ఎం.ఎన్.సిల డిమాండ్లు నెరవేర్చే బడ్జెట్ 2015-16 -(2)


Budget 2015

మౌలిక నిర్మాణాల (ఇన్ఫ్రాస్ట్రక్చర్) కోసమే అని చెబుతూ జైట్లీ బడ్జెట్ తీసుకున్న మరొక చర్య ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్లు జారీ చేయడం. ఈ తరహా బాండ్లు జారీ చేయడం మోడి-జైట్లీ బృందం కనిపెట్టినదేమీ కాదు. ప్రణబ్ ముఖర్జీ ఆర్ధిక మంత్రిగా ఉన్నప్పుడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్లు జారీ చేసి నిధులు సేకరించారు. అయితే అప్పటి ప్రభుత్వం వాటిపై పన్నులు వసూలు చేసింది. జైట్లీ బడ్జెట్ పన్నులు లేని బాండ్లు జారీ చేస్తామని ప్రకటించింది. ఏ పేరుతో బాండ్లు జారీ చేసినా అది ప్రాధమికంగా ఋణ సేకరణ. కనుక అది ఋణ దాతల ఆదాయం. ఈ విధంగా పన్నులు కట్టనవసరం లేని ఆదాయాన్ని ధనిక వర్గాలకు జైట్లీ బడ్జెట్ సమకూర్చుతోంది. బాండ్ల కొనుగోళ్ళు వేలు, లక్షలలో ఉండదు. కోట్లలో ఉంటాయి. వందల కోట్లలో కొనుగోలు చేసినా చేయవచ్చు.

పేరుకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అని చెప్పినప్పటికీ పన్ను రహిత బాండ్ల అసలు ఉద్దేశ్యం ధనిక వర్గాలకు పన్నులు లేని ఆదాయ మార్గాలను, డబ్బు దాచుకునే చోట్లను అధికారికంగా సృష్టించడం! అనగా ఒక పక్క అవినీతికి వ్యతిరేకం అని చెబుతూ అధికారికంగానే అవినీతి సొమ్మును తెల్ల డబ్బుగా మార్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఇది ప్రజల కోసం చేసినట్లుగా కనిపిస్తూ వాస్తవంలో సంపన్నుల ఆస్తి మరింత పెరిగేందుకు దోహదం చేసే చర్య. విద్యుదుత్పత్తి, రోడ్లు రైలు మార్గాల నిర్మాణం, ఇరిగేషన్ తదితర ముఖ్యమైన మౌలిక రంగాల కోసం అంటూ ఈ పద్ధతిని బడ్జెట్ ద్వారా ప్రవేశపెట్టారు.

పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ (పి.పి.పి) రూపు రేఖలను మార్చేందుకు కూడా జైట్లీ బడ్జెట్ నడుం బిగించింది. పి.పి.పి మోడల్ మొదలుకే ప్రభుత్వ రంగాన్ని పిండి ప్రైవేటు రంగానికి దోచి పెట్టే నాసిరకం మోడల్. ఈ మోడల్ లో కొద్దోగొప్పో ఉపయోగ పడుతున్న అంశాలను కూడా రద్దు చేసి పూర్తిగా తమకు అనుకూలంగా మార్చాలని కంపెనీలు ఒత్తిడి తెచ్చి సఫలం అయ్యాయి. మదుపుదారులకు ఎలాంటి ఫైనాన్షియల్ రిస్క్ లేకుండా ఉండేట్లుగా పి.పి.పి మోడల్ ను సంస్కరిస్తామని జైట్లీ బడ్జెట్ ప్రకటించింది. పి.పి.పి మోడల్ లో ప్రైవేటు భాగస్వాములు ఎదుర్కొంటున్న రిస్క్ ఏమిటి? ప్రతిపాదిత ప్రాజెక్టుకు అవసరమైన ద్రవ్య పెట్టుబడి (ఫైనాన్స్) అందుబాటులో ఉంటుందో లేదో అన్నది ఒకటి. ఒకవేళ ద్రవ్య వనరులు అందుబాటులో ఉంటే వాటి రేటు తక్కువగా ఉండాలి. ప్రాజెక్టు ఖర్చు తక్కువగా ఉండాలి. కానీ లాభాలు దండిగా ఇవ్వాలి. రుణం తేలికగా అందుబాటులో ఉండాలి. ఫైనాన్సింగ్ లాభదాయకం కాకపోతే కంపెనీలకు నష్టం కలగకుండా ప్రాజెక్టును మూసివేయాలి. ఇవన్నీ జరగకపోతే అవి ప్రైవేటు భాగస్వామి ఎదుర్కొనే ఫైనాన్షియల్ రిస్క్ గా ఆర్ధిక మంత్రి జాలి చూపుతూ వారి రిస్క్ ని తొలగించాలని చెబుతున్నారు.

