నిష్క్రమించిన ఆందోళనకారులు, కొన్ని డిమాండ్లు నెరవేర్చిన మిలట్రీ పాలకులు


 

Tahrir Square cleared

ఖాళీ ఐన తాహ్రిరి స్క్వేర్ (పెద్ద బొమ్మ కోసం క్లిక్ చేయండి)

ఆందోళనకారుల డిమాండ్లలో కొన్నంటిని మిలట్రీ పాలకులు నెరవేర్చడంతో వారు విమోచనా కూడలిని వదిలి వెళ్ళిపోవడం ప్రారంభించారు. వెళ్ళడానికి నిరాకరించిన కొద్దిమందిని అరెస్టు చేసినట్టు సమాచారం. పార్లమెంటును రద్దు చేస్తున్నట్లుగా మిలిట్రీ కౌన్సిల్ ప్రకటించింది. సంవత్సరం క్రితం జరిగిన ఎన్నికలలో పార్లమెంటు సభ్యులను ఎన్నుకున్నారు. ఎన్నికలలో పోటీ చేయకుండా అనేక పార్టీలను ముబారక్ ఎప్పటిలాగే నిషేధించడంతో పార్లమెంటులో అత్యధికులు ముబారక్ పార్టీవారే మిగిలారు. ముబారక్ పార్టీ యధేఛ్చగా రిగ్గింగ్ చేసే అచారం ఈజిప్టులో ఉంది. అందువలన పార్లమెంటును రద్దు చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేసారు.

మిలట్రీ కౌన్సిల్ ప్రకటన విశేషాలు

  • పార్లమెంటు లోని ఉభయ సభల రద్దు
  • రాజ్యాంగం సస్పెన్షన్
  • ఆరు నెలల పాటు లేదా ఎన్నికలు నిర్వహించే వరకు మిలట్రీ కౌన్సిల్ చేతిలో అధికారం
  • రాజ్యాంగ సవరణకు ఓ కమిటీ ఏర్పాటటు
  • సవరించిన రాజ్యాంగంపై ప్రజాభిప్రాయ సేకరణ (ఫ్లెబిసైట్)
  • మధ్యంతర కాలంలో మిలట్రీ కౌన్సిల్ చట్టాలు చేస్తుంది
  • ఆందోళన కాలంలో ముబారక్ నియమించిన ప్రధాని అహ్మద్ షాఫిక్, అతని నాయకత్వం లోని కేబినెట్, కొత్త కేబినెట్ ఏర్పడే వరకు కొనసాగుతుంది
  • అధ్యక్ష, పార్లమెంటు ఎన్నికలను మిలట్రీ కౌన్సిల్ నిర్వహిస్తుంది
  • పాత అంతర్జాతీయ ఒప్పందాలన్నీ కొనసాగుతాయి

ఆందోళనకారుల ముఖ్యమైన డిమాండ్ “ఎమర్జెన్సీ ఎత్తివేత” మిలట్రీ ప్రకటనలో చోటు చేసుకోలేదు. ప్రజలు లేదా ప్రతిపక్షాలు సభలు జరపాలన్నా, ప్రదర్శనలు నిర్వహించాలన్నా ఎమర్జెన్సీ చట్టం ఉన్నంత కాలం సాధ్యం కాదు. మళ్ళీ ఆందోళనలు తలెత్తకుండా ఉండటానికే ఎమర్జెన్సీ ఎత్తివేయకుండ మిలట్రీ అలానే ఉంచిందని భావించవచ్చు. ముబారక్ కు సన్నిహితులయిన కంపెనీ యజమానులను తొలగించాలని కార్మికులు కోరుతున్నారు. ఆందోళన విరమణ నాటి చర్చలలో వారిని తొలగిస్తామని మిలట్రీ లీడర్లు హాబీ ఇచ్చారని ఆందోళన కారుల నాయకుడొకరు తెలియజేశాడు.

