తీవ్ర సామాజిక సంక్షోభంలో అమెరికా


Photo: USA Today

2007-08లో వాల్ స్ట్రీట్ కంపెనీలు తెచ్చిపెట్టిన ఆర్ధిక సంక్షోభం అమెరికన్ ప్రజలను పట్టి పల్లార్చుతోంది. పెట్టుబడిదారీ కంపెనీలు తమ సంక్షోభాన్ని కార్మికవర్గం పైకీ, ప్రజా సామాన్యం పైకీ బదలాయించడంలో విజయవంతం కావడంతో అమెరికన్ ప్రజానీకం సామాజిక సంక్షోభంతో అతలాకుతలం అవుతోంది. సంక్షోభం తెచ్చిన ‘టూ బిగ్ టు ఫెయిల్’ కంపెనీలు ఎప్పటిలా భారీ లాభాలతో అలరారుతుండగా కార్మికులు, ఉద్యోగులు నిరుద్యోగం, దరిద్రం, ఆకలి, రోగాలతో సతమతం అవుతోంది. గత మూడున్నర సంవత్సరాలలోనే కోట్లాది మంది అమెరికన్లు పని కోల్పోయి ప్రభుత్వ సహాయంపై ఆధారపడే పరిస్ధితికి దిగజారిపోయారు. పొదుపు విధానాల పేరుతో జనవరి నుండి ప్రజా సంక్షేమ పధకాలను రద్దు చేసేవైపుగా ఒబామా ప్రభుత్వం కృతనిశ్చయంతో వ్యవహరిస్తోంది. ఫలితంగా మరిన్ని కోట్లమంది అమెరికన్లు దరిద్రులుగా అవతరించే పరిస్ధితి పొంచి చూస్తోంది.

ఈ సంవత్సరం ఆగస్టు నాటికి ప్రభుత్వం అందించే ఆహార సహాయాన్ని (food stamps) అందుకునే అమెరికన్ల సంఖ్య 4.71 కోట్లకు చేరుకుందని డిపార్ట్ మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ తెలియజేసింది. అమెరికా జనాభాలో (దాదాపు 31 కోట్లు) ఇది 15.2 శాతం ఉండడాన్ని బట్టి పరిస్ధితి తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. 2008 లో వీరి సంఖ్య 3 కోట్లు. అంటే కేవలం నాలుగు సంవత్సరాల్లోనే ప్రభుత్వ ఆహార సహాయంపై ఆధారపడవలసిన వారి సంఖ్య 1.71 కోట్లు పెరిగిందన్నమాట! అమెరికా రాజధాని వాషింగ్టన్ డి.సి లోనూ, మిస్సిసిపీ రాష్ట్రం లోనూ ఫుడ్ స్టాంప్స్ పొందుతున్నవారి సంఖ్య అక్కడి జనాభాలో 20 శాతం పైనే ఉందని డిపార్ట్ మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ గణాంకాలు చెబుతున్నాయి. 2007-08 ఆర్ధిక సంక్షోభాన్ని పజలపైకి నెట్టివేయడంలో పెట్టుబడిదారీ కంపెనీలు ఏ స్ధాయిలో సఫలం అయిందీ ఈ అంకెలు స్పష్టం చేస్తున్నాయి.

