150 గోతాల డబ్బు4 ట్రక్కుల్లో గుజరాత్ కి వెళ్తూ పట్టుబడింది


cash

బహుశా ఇంత మొత్తంలో డబ్బు, నగలు, వజ్రాలు పట్టుబడడం చరిత్రలో ఇదే మొదటిసారి కావచ్చు. ఎంత విలువ ఉంటుందో తేల్చడానికి కూడా రెండు రోజులు పట్టేటంత డబ్బు, నగలివి. ముంబై రైల్వే స్టేషన్ నుండి గుజరాత్ కు రవాణా కానుండగా పట్టుబడింది. 40 మంది అంగడియాలు నాలుగు ట్రక్కుల్లో, 150 గోతాల్లో నింపుకుని డబ్బు కట్టలు, బంగారు నగలు, వజ్రాలు ముంబై సబర్బన్ రైల్వే స్టేషన్ కు తీసుకెళ్తుండగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ (ఎన్.ఐ.ఏ), ఇన్ కమ్ టాక్స్ విభాగాల అధికారులు పట్టుకున్నారు.

ది హిందు పత్రిక ప్రకారం సంచుల్లో ఉన్న డబ్బు, నగలు, వజ్రాల విలువ తెలియడానికి రెండు రోజుల సమయం పడుతుందని ఐ.టి అధికారులు చెప్పారు. ఎన్.ఐ.ఏ అధికారులు డబ్బు ఎక్కడి నుండి వచ్చిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. హిందూస్ధాన్ టైమ్స్ (హెచ్.టి) పత్రిక ప్రకారం పట్టుబడిన నగదు, నగలు, వజ్రాల విలువ మొత్తం 200 కోట్ల రూపాయలకు పైనే ఉండొచ్చు. టెర్రరిస్టు కోణం ఉండొచ్చని పేరు చెప్పడానికి ఇష్టపడని అధికారులను ఉటంకిస్తూ హెచ్.టి తెలిపింది. హవాలా మార్గాల ద్వారా వచ్చిన డబ్బు అయి ఉండవచ్చని మాత్రమే అధికారులు చెబుతున్నారు తప్ప టెర్రరిస్టు కోణం గురించి వారేమీ మాట్లాడలేదు.

మొత్తం నాలుగు ట్రక్కుల పైన 41 మంది అంగడియాలు 150 కి పైగా సంచుల్లో డబ్బు, నగలు, వజ్రాలు తీసుకెళ్తుండగా పట్టుకున్నామని, వారు ముంబై రైల్వే స్టేషన్ లో రైలెక్కి గుజరాత్ లోని వివిధ చోట్లకు ఈ డబ్బు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నారని అధికారులను ఉటంకిస్తూ హెచ్.టి తెలిపింది. గుజరాత్ తో పాటు ఇతర ప్రాంతాలకు కూడా ఈ డబ్బు ఉద్దేశించారా అన్నది తెలియలేదు.

వ్యక్తిగత కొరియర్ల ద్వారా డబ్బు, బంగారం, వజ్రాల ఆభరణాలను రవాణా చేస్తుండగా ఎన్.ఐ.ఏ, ఐ.టి విభాగాల వాళ్ళు పట్టుకున్నారని హెచ్.టి తెలిపింది. సోమవారం రాత్రి గ 9:30 ని.ల ప్రాంతంలో పట్టుబడిన వీటి విలువ మొత్తం 200 కోట్లు ఉండొచ్చని సదరు పత్రిక తెలిపింది. ముంబై సెంట్రల్ టెర్మినస్ దగ్గర డబ్బు, నగలు రవాణా చేస్తున్న 4 ట్రక్కులను పట్టుకున్నామని ఐ.టి డైరెక్టర్ జనరల్ స్వంత్ర కుమార్ మంగళవారం ఉదయం పత్రికలకు తెలిపారు. ఈ 47 మంది ముంబై నుండి అహ్మదాబాద్ కు వెళ్ళే గుజరాత్ మెయిల్ రైలు ఎక్క వలసి ఉన్నదని తెలుస్తోంది.

