
Japan’s Prime Minister Fumio Kishida inspects the honour guard at Government House in Bangkok on May 2, 2022, on his official visit to Thailand. -AFP)
ధాయిలాండ్, ఇండోనేషియా, వియత్నాం
జపాన్ ప్రధాని 5 దేశాల పర్యటనలో భాగంగా మే 2 తేదీన ధాయిలాండ్ వెళ్ళాడు. రక్షణ పరికరాలు మరియు రక్షణ సాంకేతిక పరిజ్ఞానం పరస్పరం మార్చుకునే సదుపాయాన్ని కల్పించుకునే లక్ష్యంతో ఆ దేశంతో కూడా రక్షణ ఒప్పందం చేసుకున్నాడు. “ద్వైపాక్షిక భద్రతా సహకారం” మరింత లోతుగా విస్తరించుకునేందుకు ఒప్పందంలో వీలు కల్పించారు. ఈ సందర్భంలో కూడా ఇరు దేశాలు “ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రాభవం పెరుగుతున్న నేపధ్యంలో” అని చెప్పుకోవడం మానలేదు.
ఉక్రెయిన్ ప్రసక్తి కూడా ఇరు దేశాల చర్చల్లో చోటు చేసుకుంది. ఉక్రెయిన్ లో రష్యా దాడి వల్ల 5.5 మిలియన్లు నిరాశ్రయులు అయ్యారని వారికి మానవతా సాయం అందించే కృషిలో ఇరు దేశాలు సన్నిహితంగా కృషి చేయాలని ఇరు దేశాల నేతలు (జపాన్ ప్రధాని కిషిడా, ధాయిలాండ్ ప్రధాని ప్రయుత్ చాన్-ఓచా) బాస చేసుకున్నారు.
ఇండియాకు 42 బిలియన్ డాలర్ల క్యారట్ విసిరినట్లే ధాయిలాండ్ కు ఋణము, గ్రాంటు ఇస్తామని జపాన్ ప్రకటించింది. 50 బిలియన్ యెన్ ల (385 బిలియన్ డాలర్లు) ఋణం, 500 మిలియన్ యెన్ ల గ్రాంట్-ఇన్-ఎయిడ్ జపాన్ ఇవ్వజూపింది. కోవిడ్-19 నుండి కోలుకోవడానికీ, క్వారంటైన్ సౌకర్యాలు అభివృద్ధి చేసుకునేందుకు ఈ సొమ్ము వాడుకోవాలని ఋణ నిర్దేశం కూడా చేసింది.
దక్షిణ చైనా సముద్రం మొత్తం తనదే అన్న చైనా వాదనను వ్యతిరేకిస్తున్న దేశాల్లో ధాయిలాండ్ ఒకటి. మత్స్య, చమురు వనరులు పుష్కలంగా ఉన్న ఈ సముద్రం పై తమకూ హక్కులు ఉన్నాయని ఆసియాన్ గ్రూపు దేశాలు వాదిస్తున్నాయి. ఆసియాన్, చైనాల మధ్య ఉన్న ఈ వైరుధ్యాన్ని అమెరికా, EU, జపాన్ లాంటి దేశాలు అడపా దడపా రెచ్చ గొట్టడం ఆనవాయితీ. వైరుధ్యాన్ని ఆసియాన్ దేశాలు మర్చిపోవాలని భావించినా, అమెరికా, జపాన్ తదితర దేశాలు మరువనివ్వవు. కిషిడా ధాయిలాండ్ పర్యటనలోను అదే జరిగింది.
“స్వేచ్చాయుత, బహిరంగ ఇండో-పసిఫిక్ సాధన కోసం ఇరు దేశాలు కృషి చేస్తాయి. ఈ ద్వైపాక్షిక రక్షణ సహకార ఒప్పందం ఆ దిశలో వేసిన ముందడుగు” అని కిషిడా ధాయిలాండ్ లో ప్రకటించాడు (జపాన్ టైమ్స్, మే 3, 2022). “ఏ దేశ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత అయినా ఉల్లంఘించటాన్ని, యధాతధ స్థితి ని బలవంతంగా మార్చే ప్రయత్నాలను సహించబోమని, సామూహిక విధ్వంసక మారణాయుధాల వినియోగాన్ని వ్యతిరేకిస్తామని ప్రధాని ప్రయుత్ నేను అంగీకరించాము” అని కిషిడా చెప్పాడు. ‘ఉక్రెయిన్ లో మరే ఇతర దేశమైనా జోక్యం చేసుకుంటే గనక మా నుండి ఎన్నడూ ఉహించని స్పందన ఎదురవుతుంది’ అంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ పరోక్షంగా అణ్వాయుధ ప్రయోగం గురించి హెచ్చరించటాన్ని జపాన్ ప్రధాని ఇక్కడ పరోక్షంగా ఎత్తి చూపాడు.
