రూపాయి: చేతకాకపోతే సరి! -కార్టూన్


Bound to stop

“ఏం భయపడొద్దు. అది మరింత జారిపోకుండా ఎక్కడో ఒకచోట ఆగి తీరాల్సిందే!”

“రూపాయిన పతనం కానివ్వం.”అడిగినప్పుడల్లా ప్రధాని, ఆర్ధిక మంత్రులు చెప్పే మాట ఇది. ఒక పక్క పతనం అవుతూనే ఉంటుంది. వీళ్ళేమో మీడియా సెంటర్లో కూర్చుని ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతుంటారు. అదేమని అడిగితే “ఇక్కడ అంతా బాగానే ఉంది. విదేశాల్లో పరిస్ధితుల్ని మనం నియంత్రించలేము కదా?” అని చిలక పలుకులు పలుకుతున్నారు. అసలు విదేశాల్లో పరిస్ధితి బాగోలేకపోతే ఆ ప్రభావం మనమీద ఎందుకు పడుతోంది? అన్న ప్రశ్న జోలికి మాత్రం వీరు పోరు. ఎందుకంటే ఆ పరిస్ధితికి దేశ ఆర్ధిక వ్యవస్ధని తెచ్చింది వీళ్ళే కాబట్టి.

పోనీ ఇప్పుడైనా దిద్దుబాటు చర్యలకు పూనుకుంటారా అంటే అదేమీ లేదు. ఏ సరళీకరణ చర్యల వల్లనైతే ఆర్ధిక పరిస్ధితి ఈ విధంగా దిగనాసిల్లుతోందో సరిగ్గా అవే చర్యలను పరిష్కారంగా చెబుతున్నారు. సమస్యకు సమస్యనే పరిష్కారంగా చూపడం ఎవరైనా చేసే పనేనా? నిజమైన పరిష్కారం, ప్రజలకు ఆమోదయోగ్యమైన, ప్రజలకు లాభకరమైన పరిష్కారం ఏమిటి అని ఆలోచిస్తే బ్రహ్మాండమైన పరిష్కారాలు ఉన్నాయి. లాటిన్ అమెరికా దేశాలు ఆ పరిష్కారాన్ని అమలు చేసి చూపుతున్నాయి. కానీ స్వదేశ ప్రయోజనాలకు కట్టుబడని దళారీ పాలకులకు అటువంటి పరిష్కారాలు నచ్చవు.

అందుకే వాళ్ళు గాలిలో దీపం పెట్టి దేవుడ్ని తలచుకోమంటున్నారు. రూపాయి పతనం ఎల్లకాలం కొనసాగేది కాదనీ, ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒక చోట అది ఆగాల్సిందేనని చేతకాని కబుర్లు చెబుతున్నారు. పరిష్కారం తీసుకెళ్లి కాలం చేతుల్లో పెడుతున్నారు. కాలం తెచ్చిన సమస్య అయితే కాలం చేతుల్లో పెడితే అదొక అర్ధం. వాస్తవానికి కాలం తెచ్చిన సమస్యలకు కూడా పరిష్కరించుకునే దశకు మనిషి చేరుకుని శతాబ్దాలు దాటింది. కానీ భారత దేశ ఆర్ధిక వ్యవస్ధ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్య మన పాలకులు తెచ్చిందే. దేశ ఆర్ధిక వ్యవస్ధను తీసుకెళ్లి పశ్చిమ దేశాల ఆర్ధిక వ్యవస్ధకు అనుబంధంగా మార్చివేశారు. స్వతంత్ర అస్తిత్వాన్ని నాశనం చేశారు. ఫలితమే ఇలా అమెరికాకు జలుబు చేస్తే మన ఆర్ధిక వ్యవస్ధ ఇలా ఆగకుండా తుమ్మడం.

7 thoughts on “రూపాయి: చేతకాకపోతే సరి! -కార్టూన్

  1. శేఖర్‌ గారు,
    మనకు బోలెడంతమంది వసంత్‌ లున్నపుడు మనం లాటిన్‌ అమెరికాను చూపిస్తే ఏం లాభం?

  2. తిరుపాల్ గారూ, నేను అనేక సందర్భాల్లో పరిష్కారాల గురించి చర్చించాను. వసంత్ గారూ ఈ బ్లాగ్ కి కొత్త కూడా కాదు. ఐనా ఆయన ఇలాంటి వ్యాఖ్య రాయడం ఆశ్చర్యం కలిగించింది. ఈ టపా వరకూ చూసుకున్నా పరిష్కారం ఏమిటో పై వాక్యంలో చెప్పాను. (ఆ వాక్యం ఈ టపా లోనిదే). బహుశా వసంత్ గారు టపా సరిగ్గా చూడలేదేమో!

  3. అబ్బే, నిజానికి అభినందించదగిన ఓర్పేమీ నాకు లేదు. గతంలో నా సమాధానాలు మీరు చూడ్లేదు. ఈ మధ్యే అలవాటు చేసుకున్నాను.

  4. నా ఊహకందిన విశ్లేషన ఎమిటంటే షేర్ మర్కెట్ లొ MCX & commodities ట్రేడింగ్ మొదలు పెట్టింది మొదలు నిత్యవసర సరుకుల ధరలు నియంత్ర్రణలో లెకుండ పొయాయి. లాభాల గురించి స్పెక్యులేషన్ చేయటం ద్వార దళారులు నిత్యవసర సరుకుల ధరలు పెంచేసారు. దానివల్ల ఏదీ కంట్రొల్ లో లేకుండ పొయాయి. ఆఖరికి రూపాయి కూడ.

వ్యాఖ్యానించండి