భారత దేశంలో మహిళల వస్త్రధారణపై విమర్శలు, ఒక పరిశీలన


US Flag Around the Earth

(ఈ వ్యాసం e-సాహిత్య పత్రిక ‘వాకిలి’ ఆగస్టు సంచికలో ప్రచురించబడింది. రచయిత్రి రమా సుందరి గారు. స్త్రీల వస్త్రధారణ గురించి తరచుగా చర్చ జరుగుతున్న నేపధ్యంలో బ్లాగ్ పాఠకులకు ఉపయోగం అన్న దృష్టితో రచయిత్రి అనుమతితో ఇక్కడ ప్రచురిస్తున్నాను.  -విశేఖర్)

ఈ మధ్య కాలంలో ఎన్నడూ విననంతగా భారతదేశంలో స్త్రీలపై అత్యాచారాలు వెలుగులోకి వస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా అన్ని వర్గ, కుల స్త్రీలమీద ఇవి జరుగుతున్నాయి. ముక్కు పచ్చలారాని పసిపాపలు, భారతదేశ ధార్మికత మీద ఆసక్తి తో వచ్చిన విదేశీ మహిళలు… ఎవరూ వీటి నుండి తప్పించుకోలేక పోతున్నారు.

సంప్రదాయం – ప్రగతి

అత్యాచారాలు జరిగినప్పుడల్లా రెండు వాదనలు ప్రముఖంగా వినిపిస్తాయి. సంప్రదాయవాదులు ఆడవారి వస్త్రధారణ వలనే అత్యాచారాలు జరుగుతున్నవని వాదిస్తారు. సాంస్కృతిక పరాయీకరణ వలన నష్టం జరుగుతుందన్న అర్ధం ఇందులో ధ్యనిస్తుంది. అయితే స్థానిక సంస్కృతుల పరిరక్షణకు అనుకూలంగా వీరు చేసే వాదనలో సంస్కృతీ పరిరక్షణ బాధ్యత అంతా భారత స్త్రీలదేనన్న ధోరణి వ్యక్తం అవుతుంది. ఆ విధంగా స్త్రీల వ్యక్తిగత మరియు సామాజిక స్వాతంత్ర్యాలను, సంస్కృతీ పరిరక్షణ పేరుతో వీరు తిరస్కరిస్తారు.

ప్రగతి కాముకులు అత్యాచారాలకు కారణాలను వస్త్రధారణలో కాకుండా వ్యవస్థలో చూడాలని కోరుతారు. సమాజంలో వస్త్రధారణ ప్రత్యేకమైన విడి అస్తిత్వం కలిగి ఉండే విషయం కాదని, వ్యవస్థను నడిపే ఆర్ధిక పునాదులు సంస్కృతిని శాసిస్తాయనీ, అలాంటి సంస్కృతిలో ఒకానొక భాగమే వస్త్రధారణ అని వారి వివరణ. వీరు కూడ సాంస్కృతిక పరాయీకరణ జరుగుతోందని అంగీకరిస్తూ దేశ సంస్కృతిని కాపాడుకోవాలని భావిస్తారు. అయితే స్థానిక సంస్కృతుల పరిరక్షణకు అనుకూలంగా వీరు చేసే వాదన, సంస్కృతుల ఆధిపత్యాన్ని తిరస్కరించే ధోరణి తో ఉంటుంది.

ప్రగతి కాముకులు వస్త్రధారణను, అత్యాచారాలకు కారణంగా అంగీకరించరు. ఎందుకంటే, అనేక సందర్భాలలో అత్యాచారం; అధికారం, ఆధిపత్యాలకు వ్యక్తీకరణగా ఉంటుంది. పశ్చిమ దేశాలలో మహిళలకు వస్త్రధారణలో ఇంతకంటే వెసులుబాటు ఉన్నప్పటికీ, ఇక్కడ కంటే విషసంస్కృతి విసృతంగా విస్తరించినప్పటికీ, అక్కడ అత్యాచారాల శాతం తక్కువ. భారతదేశంలో వేళ్ళూనుకొని ఉన్న పితృసామ్యం, కరడు కట్టిన పురుషాధిక్యత ఈ అత్యాచారాలకు ప్రధాన కారకాలని వీరు అంటారు.

సంప్రదాయ వాదుల్లోనూ, ప్రగతి కాముకుల్లోనూ ఉమ్మడిగా కనిపించే అంశం సాంస్కృతిక పరాయీకరణ పట్ల వ్యతిరేకత. కానీ వారికి ఉన్న కారణాలు వేరు వేరు.

Cultural vigilanteసంప్రదాయవాదులు తెలిసి చేసినా, తెలియక చేసినా నశించి పోతున్న, నశించవలసిన పాత విలువలను పట్టుకుని వేళ్ళాడుతూ అందులో భాగంగా సాంప్రదాయక వస్త్రధారణను కాపాడుకోవాలని భావిస్తారు. ఇందులో మనదైనది అంతా గొప్పే అనీ, పరాయిది అంతా చెడ్డదేననే ఒక తప్పుడు అవగాహన వ్యక్తం అవుతుంది. విదేశీ ఉద్యోగాల కోసం, పశ్చిమ దేశాల పౌరసత్వాల కోసం, ఫారెన్ అల్లుళ్ళ కోసం పరితపించే వారే సంస్కృతి పరాయీకరణ పట్ల గుండెలు బాదుకోవడం తరచుగా కనిపిస్తుంది. వీరికి డాలర్లు కావాలి, కానీ డాలర్ల వెంట వచ్చే సంస్కృతీ విలువలు వద్దు.

ఈ విషయం యొక్క లోతు ‘సంస్కృతి ‘ అనే పదాన్ని అర్ధం చేసుకోవటంలోనే ఉంది. సంస్కృతులు అనేవి యధాతధంగా వాటి స్థానంలో అవి ఉన్నపుడు ఒకటి గొప్పా కాదు, మరొకటి చెడ్డా కాదు. వేటికవే ప్రత్యేకత కలిగినవి. ప్రజల సర్వతోముఖ అభివృద్ధితో ముడిపడి ఉన్నంతవరకు ఏ సంస్కృతి అయినా గొప్పదే.

