ఉక్రెయిన్: కాల్పుల విరమణపై చర్చిస్తున్న పశ్చిమ దేశాలు?!


A destroyed building in Mariupol city, April 3, 2022

జూన్ 3 తో ఉక్రెయిన్ యుద్ధం మొదలై 100 రోజులు గడిచాయి. ఉక్రెయిన్ బలగాలపై రష్యా ఫిరంగి దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మెల్లగా అయినప్పటికీ ఉక్రెయిన్ లోని ఒక్కొక్క గ్రామం, పట్టణం రష్యా వశం లోకి వస్తున్నాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ బింకం ప్రదర్శన కూడా కొనసాగుతోంది. ఉక్రెయిన్ కు అమెరికా, ఈయూ ఆయుధ సరఫరా కొనసాగుతూనే ఉన్నది.

ఉక్రెయిన్ బలగాలు గట్టిగా ప్రతిఘతిస్తున్నాయని ఓవైపు ప్రశంసలు కురిపిస్తున్న అమెరికా, యూకే, ఈయూ లు మరో వైపు శాంతి ఒప్పందం కోసం అవసరమైన ఫ్రేం వర్క్ ను రూపొందించటానికి కొన్ని వారాలుగా ప్రతి రోజూ చర్చలు జరుపుతున్నాయని సి.ఎన్ఎన్ వార్తా సంస్థ తెలిపింది.

అయితే ఈ విషయంలో కొట్ట వచ్చినట్లు కనిపించే అంశం ఈ చర్చల్లో ఉక్రెయిన్ పాత్ర లేకపోవటం. రష్యాతో ఉక్రెయిన్ సంధి చేసుకునే విషయంలో చేయ వలసిన ప్రతిపాదనలపై పశ్చిమ దేశాలు చర్చలు చర్చిస్తూ వాటిలో రష్యాతో వాస్తవంగా తలపడుతున్న ఉక్రెయిన్ కు స్థానం కల్పించక పోవడం?! ఈ లెక్కన ఉక్రెయిన్ చేస్తున్న యుద్ధం ఎవరి కోసమో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు.

భౌగోళిక ఆధిపత్య రాజకీయాల్లో భాగంగా రెండు దశాబ్దాలుగా అమెరికా, పశ్చిమ రాజ్యాలు సాగిస్తున్న ప్రయత్నాలలో, ఘర్షణలలో ఉక్రెయిన్ కేవలం ఒక పాన్ మాత్రమే. ఉక్రెయిన్ యుద్ధం వాస్తవంలో రష్యాపై అమెరికా సాగిస్తున్న పరోక్ష (ప్రాక్సీ) యుద్ధం! ఈ మాట అంటున్నది మనం మాత్రమే కాదు. ఉక్రెయిన్ ప్రభుత్వం లోని పెద్దలే అంటున్నారు.

“రష్యాకు ఎదో ఒకటి ఇచ్చి సంధి చేసుకోమని కొంతమంది సలహా ఇస్తున్నారు. ఈ ‘గొప్ప భౌగోళిక రాజకీయ ప్రముఖులు’ సాధారణ ప్రజలను, సాధారణ ఉక్రెయిన్ ప్రజలను, ఒక భ్రమాజనితమైన శాంతికి బదులుగా ఇవ్వ జూపుతున్న ఉక్రెయిన్ భూభాగంలో నివసిస్తున్న మిలియన్ల మందిని ఎన్నడూ చూడరు” అని గత మే నెల ఆఖరులో ఉక్రెయిన్ అధ్యక్షుడి సలహాదారు మిఖాయిలో పోడోల్యాక్ ఒక వీడియోలో కనిపించి ఆక్రోశించాడు (సిఎన్ఎన్, జూన్ 3, 2022).

పోడోల్యాక్ ఉటంకిస్తున్నది అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హెన్రీ కిసింజర్. 1970 లలో చైనాతో అమెరికా చర్చలు జరపడంలో ప్రధాన సూత్రధారి హెన్రీ కిసింజర్. సిద్ధాంతాలు, భావోద్వేగాలు పక్కన పెట్టి వాస్తవ పరిస్థితుల ఆధారంగా భౌగోళిక రాజకీయ సమస్యలు పరిష్కరించుకోవాలని హెన్రీ కిసింజర్ తరచూ చేసే బోధన. ఆ విధానంతోనే పలు చారిత్రాత్మక ఘటనలకు ఆయన ప్రాణం పోసాడని ప్రతీతి. అందులో పెట్టుబడిదారీ అమెరికా – సోషలిస్టు చైనా సంబంధాల పునరుద్ధరణ అని కూడా ప్రతీతి!

