మధ్యాహ్న భోజనం పిల్లలకి కాదు, భోక్తలకి


mid-day meal

చిన్న పిల్లల మధ్యాహ్న భోజన పధకం కూడా అవినీతి పరుల బొజ్జలు, భోషాణాలు నింపుతోంది. దేశ రాజధాని ఢిల్లీలోనే ఈ దారుణం జరుగుతోంది. అనేక సంవత్సరాలుగా ఢిల్లీలోని బడి పిల్లలకు పెడుతున్న మధ్యాహ్న భోజనం అత్యంత అనారోగ్యకరంగా ఉంటోందని ప్రయోగ శాలల పరీక్షలు తేల్చేస్తున్నాయి. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ఢిల్లీ వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో సేకరించిన మధ్యాహ్న భోజన శాంపిళ్లలో 83 శాతం ప్రయోగశాలల పరీక్షల్లో విఫలం అయ్యాయని ఆర్.టి.ఐ (Right to Information) చట్టం ద్వారా వెల్లడయిన సమాచారం తెలియజేస్తోంది.

ఢిల్లీ పాఠశాలల పిల్లలకు పెడుతున్న మధ్యాహ్న భోజనం శాంపిళ్ల పరీక్షల ఫలితాలను విద్య విభాగానికి అధికారి అయిన డిప్యూటీ డైరెక్టర్ (మిడ్-డే మీల్), విలేఖరులకు విడుదల చేశాడు. ఈ ఫలితాల ప్రకారం 2012-13 సంవత్సరంలో 288 శాంపిళ్ళు సేకరించగా అందులో 50 శాంపిళ్ళు మాత్రమే ప్రయోగశాలల పరీక్షల్లో విజయవంతం అయ్యాయి. అంటే 83 శాతం శాంపిళ్ళు ముక్కిపోయి లేదా తినడానికి వీలులేని విధంగా ఉన్నాయి. శాస్త్రాలు నిర్ధారించిన మైక్రో బయోలాజికల్ ప్రమాణాల కోసమూ, రసాయన ప్రమాణాల కోసమూ పరీక్షలు ఉద్దేశించబడ్డాయి. ఈ రెండు ప్రమాణాలలోనూ శాంపిళ్ళు దారుణంగా విఫలం అయ్యాయి.

మైక్రో బయోలాజికల్ ప్రమాణాలు మధ్యాహ్న భోజనంలో ఇ.కోలి, సాల్మొనెల్లా లాంటి క్రిములు ఉన్నదీ లేనిదీ పరీక్షిస్తాయి. కాగా రసాయన ప్రమాణాలు ఆహారంలో తగిన తేమ, కొవ్వు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు (పిండి పదార్ధాలు), కేలరీలు ఉన్నదీ లేనిదీ పరిశీలిస్తాయి.

అధికారి ఇచ్చిన వివరాల ప్రకారం పోషక పదార్ధాల కోసం బడి పిల్లలకు వివిధ ప్రభుత్వేతర సంస్థలు మధ్య భోజనాన్ని పంపిణీ చేస్తున్నాయి. వివిధ సేవల సంస్థలు కూడా ఇందులో భాగం పంచుకుంటున్నాయి. ఒక్కో విద్యార్ధికి రోజుకు అందవలసిన ప్రోటీన్లు ప్రాధమిక విద్యార్ధులైతే 12 గ్రాములు కాగా మాధ్యమిక విద్యార్ధులైతే 20 గ్రాములు ఉండాలి. కెలోరీలలో చూస్తే ప్రాధమిక విద్యార్ధికి 450 కేలరీలు, మాధ్యమిక విద్యార్ధికి 700 కేలరీలు అందవలసి ఉంటుంది. కానీ ఈ స్థాయిని కనీసం అందుకోవడం లేదని పరీక్షల ద్వారా తేలింది.

భోజనం యొక్క క్వాలిటీ నిర్దేశిత ప్రమాణాల ప్రకారం ఉన్నదీ లేనిదీ పరీక్షించడానికి పాఠశాల నుండి రెండు శాంపిళ్ళు, ఎన్.జి.ఓ లేదా సేవల సంస్థ నిర్వహించే వంటగది నుండి మరో రెండు శాంపిళ్ళు సేకరించారని అధికారి తెలిపాడు. 2010-11 లో 466 శాంపిళ్ళు సేకరించగా 322 శాంపిళ్ళు పాఠశాలల నుండి, మరో 144 శాంపిళ్ళు వంటగదుల నుండి సేకరించినవి. వీటిలో కేవలం అయిందంటే అయిదే శాంపిళ్లు పరీక్షల్లో పాసయ్యాయి. అంటే కేవలం 1 శాతం మాత్రమే నిర్దేశించిన ప్రమాణాల మేరకు పోషక పదార్ధాలు కలిగి ఉన్నాయి.

2011-12 సంవత్సరంలో ఇది కొంత మెరుగయ్యి 5 శాతం మేరకు శాంపిళ్ళు పరీక్షల్లో నెగ్గాయి. 541 శాంపిళ్లలో 367 శాంపిళ్లను పాఠశాలల నుండి, 174 శాంపిళ్లను వంటగదుల నుండి సేకరించగా వాటిలో 27 శాంపిళ్ళు మాత్రమే పరీక్షల్లో నిర్దేశిత ప్రమాణాలను అందుకున్నాయి. ఇక 2012-13లో అయితే 288 శాంపిళ్లలో 50 శాంపిళ్ళు ప్రమాణాలు అందుకున్నాయి. మొత్తం శాంపిళ్లలో 198 పాఠశాలల నుండి సేకరించగా అందులో 160 శాంపిళ్ళు పరీక్షల్లో విఫలం అయ్యాయి. వంట గదుల నుండి 90 శాంపిళ్ళు సేకరిస్తే వాటిలో 78 శాంపిళ్ళు విఫలం అయ్యాయి. మొత్తం మీద 83 శాతం నిర్దేశిత ప్రమాణాలు అందుకోలేదు.

అంటే పేద పిల్లల కోసం ఉద్దేశించిన మధ్యాహ్న భోజనాన్ని అవినీతి పందికొక్కులు ఆరగిస్తున్నాయన్నమాట! ప్రభుత్వ నిధులను సొంతానికి వాడుకుంటూ పిల్లలకి మాత్రం అధ్వాన్నమైన భోజనాన్ని పెడుతున్నారు. ఈ మాత్రానికే సంక్షేమ పధకాల గురించి మన ప్రభుత్వాలు బాకాలూదుకుంటాయి. అదేమంటే తప్పును ఎన్.జి.ఓ సంస్థల మీదికి, సేవల సంస్థల మీదికి నెట్టేయడం ప్రభుత్వ పెద్దలకు తెలిసిన విద్య. నిజానికి ప్రభుత్వ పెద్దలకు వాటాలు లేకుండా ఇంత దుర్మార్గంగా మధ్యాహ్న భోజనం పెట్టడానికి ఎలా సాహసిస్తాయి?

వ్యాఖ్యానించండి