కానీ వచ్చిన చిక్కంతా ఏమిటంటే చరిత్ర ఎక్కడి సంస్కృతిని అక్కడే ఉంచలేదు. వ్యాపార వాణిజ్యాలతో పాటు, పాత వలస పాలన, ఆధునిక సామ్రాజ్యవాద దోపిడి లాంటి ఆర్ధిక ఆధిపత్య కార్యకలాపాలు ప్రపంచంలోని వివిధ సంస్కృతులు పరస్పరం ఇచ్చి పుచ్చుకోవటానికి, సంభాషించుకోవటానికి, సమ్మిళితం కావడానికి దారి తీసింది. అంతే కాక సాంస్కృతిక సామ్రాజ్యవాదానికి దారి తీసింది.

వస్త్రధారణకు సంబంధించి కొన్ని నియమాలు గతంలో పాటించేవారు. దుస్తులు చలి, వేడిల నుండి శరీరాన్ని కాపాడటానికి అనే ప్రాచీనయుగాల అవసరం నుండి, నాగరికత అభివృద్ధిలో భాగంగా అనేక రూపాలు తీసుకొంటూ ఒక దశలో పరిణతి రూపం తీసుకొంది. అన్ని వర్గాల పిల్లలను ఒకటిగా కలపగల ‘యూనిఫామ్‘ కల్చర్ లాగా, అన్ని రకాల శరీరాకృతి గలిగిన మనుషుల పొడవు, లావు, కండలు, ఎముకలు కప్పిపెట్టే ఒక విశ్వజనీన సాధనంగా దుస్తులు ఒకప్పుడు ఉండేవి. మళ్ళీ స్త్రీ, పురుషులకు వాళ్ళ అవసరాల రీత్య వేరు వేరు వస్త్రధారణ ఉండేది. ఇందులో ఆనాటి వ్యవస్థల ప్రభావం కూడ ఉండేది.

కాల క్రమేణ సాంస్కృతిక సామ్యాజ్యవాద ప్రభావంతో భారతదేశంలో అత్యధిక శాతం పురుషుల దుస్తులు పాశ్చాత్స ప్రభావానికి గురయ్యాయి. అయితే స్త్రీల దుస్తులు 80 శాతం ఇంకా స్థానికతను కోల్పోలేదు. కాలక్రమేణ స్త్రీల క్రియాశీలక పాత్ర అన్ని రంగాలలో పెరగటం వారి వస్త్రధారణలో మార్పులకు దారి తీసింది.

ఆరడుగుల చీరల నుండి కురచ తక్కువ చీరలలోకి, తరువాత దక్షిణ భారతదేశ స్త్రీలు ఉత్తర భారతదేశ దుస్తులైన పంజాబీ డ్రెస్, చూడీదార్, షల్వార్ కమీజ్ వగైరాలలోకి మారిపోయారు. ఇందులో ఫాషన్ తో బాటు, సౌకర్యం కూడ పని చేసింది. ఇప్పుడు దక్షిణ భారతంలో కూలీకెళ్ళే మహిళలు కూడ పంజాబీడ్రెస్ లోకి మారటం గమనించగలము. నగర ప్రాంత మహిళలు పాంటు, షర్ట్ లలోకి మారారు. ఉత్తర భారతదేశ రాష్ట్రాలలో సేల్స్ గర్ల్స్ కూడ జీన్స్ పాంటులు ధరిస్తారు.

స్త్రీ-పురుష ఆకర్షణ

వేషధారణలో ఈ మధ్య వచ్చిన ఫాషన్ లో అంతర్లీనంగా కనిపించేది, స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ. పాశ్చాత్యదేశాల్లో ఇలాంటి ఆకర్షణ కోసం తమను తాము వ్యక్తీకరించుకునే చర్యలు వెర్రితలలు వేస్తున్నాయి. వ్యక్తిత్వ సౌందర్యంతో కాకుండా శారీరక సౌందర్యంతో ఆకర్షించుకునే ప్రయత్నం ఏ దేశంలోనైనా సహజమే అయినా పశ్చిమ దేశాల్లో అది విపరీత పోకడలకు పోయింది. పోర్న్ మాఫియా అభివృద్ది చెంది, వివిధ ఆర్ధిక కార్యకలాపాల్లో పై చేయి సాధించటానికి అదొక సాధనంగా అక్కడ అవతరించడం దానికొక కారణం కావచ్చు. ఇది స్త్రీ, పురుషుల ఆకర్షణకు సంబంధించిన డైనమిక్స్ పైన తీవ్ర ప్రభావం పడేసినట్లు కనిపిస్తోంది.

Pub culture 3 -B'loreశారీరక సౌందర్య ఆకర్షణలో భాగంగా శరీర భాగాలను కూడా బహిర్గతపరుస్తూ ఆపోజిట్ సెక్స్ ను ఆకర్షించడం పశ్చిమ దేశాల్లోనూ, కొన్ని లాటిన్ దేశాల్లోనూ ఒక ధోరణిగా ముందుకొచ్చింది. దుస్తులను రకరకాల షేపుల్లో కుట్టి ధరిస్తే అదొక ఫ్యాషన్ కావచ్చు. ఒకటికి రెండు, మూడు, లేదా ఐదారు దుస్తులు ఒకదానిపైన ఒకటి వేసుకొని లోచొక్కాలను బైటికి కనిపించేలా పై దుస్తులను కురచవి చేసుకొంటే అదొక ఫ్యాషన్ కావచ్చు. జుత్తుని రకరకాల షేపుల్లో కత్తిరించి ప్రదర్శించుకొంటే, పాతదైనా, లేటెస్టైనా, అదొక ఫ్యాషన్ కావచ్చు. కానీ శరీర భాగాల్ని చూపడం ఏమి ఫ్యాషన్? ఇక మనిషి దుస్తులను కనిపెట్టి ధరిస్తున్నదెందుకు? ఇవి ఆలోచించవలసిన ప్రశ్నలు.

