రూపాయి ఇంకా కిందికి…, సామాన్యుడి చావుకి!


Rupee value

బుధవారం రూపాయి మళ్ళీ కొత్త రికార్డుకు పతనం అయింది. మంగళవారం డాలర్ ఒక్కింటికి 66 రూపాయల మార్కు దాటి రికార్డు సృష్టించిన రూపాయి విలువ బుధవారం 68 రూపాయల మార్కు దాటిపోయింది. ఒక దశలో డాలర్ ఒక్కింటికి రు. 68.75 పై కు పడిపోయింది. కడపటి వార్తల ప్రకారం (మధ్యాహ్నం 1:45) 1 డాలర్ = రు. 68.025 వద్ద రూపాయి విలువ కొట్టుకులాడుతోంది. (బ్లూమ్ బర్గ్ వార్తా సంస్ధ)

మంగళవారం ట్రేడింగ్ ముగిసేనాటికి 66.24 వద్ద ఉన్న రూపాయి విలువ బుధవారం ట్రేడింగ్ ప్రారంభం కావడమే రు. 66.9 వద్ద మొదలయింది. ఆ తర్వాత గంట సేపటికే భారీగా పతనం అయ్యి రు. 68.75 కు చేరింది. తదనంతరం పడుతూ లేస్తూ ప్రయాణం సాగిస్తోంది. స్టాక్ మార్కెట్లు కూడా ఇదే రీతిలో పతనం అవుతున్నాయి. బి.ఎస్.ఇ సెన్సెక్స్ 470 పాయింట్లు పైగా పతనం అయ్యి 17,500 వద్ద ట్రేడ్ అవుతోందని ది హిందు తెలిపింది.

బ్లూమ్ బర్గ్ పత్రిక ప్రకారం ఆహార భద్రతా బిల్లు, సిరియాపై అమెరికా చేస్తున్న దాడి ప్రయత్నాలు భారత స్టాక్ మార్కెట్ల పైనా, రూపాయి విలువ పైనా భారీగా ఒత్తిడి పెంచాయి. 1.35 లక్షల కోట్ల బిల్లు వలన బడ్జెట్ లోటు పెరిగిపోతుందన్న భయాలు కొనసాగుతుండగా, సిరియాపై కమ్ముకున్న యుద్ధ మేఘాల వలన చమురు ధరలు పెరిగి ఇండియా దిగుమతుల బిల్లును పెంచుతుందని, దానివలన విదేశీ మారకద్రవ్య నిల్వలు మరిన్ని కరిగిపోయి కరెంటు ఖాతా లోటు మరింత పెరుగుతుందని మార్కెట్లు భయాందోళనలో ఉన్నాయి. కరెంటు ఖాతా లోటు రూపాయి విలువపై నేరుగా ప్రభావం చూపుతుంది.

రష్యా టుడే పత్రిక ప్రకారం సిరియాపై రెండు రోజుల పాటు దాడులు చేయడానికి అమెరికా అధ్యక్షుడు ఒబామా నిర్ణయించాడు. ప్రభుత్వ సైనికుల చేతుల్లో చావు దెబ్బలు తింటున్న కిరాయి బలగాలకు సహాయం చేయడం ఈ దాడుల లక్ష్యం. దానికి రుజువు కానీ రసాయన ఆయుధాల దాడిని సాకుగా అమెరికా, ఐరోపాలు ఎంచుకున్నాయి. నిజానికి ప్రభుత్వ బలగాలు రసాయన ఆయుధాలతో దాడి చేశారా లేక తిరుగుబాటుదారులు చేశారా లేక అసలు రసాయన ఆయుధాలు ఉపయోగించారా లేదా అన్న విషయం తేల్చడానికి నాలుగు రోజుల క్రితమే ఐరాస పరిశీలకులు సిరియా చేరుకున్నారు. ఐరాస పరిశీలకుల పరీక్షలకు సిరియా ప్రభుత్వం అంగీకరించింది కూడా.

అయితే సిరియాపై ఎలాగైనా దాడి చేసి వారి సైనిక శక్తిని నాశనం చేసి ప్రభుత్వ బలగాలపై తిరుగుబాటు బలగాలకు పైచేయి అందించడానికి అమెరికా, ఐరోపాలు ఇప్పటికే నిర్ణయించుకున్నాయి. తమ నిర్ణయానికి అనుగుణంగా అవి సిరియాలో పరిస్ధితికి భాష్యం చెబుతున్నాయి. వాస్తవ పరిస్ధితిని బట్టి ఎలా స్పదించాలన్నది నిర్ణయించడం కాకుండా స్పందనను మొదటే నిర్ణయించుకుని దానిని బట్టి పరిస్ధుతులకు భాష్యం చెప్పడం అన్నమాట!

