తాలిబాన్ సరే, డ్రోన్ దాడుల లెక్క తేల్చరా?


ఆఫ్ఘన్-పాక్ సరిహద్దు ప్రాంతాల్లో సంచరించే తెహ్రీక్-ఏ-తాలిబాన్ అనే తీవ్రవాద సంస్ధ పెషావర్ లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ పైకి ఆత్మాహుతి మిలిటెంట్లను పంపి 132 మంది పిల్లలను, టీచర్లను బలిగొన్న వార్త ఇప్పుడు అందరినీ కలచివేస్తోంది.

తాలిబాన్ పైశాచికత్వం తలచుకుని ప్రతి ఒక్కరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుపితులై పిడికిళ్ళు బిగిస్తున్నారు. ‘వారు పిల్లల్ని ఎలా చంపారో వారినీ అలానే చంపాలి’ అప్పుడే తగిన శాస్తి’ అన్న నిర్ణయానికి రాకపోతే వారిలో ఏదో లోపం ఉందన్నంతగా భావోద్వేగాలు చార్జి అయి ఉన్నాయి.

ఈ కోపంలో తప్పు లేదు. ఈ భావోద్వేగాలు న్యాయమైనవే. పాకిస్తాన్ తాలిబాన్ దుశ్చర్యలు నాగరిక ప్రపంచం సహించరానివి. వారి చర్యలకు వారిని బాధ్యులు చేయవలసిందే. తాలిబాన్ మన కంటికి స్పష్టంగా కనిపించేవి.

మనకు కనపడని నిజాలు చాలా ఉన్నాయి. నిజానికి అవి తెలియనివేమీ కావు. పత్రికల్లో పతాక శీర్షికలకు ఎక్కవు గనుక మాత్రమే అవి మనకు తెలియవు. మనమూ ఆ వార్తలను చూస్తుంటాం. కానీ ‘ఎప్పుడూ చూసేదేగా’ అన్న విస్మరణతో ఆ వార్తల జోలికి మనం పెద్దగా వెళ్లం.

‘ఫోరెన్సిక్ ఆర్కిటెక్చర్’ అన్న పేరుతో ఒక పరిశోధనా ప్రాజెక్టు పని చేస్తోంది. లండన్ లోని గోల్డ్ స్మిత్ యూనివర్సిటీ, న్యూయార్క్ లోని సిటు రీసర్చ్ సంస్ధ కలిసి ఈ ప్రాజెక్టును నిర్వహిస్తున్నారు. ఈ ప్రాజెక్టు గత మే నెలలో వెల్లడించిన కొన్ని నిజాలు ఇలా ఉన్నాయి.

పాకిస్తాన్ (ఆఫ్ఘనిస్తాన్ కాదు) పై అమెరికా జరిపిన డ్రోన్ దాడుల్లో 61 శాతం నివాస గృహాలపై చేసినవే. 380కి పైగా దాడుల్లో కనీసం 132 నివాస భవనాలు నాశనం అయ్యాయి.

ఇలాంటి నివాస భవనాలపై జరిపిన డ్రోన్ దాడుల్లో 222 మంది పౌరులు ఉట్టి పుణ్యానికి చనిపోయారు.

పదేళ్ళ ఆఫ్ఘన్ యుద్ధంలో సి.ఐ.ఏ పాకిస్తాన్ నివాస గృహాలపై స్ధిరంగా దాడులు జరిపింది. (డ్రోన్ దాడులు అమెరికా అధ్యక్షుడి ప్రత్యక్ష అనుమతితో సి.ఐ.ఏ చేసేవి.)

2006 నుండి 2009 వరకు 330 సార్లు పాక్ భూభాగంపై డ్రోన్ దాడులు జరిగాయని పాక్ ప్రభుత్వం వెలువరించిన రహస్య నివేదిక ఒకటి తెలిపింది.

డ్రోన్ దాడుల్లో చనిపోయే స్త్రీలు, పిల్లల మరణాలను రిపోర్ట్ చేయడం చాలా తక్కువ. ఫలితంగా స్త్రీలు, పిల్లల మరణాలు రికార్డులకు ఎక్కడం లేదు. లేదా వాస్తవ మరణాల కంటే చాలా తక్కువగా రికార్డు చేయబడుతున్నాయి. దానికి కారణం వారు బైటికి రావడం తక్కువ. ఇళ్లలోనే ఎక్కువగా గడుపుతారు. దానితో వారు అధికారిక మృతులుగా పరిగణించబడరు.