స్త్రీ, పురుషల మధ్య ఆకర్షణలో భాగంగా వెర్రితలలు వేస్తున్న ఫ్యాషన్లు పాశ్చాత్య దేశాల్లో ప్రముఖ ధోరణి అయ్యింది. సాంస్కృతిక సామ్రాజ్యవాదంలో భాగంగా అది మన దేశానికి వచ్చింది. శాటిలైట్ల పుణ్యమాని విదేశి టి.వి., మ్యూజిక్ లు దేశాన్ని ముంచెత్తితే, అంతర్జాలం పుణ్యమాని పోర్నోగ్రఫీకి గట్లు తెగి మారుమూల గ్రామీణ యువకుడి జేబులోకి సైతం జొరబడింది.

ధనిక వర్గాలు అలవర్చుకొన్న పాశ్చాత్య సంస్కృతి, ‘పాలకుల భావాలే, పాలితుల భావాలు’ కనుక కింది వర్గాల మీదికి దూకింది. ఇందులో భాగంగా స్త్రీ, పురుష బేధం లేకుండా సకల వర్గాలు పబ్ సంస్కృతులకు, శరీర భాగాలు చూపుకొనే రకం ఫ్యాషన్లకు లోనవుతున్నారు. దుస్తులు తయారుచేసే పరిశ్రమలు కూడ ఈ రకం దుస్తులను తయారు చేసి జనం మీదకు వదులుతున్నారు. ఇక్కడ ప్రభుత్వం కూడ ఒక పెట్టుబడిదారుడు కాబట్టి ఈ దుస్తుల కంపెనీలకు అనేక రాయితీలు ఇచ్చి ఈ వస్త్ర సంస్కృతిని మనకు అంట కడుతున్నారు.

వాణిజ్య వ్యాపారాలు ప్రపంచానికి అవసరమే; కాని వ్యాపారం పేరుతో వచ్చే వలస పాలన, సామ్రాజ్యవాద దోపిడి అవసరం లేదు. సంస్కృతుల సంగమం అవసరమే; కానీ సాంస్కృతిక ఆధిపత్యం అవసరం లేదు.

సాంస్కృతిక సామ్రాజ్యవాదం

పాత కొత్తల మధ్య సంఘర్షణ ఎప్పుడూ తప్పదు. సంఘర్షణ జరిగితేనే మెరుగైన అంశం బైటికి వచ్చి అభివృద్ది వైపుకి సమాజాన్నినడిపిస్తుంది. అలాగే ప్రపంచీకరణ యుగంలో స్థానికం, పరాయిల మధ్య సంఘర్షణ అనివార్యం. ఈ సంఘర్షణలోంచి పుట్టే మెరుగైన అంశాలను, అవి ఏవైపు నుండి వచ్చినా, స్వీకరించాల్సిందే.

డాలర్ వెంట వచ్చే సంస్కృతి మొత్తంగా చెడ్డది కాదు. ప్రతి సంస్కృతిలోనూ పాత, కొత్తలు; గొప్పలు, లోపాలు ఉంటాయి. వాటిలో మెరుగైన అంశాన్ని, ఆధునిక అంశాన్ని స్వీకరించి ప్రగతి నిరోధక చెడ్డ అంశాలను తిరస్కరించాలి. ఐతే: ఏది మంచిది, మెరుగైనది అనేది మరియు ఏది ప్రగతి నిరోధకమైనదీ, చెడ్డదైనదీ అనేది ఎలా నిర్ణయించాలి అంటే ఒక్కటే దారి. ప్రజాస్వామిక విలువలకు, సమానత్వ భావాలకు ఏది విలువ ఇస్తుందో అదే గొప్పది, అదే మెరుగైనది, అదే ఆధునికమైనది.

కొత్తకు పునాది పాతే కనుక రెండింటిలోనూ ప్రజాస్వామిక విలువలకు, సమానత్వ భావనలకు విలువ ఇచ్చేవి ఉంటాయి. వాటిని కాపాడుకుని ఆ విలువలకు వ్యతిరేకంగా ఉన్నవాటిని తిరస్కరించటమే నేటి మనిషి కర్తవ్యం. ఆ మాటకొస్తే ఏ కాలంలోనైనా, సంస్కృతి రీత్యా, మనిషికి కర్తవ్యం ఇదే. పాతలోంచి ‘మంచి‘ని నిలుపుకొని కొత్తలోని అభివృద్ధిని ఆహ్వానించాలి.

భారతదేశం లాంటి మూడో ప్రపంచ దేశాల్లో కూడా ఆధిపత్య వర్గాలకు విదేశీ డబ్బు కావాలి. కానీ దానితో వచ్చే సంస్కృతిని అలవాటు చేసుకోకూడదు. ఆ ఆధిపత్యం అన్నీ రంగాల్లో కనబడుతుంది. పురుషులకైతే స్త్రీలు ఒద్దికగా ఉండాలి తప్ప కొత్త ఆర్ధిక వెసులుబాటు తెచ్చిన స్వేచ్చా స్వాతంత్రాలను వారు కోరుకోకూడదు. ధనికులకైతే పేదలు అణగిమణిగి ఉండాలి తప్ప సోకులు కోరుకోకూడదు. అగ్ర కులాలకైతే చిన్న కులాలు కష్టం చేసుకొని తొంగోవాలి తప్ప తన కష్టాన్ని నచ్చిన రీతిలో ఖర్చుచేసుకోగూడదు.

ఇందులో భాగమే స్త్రీల వస్త్రధారణపై ఆంక్షలు.