ఇన్ని సౌకర్యాలు ప్రభుత్వమే కల్పిస్తే ఇక ప్రైవేటు భాగస్వామ్యం ఎందుకని? ప్రభుత్వం దగ్గర డబ్బు లేదని కదా పి.పి.పి మోడల్ లో ప్రైవేటు కంపెనీలని భాగస్వాములుగా తెస్తున్నది. వారికి ఫైనాన్స్ వనరులు కూడా ప్రభుత్వమే ఇస్తే ఇక అది ప్రైవేటు వాళ్ళు తెచ్చినట్లు ఎలా అవుతుంది? ప్రైవేటు భాగస్వాములకు ఫైనాన్షియల్ రిస్క్ తప్పించే పేరుతో ప్రజా ధనాన్ని వారికి కానుకగా ఇచ్చేందుకు జైట్లీ బడ్జెట్ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా కొత్తగా ‘నేషనల్ ఇన్వెస్ట్ మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఎన్.ఐ.ఐ.ఎఫ్)’ పేరుతో నిధిని ఏర్పాటు చేసి దానికి రు. 20,000 కోట్ల సొమ్ము కేటాయించింది. ప్రతి సంవత్సరం ఇంత మొత్తాన్ని కేటాయించబోతున్నట్లు కూడా బడ్జెట్ లో ప్రకటించేశారు. ఆ విధంగా ఒక ప్రాజెక్టు ప్రారంభానికి సంబంధించిన సాధకబాధకాలన్నీ ప్రభుత్వం తన నెత్తిన వేసుకుంది. అందుకు ప్రజా ధనాన్ని విచ్చలవిడిగా ప్రైవేటు కంపెనీలకు ధారాదత్తం చేయనుంది.

వై.ఎస్.ఆర్ ప్రభుత్వం ఇరిగేషన్ కాంట్రాక్టర్లు పనులు మొదలు పెట్టకుండానే వేల కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్ లు ఇచ్చి అందులో కమిషన్లు గుంజిన తరహాలోనే ఎన్.ఐ.ఐ.ఎఫ్ సొమ్ము కూడా కర్పూర హారతి అయినా ఆశ్చర్యం లేదు. ప్రాజెక్టులు ప్రారంభిస్తున్నాం అని ఆర్భాటం చేసి సీడింగ్ కేపిటల్ కింద ఎన్.ఐ.ఐ.ఎఫ్ నిధుల్ని తరలించి ఆనక చడీచప్పుడు కాకుండా ప్రాజెక్టులను మూసివేసే పలు బృహన్నాటకాలు ప్రదర్శించవచ్చు కూడా. ఇది దర్జాగా సాగే అధికారిక బహిరంగ లూటీ అని వేరే చెప్పనవసరం లేదు. “ప్రభుత్వం సమకూర్చే సీడ్ మనీలో అత్యధిక మొత్తం అంతిమంగా ప్రైవేటు ఈక్విటీగా మారుతుంది” అని అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగంలో చెప్పనే చెప్పారు. సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ప్రైవేటు ఈక్విటీ కింద అప్పగిస్తామని ఒక జాతీయ ఆర్ధిక మంత్రి అంత ధైర్యంగా ఎలా చెప్పగలిగారు? ఇది ప్రజలు ఆలోచించవలసిన అంశం. ప్రజలు నమ్మి మెజారిటీ ఇస్తే ఎలాంటి అడ్డగోలు పనులైనా పాలకులు చేయగలరు. ఒక పక్క ఖర్చులు తగ్గించాలని, తద్వారా ఫిస్కల్ డెఫిసిట్ అదుపు చేయాలని చెబుతూ మరోపక్క అందుకు విరుద్ధమైన చర్యలను బడ్జెట్ లో ప్రతిపాదించారు.