రష్యా టుడే పత్రిక ప్రకారం 2004 నుండి ఇప్పటివరకు జరిగిన అమెరికన్ డ్రోన్ దాడుల్లో 2379 మంది చనిపోగా వారిలో 84 మంది మాత్రమే ఆల్-ఖైదా సభ్యులు. అక్టోబర్ 11, 2014 తేదీన జరిపిన డ్రోన్ దాడితో అమెరికా తన 400వ డ్రోన్ దాడిని పూర్తి చేసుకుంది.

2379 మంది మృతుల్లో 704 మందిని మాత్రమే గుర్తించగలిగారు. వారిలో 295 మంది మాత్రమే ఏదో ఒక సాయుధ గ్రూపు సభ్యులుగా గుర్తించారు. బ్రిటన్ నుండి పని చేసే బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం సంస్ధ వెల్లడించిన వివరాలను ఉటంకిస్తూ ఆర్.టి ఈ అంశాలను తెలిపింది.

2004 నుండి జరిగిన డ్రోన్ దాడుల మృతుల్లో కేవలం 111 మంది మాత్రమే వివిధ మిలిటెంట్ సంస్ధల సీనియర్ కమాండర్లుగా గుర్తించారు. మిగిలిన వారిని కేవలం ఆయా సంస్ధల సభ్యులుగా మాత్రమే గుర్తించారు.

2004-2014 మధ్య జరిగిన డ్రోన్ దాడుల్లో పాకిస్తాన్ లో 168 నుండి 204 మంది వరకు పిల్లలు చనిపోయారు. ఈ సంఖ్య తాలిబాన్ దాడిలో చనిపోయిన 140 మంది పిల్లల సంఖ్య కంటే ఎక్కువయితే ఏమిటిట?!

ఈ వివరాలు 2004 నుండి ఇప్పటివరకూ సాగిన డ్రోన్ దాడులకు సంబంధించినవి మాత్రమే. ఇందులో ఆఫ్ఘన్, ఇరాక్ దురాక్రమణ యుద్ధాల్లో లెక్కకు మిక్కిలిగా చనిపోయిన పౌరుల మరణాలు కలిసి లేవు. 1990 నుండి ఇరాక్ పై విధించిన అమానుష ఆంక్షల ఫలితంగా పాల డబ్బాలు కూడా దొరక్క చనిపోయిన లక్షలాది మంది పసి పిల్లలు (స్కూల్ పిల్లలు కూడా కాదు) కలిసి లేరు. యెమెన్, సోమాలియాలపై జరుపుతున్న డ్రోన్ దాడుల మృతులు కలిసి లేరు.

తాలిబాన్ అమానుష దాడికి స్పందించి తీరాల్సిందే. కానీ అంతకు మించి అనేక రెట్లు దుర్మార్గమైన ఆఫ్ఘన్, ఇరాక్ దురాక్రమణ యుద్ధ మృతుల కోసం, సిరియా కిరాయి తిరుగుబాటు మృతుల కోసం మన హృదయాలు ఎందుకు స్పందించవు? ఈ దాడుల వెనుక ఉన్న అమెరికన్ సామ్రాజ్యవాద భౌగోళిక రాజకీయాలను గ్రహించి ఎందుకు ఛీ కొట్టరు?

6 thoughts on “తాలిబాన్ సరే, డ్రోన్ దాడుల లెక్క తేల్చరా?

  1. దాడుల వలన ఎవరు ఎప్పుడు మరణించినా అది భాధాకరమే!స్కూల్ పిల్లలు చనిపోయారుకదా అని మిగతా సంధర్బాలలో పిల్లలు(మరెవరైనా గానీ) చనిపోయినప్పుడు బాధ ఉండదనికాదు కదా! ఆ దాడులకు ధీర్ఘకాల లక్ష్యాలు ఉండవచ్చును! కానీ,దానికి ప్రతిస్పందించే ఎమోషన్స్ స్వల్పకాలానికి చెందినవని! 2 రోజులు గడిస్తే దీని గురించి పెద్దగా ఎవరూ చర్చించరు!
    మరి ఎమోషన్సే చూపించకూడనుకొంటే(అన్నిటికీ ఎమోషన్స్ చూపించాలనుకొంటే) ఆ విషయం గూర్చి ఇక్కడ చర్చించుకోవడం అవసరమంటారా?