Mamallapuram girlసాంస్కృతిక సామ్రాజ్యవాదం అనేది ఆర్ధిక సామ్రాజ్యవాదం యొక్క అనివార్య ఫలితం. ఇందులో సామ్రాజ్య వాద దేశాల సంస్కృతి గొప్పదిగా చెప్పబడుతుంది. పశ్చిమ దేశాలే ఇప్పటి ఆధిపత్య సామ్రాజ్యవాద దేశాలు కనుక అక్కడి సంస్కృతి, ప్రజల వేష భాషలు, ఆ దేశాల్లోని వివిధ సామాజిక పాత్రల మధ్య ఉండే సామాజిక సంభందాలు… ఇవన్నీ గొప్పవిగా చెలామణిలో ఉన్నాయి.

ఆర్ధిక, సాంస్కృతిక దురాక్రమణలో ఉన్న దేశాలలోని సంస్కృతులు ‘తక్కువ రకం; ఇవి వెనకబడి ఉన్నాయి; ఇక్కడి కుటుంబ సంబంధాలు ప్రాచీనమైనవి; బంధువులు, స్నేహితులు, కుటుంబీకుల మధ్య ఉండే సంబంధాలు ఇంకా అభివృద్ది చెందలేదు…’ ఇలాంటి వాదనలు, భావాలు- రూపాన్ని నెత్తికెత్తుకొని సారాన్ని తృణీకరించేవి. దీనిని దేశంలోని ధనిక వర్గాలు ఆనందంగా స్వీకరిస్తాయి, ఆచరిస్తాయి. పాలకుల భావాలే పాలితుల భావాలుగా చెలామణి అవుతాయి గనుక కింది వర్గాలు కూడ వారిని అనుకరిస్తాయి. ఆ విధంగా దేశీయ సంస్కృతిని, దిగుమతి చేసుకొన్న పాశ్చాత్య సంస్కృతి ఆక్రమిస్తుంది.

అయితే, ఆధిపత్య వర్గాలకు దేశీయ సంస్కృతి కూడా కావాలి. దేశీయ సంస్కృతిలో కింది వర్గాలను -స్త్రిలు, కార్మికులు, రైతులు, కింది కులాలు మొ.- కట్టి పడేసే సాధనాలుగా ఉన్నాయి. కనుక అవి వారికి కావాలి. కానీ దేశీయ సంస్కృతిలోని ప్రగతి కాముకమైనవి, స్థానిక అస్థిత్వాన్ని కాపాడేవి మాత్రం వారికి వద్దు, అవి కింద వర్గాలను ఐక్యం చేస్తాయి కనుక.

అంటే తాగి తందనాలాడి లిక్కర్ మాఫియాను పోషించేందుకు పబ్ లు కావాలి. కానీ అందులోకి స్త్రీలు రాకూడదు. రేసు గుర్రాలు, వాటిపై కాసే పందేలు కావాలి. కాని సంక్రాంతి పండగలో భాగమైన కోడి పుంజు పోటీలు నేరం. ఫ్యాంటు, షర్టు; సూటు, బూటు; షార్ట్ లు, జీన్స్ కావాలి. వాటితో బాటు వచ్చే మిడ్డీలు, చడ్డీలు, లేడి జీన్స్, లేడీ టీషర్ట్ లు వద్దు. ఇది వివక్ష తప్ప మరొకటి కాదు.

దేశీయ సంస్కృతిని పరిరక్షించుకోవడానికి వీలుగా పాశ్చాత్య సంస్కృతుల్లోని అవాంఛనీయ ధోరణులను అడ్డుకోవాలంటే మొదటి దేనిని అడ్డుకోవాలి? ఆర్ధిక, రాజకీయ సామ్రాజ్యవాదాన్ని మొదట అడ్డుకోవాలి. దేశ వనరులు దేశ ప్రజలకు దక్కేలా కాపాడుకోవాలి. దేశ వనరుల నుండి పుట్టిన వస్తువులు, డబ్బులు దేశ ప్రజల పరం కావాలి.

ఆ విధంగా ధన, వస్తు సంపదలు అన్ని వర్గాలకు సమానంగా పంపిణీ అయినపుడు వాటిని అంటిపెట్టుకొని ఉండే సాంస్కృతిక, సామాజిక భావాలు, అలవాట్లు కూడా ప్రజాసామ్య పద్దతులకు లోబడి తమదైన స్వంత అభివృద్ధి బాటపైన పరుగులు పెడతాయి. అది జరిగినపుడు స్త్రీ, పురుష వస్త్రధారణ, దాని పరిణామం ఏ పరిమితుల్లో ఉండాలో ఆ పరిమితుల్లోనే ఉంటుంది. ప్రజాస్వామిక వాతావరణం ఉన్నపుడు సంస్కృతీ పరిరక్షణ భారం ఒక్క స్త్రీలపై మోపడమే విచిత్రంగా, అవాంఛనీయంగా మారుతుంది.