ఆహార సహాయం నిమిత్తం ఒక్కో అమెరికన్ కి అందుతున్న మొత్తం సగటున నెలకి 130 డాలర్లు ఉంటుంది. అంటే రోజుకి 4.33 డాలర్లు. గ్లోబల్ రీసెర్చ్ సంస్ధ ప్రకారం ఇది లోయర్ మన్ హట్టన్ లో ఖరీదయిన కాఫీ ధరకంటే తక్కువే. అయినప్పటికీ ఈ సహాయాన్ని రానున్న పది సంవత్సరాల్లో పూర్తిగా రద్దు చేసే బిల్లును అమెరికా సెనేట్ ఇపుడు చర్చిస్తోంది. ఈ బిల్లు చట్టంగా మారితే అనేకమంది పిల్లలు, వృద్ధులు, వికలాంగులు కటిక దరిద్రంలోకి నెట్టబడతారు. అమెరికాలో ఇప్పటికే 5 కోట్లమందికి (2007లో వీరి సంఖ్య 3.6 కోట్లు) ఆహార భద్రత లేదు. వీరిలో 1.7 కోట్లమంది పిల్లలే కావడం గమనార్హం. ఈ నెలలోనే అమెరికా సెన్సస్ బ్యూరో విడుదల చేసిన ‘సప్లిమెంటల్ పావర్టీ మెజర్’  లెక్కల ప్రకారమే దారిద్ర్య రేఖకు దిగువన జీవిస్తున్న అమెరికన్ల సంఖ్య 4.97 కోట్లు. అనగా మొత్తం జనాభాలో 16.1 శాతం. ఇది కొత్త రికార్డు. అధికారిక దారిద్ర్య రేఖ వాస్తవ దారిద్ర్యాన్ని తగ్గించి చూపడానికి ఉద్దేశించిందని అనేక విమర్శలు ఉన్న నేపధ్యంలో అమెరికాలో అసలు దరిద్రం ఇంతకంటే ఎక్కువే ఉండే అవకాశం ఉంది. 2006 లో అమెరికాలో అధికారిక దరిద్రుల సంఖ్య 3.73 కోట్లు కాగా అప్పటి జనాభాలో 12.5 శాతం. అంటే దాదాపు ఆరేళ్లలో 1.3 కోట్ల మంది అమెరికన్లు దరిద్రులుగా మారిపోయారు.

సప్లిమెంటరీ రిపోర్ట్ లో ప్రభుత్వ కొత్త పధకాలనూ, ఆయా రాష్ట్రాల జీవన ఖర్చులను కూడా పరిగణలోకి తీసుకుని దరిద్రులను లెక్కించారు. ఈ నూతన తరహా ప్రమాణాల ప్రకారం వివిధ రాష్ట్రాల్లో దరిద్రుల సంఖ్య కొత్త రికార్డులు సృష్టించిందని వివిధ పత్రికల వార్తలు స్పష్టం చేశాయి. ముఖ్యంగా సంపన్న రాష్ట్రాల్లో దరిద్రుల సంఖ్య బాగా ఎక్కువగా నమోదయిందని తెలుస్తోంది. ఉదాహరణకి అమెరికాలో అత్యంత సంపన్నమైన కాలిఫోర్నియా రాష్ట్రంలో 23.5 శాతం దరిద్రంలో మగ్గుతున్నారని గణాంకాలు తెలిపాయి. అంటే ప్రతి నలుగురిలో ఒకరు దరిద్రుడే. హాలీవుడ్, సిలికాన్ లోయ లాంటి సంపన్న వ్యవస్ధలకు కాలిఫోర్నియా నెలవు. అంతేకాకుండా అత్యంత దారుణమైన వేతనాలు చెల్లించే బట్టల పరిశ్రమలకు, వలస వ్యవసాయ కూలీల లేబర్ క్యాంప్ లకూ కూడా కాలిఫోర్నియా నెలవే. అందువలన అమెరికాలో అత్యంత తీవ్రమైన ఆదాయ అసమానతలు ఉన్న రాష్ట్రాల్లో ఒకటిగా కాలిఫోర్నియా ఉండడంలో ఆశ్చర్యం లేదు.

Atlanta job fair -Photo: USA Today

ఇదిలా ఉండగా అమెరికా కుటుంబాల సగటు ఆదాయం కూడా గత నాలుగేళ్లలో బాగా పడిపోయింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం తలసరి ఆదాయం 1.5 శాతం పడిపోయిందని జనాభా గణాంకాలు వెల్లడించాయి. 2007తో పోలిస్తే 2011 నాటి తలసరి ఆదాయం 8.1 శాతం పడిపోగా, ఇప్పటివరకూ తలసరి ఆదాయం ఎక్కువగా రికార్డు అయిన 1999తో పోలిస్తే 8.9 శాతం పడిపోయిందని సెన్సస్ బ్యూరో తెలిపింది. సాధారణ అమెరికా కుటుంబం యొక్క ఆదాయం గత నాలుగేళ్లుగా పడిపోతూ వస్తోందని 2011 జనాభా లెక్కల సేకరణ నివేదిక తెలియజేసింది. 2011లో ఇది 1995 నాటి స్ధాయికి పడిపోయిందని సదరు నివేదిక తెలిపింది.