  2. చర్చాంశం ఎమోషన్స్ చూపించవచ్చా, కూడదా అన్నది కాదు. మన ఎమోషన్స్ కి సరైన అర్ధం ఇవ్వాలా లేదా అన్నది ఇక్కడ చర్చించాను.

    స్కూల్ బస్సు లోయలో పడి పిల్లలు చనిపోతే బాధపడతాము. ఆ బాధ ప్రభుత్వాన్ని చర్యలు తీసుకునేవైపు నెట్టేలా ఉంటే ఉపయోగమా కాదా? ఢిల్లీ అత్యాచారం తర్వాత వ్యక్తం అయిన మూకుమ్మడి బాధ అనేక వ్యవస్ధాగత లోపాలని వెలుగులోకి తెచ్చి, సరికొత్త చట్టం రావడానికి కారణం అయింది. బాధ కోసం బాధ వస్తే అది అనవసరం. అది మనల్ని కొన్ని పాజిటివ్ చర్యలకి ప్రేరేపిస్తే అది అవసరం.

    తాలిబాన్ చర్య అత్యంత క్రూరం. కానీ అంత క్రూరమైన చర్యకు ఎవరైనా ఎందుకు పాల్పడతారు? ఇంత పైశాచికత్వం ఎలా సాధ్యం? terrorism కి డిక్షనరీలో ఏ అర్ధం ఉందో ఒకసారి చూడండి.

    The use of violent action in order to achieve political aims or to force a government to act.

    ఇది ఆక్స్ ఫర్డ్ అడ్వాన్స్ లర్నర్స్ డిక్షనరీలో ఇచ్చిన అర్ధం.

    ఈ అర్ధానికి తగినట్లుగా తాలిబాన్ చరిత్రను పరిశీలిస్తూ పోతే పాక్ ప్రభుత్వమూ, ఐ.ఎస్.ఐ, సి.ఐ.ఏ (అమెరికా) లే ఆ చివర తేలుతాయి. అమెరికా, పాక్ లు తయారు చేసిన తాలిబాన్ మళ్ళీ అమెరికా, పాక్ ల మీదికే ఎందుకు వెళ్తోంది? ఈ ప్రశ్నలకు సమాధానం వెతికితే మనం ద్వేషించాల్సింది ఎవరినో అర్ధం అవుతుంది. మన బాధ ఇలాంటి విచికిత్సకు దారి తీయాలి. మీరు చెప్పినట్లు ఒకటి రెండు రోజులు ఉండి పోయే బాధ వ్యర్ధం. అది ఉన్నా లేకున్నా ఒకటే.

  3. ఈ అర్ధానికి తగినట్లుగా తాలిబాన్ చరిత్రను పరిశీలిస్తూ పోతే పాక్ ప్రభుత్వమూ, ఐ.ఎస్.ఐ, సి.ఐ.ఏ (అమెరికా) లే ఆ చివర తేలుతాయి-ఇంకా స్పస్టంగా చెప్పాలంటే దీనికి కారణం పెట్టుబడిదారుల మార్కెట్ల గుత్తాధిపత్యమే కనబడుతుంది! దీనికి పరిష్కారంగా పెట్టుబడీదారి సమాజాన్ని కూల్చివేసి,సామ్యవాద సమాజాన్ని నెలకొల్పడమేనంటారా?(పెట్టుబడీదారి వ్యవస్థ తదుపరిదశ సామ్యవాద వ్యవస్థ అనుకొంటే)
    ఒక ఉదాహరణ,వివేకాంద-“చరిత్ర అంటే గొప్పగొప్ప వ్యక్తుల జీవితచరిత్రలే”(ఏమైనా తప్పుగా రాసుంటే సవరించగలరని మనవి)
    మార్క్స్-చరిత్ర అంటే వర్గపోరాటానికి చెందిన రికార్ద్ తప్ప మరేమీ కాదు
    ఇలా ఎంతోమంది చరిత్రను వారివారి దృష్టికోణం నుండి చూసినపుడు మారిపోతూ ఉన్నప్పుడు,మన దైనందన జీవితంలో జరిగే ఎన్నో సంఘటనలకు ఇలానే స్పంధించాలి! ఇలా స్పందించకూడదు అంటే ఎదుటివారి గూర్చి(వారి వారి ఎమోషన్స్ ను) ప్రస్తావించుకోవడమే అనవసరం!!!