15 thoughts on “భారత దేశంలో మహిళల వస్త్రధారణపై విమర్శలు, ఒక పరిశీలన

  1. ఫాషన్ లు వచ్చేది , ఎక్కువ బట్టలు అమ్ముడు పోవడానికే ! కానీ ఫాషన్ లు మారినంత వేగం గా , మన దేశం లో, పురుషుల ఆలోచనా ధోరణి మారట్లేదు ! స్త్రీలపై అత్యాచారాలకు దుస్తులు కొంతవరకూ కారణం.అందుకని వారి శరీరాలను కప్పి ఉండే వస్త్రాలు,మాత్రమే ధరించ మనడానికి ఎవరికీ హక్కు లేదు ! శరీరావయవాలను కనిపించేట్టు వస్త్రధారణ చేసుకున్న స్త్రీలను చూస్తే , పురుషులలో కామ వాంఛ ఎక్కువ అవడం , కేవలం జీవ రసాయన చర్య. ఆకలీ, నిద్రల లాగానే , కామ వాంఛ కూడా అంతే! అందులో తప్పు ఏమీ లేదు!కేవలం కామ వాంఛ వల్ల అత్యాచారం జరగదు. అధిక శాతం మంది పురుషులు , తమ విచక్షణ తో నూ , సాంఘిక కట్టుబాట్లతో,సత్ప్రవర్తన తో నియమ బద్ధమైన జీవితాలు గడుపుతూ ఉంటారు ! అధిక శాతం భారత సినిమాలు ఈ వాస్తవాన్ని సొమ్ము చేసు కుంటున్నాయి కూడా !( ఉదాహరణ కు, ఐటం సాంగ్ లేని సినిమాలు అనేకం, బాక్సాఫీస్ దగ్గర పైసా వసూలు చేయకుండా పోతున్నాయి ) ! కేవలం కొంత మంది మాత్రమే , విచక్షణా రహితం గా ప్రవర్తించి , మృగాలు గా ప్రవర్తిస్తున్నారు ! వారు తాగే మద్యం కూడా , విచక్షణను అదిమి పట్టి , మృగత్వాన్ని బహిరంగ పరుస్తుంది ! ముందు ముందు, ఈ ‘ మృగాల ‘ సంఖ్య ఎక్కువ అయే ప్రమాదం ఉంది , కారణం , అవినీతీ , స్వచ్చమైన పాలన కొర వడడం , దానితో చట్టాలను ఏమాత్రం లక్ష్యం చేయక పోవడం ! ఈ వాతావరణం లో , యువతులూ ,స్త్రీలూ కూడా తమ తమ స్వేచ్ఛను, వివిధ ( ఒళ్ళు కనిపించే ) వస్త్ర ధారణ లో బహిరంగ పరచడం కూడా వారిని అత్యాచారాలకు లక్ష్యం గా చేస్తుంది !

    పాశ్చాత్య దేశాలలో ఒళ్ళు కనిపించేట్టు గా వస్త్ర ధారణ చేసుకోవడానికి ముఖ్యమైన కారణం, అక్కడి వాతావరణం. చాలా పాశ్చాత్య దేశాలలో ఏడాది లో చాలా కాలం, సూర్యుడు నామ మాత్రం గానే కనిపించేది ! అందువల్ల చాలా కాలం స్త్రీలు ( పురుషులు కూడా ) వెచ్చని బట్టలతో, కేవలం ముఖం మాత్రం కనిపించేట్టు వస్త్ర ధారణ చేసుకుంటారు ! ఏడాది లో కేవలం కొన్ని నెలలు మాత్రమే , కాస్త ఒళ్ళు కనిపించేట్టు గా వస్త్ర ధారణ చస్తారు. ఎందుకంటే, ఆ సమయం లోనే వారికి కాస్త సూర్య రశ్మీ , తద్వారా విటమిన్ D కూడా అందేది ! అంతే కాక , మిగతా కాలం లో వారు అనుభవించిన చీకటి నీ ,దానితో ఉండే డిప్రెషన్ కూడా అధిగ మించడానికి !
    భారత దేశం లో పాశ్చాత్య ఫాషన్ లను అనుకరించే చాలా మంది కి ఈ విషయాలు తెలియదు ! అవన్నీ దృష్టిలో ఉంచుకుని బట్టలు కనుక అమ్మితే , అమ్మే వారందరూ దివాలా తీస్తారు !
    స్వాతంత్ర్య పోరాట సమయం లో ఎందరో త్యాగ మూర్తులు , స్వదేశీ ఉద్యమం లో భాగం గా , విదేశీ వస్త్రాలను, మహాత్మా గాంధీ స్ఫూర్తి తో గుట్టలు గుట్టలు గా , బహిరంగం గా తగల బెట్టే వారు ! ఇప్పుడు ఆ పనులు చేయక పోయినా , స్వదేశీ నూలు బట్టలను మాత్రేమే ధరించాలని ప్రతిన బూనడం , కేవలం ఆరోగ్య పరం గానే కాకుండా ,దేశ పురోగతి కీ దోహద పడుతుంది !

  2. చారిత్రిక పరినామ క్రమములో ఏర్పడిన ఫాషన్‌,దుస్తులు స్త్రీల ఆకర్షణ ఎక్కువ చేసి నదనే మాటా ఏమాత్రం అనుమతించ తగినది కాదు.(ఒకప్పుడు అచ్చాదనే లేని స్తితి మనవాల్లు ఊహించు కోలేరు- అంటే ఆనాడు స్త్రీ పురుష ఆకర్షణ లేదా?)

    ఏ కాలం లో నైన స్త్రీ పురుష ఆకర్షన సహజ మైనదే. ఇలా సహజమైన దాన్ని అసహజముగా చేసినది పిత్రుస్వామిక భావజాలమే. గర్వించ దగిన స్త్రీల తల్లి తనాన్నే బలహీనతగా చూడడం మొదలెట్టి తనకు అనుకూలంగ మలుచుకున్నాడు పురుషడు.

    పితృస్వామ్యం మొదలైనది లగాయితు, స్త్రీ ఒక బోగ వస్తువుగానే చూడబడుతున్నది. ఇలా చూడడమే కాదు, స్త్ర్రీ యే తను మగవాని కోసమే అందంగా కనపడాలి తప్ప మరేందుకు కాదు అనే బావాన్ని పెంపొందించుకొనేల చేసింది. స్త్రీ తనకు తెలియకుండానే తాను భానిస అయిపోయింది.. (కుల వ్యవస్థలో శూద్రులు తమకు సేవ చేయటానికే దేవుడు పుట్టించాడు అని అగ్ర గాములు ఎలా అనుకొన్నారో అలా) మగవాన్ని సుఖపెట్టటమే తన భాధ్యత అన్నంతగా.