మొదటేమో “ఐరాస పరిశీలకులు దాడి జరిగిన ప్రాంతాలను పరీక్షించడానికి ఆ దేశ అధ్యక్షుడు బషర్ ఆల్-అస్సాద్ ఎందుకు అనుమతి ఇవ్వడం లేదు. అనుమతి ఇవ్వడం లేదు కాబట్టి ఆయన ఏదో దాస్తున్నాడు. కాబట్టి రసాయన దాడి జరిగే ఉంటుంది” అని అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ లు ప్రకటించాయి. తీరా ఐరాస పరీక్షలకు బషర్ అనుమతి ఇచ్చేసరిగా వెంటనే మాట మార్చేశాయి.

“ఆలస్యంగా అనుమతి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? అంటే తాము ప్రయోగించిన రసాయన ఆయుధాల ప్రభావం ఆవిరై మాయం అయ్యేవరకూ ఆగి అనుమతి ఇచ్చాడు. తద్వారా సాక్ష్యాలు లేకుండా చేసి ఆ తర్వాతనే అనుమతి ఇచ్చాడు. దాడి జరిగిన చోట ప్రభుత్వ బలగాలు విచ్చలవిడిగా దాడి చేయడం వలన సాక్ష్యాలు నాశనం అయ్యాయి. కాబట్టి ఇప్పుడు అనుమతి ఇచ్చినా వ్యర్ధమే. మేము దాడి జరిపే తీరుతాం” అని బ్రిటన్ విదేశీ మంత్రి విలియం హేగ్, బ్రిటిష్ ప్రధాని కామెరాన్, ఫ్రెంచి అధ్యక్షుడు ఫ్రాంష ఒలాండే, అమెరికా అధ్యక్షుడు ఒబామా ప్రకటిస్తున్నారు.

ఈ మేరకు అమెరికాకు చెందిన నాలుగు యుద్ధ నౌకలు సిరియా సముద్ర జలాలకు సమీపానికి వెళ్ళాయి. బ్రిటన్, ఫ్రాన్స్ లు కూడా మధ్యధరా సముద్రంలోని తమ యుద్ధ నౌకలను సిరియాకు సమీపంగా తరలించాయి. గురు, శుక్రవారాల్లో దాడి చేయడానికి అమెరికా నిశ్చయిందని దాదాపు ఖాయంగా చెబుతున్నారు.

ఈ యుద్ధోన్మాదం ఫలితంగా చమురు ధరలు పెరుగుతున్నాయి. చమురు ధరల పెరుగుదల భారత దిగుమతి బిల్లును పెంచుతుంది. అంటే మరిన్ని డాలర్ల నిధులను ప్రభుత్వం ఖర్చు పెట్టాలి. వాటిని కరెంటు ఖాతా నుండి తీయాలి. కరెంటు ఖాతాలో నిల్వలేమీ లేవు. అక్కడ ఇప్పటికే భారీ లోటు ఉన్నది. ఆ లోటుకు మరింత లోటు చేర్చి చమురు చెల్లింపులు చేయాలి. అంటే కరెంటు ఖాతాలో మరింత లోటు పెరుగుతుంది. ఇది నేరుగా రూపాయి విలువను ప్రభావం చేస్తోంది.

ఆర్ధిక వ్యవస్ధలోని ఫండమెంటల్స్ ఒకదానికొకటి ప్రభావం చూపుకుంటూ ఉంటాయి. పతనంలోనూ అంతే, వృద్ధిలోనూ అంతే. కరెంటు ఖాతా లోటు రూపాయిని తగ్గిస్తే చమురు ధరలతో పాటు దానిపై ఆధారపడి ఉన్న ఇతర సరుకుల ధరలు కూడా పెరుగుతాయి. కాబట్టి ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ధరలు పెరిగితే ఆ మేరకు ప్రభుత్వ సబ్సిడీలూ పెరుగుతాయి. కాబట్టి బడ్జెట్ లోటు పెరుగుతుంది. కరెంటు ఖాతా లోటు పూడ్చుకోవడానికి మరిన్ని అప్పులు తెస్తారు. బడ్జెట్ లోటు పూడ్చుకోవడానికి మరిన్ని బాండ్లు అమ్మకానికి (ఆక్షన్ కి) పెడతారు. తద్వారా అప్పులూ పెరుగుతాయి.

