ఉన్నత విద్యకు చేరుతున్న ఎస్.సిలు 10 శాతమే -ప్రభుత్వ సర్వే


Photo: The HIndu

షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన ప్రజలనుండి యూనివర్సిటీ లాంటి ఉన్నత చదువుల వరకూ రాలేకపోతున్నారని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ జరిపిన సర్వేలో తెలిసింది. ఇతర వెనుకబడిన కులాల విద్యార్ధులు వారి జనాభా దామాషాలోనే ఉన్నత స్ధాయి చదువుల వరకూ రాగలుగుతున్నారనీ, కానీ షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన విద్యార్ధులలో చాలా తక్కువమంది మాత్రమే ఉన్నతస్ధాయి చదువులకు చేరగలుగుతున్నారని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి కపిల్ సిబాల్ విడుదల చేసిన సర్వే నివేదిక తెలిపింది.

మహిళలు మెరుగు

మొత్తం విద్యార్ధుల్లో ఎంతమంది ఉన్నత విద్యా సంస్ధల్లో చేరుతున్నదీ వివరాలను ప్రభుత్వం సేకరించింది. 2009-10, 2010-11 విద్యా సంవత్సరాల్లో సేకరించిన వివరాల ప్రకారం అగ్ర కులాలు, ఇతర వెనుకబడిన కులాలకు చెందినవారిలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న వారి సంఖ్య పెరుగుతూ పోతున్నప్పటికీ ఎస్.సి, ఎస్.టి లలో ఆ పెరుగుదల లేదు.

2009-10 లో మొత్తం (అన్ని కులాలు) విద్యార్ధుల్లో 15 శాతం మంది ఉన్నత విద్య వరకూ వస్తే, 2010-11 లో వీరి సంఖ్య 18.8 శాతానికి చేరింది. [దీనిని గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియో (జి.ఆర్.ఇ) గా పిలుస్తారు] అంటే ఒక సంవత్సర కాలంలోనే ఉన్నత విద్యను అభిలాషిస్తున్నవారి సంఖ్యలో పెరుగుదల సంభవించింది. వీరిలో మహిళల పెరుగుదల ఇంకా ఎక్కువగా ఉండడం గమనార్హం. 2009-10లో 12.7 శాతం విద్యార్ధినులు ఉన్నత విద్యా కోర్సుల్లో చేరగా, 2010-11లో వారి సంఖ్య 16.5 శాతం కి చేరింది. పురుషుల్లో ఇది 17.1 శాతం, 20.9 శాతంగా ఉంది.

పురుషులు, స్త్రీలు ఇద్దరిలోనూ పెరుగుదల 3.8 శాతంగా ఉన్నప్పటికీ మహిళా విద్యా సంస్ధల సంఖ్యను పరిశీలిస్తే తేడా తెలుస్తుంది.  మొత్తం యూనివర్శిటీలలో మహిళా విద్యార్ధినుల సంఖ్య కేవలం 1 శాతం మాత్రమే కాగా, మొత్తం కాలేజీల్లో మహిళా కాలేజీలు 9 శాతం మాత్రమే. కో-ఎడ్యుకేషన్ కాలేజీలు, యూనివర్సిటీల్లో మహిళలు చాలా పరిమితంగానే ఉంటారన్న సంగతి గ్రహిస్తే, అతి కొద్ది కాలేజీలు, యూనివర్సిటీల సాయంతోనే పురుషులతో సమానంగా విద్యార్ధినులు ఉన్నత విద్యకోసం పోటీపడడం గమనించవలసిన విషయం.

ఎస్.సి, ఎస్.టి లు

ఉన్నత విద్యా సంస్ధల్లో ఎస్.సి కులాలకు చెందిన విద్యార్ధుల సంఖ్య 10.2 శాతం మాత్రమే ఉన్నదని తమ సర్వేలో తేలినట్లు మానవ వనరుల మంత్రిత్వ శాఖ తెలిపింది. అంటే ఉన్నత విద్య వరకూ వస్తున్న 100 మంది విద్యార్ధుల్లో 10.2 మంది మాత్రమే ఎస్.సి కులాలకు చెందినవారు. దీనర్ధం ఉన్నత విద్యా సంస్ధల్లో ఎస్.సి లకు కేటాయించిన సీట్లలో 32 శాతం ఖాళీగా కొనసాగుతున్నాయని. 10.2 శాతం ఎస్.సి పురుషులు ఉన్నత విద్యకు వస్తుండగా, 10.1 శాతం ఎస్.సి మహిళలు ఉన్నత విద్యకు వస్తున్నారని సర్వే తెలిపింది.

ఉన్నత విద్యలో ఎస్.టి ల సంఖ్య బాగా తక్కువగా ఉంది. ఉన్నత విద్య అభ్యసిస్తున్నవారిలో 4.4 శాతం మాత్రమే ఎస్.టి లకు చెందినవారు. ఎస్.టిలకు ఉన్న దేశవ్యాపిత రిజర్వేషన్ 7.5 శాతం. ఈ లెక్కన ఉన్నత విద్యలో ఎస్.టి లకు కేటాయించిన సీట్లలో 41.3 శాతం ఖాళీగా కొనసాగుతున్నాయి. ఉన్నత విద్యలోని ఎస్.టిల సంఖ్యలో పురుషులకు, స్త్రీలకు పెద్ద తేడాలేదని సర్వేలో తేలినట్లు తెలుస్తోంది.