జైట్లీ బడ్జెట్ ప్రకటించిన మరో ముఖ్యమైన చర్య కార్పొరేట్ పన్ను తెగ్గోయడం! ప్రస్తుతం 30 శాతంగా ఉన్న జనరల్ కార్పొరేటు పన్నును రానున్న 5 సంవత్సరాలలో 25 శాతానికి తగ్గిస్తామని బడ్జెట్ లో చెప్పారు. కార్పొరేట్ పన్ను పరిధిలోకి రాకుండా ఆదాయాలను దాచి పెట్టుకునే మార్గాలు ఇప్పటికే అనేకం కార్పొరేట్ కంపెనీలకు అందుబాటులో ఉన్నాయి. ఇవి చాలవని కంపెనీలు డిమాండ్ చేయడంతో తన ఆదాయ మార్గాలలో ఒకదానిని ప్రభుత్వం ఇరుకు చేసుకుంది. ఆ విధంగా ధనిక వర్గాల ఆదాయాన్ని మరింతగా పెంచింది. కార్పొరేట్ కంపెనీల వద్ద దేశ సంపద కేంద్రీకృతం కావడానికి ఇంకా తోడ్పడింది.

“ఆస్తి పన్ను”  (వెల్త్ టాక్స్) మొత్తంగా రద్దు చేస్తున్నట్లు మోడి-జైట్లీ బడ్జెట్ ప్రకటించింది. దీనికి జైట్లీ చెప్పిన కారణం బహు విచిత్రం. బహుశా ఇంతవరకు ఎవరూ విని ఉండరు. ఎగున మధ్య తరగతి వర్గం, ధనిక వర్గాలు ఒక పద్ధతి ప్రకారం ఆస్తి పన్నును ఎగవేస్తున్నారట! అనగా పన్ను చెల్లింపుకు నిరాకరిస్తున్నారు. కట్టనికాడికి పన్ను ఎందుకని ఆస్తి పన్నును రద్దు చేస్తున్నామని ఆర్ధిక మంత్రి చెప్పారు. పన్ను ఎగవేస్తున్నందుకు మంత్రిగారు ఇచ్చే బహుమతిగా దీనిని అర్ధం చేసుకోవాలా? పన్ను వసూలుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం మాని రద్దు చేయడం ఏమిటి? ధనికవర్గాలపై పన్ను కాబట్టి రద్దయిందిగానీ అదే సాధారణ ప్రజలయితే కోర్టులు, పోలీసులు, చట్టాలు కార్యరంగంలోకి దూకి ఉండేవి కాదా? ఆస్తి పన్నుకు బదులు కోటి రూపాయల పైబడి పన్ను వేయగల ఆదాయం పొందేవారిపై 2 శాతం సర్ ఛార్జీ వేస్తున్నట్లు చెప్పారు. చాలా కొద్ది మంది మాత్రమే ఈ కోవలోకి వస్తారు.