ఆసియా-పసిఫిక్ ఎకనమిక్ కో-ఆపరేషన్ వాణిజ్య కూటమికి ఈ ఏటి నుండి ధాయిలాండ్ అధ్యక్షరికం వహిస్తుంది. ఈ కూటమిలో రష్యా కూడా సుభ్యురాలే. ఈ నేపధ్యంలో ధాయిలాండ్ రష్యాకు వ్యతిరేకంగా వ్యవహరించే అవకాశం చాలా తక్కువ. ఐరాస మానవ హక్కుల కౌన్సిల్ నుండి రష్యాను సస్పెండ్ చేస్తూ చేసిన తీర్మానం ఓటింగ్ లో ధాయిలాండ్ పాల్గొనకుండా తటస్థ వైఖరి అవలంబించింది. G7 గ్రూపు విధించిన ఆంక్షలను కూడా అమలు చేయడం లేదు.
ప్రధాని కిషిడా ఇండోనేషియా, వియత్నాం దేశాలు కూడా పర్యటించాడు. అయితే ఆ దేశాలతో రక్షణ ఒప్పందాలేవి చేసుకోలేదు. కాని “స్వేచ్చాయుత, బహిరంగ ఇండో-పసిఫిక్ కోసం కృషి చేద్దాం” అని బాస తీసుకోవడం మర్చిపోలేదు. “ఉక్రెయిన్ పరిస్థితి, తూర్పు దక్షిణ చైనా సముద్రాలు, ఉత్తర కొరియాలతో పాటు మనం అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నాం. నియమాలపై ఆధారపడిన, స్వేచ్చాయుత, బహిరంగ అంతర్జాతీయ అమరికకు మరింత ప్రాముఖ్యత వచ్చింది” అని కిషిడా, ఏప్రిల్ 29 తేదీన జకార్తాలో సమావేశం జరగక ముందు వ్యాఖ్యానించాడు.

Japan PM Fumio Kishida and Indonesia President Joko Widodo
ఇండోనేషియా ప్రధాని రష్యాను ఉద్దేశించి ఎలాంటి విమర్శా చేయలేదు. ఈ ఏడు G20 కూటమికి ఇండోనేషియా అధ్యక్షత వహిస్తుంది. G20 గ్రూపు సమావేశం నుండి రష్యాను బహిష్కరించాలని అమెరికా, పశ్చిమ దేశాలు ప్రతిపాదించగా దానిని ఇండోనేషియా పట్టించుకోలేదు. పైగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ను సమావేశానికి ఆహ్వానించానని చెప్పాడు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీని సైతం ఆహ్వానించాడు.
వియత్నాంకు అభివృద్ధి సాయం అందజేయడంలో జపాన్ దే పెద్ద చెయ్యి. FDI లలో మూడవ అతి పెద్ద పెట్టుబడిదారు. అయినప్పటికీ రష్యాను నేరుగా విమర్సించేందుకు వియత్నాం ముందుకు రాలేదు. ఆయుధాల కోసం వియత్నాం ప్రధానంగా రష్యా పైనే ఆధారపడి ఉంది. ఉక్రెయిన్ శరణార్ధులకు 5 లక్షల డాలర్ల సాయాన్ని ప్రకటించినప్పటికీ దానిని అన్తర్జాతీయ సంస్థల ద్వారానే అందజేసింది.
ఆస్ట్రేలియా
ఆగ్నేయాసియా, ఐరోపా దేశాల పర్యటనకు నాలుగు నెలల ముందే జపాన్ ప్రధాని ఆస్ట్రేలియా వెళ్లి ఆ దేశంతో రక్షణ ఒప్పందం చేసుకున్నాడు. జనవరి 6 తేదిన ఆస్ట్రేలియా వెళ్ళిన ఫుమియో కిషిడా బ్రిటన్ తరహాలో రెసిప్రోకల్ యాక్సెస్ అగ్రిమెంట్ (RAA) పై, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ తో కలిసి సంతకాలు చేశాడు. ‘జపాన్-ఆస్ట్రేలియా RAA’ గా పిలిచిన ఈ ఒప్పందం ద్వారా జపాన్ ‘ఆత్మరక్షణ బలగాలు’ ఆస్ట్రేలియన్ రక్షణ బలగాలు పరస్పరం సహకారం చేసుకునేందుకు అంగీకారం కుదిరింది.
ఒక దేశ బలగాలు సహకార కార్యకలాపాల నిమిత్తం భాగస్వామ్య దేశం వెళ్ళినప్పుడు పాటించ వలసిన నిర్దిష్ట నిబంధనలు, ప్రక్రియలను ఈ ఒప్పందం నిర్వచిస్తుంది. దానితో పాటు ద్వైపాక్షిక భద్రత మరియు రక్షణ సహకారానికి వీలు కల్పిస్తుంది. అలాగే ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, సుస్థిరతల స్థాపనకు ఇరు దేశాలు మరింతగా తోడ్పడుతుంది (జపాన్ విదేశి వ్యవహారాల వెబ్ సైట్ –mofa.go.jp, జనవరి 6, 2022).
