతిపక్ష పార్టీలే ఉసికొల్పాయనీ వారిపై చర్యలు తప్పవనీ పోలీసులు ప్రకటించారు.
అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్, హిల్లరీ క్లింటన్, ఇరాన్ ఆందోళనలకు పూర్తి మద్దతు ప్రకటించింది. ఈజిప్టు లాగే ఇరాన్ పాలకులు కూడా పౌరులకు రాజకీయ స్వేఛ్చ కల్పించాలని హితవు పలికింది. ఇరాన్ లో జరిగే ప్రదర్శనలకు పశ్చిమ దేశాలు అన్ని విధాలుగా సహాయం అందించి ప్రోత్సహిస్తున్నాయని ఇరాన్ పాలక పార్టీ నిందించింది. ప్రతిపక్ష నాయకులిద్దరూ పెద్ద అవినీతిపరులనీ, వారిని ఉరి తీయాలనీ పాలక పార్టీ ఎం.పి లు పార్లమెంటులో డిమాండ్ చేశాయి.
ఇరాన్ అణు విధానం పట్ల పశ్చిమ దేశాలు వ్యతిరేకతతో ఉన్న విషయం తెలిసిందే. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు లేనప్పటికీ, తన దేశంలో అణ్వాయుధాల తనిఖీ కోసం అంతర్జాతీయ పరిశీలకులను అనుమతించినప్పటికీ పశ్చిమ దేశాలు అదే పనిగా ఇరాన్ ను తిట్టి పోస్తుంటాయి. ప్రపంచంలో ఏ దేశమైనా అణ్వాయుధం నిర్మించుకోవాలన్నా అంతర్జాతీయ అణు శక్తి సంస్ధ (ఐ.ఏ.ఇ.ఏ) అనుమతి తీసుకోవాలని పశ్చిమ దేశాలు ఆజ్గ్నాపిస్తుంటాయి. ఐ.ఏ.ఇ.ఏ అనుమతి అంటే అమెరికా అనుమతి అనే అర్ధం. ఎందుకంటే ఐ.ఏ.ఇ.ఏ అమెరికా కనుసన్నల్లోనే నడుస్తుంది.
ఐ.ఏ.ఇ.ఏ అనుమతి తీసుకోలేదన్న సాకుతో పశ్చిమ దేశాలు ఇప్పటికి నాలుగు సార్లు ఇరాన్ పైన ఆర్ధిక రాజకీయ ఆంక్షలు విధించాయి. వాస్తవానికి పశ్చిమాసియాలో అమెరికా అనుంగు మిత్రుడు, అమెరికా తర్వాత అంత స్ధాయిలో పశ్చిమాసియా ప్రాంతంలో అరాచకాలకు పాల్పడే ఇజ్రాయెల్ తప్ప మరో దేశానికి అణ్వాయుధాలు ఉండకూడదనే దురుద్దేశంతోనే అమెరికా నాయకత్వంలో పశ్ఛిమ దేశాలు అప్రకటిత యుద్ధం చేస్తున్నాయి. ఇదే అవకాశంగా ఇరాన్ మత పాలకులు తమ దేశంలో జరిగే నిరసన ప్రదర్శనలన్నింటికీ పశ్చిమదేశాలే కారణమని నిందించి తప్పుకుంటున్నారు.
ఇరాన్ వద్ద అణ్వాయుధ పరిజ్గ్నానం లేదని అమెరికా గూఢచార సంస్ధ సి.ఐ.ఏ తేల్చి చెప్పింది. ఇజ్రాయిల్ గూఢచార సంస్ధ మొస్సాద్ కూడా ఇటీవల ఇరాన్ అణ్వాయుధం తయారు చేయాలంటే మరో ఐదు సంవత్సరాలు పడుతుందని వెల్లడించింది. అయినా, “ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయాలని ప్రయత్నిస్తున్నద”న్న ఒకే ఒక్క సాకు చూపి ఇప్పటికి నాలుగు దఫాలుగా పశ్చిమ దేశాలు దారుణమైన ఆంక్షలు విధించాయి. వైద్య ప్రయోజనాలకు, ఇంధన ప్రయోజనాలకు మాత్రమే తాము ప్రయత్నిస్తున్నామని ఇరాన ప్రకటించినప్పటికీ పశ్చిమ దేశాలు పట్టించుకోవటం లేదు. ఎన్నిసార్లు ఆంక్షలు విధించినా ఇరాన్ లొంగక పోవటంతో పశ్ఛిమ సామ్రాజ్య వాదులు ఇంకా కసి పెంచుకుంటున్నాయి. ఆంక్షలు అక్కడి ప్రజలపై దారుణ ప్రభావం చూపుతున్నప్పటికీ వాటికి లెక్క లేదు. “ఇరాన్ ప్రజలు తమ పాలకులను మార్చుకోవాలి” అని అనధికారంగా నిస్సిగ్గుగా ప్రకటించాయి.
