11,375 కోట్ల రూపాయలు నష్టపోయిన అనీల్ అంబానీ కంపెనీలు


 

BSE-Sensex-Down

పతన దిశలో షేర్ మార్కెట్లు

బుధవారం ప్రతికూల పుకార్ల కారణంగా అనీల్ అంబానీకి చెందిన కంపెనీలు దాదాపు 2.5 బిలియన్ల డాలర్ల మార్కెట్ కేపిటల్ నష్ట పోయినట్లుగా రాయటర్స్ వార్తా సంస్ధ గురువారం తెలిపింది. బుధవారం ఇండియా షేర్ మార్కెట్లు ఎనిమిది నెలల కనిష్ట స్ధాయికి పతనమయ్యాయి. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించటంలో ప్రభుత్వం ఘోరంగా విఫలం కావటంతో విదేశీ సంస్ధాగత ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఇండియా షేర్ల నుండి ఉపసంహరించుకుంటున్నందువలన షేర్లు అడ్డూ అదుపూ లేకుండా పతనమవుతున్నాయి.

ఈ నేపధ్యంలో అనీల్ అంబానీ గ్రూపుకు (అడాగ్) చెందిన కంపెనీలు బుధవారం అత్యధికంగా నష్టపోయాయి. ‘రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్’ కంపెనీ 19 శాతం నష్టపోయింది. అది ఒక దశలో 25 శాతం పడిపోయి సెషన్ అంతానికి కొంత కోలుకుంది. ఇండియాలో రెండో పెద్ద మొబైల్ కంపెనీ అయిన ‘రిలయన్స్ కమ్యూనికేషన్స్’ కంపెనీ 18 శాతం వరకూ పడిపోయి కోలుకుని 14 శాతం నష్టంతో ముగిసింది.

మార్కెట్ పోటీదారులు తమ కంపెనీపై తప్పుడు పుకార్లు ప్రచారం చేశారని అనీల్ రెగ్యులేటరీ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు అనీల్ తెలిపాడు. అయితే రెండు కంపెనీలు గురువారం కొంత కోలుకున్నాయి. రిలయన్స్ ఇన్ఫ్రా 8 శాతం కోలుకోగా రిలయన్స్ కాం

4 శాతం కోలుకుంది. కానీ భారత షేర్ మార్కెట్ల పతనం మాత్రం గురువారం కూడా కొనసాగింది. సెన్సెక్స్ 129 పాయింట్లు కోల్పోయి 17463 వద్ద ముగిసింది. నిఫ్టీ 28 పాయింట్లు కోల్పోయి 5225 వద్ద ముగిసింది.

ప్రభుత్వం కోశాగారాన్ని స్ధిరీకరించడానికి (ఫిస్కల్ కన్సాలిడేషన్) పూనుకుంటుందన్న ఆశాభావాన్ని ఆర్.బి.ఐ గవర్నర్ దువ్వూరి.సుబ్బారావు గురువారం వ్యక్తం చేశాడు. ద్రవ్యోణం నియంత్రణ లోకి రాని ప్రస్తుత పరిస్ధితుల్లో ద్రవ్యత (లిక్విడిటీ) ను పెంచడం అసాధ్యమని ఆయన చెప్పాడు. లిక్విడిటీ పెంచే చర్యలు తీసుకుని తమకు మరింత డబ్బు అందుబాటులోకి వచ్చేలా చేయాలని కంపెనీలు వత్తిడి చేస్తుంటాయి. బహుశా వాటికి సుబ్బారావు సమాధానం ఇస్తుండ వచ్చు.

వ్యాఖ్యానించండి