ధనిక వర్గాలకు ఇన్ని వరాలు కురిపించిన జైట్లీ వేతన జీవులను ఎంత మాత్రం కనికరించలేదు. పైగా వారిపై పరోక్ష పన్నులను బాదారు. అనేక రంగాలలో అమ్మకపు పన్నులను పెంచారు. ఇతర రుసుములను కూడా పెంచారు. బహుళజాతి ప్రైవేటు కంపెనీలు ఎన్నాళ్లుగానో డిమాండ్ చేస్తున్న అత్యంత ప్రగతి నిరోధక, ప్రజా పీడక గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జి.ఎస్.టి) ను ఆ పై వచ్చే ఆర్ధిక సంవత్సరం నుండి (ఏప్రిల్ 1, 2016 నుండి) అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఇది అమలులోకి వస్తే దేశవ్యాపితంగా ఒకే పన్నుల విధానం వస్తుంది. వివిధ రాష్ట్రాల అభివృద్ధి స్ధాయిల మధ్య అంతరాలను ఇది పట్టించుకోదు. ‘అత్యంత అభివృద్ధికరమైన అత్యంత తాజా పరోక్ష పన్నుల విధానాన్ని జి.ఎస్.టి ద్వారా తెస్తాం’ అని జైట్లీ ప్రకటించారు. జి.ఎస్.టి వ్యవస్ధ రూప కల్పనకు అప్పటి ప్రధాని వాజ్ పేయి కమిటీ వేయగా, దానికి అధ్యక్షులు అప్పటి పశ్చిమ బెంగాల్ ఆర్ధిక మంత్రి అసిమ్ దాస్ గుప్తా. (‘ఈయన అమెరికాలో చదివిన నా మంత్రి. ఆయన మిమ్మల్ని బాగా చూసుకుంటారు’ అంటూ అప్పటి బెంగాల్ సి.ఎం జ్యోతి బసు 1990ల నాటి సంస్కరణల రోజుల్లో కార్పొరేట్ వర్గాలకు పరిచయం చేసేవారు. చివరికి కార్పొరేట్ల సంఘం ఫిక్కీ నేత చేతుల్లోనే 2011 ఎన్నికల్లో ఆయన ఓడిపోవడం కాకతాళీయం కాదు.) ఈ విధంగా వామపక్షం, కాంగ్రెస్, బి.జె.పి తలా ఒక చెయ్యి వేసిన జి.ఎస్.టి ని ‘స్టేట్ ఆఫ్ ద ఆర్ట్’ పన్నుల వ్యవస్ధగా ఆర్ధిక మంత్రి అభివర్ణించడం బట్టి ఈ రాజకీయ పక్షాలన్నింటి ఆర్ధిక కేంద్రం ఒకటే అని అర్ధం అవుతోంది. బీమా రంగంలో ఎఫ్.డి.ఐ లను 26 శాతం నుండి 49 శాతానికి పెంచే బిల్లును “ఇది మా బిల్లు. అందుకే మద్దతు ఇచ్చాం” అని కాంగ్రెస్ నేత వీరప్ప మొయిలీ ప్రకటించడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించుకోవడం సముచితం.

జి.ఎస్.టి వల్ల పన్నులు తగ్గుతాయని పాలకులు చెబుతున్నారు. కానీ పన్ను చెల్లింపుదారులు 5 లేదా 6 రెట్లు పెరుగుతారన్న సంగతిని వారు పెద్దగా చెప్పరు. ఒకసారి పన్నుల ఛత్రం కిందికి వచ్చేవారిని 5 రెట్లు పెంచడం అంటూ జరిగాక ఇక ఆ పన్నుల్ని పెంచడానికి ఎంతకాలం పడుతుందని! పైగా విదేశీ కంపెనీలు, దిగుమతి సరుకులను కూడా దేశీయ ఉత్పత్తిదారులతో సమానంగా జి.ఎస్.టి పరగణిస్తుంది. ఎగుమతిదారుల పైన అసలు పన్నులే వేయరు. అవి విదేశీ కంపెనీలైనా సరే. ఎం.ఎన్.సి లు డిమాండ్ చేసిన ‘లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్’ ఈ విధంగా పాలకులు నెరవేర్చుతున్నారు. వారిలో సొ కాల్డ్ వామపక్షాలు కూడా ఉండడం రాజకీయ ప్రాధాన్యత కలిగినది. వారిని రివిజనిస్టులుగా విప్లవ పార్టీలు ఎందుకు పరిగణిస్తాయో చెప్పేందుకు ఈ ఒక్క సంగతి చాలును.

మొదటి విడత ప్రభుత్వంలో ప్రభుత్వరంగ కంపెనీలను అయిన కాడికి అమ్మిపారేసే కర్తవ్య నిర్వహణకు ఏకంగా ఒక మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేసిన ఎన్.డి.ఏ ఆనాటి ధోరణిని కాంగ్రెస్ మార్గంలోనే తాజా బడ్జెట్ లోనూ కొనసాగించింది. ప్రభుత్వ కంపెనీల వాటాలను తెగనమ్మి 41,000 కోట్ల రూపాయలను సంపాదించాలన్న లక్ష్యాన్ని మోడి ప్రభుత్వం నిర్దేశించుకుంది. నష్టాల్లో ఉన్న పబ్లిక్ కంపెనీలను అమ్మేస్తామన్న గత ప్రకటనకు ఇది అదనం. ఆ తర్వాత సంవత్సరం ఈ లక్ష్యాన్ని ఇంకా పెంచుతామని ఎం.ఎన్.సి లకు వాగ్దానం ఇచ్చింది. బడ్జెట్ లోటు తగ్గించుకోవాలంటే ఈ త్యాగాలు తప్పవని మంత్రి బోధ చేశారు. స్వదేశీ, విదేశీ ప్రైవేటు కంపెనీలకు పదుల వేల కోట్లు దోచి పెట్టడం మానుకుంటే బడ్జెట్ లోటు తర్వాత బోలెడు మిగులు తేలుతుంది. ఆ మిగులుతో ఉపాధి కల్పించవచ్చు. సొంతగా మౌలిక నిర్మాణాలూ చేసుకోవచ్చు. ఎన్.డి.ఏ పాలకుల బడ్జెట్ లక్ష్యంలో భారత ప్రజలు లేనందున ఇది జరగదు.