    స్త్రీకి వుత్పత్తి క్రమమలో విలువ లేకుండా చేసి తను కుటుంబ పెద్దగా,వారి ఆస్తికి అదిపతిగా తయరైన మగ మహ రాజు ఇక తను చెప్పిందే వేదం తాను చేసిందే న్యాయం అని, సంపాదనా క్రమములో, వుంపుడుగత్తేలు, లేక వేష్యలు గా స్త్రీలు మలచ బడినారు. ఆకర్షణ సంస్కృతి సంబందించినది. మొన్న మొన్నటి వరకు కొన్ని కులాల్లో రవికెలు లేకుండా బ్రతి కారు వాల్లు అకర్ష్నకు లోనయ్యరా? మనవాల్లకి గ్లోబలైజేషన్‌ కావాలి విదేశి సంస్కృతి అక్కర్లేదా? ముందు ఈ సంస్కృతే లేకపోతే గ్లోబలైజేషన్‌ బతికి బట్ట కట్ట లేదు. ఇది అమెరికా వాల్లకి తెలిసినంత మనవాల్లకి తెలియదా?

    ఈనాటి వ్యాపార సామ్రాజ్యవాద సంస్కృతి మరింత పెరిగి పెద్దదై కాస్మిటిక్‌ లేకుండ స్త్రీలు బ్రతకలేని స్థాయికి తీసుక వెల్లింది. దానికి తోడు, పురుషహంకారాన్ని పుట్టుకతోనే ఉగ్గు పాలతో పెంచబడుతున్న పురుషులు స్త్రీ అంటే చులకన చేయబడే భూస్వా మ్య సంస్కృతి, ఈనాటి మత్తు సంస్కృతి, వాల్లని ఎటుపోతున్నారో తెలియనీకుండ చేస్తుంది.

    ఈ నాటికి కూడా కొంతమది వేశ్య వాటికలకు లైసన్సులు మంజూరు చేస్తే ఈలాంటివన్ని సర్దుకుంటాయి అనుకోవటం గర్హనీయం. కేవలం కడుపు కూటికోసం పడుపుకత్తే రాక్షస రతికి అంగీక రించడం ఎంత నీచమో అనే అలోచన మనకు లేదు. ఇదేమంటే ప్రపంచములో లేనిది మనము చేస్తున్నామా? అంటారు. ఈ లాంటి ఒక వ్యవస్త లేకుంటే సమాజం నడవదు అను కోవడం ఇంకా ఎంత వికృతం? ఈ భౌతిక, సంస్కృతి తో పాటు,మగవాడి దురహంకారం మారితే తప్ప దీనికి పరిష్కారం లేదు.

  3. వస్త్రధారణపై ఆంక్షలు. ఎవరు పెట్టారు ఎవరు ఏది కట్టుకుంటే ఎవరికేంటి నూలు బట్టలు విదేశి బట్టలు ఎవరి ఇష్టం వాళ్ళది

  4. Thirupalu గారి పితృస్వామ్యం మాట చదివిన తర్వత.. మొన్న టివీ లో చూసిన ఒక సినిమా గుర్తుకు వచ్చింది… అక్కినేని గారిది..(సినిమా పేరు చెప్పనోచ్ ).. అందులొ హీరొ బాగా డబ్బున్నవాడు .. అతను విదేశాలలో ఉండి మనదెశానికి తిరిగి వస్తాడు.. అది ప్రారంభ దౄశ్యం … అతను విమానం దిగేసరికి తల్లితండ్రులు అతనికి ఎదురెల్లి స్వాగతం చెప్తారు… వారితో పాటుగా కొందరు అమ్మాయిలు కుడా వెళ్తారు..అతనిని వలలొ వెసుకొవడం వాళ్ళ ఉద్దెశ్యం అని వాళ్ళా హొయల ద్వారా మనకి అర్ధం అవుతుంది…. వాళ్ళు రకరకాల విదేశీ వస్త్రాలు ధరించి ఉంటారు … ఏ బ్రాండో తెలియదు గాని సూటు బూటూ వెసుకుని, చలువ కళ్ళద్దాలు ధరించి ఉన్న హిరో గారు…ఆ అమ్మాయిల దుస్తులు చుసి ఆశ్చర్య పడిపోతాడు వాళ్ళకి స్వదేశ వస్త్ర ధరన గురించి క్లాసు పీకి అక్కడి నుంచి వెల్లి పోతాడు …

    నీతి : “నీతులు చెప్పడానికి తప్ప ఆచరించడానికి పనికిరావు. “

  5. బాగా చెప్పారు ! కాక పొతే హీరో గారు ఫ్లైట్ దిగి ఇంటికి వెళ్ళాలి కదా, బట్టలు మార్చు కోడానికి !
    తల్లీ తండ్రీ ఉన్న ఇల్లు లాగానే , పార్లమెంటు లో కూడా యాభై శాతం రిజర్వేషన్లు ఉండాలి స్త్రీలకూ !
    అసమానత కొంత వరకైనా తగ్గుతుంది !

  6. బలే జోకేసారండి నాగశ్రీనివాస గారు, రెండు ‘ స్వామ్యాలు ‘ సమ ఉజ్జీలుగా ఉంటే మనం మాట్లడమండి . అలా లేవు గనకే ఇంకో స్వామ్యాన్ని చక్కబెట్టవలసి వుంది. అవతల స్వామ్యానికి ఆచరణ సాధ్య మైనపుడు ఇవతల స్వామ్యానికి ఎందుకు సాధ్యమవదండీ? అలా లేకపొవడం వ్యక్తిత్వ లోపమండీ. ‘జీవ రసాయన చర్య’ ఇక్కడ కూడా పనిచేస్తుందండి సుదాకరు గారు!

  7. రమ గారి వ్యాసం బాగుంది. ఇలాంటి అంశాలను ఇంత విస్తృత పరిధిలోనే చర్చించాల్సివుంటుంది.

    వస్త్రధారణలో ఫ్యాషన్లు, పెడ పోకడలూ ఒక అంశం. అత్యాచారాలు మరో అంశం. రెండోదానికి మొదటిదాన్ని కారణంగా చూపటం హ్రస్వ దృష్టి మాత్రమే. అది అసలైన కారణాలను చూడటానికి నిరాకరించటమే అవుతుంది.