ఒక పక్క దరిద్రం పెరిగిపోతూ, సామాజిక క్లేశాలు చుట్టుముడుతుండగా మరో పక్క సామాజిక సంక్షేమ పధకాల్లో అమెరికా ప్రభుత్వం వరుసగా కోతలు విధిస్తున్నది. అమెరికా ప్రభుత్వం అమలు చేస్తున్న దారిద్ర్య నిర్మూలనా పధకాల వల్ల 5 కోట్ల మంది ప్రజలు దరిద్రం కోరలనుండి తప్పించుకోగలుగుతున్నారు. కనుక, అలాంటి పధకాలు లేనట్లయితే అమెరికా దరిద్రం రెట్టింపు అవుతుందని సి.బి.పి.పి (Center on Budget and Policy Priorities) తెలియజేసింది. ఉదాహరణకి ఎన్.ఇ.ఎల్.పి (National Employment Law Project) ప్రకారం 2011లో నిరుద్యోగ భీమా పధకం వల్ల 2.6 కోట్ల మంది కార్మికులు లబ్ది పొందగా 23 లక్షల మంది దారిద్ర్యం బారిన పడకుండా తప్పించుకున్నారు. వీరిలో 6 లక్షల మంది పిల్లలు కుండా ఉన్నారని ఎన్.ఇ.ఎల్.పి తెలిపింది. 2010లో ప్రభుత్వం నిరుద్యోగులుగా లెక్కించినవారిలో 2/3 వంతు (66 శాతం) మంది నిరుద్యోగ సంక్షేమ పధకాల ద్వారా లబ్ది పొందారు. అయితే 2011లో నిరుద్యోగ లబ్దిదారుల సంఖ్య 54 శాతానికి పడిపోయింది. 2012కి వచ్చేసరికి అది 45 శాతానికి పడిపోయింది. ఒక పక్క దరిద్రుల సంఖ్య పెరుగుతుండగా దారిద్ర్య నిర్మూలనా పధకాల లబ్దిదారుల సంఖ్య పడిపోవడాన్ని బట్టి పొదుపు విధానాల కోతలు ఎవరిని ఉద్ధరిస్తున్నాయో చెప్పకనే చెబుతున్నాయి.

2007-08 ఆర్ధిక సంక్షోభం నేపధ్యంలో నిరుద్యోగం తీవ్రంగా పెరగడంతో అమెరికా ప్రభుత్వం నిరుద్యోగ సంక్షేమ కార్యక్రమాలను పొడిగించింది. ఈ కార్యక్రమాలు డిసెంబర్ 31 తేదీతో ముగిసిపోయేలా గత సంవత్సరం వైట్ హౌస్, ప్రతినిధుల సభలు ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ కార్యక్రమాలను పునరుద్ధరించకపోతే 20 లక్షలమంది నిరుద్యోగులు పధకాల లబ్దిని కోల్పోతారు. అంతేకాకుండా దేశంలోని ఏ ప్రాంతంలోనైనా 26 వారాల కంటే ఎక్కువగా నిరుద్యోగ భృతిని పొందే అవకాశాన్ని నిరుద్యోగులు కోల్పోతారు. దానర్ధం అధికారిక నిరుద్యోగుల్లో 25 శాతం మాత్రమే ప్రభుత్వ పధకాల ద్వారా లబ్ది పొందే అవకాశం ఉంటుంది. సామాన్య అమెరికన్ల వైపు నుండి చూస్తే అమెరికా ఎన్నికలు వారి సమస్యలను ఏమాత్రం పట్టింపుకు నోచుకోకుండానే వచ్చాయి, వెళ్ళాయి. ఒబామా ఎన్నికల ప్రసంగాల్లో దరిద్రం అన్న పదమే ఎన్నడూ చోటు చేసుకోలేదని కొన్ని పత్రికలు ఎత్తిచూపాయి. సామాన్య ప్రజానీకం సమస్యల పట్ల అమెరికన్ మీడియా కానీ, రాజకీయార్ధిక, సామాజిక వ్యవస్ధ గానీ ఎంతటి ఉదాసీనతో వ్యవహరిస్తున్నదో ఈ ఒక్క అంశం ద్వారా అర్ధం చేసుకోవచ్చు. సామాన్యులు ఎదుర్కొంటున్న సామాజిక విధ్వంసాన్ని ఒక సమస్యగా కూడా వారు పరిగణించడం లేదని అర్ధం చేసుకోవచ్చు.