రాజకీయ పార్టీల నియంతృత్వం

కంపెనీ యజమానులను తొలగించే చర్యలు ఏవీ కనిపించక పోవటంతో కార్మికులు సమ్మెలు చేయటానికి సిద్ధమైనట్లు సమాచారం. కానీ, ఆందోళన వలన కంపెనీల్లో ఉత్పత్తి దెబ్బతిని ఆర్ధిక వ్యవస్ధ క్షీణించిందన్న పేరుతో సమ్మెలను మిలట్రీ కౌన్సిల్ నిషేధం విధించే అవకాశం కనిపిస్తోంది. ఆందోళనకు నాయకత్వం వహించిన ఎల్-బరాదీ, ముస్లిం బ్రదర్ హుడ్ లాంటి వారికి సమ్మెల నిషేధానికి పెద్దగా అభ్యంతరం ఉండకపోవచ్చు.

కనుక, మొత్తం దేశాన్ని అణచి ఉంచటానికి ముబారక్ వినియోగించిన ఎమర్జెన్సీ చట్టం, ప్రజాస్వామ్యం కోసం జరిగిన ఉద్యమం తర్వాత, కార్మికులను, వారి కనీస కోర్కెలను అణచివేయటానికి ఉపయోగపడనున్నాయి. ప్రజాస్వామిక ఉద్యమం, ఒకరి నియంతృత్వం స్ధానంలో రాజకీయ పార్టీల నియంతృత్వం స్ధాపించటానికి ఉపయోగ పడిందన్నమాట. కాకపోతే ఏ రాజకీయ పార్టీ తమపై నియంతృత్వం చెలాయించాలో ఎన్నుకునే అవకాశం మాత్రం ప్రజలకు ఉండొచ్చు. అటువంటి ఘనమైన స్వేఛ్చ కల్పించటానికే రాజ్యాంగ సవరణ. నేతి బీరకాయ లాంటి అటువంటి స్వేఛ్చ కోసమే ముబారక్ కాలపు రాజ్యాంగాన్ని రద్దు చేసి కొత్త రాజ్యాంగాన్ని రూపొందించుకోవటం బదులు పాత రాజ్యాంగాన్నే సవరించబోతున్నారు.

ఆందోళనకారుల మరో ముఖ్యమైన డిమాండ్ కూడా విస్మరించబడింది. ఎన్నికలు జరిగే వరకూ ఆందోళనకు నాయకత్వం వహించిన పార్టీల నుండి వచ్చిన ప్రతినిధులతో తాత్కాలిక కమిటీ ఏర్పాటు చేయాలనీ, ఆ కమిటీ ఆధ్వర్యంలోనే మధ్యంతర ప్రభుత్వం నడవాలనీ, మిలట్రీ ప్రతినిధిగా ఒకరు కమిటీలో ఉండవచ్చని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. దానిని ఇప్పుడు ఎవరూ కనీసం తలచుకోవటం లేదు. మిలట్రీ కౌన్సిల్ ప్రకటనే గొప్ప విజయంగా కొంతమంది కీర్తిస్తున్నారు. సైన్యం ప్రాపకం కోసం కొంతమంది ప్రయత్నిస్తున్నట్లుగా కూడా అర్ధం అవుతోంది. చివరికి ఈజిప్టు ప్రజలు పద్దెనిమిది రోజుల పాటు పడ్డ శ్రమకు చేకూరిన ఫలితం ‘ఈన గాచి నక్కల పాలయినట్లు”గా మరో రకం దోపిడీ వ్యవస్ధ వేళ్ళూనుకోవటానికి దోహదం చేసినట్లుగా కనిపిస్తున్నది.

పార్లమెంటు రద్ధు చేస్తామనీ, రాజ్యాంగం సవరిస్తామనీ మిలట్రీ ఇచ్చిన వాగ్దానలను వాస్తవంగా అమలు జరిపేదాకా వాటిని హామీలుగా మాత్రమే పరిగణించాలి. మిలిట్రీ అధికారంలో ఉంటూ ప్రజాస్వామ్య స్ధాపనకు దారి ఇచ్చిన ఉదాహరణ చరిత్రలో దాదాపుగా లేదు.

 

వ్యాఖ్యానించండి