  8. *పశ్చిమ దేశాలలో మహిళలకు వస్త్రధారణలో ఇంతకంటే వెసులుబాటు ఉన్నప్పటికీ, ఇక్కడ కంటే విషసంస్కృతి విసృతంగా విస్తరించినప్పటికీ, అక్కడ అత్యాచారాల శాతం తక్కువ*

    డిల్లి గాంగ్ రేప్ సందర్భంలో ప్రపంచ వ్యాప్తంగా అత్యాచారాలపైన ఎంతో చర్చ జరిగింది. పశ్చిమ దేశాలు సమయం దొరికింది కదా అని, మనదేశాన్ని ఎగతాళి చేస్తూ భారతదేశం ను అభివృద్ది నోచుకొని ఒక వెనుకబడిన దేశం గాను, పురుషాధిక్యత అంట్టూ వాళ్ల ప్రాపగండా తారాస్తాయిలో అన్ని మీడియా మాధ్యమాల ద్వారా మొదలుపెట్టారు. దానికి జాతీయస్థాయిలో మన ఇంగ్లిష్ మీడియావారు తాళం వేశారు. వీళ్లలో ఎక్కువగా ఆక్స్ ఫర్డ్, అమేరికా యునివర్సిటిలలో చదివుకొని, ఆదేశాల గురించి ఎంతో ఎక్కువగా, మనదేశం గురించి చాలా తక్కువ అవగాహన ఉంట్టుంది. అటువంటి సంధర్భం లో బయటపడిన వాస్తవాలు ఏమిటంటే “ప్రపంచం లోనే ఎక్కువ గా అత్యాచారాలు జరిగేది పశ్చిమ దేశాలలో ” అన్న విషయం. ఈ క్రింది లింక్ లో ఉన్న గ్రాప్ ను చూడండి.

    http://www.globalpost.com/dispatches/globalpost-blogs/quick-click/which-country-has-the-highest-reported-incidents-rape-data

    ఆ సందర్భంలో సుమారు ఒక నెలపైన వివిధ పత్రికలలో ఇద్దరు మహిళల (ఎమర్ టూలే ,లిబ్బి పర్వ్స్ )మధ్య వాదోపవాదాలు జరిగాయి. Libby purves ఆరోపణలను తిప్పికొడుతూ ఎమర్ టూలే అనే ఒకావిడ పశ్చిమదేశాల హిపోక్రసిని , వాళ్లకు వాళ్లే ఆపాదించుకొనే కల్చరల్ సుపిరియారిటిని కడిగి పారేశారు.

    Libby purves said :

    If there is one thing the Delhi gang rape has done it has apparently shattered the West’s Bollywood fantasies about India.

    “Good. About time too,” writes Libby Purves in The Times. “We in the West enjoy an image of India: industrious ambition, rising economy, colour and vigour. We romanticise it, cooing at garlands and tuk-tuks in films such as The Best Exotic Marigold Hotel.”

    The reality of India, huffs Purves is “murderous hyena-like male contempt”. Britain, she complains, just “tends to sentimentality” about its jewel in the crown and ignores “the ugly faultline in the world’s biggest democracy.”

    Purves says now the west is “looking eastward in disgust.”
    http://www.theaustralian.com.au/news/world/gang-rape-shame-could-drag-india-into-21st-century/story-fnb64oi6-1226545829569

    దానికి బదులు ఇస్తూ ఎమర్ టూలే రాసిన ఆఖరు వ్యాసం లింక్ ఇది.
    Emer O’Toole Said :
    Delhi gang-rape: look westward in disgust by Emer O’Toole
    http://www.theguardian.com/commentisfree/2013/jan/01/delhi-rape-damini

    అందులోని ముఖ్యాంశాలు ఎమిటంటే
    Even gang-rape does not make news in the ‘developed’ West at times. Emer compares the gang-rape in Delhi with the gang-rape in Steubenville in Ohio in the US, where, in August 2012, a 16-year-old girl was dragged, drunk and unresponsive, from party to party where she was raped allegedly by members of a high school basketball team. Contrasting the brutal Delhi rape and death which spurred Indian civil society to its feet, causing protest and unrest, bringing women and men into streets, with the army and the states of Punjab and Haryana cancelling new year celebrations, Emer says that in Steubenville, sports-crazy townsfolk blamed the victim. But for a blogger Alexandria Goddard, now being sued, exposing it, followed by The New York Times four months after the crime, the US might not have noticed the incident at all.

    Source
    http://www.firstpost.com/world/looking-eastward-in-disgust-delhi-gangrape-through-eyes-of-the-west-577131.html

    Sexual violence is not a cultural phenomenon in India – it is endemic everywhere
    http://www.independent.co.uk/voices/comment/sexual-violence-is-not-a-cultural-phenomenon-in-india–it-is-endemic-everywhere-8433445.html

  9. The rape record of ‘civilised and developed’ countries
    US
    44% of victims are under age 18.
    80% are under age 30.
    Every 2 minutes, someone in the US is sexually assaulted.
    There is an average of 207,754 victims (age 12 or older) of sexual assault each year.
    54% of sexual assaults are not reported to the police.
    97% of rapists will never spend a day in jail.
    Approximately 2/3 of assaults are committed by someone known to the victim.
    38% of rapists are a friend or acquaintance.
    ———————————–
    UK
    Less than one rape victim in 30 can expect to see her or his attacker brought to justice.
    About 1,000 rapists are convicted every year.
    90 per cent of rape victims said they knew the identity of their attacker.
    15 per cent went to the police.
    Between 60,000 and 95,000 people are estimated to be raped each year.
    About one woman in 200 has been a victim in the last one year.
    1 in 38 major sex crime leads to a conviction for the offence.
    2 years is the average time taken for a court verdict when the accused contests the allegations.