బడ్జెట్ లోటు తగ్గించుకునే పేరుతో ప్రజలపై చేసే సామాజిక వ్యయంలో పలు చోట్ల కోతలను విధించింది జైట్లీ బడ్జెట్. ఆరోగ్య భద్రత, ఆరోగ్య పరిశోధన, ఎయిడ్స్ నియంత్రణ లాంటి రంగాలకు కేటాయింపులను 15 శాతం కోత పెట్టి 33,150 కోట్లు మాత్రమే కేటాయించారు. విద్యారంగం కోసమైతే 16 శాతం కోత పెట్టారు. ప్రాధమిక మరియు సెకండరీ విద్యకు 42,200 కోట్లు, ఉన్నత విద్యకు 26,900 కోట్లు కేటాయించారు. ఈ మొత్తాన్ని దేశం మొత్తానికి ఖర్చు చేయాలి. రాష్ట్రాలకు గ్రాంట్లు ఇవ్వాలి. ఈ కోతల ద్వారా మిగిల్చిన సొమ్మును రోడ్లు, రైలు పట్టాలకు తరలించారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. భారత కార్పొరేట్ వర్గాలకు శక్తివంతమైన గొంతు ఇచ్చే బిజినెస్ స్టాండర్ద్ పత్రిక సైతం ఈ కోతలను “దయ లేని కోతలు” గా అభివర్ణించింది. పెరిగిన జనాభా నేపధ్యంలోనూ, దరిద్రం పెరిగి ఆదాయాలు పడిపోతున్న నేపధ్యంలోనూ సామాజిక కార్యక్రమాలకు ఖర్చులు పెంచడం మాని ఇంత భారీ కోతలు పెట్టడం మోడి ప్రభుత్వ ప్రాధామ్యాలు ఏమిటో స్పష్టం చేస్తున్నది. ఈ కోతలను పశ్చిమ కార్పొరేట్ పత్రికలు వేనోళ్ళ కొనియాడాయి. ఫిస్కల్ డెఫిసిట్ ను అదుపు చేయాలన్న పశ్చిమ సామ్రాజ్యవాదుల డిమాండ్ యొక్క ప్రధాన ఉద్దేశ్యం ప్రజలపై పెట్టె ఖర్చు తగ్గించి దానిని కంపెనీల ప్రయోజనాలకు తరలించాలనే. ఆ లక్ష్యాన్ని జైట్లీ బడ్జెట్ సమర్ధవంతంగా నిర్వహించింది. అందుకే ఇది వారికి ‘గ్రోత్-ఓరియెంటెడ్ బడ్జెట్’ అయింది.