150 కి పైగా ఉన్న సంచుల్లో ఇప్పటివరకు 50 సంచులను తెరిచి తనిఖీ చేశారని వాటన్నింటిలో డబ్బు కట్టలు ఉన్నాయని ది హిందు తెలిపింది. మిగిలిన సంచులు ఇంకా తెరిచి చూడాల్సి ఉంది. ఐ.టి అధికారులు డబ్బు కట్టాలను స్వాధీనం చేసుకోగా ఎన్.ఐ.ఏ అధికారులు ట్రక్కుల్లో ప్రయాణిస్తున్నవారిని పట్టుకున్నారు. వారం రోజుల క్రితం అందిన సమాచారం ఆధారంగా ఎన్.ఐ.ఏ అధికారులు ఐ.టి అధికారుల సహాయం కోరారని ఇరు విభాగాలు కలిసి దాడి నిర్వహించారని తెలుస్తోంది.

ముంబైలోని ఆదాయపన్ను శాఖ ప్రధాన కార్యాలయంలో ఇప్పుడు లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం డబ్బు, నగల విలువ బుధవారానికి మాత్రమే తెలుస్తుందని అధికారులు తెలిపారు. నగలు, వజ్రాల విలువను అంచనా వేయడానికి నిపుణుల సహాయం తప్పనిసరి కావడంతో లెక్కింపు ప్రక్రియ ఆలస్యం అవుతుందని సమాచారం.

అంగడియాలు నమ్మకమైన కొరియర్లుగా ముంబైలో అనేక శతాబ్దాలుగా పేరు పొందారని హిందూస్తాన్ టైమ్స్ తెలిపింది. పెద్ద మొత్తంలో డబ్బు, వజ్రాలు, ఆభరణాలు తదితర విలువైన వస్తువులను నమ్మకంగా రవాణా చేయడంలో వీరు పేరు పొందారని, దాదాపు ప్రతి రోజూ రైళ్లలో ముంబై నుండి గుజరాత్, ఇతర ప్రాంతాలకు వీరు ప్రయాణిస్తారని సదరు పత్రిక తెలిపింది.

ప్రజల అవసరాలు తీర్చవలసి వచ్చినపుడు డబ్బు లేదని చెప్పడం మన పాలకులకు అలవాటు. ప్రధాని మన్మోహన్ లాంటివారు డబ్బు చెట్లకు కాయవు అని కూడా హేళన చేస్తారు. హవాలా చెట్లకు డబ్బు ఎలా కాసిందో వీరిప్పుడు చెప్పాలి. దేశంలోని ప్రతి ప్రైవేటు బ్యాంకు, కొన్ని ప్రభుత్వ బ్యాంకులతో సహా నల్ల డబ్బు స్వీకరించడానికీ, హవాలా మార్గంలో దానిని తరలించడానికీ, అలాగే నల్ల డబ్బు తెల్లడబ్బు గా మార్చడానికీ దొంగ వ్యాపారులకు, పేరు మోసిన పెద్దలకు ఎలా సహకరిస్తున్నాయో ఇటీవలే కోబ్రా పోస్ట్ అనే పోర్టల్ వెల్లడి చేసింది.

ఒకవైపు 6 లక్షల కోట్ల మేర ధనిక వ్యాపారులకు, పెట్టుబడిదారులకు రాయితీలు పంచి పెడుతూ రైతులు, కార్మికుల వద్దకు వచ్చేసరికి బీద అరుపులు అరవడం ఎంత బూటకమో ముంబై ఘటన రుజువు చేస్తోంది. ఐ.టి, ఎన్.ఐ.ఏ అధికారులకు కర్తవ్య నిర్వహణ పట్ల ఇంకా ఆసక్తి ఉన్నట్లయితే ఎన్నికలు దగ్గర పడేకొద్దీ ఇలాంటి డబ్బు సంచుల రవాణా మరిన్ని పట్టుకోవచ్చు.

2 thoughts on “150 గోతాల డబ్బు4 ట్రక్కుల్లో గుజరాత్ కి వెళ్తూ పట్టుబడింది

వ్యాఖ్యానించండి