అధ్యక్ష ఎన్నికలు ముగిశాక అటు డెమొక్రాట్లు గానీ, రిపబ్లికన్లు గానీ సంక్షేమ పధకాలను రద్దు చేయడమే ఏకైక లక్ష్యంగా పని చేస్తున్నారు. ‘సోషల్ సేఫ్టీ నెట్’ గా పరిగణించే వివిధ పధకాల్లో మిగిలి ఉన్న ఏ కొద్ది పధకాలను కూడా క్రమానుగత కోతల ద్వారా రద్దు చేసేందుకు వారు ఉత్సుకతను ప్రదర్శిస్తున్నారు. సంక్షేమ పధకాలకు డబ్బు లేదని బీదపలుకులు పలుకుతున్న ప్రభుత్వమే సంక్షుభిత వాల్ స్ట్రీట్ కంపెనీలను క్రెడిట్ క్రంచ్ నుండి బైటికి లాగడానికి ట్రిలియన్ల కొద్దీ డాలర్ల ప్రజాధనాన్ని మంచినీళ్ళలా ఖర్చుపెట్టిన సంగటినీ, జనం నెత్తిపై కొండల్లాంటి రుణభారాన్ని మోపిన దుర్మార్గాన్ని ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవాలి.

కోట్లాది శ్రమ జీవుల జీవితాల్ని బలికోరే దరిద్రం, తరాలు తిన్నా తరగని ఆస్తులతో కులికే సంపన్నత్వం పక్క పక్కనే కొలువు తీరడం దోపిడీ సమాజాల లక్షణం. కోట్లాది దరిద్రులు ఎంత తక్కువకైనా పని చేసేందుకు సిద్ధంగా ఉంటేనే శత, సహస్ర, శత సహస్ర కోటీశ్వర వర్గాలకు మరిన్ని సంపదలు సమకూరడం సాధ్యం అవుతుంది. అమానవీయ యుద్ధాలతోనూ, నిరంతర సంక్షోభాలతోనూ వెళ్ళబుచ్చుతున్న అమెరికా సామ్రాజ్యవాద ఆధిపత్య విధానాలకు మొదటి పునాది అమెరికా ఆర్ధిక వ్యవస్ధే. సామ్రాజ్యవాద విధానాలకు ఇతర ప్రపంచ దేశాలనుండి వివిధ రూపాల్లో ప్రతిఘటన పెరుగుతున్నకొద్దీ అమెరికా రాజ్యం తన సొంత ప్రజలపై దోపిడీని తీవ్రం చేస్తున్నది.

