బి.జె.పి రోజులివి! -కార్టూన్


BJP days

“అమిత్ షాజీ! మన సొంత తెల్లపావుల భావాలను కాస్త ఉపశమనపరచండి…”

*********

ఇప్పుడు దేశంలో భారతీయ జనతా పార్టీ ఆకర్షక కేంద్రంగా మారింది. ఇతర పార్టీల్లోని ఛోటా మోటా నాయకులతో పాటు బడా నేతలు సైతం బి.జె.పిలో చేరిపోవడానికి ఆతృత ప్రదర్శిస్తున్నారు. ప్రతిపక్షంలోని ప్రత్యర్ధులు అనేకులు తమ సొంత రంగు మార్చుకుని బి.జె.పి రంగు పూసుకుంటున్నారన్న సంగతిని చదరంగం బల్ల ద్వారా కార్టూనిస్టు ప్రతిభావంతంగా చెప్పారు.

ఒకప్పుడు అంటరాని పార్టీగా ఉన్న బి.జె.పి ఆకర్షక పార్టీగా మారడానికి కారణం మోడీయేనని ఆయన సమర్ధకులు చెప్పబోతారు. అమిత్ షా చాణక్య ఎత్తుగడలు మోడీకి పెట్టని కోట అని కూడా వారి అభిప్రాయం. కానీ వాస్తవం ఏమిటంటే ఇది ప్రధానంగా ప్రజల్లో పాలకవర్గ పార్టీల పట్ల భ్రమలు కోల్పోతున్న పరిస్ధితిని తెలియజేస్తోంది. మరో ప్రత్యామ్నాయం లేని పరిస్ధితుల్లో మాత్రమే జనం అనివార్యంగా బి.జె.పి వైపు మొగ్గు చూపారే తప్ప అది బి.జె.పి ఆకర్షణ ఎంత మాత్రం కాదు.

ఆర్ధిక విధానాల పరంగా చూస్తే కాంగ్రెస్, బి.జె.పి కూటముల మధ్య ఎలాంటి తేడాలు లేకపోవడం స్పష్టంగానే కనిపిస్తున్న సంగతి. కాంగ్రెస్ కూటమి విధానాలనే బి.జె.పి కూటమి కొనసాగిస్తోంది. ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్ విధానాలని మరింత తీవ్రంగా అమలు చేస్తోంది.

భూ సేకరణ చట్టం సవరణ, కార్మిక చట్టాల సవరణ, పలు నియంత్రణల ఎత్తివేత, చమురు ధరల తగ్గింపు ప్రజలకు అందకుండా సైంధవుడిలా అడ్డుపడడం, ఒబామాను ముఖ్య అతిధిగా పిలిచి మరీ యు.పి.ఏ చేసిన పౌర అణు ఒప్పందం ఫలాలను అప్పగించబూనడం… ఇలా బి.జె.పి అమలు చేస్తున్న ప్రతి విధానమూ, చేస్తున్న ప్రతి చట్టమూ (లేదా ఆర్డినెన్స్), చెబుతున్న ప్రతి మాటా… అన్నీ కాంగ్రెస్ విధానాల కొనసాగింపే.

అంతెందుకు! బి.జె.పి అట్టహాసంగా వ్యతిరేకించిన ‘చిల్లర వర్తకంలో ఎఫ్.డి.ఐల’ విధానాన్ని బి.జె.పి రాష్ట్రాల్లో కూడా అమలు చేయించేందుకు ఆర్ధిక మంత్రి ప్రయత్నిస్తున్నారు. ఏదో ఒక వంక జెప్పి చిల్లర వర్తకంలో ఎఫ్.డి.ఐ లను ఆహ్వానించే ప్రక్రియకు బి.జె.పి త్వరలోనే లాకులు ఎత్తబోతోందని జైట్లీ ప్రకటనలు తెలియజేస్తున్నాయి.

ఇక ఇతర పార్టీల నేతలు బి.జె.పి లోకి దూకితే మాత్రం ఏమిటట తేడా?!

1 thoughts on “బి.జె.పి రోజులివి! -కార్టూన్

వ్యాఖ్యానించండి