  10. శేఖర్ గారు,

    పై వ్యాఖ్యలు పొస్ట్ లో ని రమాసుందరి గారు చాలా బాలెన్సెడ్ గా రాసిన, భావాన్ని తప్పుపట్టటనికి కాదు. ఇతరదేశాలు స్వర్గధామాలు అని చాలా మంది భారతీయులు అనుకొంట్టుంటారు. ఎంతో మంది కి అక్కడకి వెళ్లి స్థిరపడాటమే జీవిత లక్ష్యం. వాస్తవమేమిటంటే ఆదేశాలేమి, మనం ఊహించుకొన్నంత భులోక స్వర్గాలు కావు. వాటిలో కూడా ఎన్నో లోపాలు ఉన్నాయి. అందుకుగాను అధారాలు ఇవ్వటం జరిగింది. కనీసం కొంతమంది కన్నా విదేశీ వ్యామోహం తగ్గితే అదే పదివేలు.
    వాళ్ల అభివృద్ది మాటల వెనుక, వాస్తవం కన్నా ప్రాపగండా చాలా ఉంట్టుంది. ఉదాహరణకు నేను చిన్నపుడు బిబిసి ని ఎక్కువగా ఫాలో అయ్యే వాడిని. మన దేశం శ్రీహరికోట నుంచి అంతరిక్షం లోకి విజయవంతంగా రాకేట్ ప్రయోగిస్తే బిబిసి రెండు లైన్లు చెప్పేవాళ్లు. అదే విఫలమైనపుడు రాకేట్ సముద్రం లో పడిపోవటం, చాలా సేపు చూపించిందే చుపించి, మనదేశానికి అంత సమర్ధత లేద్దనట్లు అర్థం వచ్చే విధంగా వార్తలను ప్రసారం చేసేవారు.

  11. శ్రీరాం గారూ , మీ వివరణ , విశ్లేషణా బాగున్నాయి !
    విదేశాల పైన వ్యామోహం వుండడం తప్పు కాదు కానీ , ఆ యా దేశాల మీద ఏమాత్రం అవగాహన లేకుండా ,విదేశాలకై ఎగ బడడం క్షేమ దాయకం కాదు ! మన దేశం లో దిగుమతి సంప్రదాయం వేళ్ళూనుకుని ఉంది ! విదేశీ వస్తువులు , విదేశీ భాషా , విదేశీ మతాలూ ! ముందు ముందు విదేశీ పాలనా ! ఈ విషయం లో భారతీయులు నిజమైన గ్లోబల్ సిటిజెన్స్ !ఉదాహరణకు , ఇక్కడ ఇంగ్లండు దేశం లో ఎక్కడ చూసినా , ఒకటవ , రెండవ ప్రపంచ యుద్ధాల లో మరణించిన అమర జవానుల స్మారక స్థూపాలు ఉంటాయి ! అంత బలం గా ఉంటుంది , ఆక్కడి వారి జాతీయత ! కానీ ఇంగ్లండు దేశస్థులలో అత్యధికులకు ( ఆ మాటకొస్తే భారతీయులకు కూడా ! ) తెలియని యదార్ధం, మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాలలో కలిపి మరణించిన మొత్తం యూరోపియన్ సైనికుల సంఖ్య ( అంటే యూ రప్ లో ఉన్న అన్ని దేశాల సైనికుల సంఖ్య ) కన్నా కూడా ఎక్కువ మంది సైనికులు , భారత ఉపఖండం నుంచి వెళ్లి యూ రప్ లోనూ , ఆసియా లోనూ , దక్షిణ ఆసియా లోనూ , యుద్ధం చేసి మరణించిన వారే అన్నవిషయం ! ( అందులో భారత దేశం నుంచి వెళ్ళినవారు అత్యధికులు ! ) కానీ ఈ యదార్ధాన్ని ,బీ బీ సీ తో సహా ఏ టీ వీ చానల్ కూడా ఇక్కడి వారికి తెలియ చేయదు ! అట్లాగే , మన దేశం లో జరిగే అభివృద్ధి ని ఎప్పుడూ వివరం గా కాక పోయినా కూడా , కనీసం సంగ్రహం గా కూడా చూపించరు !

  12. ఏ సమాజం లోనైనా స్త్రీ పురుష సంబందాలు గానీ, మరో సంబందాలు గానీ, ప్రజా స్వామ్య యుతంగా వుంటే తప్ప వాటికి గౌరవం కాని, ఆదిపత్య బావ జాలాలకు అడ్డాలుగా మారితే వాటికి గౌరవం అటుంచి వ్యతిరేకత తప్పదు. వాళ్లకు వాళ్లే ఆపాదించుకొనే కల్చరల్ సుపిరియారిటిని కడిగి పారేశ య్యాలి మరి! ‘కల్చరల్ సుపిరియారిటి ‘ అంటేనే ఆధి పత్య భావజాలమే! అది ఏ దేశమైనాసరే మినహ ఇంపులు ఏమైన వుంటాయా? స్వయం సమృద్దిగా వుంటే కూడా!?

  13. సుధాకర్ గారు,

    సాధారణంగా మనదేశస్థులు నా చివరి రక్తపు బిందువు వరకు మాతృదేశం కొరకు పోరాడుతాము. కావాలంటే అమరులవుతాము. అంతే కాని యుద్దం నుంచి వెనుదిరిగేది లేదని అంటారు కదా! మరి రెండవ ప్రపంచ యుద్ద సమయం లో అప్పటి బ్రిటిష్ ప్రధాని యుద్దం గురించి మాటాలాడుతూ మాదగ్గర “చివరి భారత సైనికుడు ఉన్నంత వరకు మేము యుద్దం పోరాడుతాం. యుద్దం నుంచి వెనుదిరిగే ప్రసక్తి లేదని” నొక్కి వక్కాణించాడు 🙂 భారతీయులు చనిపోతే వారి సొమ్మేమి పోయింది? బ్రిటిష్ వారి డబులు స్టాండర్డ్స్ ఎవరికి తెలియదు.

వ్యాఖ్యానించండి