రెండో ప్రపంచ యుద్ధానంతరం సోషలిజం తరుముతున్న పరిస్ధితుల్లో చారిత్రకంగా తమనుతాము సంక్షేమ రాజ్యాలుగా ప్రకటించుకుని సంక్షేమ విధానాల ద్వారా కార్మికవర్గానికి ఒకింత అధిక ఆర్ధిక వాటాని పంచిపెట్టిన పెట్టుబడిదారీ వర్గం ఇపుడు సోషలిజం భయాలు లేనందున ధైర్యంగా కార్మికవర్గంపై అన్నివిధాలుగా దాడులకు తెగబడుతోంది. అందులో భాగంగానే అమెరికా, యూరప్ లలోని పొదుపు విధానాలు మున్నేన్నడూ లేని విధంగా ప్రజలను కష్టాలకు గురిచేస్తున్నాయి. ఈ కష్టాలను ప్రజలు ఎంతోకాలం సహించబోరు. అమెరికా సామ్రాజ్యవాదానికి అమెరికన్ ప్రజలే గోరీ కట్టేందుకు తగిన పునాదిని అమెరికా రాజ్యం స్వయంగా సిద్ధం చేసుకుంటోందని చెప్పడం సబబుగా ఉండగలదు.

3 thoughts on “తీవ్ర సామాజిక సంక్షోభంలో అమెరికా

  1. “కోట్లాది శ్రమ జీవుల జీవితాల్ని బలికోరే దరిద్రం”

    అమేరికాలో మనుషులకు పనిచేయటానికే పనిలేక పోతే వారిని మీరు శ్రమజీవులని ఎలా అంటారు? వాళ్ళెమీ శ్రమ చేస్తున్నారు?

  2. సాదారణంగా సంపన్న దేశాలంటేనే మూడొప్రపంచ దేశాల ప్రజలకు అక్కడి ప్రజలు సుఖసంతొషాలతొ తగినంత డబ్బుతొ వుంటారని బావిస్తారు. అలాగే బీద దేశాలు అనగానే అక్కడ అందరూ కష్టపడుతూ బీదతనంలొ వుంటారనే అభిప్రాయం కలుగు తుంది. వలసదేశమైనా , పేదదేశమైనా అక్కడి పెట్టుబడిదారీ వర్గం అక్కడి సంపదపై పట్టుకలిగి వుంటుంది.మిగతా కార్మికవర్గం వాళ్ళ శ్రమపైన మాత్రమే ఆదారపడి జీవించవలసి వుంటుంది. ఏ రకమైన ఉత్పత్తి సాదనాలూ కలిగి వుండరు. ధనిక దేశాల కార్మిక పరిస్తితి కుడా అంతే. మితిమీరిన ఉత్పత్తి వల్ల ఈ సంక్షొబాలు ఒకదానితర్వాత ఒకటి రుతువుల లాగ వస్తునే వుంటాయి. ఇలాంటి సందర్బాలలొనే కార్మికవర్గం తమ పొరాటాలకు సన్నద్దం కావలసి వుంటుంది. అయితే దానికి నాయకత్వం వహించే పార్టీ లేదు. ఉన్నా అది బూర్జువా వర్గంతొ నిండిపొయి వుంటుంది. ఇండియాలొ లాగ సంస్కరణ వాద జపం జపిస్తూ వుంటుంది. జబ్బుకు తాయత్తులూ, మత్రాలూ, జపిస్తూ వుంటుంది. అది ఈ లొగా చచ్చి ఊరుకుంటుంది. మళ్ళీ మళ్ళీ కొత్తజబ్బులు వస్తునే వుంటాయి.ఈ దొంగ వైద్యాలు చేస్తునే వుంటారు జబ్బు నయం కాదు పాతతరం పొతునే వుంటారు కొత్త తరానికి తగులుకుంటుంది. పెట్టుబడి కేంద్రీకరణ ఎస్తాయిలొ వుంటుందొ ఆస్తాయిలొ బికారులను తయారు చేస్తుంది. శ్రమ ఎప్పుడైతే పెట్టుబడికి లొబడదొ శ్రమశక్తిని ఎప్పుడైతే అమ్ముకొవలసిన పరిస్తితి వుండదొ అప్పటివరకు కార్మిక వర్గం అను నిత్యం అబద్రాబావంతొ ఎప్పుడు ఉద్వొగం ఊడుతుందొనని ఆందొళనతొ జీవితం వెళ్ళతీయవలసిందే.