Putin and Kissinger -2007 photo

‘యుద్ధం ముగియాలంటే కొంత భూమిని వదులుకునేందుకు ఉక్రెయిన్ సిద్ధంగా ఉండాలి. రష్యా అవమానకర ఓటమి ఎదుర్కొనే పరిస్ధితి ఏర్పడితే అది విస్తృతమైన అలజడికీ, ఆస్థిరతకు దారి తీస్తుంది” అని 98 ఏళ్ళ కిసింజర్ హెచ్చరించాడు. మే 23 తేదీన దావోస్ (స్విట్జర్లాండ్) లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరం లో మాట్లాడుతూ ఆయన ఈ మాటలు చెప్పాడు.

“ఉద్రిక్తతలు మరింత ముదిరి పరిష్కారం కష్టం కాకుండా పోయే లోపే అంటే వచ్చే రెండు నెలల్లో చర్చలు మొదలవ్వాలి. ఐడియల్ గా ‘స్టేటస్ కో యాంటి’ (status quo ante) పరిస్ధితికి తిరిగి మళ్లడం అంగీకార యోగ్యంగా ఉండాలి” అని కిసింజర్ సలహా ఇచ్చాడు (బిజినెస్ ఇన్సైడర్, మే 24, 2022).

కిసింజర్ చెప్పేదాని ప్రకారం యుద్ధం మొదలైన ఫిబ్రవరి 24 నాటి పరిస్ధితికి ఇరువురు అంగీకరించాలి అని. అనగా 2014 లో రష్యా కలుపుకున్న క్రిమియా, లుగాన్స్క్, డోనేట్స్క్ లలోని కొంత భాగం లను ఉక్రెయిన్ వదులుకోవాలి. దీనికి ఉక్రెయిన్ అధ్యక్షుడు అంగీకరించలేదు. క్రిమియాతో సహా ఉక్రెయిన్ కి చెందిన ఏ భాగాన్ని రష్యాకు ఇచ్చేది లేదని మే 24 తేదీన ప్రకటించాడు.

కాని అప్పటి నుండి రష్యా మరిన్ని ప్రాంతాలను వశం చేసుకుంది. ఇంకా పురోగమిస్తున్నది కూడా. నిజానికి కిసింజర్ ప్రతిపాదన పుతిన్ కి అంగీకారమా అన్నది అనుమానమే. లుగాన్స్క్ లో 98 శాతం రష్యా వశం చేసుకుంది. డోనెట్క్స్ లో 70 శాతం వశం చేసుకున్నట్లు రష్యా చెబుతోంది. ప్రధాన నగరాలు మరియుపోల్, ఖేర్సన్, లిమన్, సెవరోడోనెట్క్స్, మేలిటోపోల్ మొ.వి రష్యా ఆధీనంలోకి వచ్చాయి. కిసింజర్ ఫార్ములాలో ఇవన్నీ రష్యా తిరిగి ఉక్రెయిన్ కి అప్పగించాల్సి ఉంటుంది.

రష్యాకి ఏం కావాలి?

ఉక్రెయిన్ కు పడమర దిశలో ఉన్న మాల్డోవా దేశంలోని తూర్పు సరిహద్దు ప్రాంతం ట్రాన్స్ డి నిస్ట్రియా. 200 కి.మీ పొడవు, 20 కే.మీ వెడల్పు గల ఈ ప్రాంతం మాల్దోవా నుండి స్వతంత్రం కోరుతోంది. వేరుగా ఉంటోంది కూడా. పైగా రష్యాలో కలవాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు. ఇక్కడ రష్యా సైన్యాలు కూడా ఉన్నాయి.