భారీ కోతలను, వ్యయం తగ్గింపులను కనపడకుండా చేసేందుకు జైట్లీ బడ్జెట్ కనికట్టు ప్రదర్శించింది. కాంగ్రెస్ ప్రవేశ పెట్టిన ‘మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పధకం’ ను మతిలేని పాపులిస్టు విధానంగా తెగనాడిన జైట్లీ ఈ బడ్జెట్ లో గత యేడు కంటే 5,000 కోట్లు అధికంగా కేటాయిస్తున్నట్లు తెలిపారు. అంతకు మునుపు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు సమాధానం ఇస్తూ ఉపాధీ హామీ పధకం 60 యేళ్ళ కాంగ్రెస్ పాలనా వైఫల్యానికి ‘ప్రదర్శనలో ఉంచదగ్గ సంకేతం’గా మోడి చెప్పారు. ‘అలాంటి పధకాన్ని ఎందుకు తొలగిస్తాం, కొనసాగిస్తాం గానీ’ అంటూ అపాలజీ చెప్పుకుని మరీ కేటాయింపులు పెంచారు. 60 యేళ్ళ తర్వాత కూడా జనాన్ని గోతులు తవ్వడానికి కాంగ్రెస్ పంపింది అని విమర్శించిన మోడి ఆ మాట పైన నిలబడకుండా కేటాయింపులు ఎందుకు పెంచినట్లు! అయితే ఈ పెంపుదల ఏ మేరకు అమలులోకి వస్తుందన్నది అనుమానమే. సబ్-ప్లాన్ పేర నిధులు కేటాయించి ఒక్క పైసా కూడా ఖర్చు చేయని విధంగానే జనానికి ఉద్దేశించిన మొత్తాన్ని మురిగిపోయేలా చేయడం పాలకులకు కొత్త కాదు. ప్రస్తుతానికి ఈ పెంపుదల సామాజిక పధకాలపై విధించిన కోతలను కప్పి పుచ్చేందుకు ఉపయోగపడుతుంది. మౌలిక నిర్మాణాలకు కేటాయింపులు పెంచడం వల్ల జి.డి.పి వృద్ధి చెందుతుందని, వృద్ధి పునాదిగా ఉపాధి హామీ పధకంపై వేటు వేయవచ్చని బహుశా మోడి ప్రభుత్వం ఆశిస్తుండవచ్చని కొందరు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.

అమెరికా ప్రకటించిన ఆసియా-పివోట్ వ్యూహానికి అనుగుణంగా రక్షణ రంగానికి భారీ మొత్తంలో కేటాయింపులు చేసింది. 2015-16 లో 2.46 లక్షల కోట్లు కేంద్రం ఖర్చు చేయనుంది. గత సంవత్సరం రక్షణ వ్యయం 2.22 లక్షల కోట్లు కాగా దానిపైన 9.87 శాతం అధికంగా ఈ యేడు కేటాయించింది. రక్షణ రంగంలో స్వావలంబన సాధించాలని, మనమే ఇతర దేశాలకు ఆయుధాలు ఎగుమతులు చేయాలని చెప్పిన జైట్లీ ఆ పని ఎలా చేస్తారో చెప్పలేదు. ఆచరణలో ఈ మొత్తంలోని అత్యధిక భాగం ఆయుధాల కొనుగోళ్లకే వెళ్లిపోతుంది. బడ్జెట్ లోటు తగ్గించగల మార్గాల్లో ఒకటి రక్షణ వ్యయం తగ్గించడం. విదేశాంగ విధానం ప్రభావశీలంగా ఉన్నట్లయితే రక్షణ రంగానికి వృధా వ్యయం చేయాల్సిన అవసరం తప్పుతుంది. ముఖ్యంగా ఇరుగు పొరుగు దేశాలతో స్నేహ సంబంధాలు నెరపడం ద్వారా రక్షణ వ్యయం బాగా అదుపులో పెట్టవచ్చు. కానీ రక్షణ వ్యయం పెంచడానికే పొరుగు దేశాలతో గిల్లికజ్జాలు పెట్టుకోవడం, ఆయుధ కొనుగోళ్ళు విపరీతంగా పెంచుకోవడం, దళారీ ఆదాయం పెంచుకోవడం దళారీ పాలకుల విధానం కనుక వారి హయాంలో స్వావలంబన సాధించడం కలలోని మాట!

మొత్తం మీద 2015-16 బడ్జెట్ నయా ఉదారవాద ఆర్ధిక విధానాలను వేగవంతం చేసేందుకు అవసరమైన భూమికను పటిష్టం చేసేందుకు ఉద్దేశించినది. ఢిల్లీ ఎన్నికల ద్వారా ఎదురైన ప్రజా వ్యతిరేకతను సంతృప్తిపరిచేందుకు అస్పష్టమైన తాయిలాలు ప్రకటించి, దాని మాటున బహుళజాతి కంపెనీల విచ్చలవిడి దోపిడీకి మార్గం సుగమం చేసే బడ్జెట్ ఇది! భారత ప్రజలు ఈ బడ్జెట్ నిర్దేశించిన విధానాలను ప్రతిఘటించాలి.

…………………..అయిపోయింది

2 thoughts on “ఎం.ఎన్.సిల డిమాండ్లు నెరవేర్చే బడ్జెట్ 2015-16 -(2)

వ్యాఖ్యానించండి