  3. మనోహర్ గారూ, దరిద్రం అనుభవిస్తున్నవారు చేయడానికి పనిలేక దరిద్రులుగా ఉండరు. చేసే పనికి తగిన వేతనాలు లభించక దరిద్రం అనుభవిస్తుంటారు. శ్రమ చేసేవారు లేకపోతే సంపన్నులకి కూడా డబ్బు పుట్టదు. ఎంత పెట్టుబడి ఉన్నా శ్రమ జరగకుండా ఉత్పత్తి ఉండదు. శ్రమ ద్వారా సరుకులు ఎప్పటికప్పుడు ఉత్పత్తి అవుతూ అమ్ముడు పోతూ ఉంటేనే లాభాల (శ్రమ) దోపిడీ సాధ్యం అవుతుంది.

    ఉత్పత్తి పంపిణీలోని అసమానతలే పేదరికానికి దారితీస్తాయి తప్ప పని లేనందువల్ల కాదు. ఉత్పత్తి అయిన సరుకులు ఎప్పటికప్పుడు అమ్ముడయ్యే పరిస్ధితులుంటే పెట్టుబడి, శ్రమ ఒకచోట చేరి ఉత్పత్తి కార్యక్రమాలు ఊపందుకుంటాయి. కానీ సరుకులు అమ్ముడుకావాలంటే వాటిని కొనేవారు ఉండాలి. సరుకులు కొనవలవసినవారు ఉద్యోగాలు రద్దు, వేతనాల కోతలు ఎదుర్కొంటున్నారు. దానివల్ల వారి కొనుగోలు శక్తి పడిపోయి సరుకులు కొనలేకపోతున్నారు. కొనుగోలు శక్తి పెరగాలంటే వేతనాలు పెరగాలి. కొత్త ఉద్యోగాలు సృష్టించబడాలి. అంటే పెట్టుబడిదారులు తమ లాభాల్లో మరింత వాటాను కార్మికవర్గానికి పంచడానికి సిద్ధపడాలి. అందుకు వారు ఒప్పుకోరు. ఆ విధంగా వారి సంక్షోభానికి వారే కారకులు.

    నిజానికి పెట్టుబడిదారుల లాభాలు శ్రమ వల్ల వచ్చేవే తప్ప పెట్టుబడివల్ల కాదు. యంత్రాల తయారీలో ఎంత (శ్రమ) విలువ ఉంటుందో అంత విలువనే అవి తిరిగి ఇస్తాయి. కాని కార్మికుల (శారీరక కార్మికులు, మేధో శ్రమలు చేసే ఆఫీసు ఉద్యోగులు, టీచర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు మొదలయినవారంతా అటు ఇటుగా కార్మికవర్గం కిందికె వస్తారు) సజీవ శ్రమ మాత్రం తాను పుంజుకోవడానికి అవసరమైన సరుకుల విలువ కంటే మరింత ఎక్కువ విలువను యజమానులకి ఇస్తుంది. అలా కార్మికుల శ్రమ ఇచ్చిన ఎక్కువ విలువే లాభం, వడ్డీ, అద్దె, నాగు… ఇలా అనేక రూపాల్లో ఉనికిలో ఉంది. ఇదంతా పెట్టుబడిదారులు వశం చేసుకుంటూ శ్రమ జీవులకి వాటా నిరాకరించడం వల్ల దరిద్రం, ఆకలి, నిరుద్యోగం లాంటి సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. ఆ విధంగా ఈ సమస్యలు సృష్టించబడినవే తప్ప స్వాభావికమైనవి కావు. ఈ సమస్యల వల్ల కార్మికవర్గం మరింత తక్కువవేతనాలకు పని చేయడానికి సిద్ధపడి పెట్టుబడిదారులకు మరిన్ని లాభాలు సమకూర్చుతారు.

    నేను రాసినదాని నుండి మీరు ఉటంకించిన పదజాలం ఒక విస్తృత అవగాహనలో భాగం. ఈ అవగాహన కొంత ఆర్టికల్ లో ఉంది. ఇంకొంత చేర్చడానికి ఈ సమాధానం.

వ్యాఖ్యానించండి