  4. మానవ జీవిత చరిత్ర సమస్తం అనుభవాల సారము. కార్యకారణ సంబందం. ఒక దుస్సంఘటనకు స్పందించిన పలితం దాని పునారావ్రుతం కాకుండా చూసుకోవడం. అది సరైన స్పందన అయితే దాని మూలాలు వెదకాలి.చికిత్స చేయాలి. లేకపోతే ఆ స్పందన అప్రయోజనం.

    /మార్క్స్-చరిత్ర అంటే వర్గపోరాటానికి చెందిన రికార్ద్ తప్ప మరేమీ కాదు/

    ఈ రికార్డు ను అధ్యయనమ చేసి దాని నుం డి తీసిన సారం తో కొత్త బాటకు పునాదులు వేయడం. ఇదే చరిత్ర సారం.
    అందుకే శ్రీ శ్రీ ‘ ఆరాణి ప్రేమ పురాణం ఈ కైపియుతులకై న ఖర్చు కాదోయి చరిత్ర సారం’ అన్నారు. చరిత్ర అంటే మానవ జాతి అనుభవ సారం. ఈ చరిత్ర లేకుండా మానవ మనుగడ ఒక ఇంచై నా ముందుకు కదలదు.

  5. @RAVI HIGIRI…గారు..
    ” దీనికి పరిష్కారంగా పెట్టుబడీదారి సమాజాన్ని కూల్చివేసి,సామ్యవాద సమాజాన్ని నెలకొల్పడమేనంటారా?”

    పోనీ మరేదైనా (ఇంకో ) పరిష్కారం ఉందంటారా…? (నాకు తెలియక అడుగుతున్నాను. మరోలా అనుకోవద్దు.)
    ఉంటే వివరించగలరు…

  6. చందుతులసి గారు,మీరు నేను ఒకే స్టేజ్ లో ఉన్నామంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది!(ఇదే నిజమైతే ఇంకోవ్యక్తిని సంప్రదించడం ఉత్తమమేమో!)
    మానవ అభివృద్ధి దశలను(క్రమాన్ని) పోల్చిచూసుకుంటే ప్రస్తుతమున్న దశకంటే రాబోయే దశ ఉన్నతమైనదనుకోవడం సరైనదేకదా!
    మార్క్స్ చరిత్రను చూసినకోణం మిగతా చరిత్రకారులు చూసినకోణం కంటే ప్రభావశీలమైనదని ఈ బ్లాగ్ ద్వారా విశేఖర్గారు చాలాసార్లు తెలిపారు!(నేనుకూడా నా పరిమితులమేరకు ఇది నమ్మదగినవిధంగానే ఉందని తోచింది!)
    ఆ సిద్ధాంతరీత్యా చూసుకొంటే తదుపరిదశ సామ్యవాద సమాజమే నెలకొల్పబడాలిగదా!ప్రస్తుతం జరుగుతున్న అంతర్జాతీయ పరిణామాలు సామ్యవాద సమాజ స్థాపనకు దారితీసినట్లయితే ఆ సామ్యవాద దశ ఇప్పుడున్న చాలా విపరిమాణాలను నిర్మూలించ గలదని నమ్మవచ్చునుకదా!
    అందుకే సామ్యవాదసమాజ స్థాపన జరగాలనీ,తద్వారా ప్రభావవంతమైన సామాజిక మార్పులు జరిగి మనిషి మరంత ఉన్నతమైన దశలకు చేరుకోవాలని ఆశించి ” దీనికి పరిష్కారంగా పెట్టుబడీదారి సమాజాన్ని కూల్చివేసి,సామ్యవాద సమాజాన్ని నెలకొల్పడమేనంటారా?” అని నా ఆలోచనలు తెలిపాను!
    ఏమైనా మీ విలువైన ఆలోచనలు ఉంటే తెలపాలని ఆశిస్తునాను! థాంక్స్!

వ్యాఖ్యానించండి