కాగా ఇతర వెనుకబడితన తరగుతుల వారు ఉన్నత విద్యలో 27.1 శాతం ఉన్నారని ప్రభుత్వ సర్వే తెలిపింది. కేంద్ర స్ధాయిలో ఒబిసి లకు 27 శాతం రిజర్వేషన్ ఉన్న సంగతి గమనార్హం.

రిజర్వేషన్లు ఇక అవసరం లేదా?

ఎస్.సి, ఎస్.టి లు అభివృద్ధి సాధించారనీ, వారికిక రిజర్వేషన్ అవసరం లేదనీ చాలా మంది వాదిస్తున్నారు. రిజర్వేషన్లు పొందినవారే మళ్ళీ మళ్ళీ రిజర్వేషన్లు అనుభవిస్తున్నారని కూడా వీరు వాదిస్తున్నారు. రిజర్వేషన్ ద్వారా అభివృద్ధి చెందినవారు ఇక రిజర్వేషన్ వదులుకుని ఇతర ఎస్.సి లకు (లేదా ఇతర ఎస్.టి లకు) అవకాశం ఇవ్వాలనీ వీరు వాదిస్తున్నారు. వాస్తవ పరిస్ధితికి ఆ వాదన విరుద్ధమని ప్రభుత్వ అధికారిక సర్వే స్పష్టం చేస్తున్నది.

ఎస్.సి లకు గానీ, ఎస్.టి లకు గానీ ఉన్నత విద్యా సంస్ధల్లో రిజర్వ్ చేసిన చేసిన సీట్లు తగినంతమంది అభ్యర్ధులు లేక పూర్తిగా నిండడం లేదని ఈ సర్వే చెబుతోంది. రిజర్వేషన్ పొందినవారు మళ్ళీ మళ్ళీ రిజర్వేషన్ వినియోగించుకుంటున్నప్పటికీ రిజర్వ్ సీట్లు నిండక ఖాళీగా మిగిలిపోవడాన్ని బట్టి రిజర్వేషన్ సౌకర్యం పొందలేని ఎస్.సి, ఎస్.టి లకు ఇంకా సీట్లు (ఉన్నత విద్యా సంస్ధల్లో) ఖాళీగా అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వ సర్వే చెబుతోంది. కేటాయించిన సీట్లు పూర్తిగా నిండని పరిస్ధితిలో అభివృద్ధి చెందిన ఎస్.సి, ఎస్.టి లు ఉన్నత విద్యారంగంలో రిజర్వేషన్ వదులుకోవలసిన అవసరమే తలెత్తదని గ్రహించవచ్చు.

‘ది హిందూ’ పత్రిక ప్రకారం ఉన్నత విద్యారంగంలో రిజర్వేషన్ విద్యార్ధులకు సంబంధించిన వివరాలు కేవలం ప్రభుత్వ నిధులు పొందుతున్న విద్యా సంస్ధలకు సంబంధించినవి మాత్రమే. అవి కూడా స్వచ్చంధంగా ఇచ్చిన వివరాలు మాత్రమే. ఈ వివరాలు వాస్తవ విరుద్ధమైతే సంస్ధలపై తీసుకునే చట్టపరమైన చర్యలేవీ లేవు. రిజర్వేషన్ల సీట్లను డొనేషన్ విద్యార్ధులకు అమ్ముకునే ప్రవేటు విద్యా సంస్ధలు అనేకం ఉన్న నేపధ్యంలో ఉన్నత విద్యా రంగంలో (ప్రభుత్వం ప్రకటించిన) ఎస్.సి, ఎస్.టి ల విద్యార్ధుల సంఖ్య వాస్తవంలో ఇంకా తగ్గే అవకాశమే ఉంది తప్ప పెరిగే అవకాశం లేదు.

ఉన్నత విద్యను గణనీయ మొత్తంలో ప్రవేటీకరించి ఇంజనీరింగ్, మెడిసిన్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్ లాంటి ఉన్నత విద్యను పవేటు పెట్టుబడులకు సంపాదనా మార్గంగా మలిచాక రిజర్వేషన్ అమలు ప్రశ్నార్ధకంగా మారిపోయింది. ఉన్నత కులాల విద్యార్ధులు చేరడానికి ఆసక్తి చూపని పరిస్ధితుల్లో ఎస్.సి, ఎస్.టి, బి.సి ల విద్యార్ధుల కోసం ప్రభుత్వాలు చెల్లించే ఫీజు రాయితీల కోసం కాలేజీలు నడుపుతున్న ఉన్నత ప్రవేటు విద్యా సంస్ధలు అనేకం ఉన్నాయి. కనుక రానున్న రోజుల్లో ఉన్నత విద్యలో ఎస్.సి, ఎస్.టి విద్యార్ధుల సంఖ్య మరింత తగ్గిపోయే అవకాశం ఉంది.