  • తూర్పు రిపబ్లిక్ లు లుగాన్స్క్, డోనెట్క్స్ లను (రెండు కలిపి డాన్ బాస్ అంటారు) పూర్తిగా ఉక్రెయిన్ నుండి విముక్తి చేయటం
  • డాన్ బాస్, దక్షిణాన ఉన్న క్రిమియాలను కలిపే భూభాగం (Zaporizhia, Kherson రాష్ట్రాలు) ను వశం చేసుకోవడం ద్వారా క్రిమియాకు భూమార్గం ఏర్పరచడం
  • మైకోలాయివ్, ఒడేసా రాష్ట్రాలను పాక్షికంగా గానీ, పూర్తిగా గానీ కలుపుకోవటం తద్వారా ఇటు ట్రాన్స్ డి నిస్ట్రియా నుండి అటు డాన్ బాస్ వరకు వరుస భూమార్గాన్ని చేజిక్కించుకోవటం

పై లక్ష్యాలు సాధిస్తే రష్యా లో కలవాలని భావిస్తున్న ట్రాన్స్ డి నిస్ట్రియా, క్రిమియా, డాన్ బాస్ లను మధ్యలో ఎలాంటి ఖాళి లేకుండా రష్యాలో కలిసినట్లు అవుతుంది.

Ukraine political map_

ఉక్రెయిన్ లో పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ప్రాంతం డాన్ బాస్ మాత్రమే. అలాగే సారవంత భూములతో పంటలు పండే ప్రాంతం కూడా తూర్పు ఉక్రేయినే. రష్యా తలపోస్తున్న లక్ష్యాలను సాధిస్తే మిగిలే ఉక్రెయిన్ కు అందుబాటులో ఉండే వనరులు చాలా పరిమితం. కనుక మిగిలిన ఉక్రెయిన్ అటు ఐరోపా మీదనో లేదా రష్యా మీదనో ఆధారపడటం తప్ప మరో గత్యంతరం ఉండదు. అటువంటి ఉక్రెయిన్ వల్ల అమెరికాకు ఒరిగే ప్రయోజనమూ పెద్దగా ఉండకపోవచ్చు.

మాల్దోవా ప్రభుత్వం కూడా ప్రస్తుతం రష్యా వ్యతిరేక వైఖరి తీసుకుంది. రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీ ని తరిమి కొట్టిన సోవియట్ రష్యా సైనిక వీరుల స్మృతి నిమిత్తం నిర్మించిన స్థూపాలను, నిర్మాణాలను వరుస పెట్టి కూల్చుతోంది. మాల్దోవా లో సైతం పారిశ్రామికంగా అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతం ట్రాన్స్ డి నిస్ట్రియా. మాల్దోవా జిడిపి లో 40 శాతం ఇక్కడి నుండే వస్తుంది. పంటలు కూడా ఇక్కడే ఎక్కువ పండుతాయి. ట్రాన్స్ డి నిస్ట్రియా, రష్యాలో కలిస్తే మాల్దోవా పరిస్ధితి కూడా బలహీనపడుతుంది.

అయితే తనకు ఏమి కావాలో పుతిన్ ఇంతవరకు స్పష్టంగా చెప్పలేదు. ఉక్రెయిన్ లో నాజీ నిర్మూలన (డీ నాజిఫికేషన్), మిలటరీ నిర్మూలన (డీ మిలటరైజేషన్) చేయడమే లక్ష్యంగా స్పెషల్ మిలటరీ ఆపరేషన్ చేపట్టినట్లు ప్రకటించాడు తప్పితే నిర్దిష్ట లక్ష్యాలు ప్రకటించలేదు. పైన ఉదాహరించిన అంశాలు కేవలం ప్రస్తుతం రష్యా సైనిక చర్యలు, రష్యా నేతల ప్రకటనలు ఆధారంగా నిపుణులు అంచనా వేస్తున్నవి.

కిసింజర్ ఫార్ములా ప్రకారం డాన్ బాస్ లో మూడింట రెండు వంతులు తిరిగి ఉక్రెయిన్ కి రష్యా అప్పగించాల్సి ఉంటుంది. క్రిమియాను పూర్తిగా ఉంచుకోవచ్చు. అయితే డాన్ బాస్ ను పూర్తిగా విముక్తి చేయటం తమ ప్రధాన లక్ష్యంగా రష్యా విదేశి మంత్రి లావరోవ్ అనేక మార్లు ప్రకటించాడు. ట్రాన్స్ డి నిస్ట్రియా ను డాన్ బాస్ ను కలుపుతూ భూ భాగం వశం చేసుకునే లక్ష్యాన్ని పుతిన్ విడనాడే అవకాశం ప్రస్తుతం కనిపించటం లేదు.