అప్పులూ, లోట్లూ పెరుగుతుంటే ఆర్ధిక వ్యవస్ధపైన విదేశీ మదుపుదారులకు నమ్మకం తగ్గిపోతుంది. కాబట్టి వాళ్ళు స్టాక్ మార్కెట్ల నుండి తమ పెట్టుబడులు ఉపసంహరించుకుంటారు. కాబట్టి స్టాక్ మార్కెట్లు పతనం అవుతాయి. వెరసి ఆర్ధిక వ్యవస్ధ మొత్తం అధోగమనంలో ఉంటుంది. దీన్ని సాకుగా చూపి కఠిన చర్యల పేరుతో మరిన్ని సంస్కరణలను ప్రవేశపెట్టడానికి ప్రభుత్వాలకు బోలెడంత అవకాశం. నిన్న రాజ్య సభలో ఆర్ధిక మంత్రి ప్రసంగం ఇదే చెబుతోంది. మరిన్ని సంస్కరణలు తప్పవని ఆయన నిన్ననే చెప్పేశారు. అక్కడ సిరియాపైన బాంబులు పడితే సిరియా జనం ఎలాగూ ఛస్తారు. కానీ ఆ బాంబుల ఛాయల కింద పడి భారత దేశ సామాన్యుడు చస్తూ బతుకుతాడు. అందుకే అమెరికా దుర్నీతిని దృఢంగా వ్యతిరేకించాలి.

అప్ డేట్ (7:15 PM):

సాయంత్రానికి రూపాయి విలువ కొద్దిగానన్నా పెరక్కపోతుందా అని ఆశించినవారిని రూపాయి నిరాశపరిచింది. మధ్యాహ్నం రెండు గంటలకు డాలర్ కి రు. 68/- పలికిన రూపాయి 68.85 స్ధాయికి పడిపోయింది. ఆ తర్వాత కొద్దిగా మాత్రమే కోలుకుని రు. 68.80 పై ల వద్ద ముగిసింది. అంటే ఈ ఒక్క రోజూలోనే ఏకంగా 256 పైసలు లేదా 3.86 శాతం రూపాయి విలువ కోల్పోయింది.

ది హిందూ పత్రిక మరికొన్ని వివరాలు ఇచ్చింది. గత మూడు రోజుల్లో రూపాయి, మొత్తం 560 పైసలు లేదా 8.86 శాతం కోల్పోగా ఆగస్టు నెలలో 840 పైసలు లేదా 14 శాతం రూపాయి విలువ కోల్పోయింది. అదే ఈ సంవత్సరంలో చూసుకుంటే (జనవరి 1 తేదీ నుండి) ఇప్పటివరకూ రు. 13.81 పై.లు లేదా 25 శాతం విలువను రూపాయి కోల్పోయింది. అంటే డిసెంబరు 31, 2012 తేదీ ముగిసేనాటికి రూపాయి విలువ డాలర్ కి రు. 54.99 పై.లు గా ఉంటే ఇప్పుడు రు. 68.80 పై.లుగా ఉందన్నమాట!

ఇది ఇంకా పడిపోయి రు. 70/- నుండి రు. 72/- వరకూ పలకొచ్చని మదుపుదారులు ఊహిస్తున్నారు. దానితో అప్పటివరకూ ఆగుదామన్న ఉద్దేశ్యంతో డాలర్ల అమ్మకం బిగదీసుకుపోయింది. అంటే డాలర్ల కోసం డిమాండ్ ఉంది గానీ అవి దొరకడం లేదు. దాంతో రూపాయి మరింతగా పడిపోతోంది. బహుశా ఆర్ధిక మంత్రి గారు చెప్పిన సరైన విలువ ఈ 70-72 రూపాయలేనేమో!?

1 thoughts on “రూపాయి ఇంకా కిందికి…, సామాన్యుడి చావుకి!

  1. శీర్షిక ఇలా ఉంటె బగుంటుందేమో!
    “రూపాయి ఇంకా ఇంకా కిందికి…, సామాన్యుడే మో బొందకి!

వ్యాఖ్యానించండి