పూర్తి వివరాలు కాదు

ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో విద్యా సంస్ధలన్నీ పాల్గొనలేదు. మానవ వనరుల శాఖ నిర్వహిస్తున్న వెబ్ సైట్ కి వివిధ కాలేజీలు, యూనివర్సిటీలు, ఇతర సంస్ధలు అప్ లోడ్ చేసిన వివరాలనుండి మాత్రమే ప్రభుత్వం సర్వే ఫలితాలు ప్రకటించింది. వివరాలు అప్ లోడ్ చేసే ప్రక్రియను తప్పనిసరి అవసరంగా విద్యా సంస్ధలకు ప్రభుత్వం విధించలేదు. ఉన్నత విద్యా సంస్ధలు స్వచ్ఛందంగా అందజేసిన వివరాలనే ప్రభుత్వం ప్రకటించింది.

జులై 31, 2012 వరకూ వివరాలు అప్ లోడ్ చేసిన 448 యూనివర్సిటీలు, 8123 కాలేజీలు, 4076 ఇతర సంస్ధలు (వీటిని standalone institutions గా ప్రభుత్వం పేర్కొంది) ఇచ్చిన వివరాల ద్వారా సర్వే ఫలితాలు ప్రకటించామని ప్రభుత్వం తెలిపింది. సర్వేకి సంబంధించిన అంతిమ నివేదిక తర్వాత ప్రకటిస్తామని మంత్రిత్వ శాఖ అధికారులు చెప్పారని డెక్కన్ హెరాల్డ్ తెలిపింది. దేశంలో మొత్తం 621 యూనివర్సిటీలు, 27,468 కాలేజీలు ఉన్నట్లు ప్రభుత్వం ఇచ్చిన వివరాల ద్వారా తెలుస్తోంది.

మరిన్ని వివరాలు

ప్రభుత్వ సర్వేలోని మరిన్ని అంశాలు ‘ది హిందూ’ పత్రిక అందజేసింది. వీటి ప్రకారం, ఉన్నత విద్య అందిస్తున్న మొత్తం కాలేజీల్లో 57 శాతం ప్రవేటు కాలేజీలే. 22 శాతం మాత్రమే ప్రభుత్వ కాలేజీలు. అయితే ఉన్నత విద్యలో చేరే విద్యార్ధుల్లో 38 శాతం మాత్రమే ప్రవేటు కాలేజీల్లో చేరుతున్నారు. అరకొర సౌకర్యాలతో, లాభాపేక్షతో కాలేజీలు స్ధాపిస్తున్నందున ఈ పరిస్ధితి ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వ సాయం లేని ప్రవేటు కాలేజీల్లో సగటును ఒక్కో కాలేజీకి 529 మంది విద్యార్ధులు చదువుతున్నారు.

ప్రభుత్వానికి వివరాలు అందజేసిన సంస్ధల్లో 36 శాతం యూనివర్సిటీలు, 48 శాతం కాలేజీలు, 56 శాతం స్వతంత్ర (standalone) సంస్ధలు గ్రామీణ ప్రాంతంలో ఉన్నాయి. 621 యూనివర్సిటీల్లో 448 యూనివర్సిటీలు వివరాలు ఇవ్వగా తమిళనాడులో 59, యు.పి లో 56, ఎ.పి లో 46 యూనివర్సిటీలు ఉన్నాయి. కాలేజీల విషయానికి వస్తే ఎ.పి లో 4815, యు.పి లో 3657, మహారాష్ట్రలో 3328 కాలేజీలు ఉన్నాయి. 4118 స్వతంత్ర సాంకేతిక విద్యా సంస్ధల్లో 1243 మహారాష్ట్ర లోనే ఉన్నాయి. దేశంలో మొత్తం 308 నర్సింగ్ కాలేజీలుంటే, కేరళలోనే (స్వతంత్ర) 129 నర్సింగ్ కాలేజీలు ఉన్నాయి.

1 thoughts on “ఉన్నత విద్యకు చేరుతున్న ఎస్.సిలు 10 శాతమే -ప్రభుత్వ సర్వే

  1. ఒరిస్సాలోని రాయగడ, గజపతి జిల్లాలలోని గిరిజనులలో చాలా మందికి రిజర్వేషన్‌లు అంటే ఏమిటో తెలియదు. రెండుమూడు ఎకరాలు కొండపోడు సాగు చేసుకునే గిరిజనులకి ఆ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్‌లో వాళ్ళు పెద్ద చదువులు చదువుకోలేరు కనుక వాళ్ళకి రిజర్వేషన్‌ల గురించి తెలిసే అవకాశం కూడా లేదు. “మా పార్టీకి వోట్లు వేస్తే మీ కులానికి రిజర్వేషన్‌లు పెంచుతాము” అని అన్ని పార్టీలవాళ్ళూ వాగ్దానాలు చేస్తారు కానీ “మీ కులంలో అక్షరాస్యత పెంచుతాం” అని మాత్రం వాగ్దానం చెయ్యరు.

వ్యాఖ్యానించండి