కనుక కిసింజర్ ప్రతిపాదన రష్యాకు ఆమోదయోగ్యం కాకపోవచ్చు. ఇటలీ ఆమోదించిన కిసింజర్ ప్రతిపాదన ను అమెరికా కూడా ఇప్పటిదాకా ఆమోదించలేదు.

సడలుతున్న పశ్చిమ దేశాల పట్టు

అయితే పశ్చిమ దేశాల నేతలు ఇటీవల జారీ చేస్తున్న ప్రకటనలు వారి పట్టుదల సడలుతున్నట్లు సూచిస్తున్నాయి. రష్యా పట్ల ప్రదర్శించిన గట్టి వ్యతిరేకత బలహీనం అవుతున్నట్లు తెలుపు తున్నాయి. నిజానికి ఐరోపా దేశాల రష్యా-వ్యతిరేకత అమెరికా బలవంతం వల్ల వ్యక్తం అవుతున్నదనీ, అమెరికా కు ఉన్నంత రష్యా వ్యతిరేకత ఈయూ కూటమి దేశాలకు లేదని విశ్లేషకుల అభిప్రాయం.

ఇటలీ మాజీ ప్రధాని బెర్లుస్కోని ఇటీవల పత్రికలో ఆర్టికల్ రాస్తూ ఉక్రెయిన్ పై వైఖరి వల్ల పశ్చిమ దేశాలు ప్రపంచం నుండి ఒంటరి అయ్యాయని వ్యాఖ్యానించాడు అమెరికా, ఈయూ, పసిఫిక్ లో జపాన్, ఆస్ట్రేలియాలు తప్ప ఇంకెవరూ పశ్చిమ దేశాలకు మద్దతు ఇవ్వడం లేదని కుండ బద్దలు కొట్టాడు.

“వర్తమానానికి సంబంధించి ముఖ్యంగా భవిష్యత్తు కు సంబంధించి ఆందోళనకర సూచనలను పశ్చిమ దేశాలకు ఉక్రెయిన్ సంక్షోభం అందజేసింది. రష్యా పశ్చిమ దేశాల నుండి ఒంటరి అయింది నిజమే; కానీ పశ్చిమ దేశాలు మిగతా ప్రపంచం నుండి ఒంటరి అయిపోయిందే!” అని బెర్లుస్కోని ఇటలీ పత్రిక జర్నల్ (Giornale) కు రాస్తూ అన్నాడు.

ఫ్రాన్స్ అధ్యక్షుడు మేకరాన్ మాట్లాడుతూ రష్యా అవమానకరంగా మాట్లాడటం, దూషించటం మానుకోవాలని కోరాడు. అలా చేస్తే రష్యాతో శాంతి ఒప్పందం చేసుకునే అవకాసం దూరం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశాడు.

నాటో సభ్య దేశమైన టర్కీ అసలు పశ్చిమ దేశాల ఆంక్షలకు మద్దతు ఇవ్వలేదు. తమకు రష్యాతో సంబంధాలు అత్యవసరం కనుక ఆంక్షలు విధించేది లేదని టర్కీ స్పష్టం చేసింది. నాటో లోకి స్వీడన్, ఫిన్లాండ్ లను చేర్చుకోవటాన్ని కూడా టర్కీ వ్యతిరేకిస్తోంది.

ఉక్రెయిన్ విషయంలో అమెరికా వైఖరిలో మార్పు వచ్చిందని జర్మనీ పార్లమెంటు సభ్యులు కొందరు సూచిస్తున్నారు. న్యూ యార్క్ టైమ్స్ పత్రిక “రష్యాతో సాయుధ ఘర్షణ అమెరికా ప్రయోజనాలకు విరుద్ధం” అని ఒక ఆర్టికల్ ద్వారా ప్రకటించిన సంగతి వారు ఉదాహరణగా చెబుతున్నారు. దీని ప్రకారం ఉక్రెయిన్ విషయంలో సాధించ దలచిన లక్ష్యాలను ఇప్పటికే సాధించినట్లు అర్ధం అవుతోందని జర్మని పార్లమెంటు సభ్యులు వ్యాఖ్యానించారు. అయితే ఈ లక్ష్యాలు ఏమిటో వారు సూచించలేదు. 

అమెరికా ప్రజల్లోనూ ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా పాత్రకు మద్దతు తగ్గిపోతోంది. ఆరంభంలో అధ్యక్షుడు బిడెన్ అనుసరించిన ఉక్రెయిన్ విధానానికి 70 శాతం పైగా మద్దతు ఇవ్వగా ఇప్పుడది 36 శాతానికి పడిపోయిందని ద డెమోక్రటిక్ ఇనిస్టిట్యూట్ తెలిపింది. 53 శాతం వ్యతిరేకిస్తున్నారు. ఉక్రెయిన్ ఓడిపోయినా ఫర్వాలేదని భావిస్తున్నవారి భాగం 40 నుండి 45 శాతానికి పెరిగింది.

ఆరంభంలో అమెరికా పత్రికలు యుద్ధ వార్తలను ఉక్రెయిన్ కు అనుకూలంగా ప్రకటించేవి. ఉక్రెయిన్ విజయం సాదిస్తున్నట్లూ, ఉక్రెయిన్ సైనిక బలగాలు దూసుకు పోతున్నట్లు రాసాయి. రష్యా తనకు తానే కీవ్, సుమీ నగరాల నుండి సైన్యాన్ని ఉపసంహరించు కుంటే అమెరికా పత్రికలేమో ఉక్రెయిన్ సైన్యం దెబ్బకు రష్యా సైన్యం పారిపోయిందని రాసాయి. మరియు పోల్ నగరంలో రెండు వేలకు మందికి పైగా నయా నాజీలైన అజోవ్ బలగాలు లొంగిపోగా వారిని రష్యా జైళ్లకు తరలించింది. ఈ వార్తను అమెరికా పత్రికలు అజోవ్ బలగాలను ఉక్రెయిన్ విముక్తి చేసినట్లుగా నిర్బంధం నుండి ఖాళీ చేయించినట్లుగా రాసాయి. వీటినే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సగర్వంగా ప్రకటిస్తూ వచ్చాడు.

ఇప్పుడు అమెరికా పత్రికలు అలా రాయటం లేదు. సాధ్యం అయినంతగా వాస్తవాలు చెప్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. గతంలో లాగా అవాస్తవాలు రాసినట్లయితే హఠాత్తుగా రష్యా విజయాన్ని ప్రకటించటం అసాధ్యం అవుతుందని అవి గ్రహించినట్లు కనిపిస్తోంది. జెలెన్ స్కీ సైతం 20 శాతం భూ భాగాన్ని రష్యా ఆక్రమించిందని ప్రకటించక తప్పలేదు. ప్రతి రోజూ 100 నుండి 160 వరకు ఉక్రెయిన్ సైనికులు చనిపోవడమో లొంగిపోవడమో జరుగుతున్నట్లు చెబుతున్నాడు.

ఈ నేపధ్యంలో కాల్పుల విరమణ గురించి అమెరికా, ఈ యూ, యూకే లు చర్చలు చేయడంలో ఆశ్చర్యం లేదు. కిసింజర్ ఫార్ములాయే ‘మరో రెండు నెలల్లో శాంతి ఒప్పందం జరిగితే మంచిది’ అని ప్రతిపాదించింది కనుక బహుశా జులై, లేదా ఆగస్టు వరకు యుద్ధం కొనసాగవచ్చు. ఈ లోపు సాధ్యమైనన్ని ఎక్కువ ప్రాంతాలను వశం చేసుకునేందుకు రష్యా ప్రయత్నాలు చేస్తుంది.

One thought on “ఉక్రెయిన్: కాల్పుల విరమణపై చర్చిస్తున్న పశ్చిమ దేశాలు?!

  1. సామరస్యంగా, ప్రశాంతంగా బ్రతికే సామాన్యులను రాజకీయాలు,ధనవంతులు తమ స్వలాభాలకోసం బలి పెట్టడం విచారం కలిగిస్తుంది.ఈ దుస్థితి నుండి ప్రజలు బయటపడే మార్గం కనుచూపు మేరలో కనిపించడంలేదు!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s