దీని అర్ధం ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడును ఎదుర్కొనేందుకు ఇరు దేశాలు సైనికంగా సహకరించుకుంటాము అని చెప్పడం. అనగా జపాన్ ఆత్మరక్షణ బలగాలు ఇక ఎంతమాత్రం ఆత్మరక్షణకు మాత్రమే పరిమితమై ఉండబోవు. అవసరం అయితే చైనా లేదా ఇతర వైరి దేశాలను ఎదుర్కొనేందుకు తన సైన్యాన్ని ఆస్ట్రేలియా, బ్రిటన్, ఇటలీ లాంటి దేశాలకు పంపవచ్చు. కొన్నేళ్ళ క్రితం వరకు, ఆ మాటకు వస్తే కొన్ని నెలల క్రితం వరకు జపాన్ ఈ తరహా ఒప్పందం చేసుకుంటుందన్న సంగతి సాధారణ అవగాహనకు తట్టనిది. అయితే అమెరికా ప్రోత్సాహంతో, ఒత్తిడితో జపాన్ ఆ వైపు అడుగులు వేస్తున్న సంగతి మాత్రం నిజం. ఉక్రెయిన్ పై రష్యా దాడి, జపాన్ తన ముసుగును నిర్భయంగా తొలగించుకునేందుకు వీలు కల్పించింది.
ఆగ్నేయాసియా దేశాల పర్యటన అనంతరం బ్రిటన్ చేరక ముందు జపాన్ ప్రధాని ఇటలీ కూడా సందర్శించాడు. అయితే ఇటలీతో జపాన్ రక్షణ ఒప్పందాలు ఏమి కుదుర్చుకోలేదు. ఉమ్మడి ప్రకటనలతో సరిపెట్టాడు. “రష్యాకు వ్యతిరేకంగా గతంలో ఎన్నడూ ఎరగని రీతిలో కఠిన ఆంక్షలను జపాన్, ఇటలీ లు విధిస్తాయి. ఉక్రెయిన్ కు మా మద్దతును మరింత శక్తివంతం చేస్తాము” అని కిషిడా, ఇటలీ ప్రధాని మేరియో ద్రఘి తో కలిసి చేసిన ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాడు. రష్యా గ్యాస్ పై ఆధారపడ్డ యూరప్ దేశాలలో ఇటలీ ఒకటి. జర్మని తర్వాత గ్యాస్ కోసం రష్యాపై ప్రధానంగా ఆధారపడ్డ దేశం ఇతలీయే. బహుశా ఈ వాస్తవం ఇటలీ ని, జపాన్ తో ప్రకటనల కంటే ముందుకు వెళ్ళకుండా నిరోధించి ఉండవచ్చు. అయితే జపాన్ త్వరలో ఫ్రాన్స్ తో బ్రిటన్, ఆస్ట్రేలియా తరహాలో RAA ఒప్పందం కుడుర్చుకోవచ్చని తెలుస్తోంది.
నాటో కు అనుబంధం
జపాన్ వరస పెట్టి రక్షణ ఒప్పందాలు చేసుకుంటున్న నేపధ్యంలో మొదటి పరిశీలనలో ఆ దేశం సొంతగా వివిధ దేశాలతో రక్షణ ఒప్పందాలు చేసుకుంటున్నట్లు, తానే భద్రతా పరంగా ఒక కేంద్రంగా అవతరిస్తున్నట్లు కనిపిస్తుండ వచ్చు. అది కేవలం భ్రమా జనితం. అమెరికా నేతృత్వం లోని నాటో కూటమి మిలటరీ ఆధిపత్యానికి అనుబంధంగా లేదా కొనసాగింపుగా మాత్రమే జపాన్ ఈ రక్షణ ఒప్పందాలకు దిగుతోంది. జి7 కూటమిలో నాటో సభ్య దేశం కానిది జపాన్ ఒక్కటే. అయినప్పటికీ అది నాటో మిత్ర దేశంగా ఆసియాలో నాటో ప్రతినిధిగా వ్యవహరిస్తుంది అంటే అతిశయోక్తి కాదు.
బ్రిటన్, ఆస్ట్రేలియా, ధాయిలాండ్, ఇండోనేషియా తదితర దేశాల సందర్శనలో కిషిడా వాడిన భాష గానీ, ఒప్పంద పత్రాల్లో ఉపయోగించిన పదజాలం గానీ ఆ సంగతినే పట్టిస్తాయి. మొదట చెప్పుకున్నట్లుగా ఇండో-పసిఫిక్ ప్రాంతం అన్నది అమెరికా రక్షణ, ఆధిపత్య అవసరాల నేపధ్యంలో చైనా ఆర్ధిక శక్తిగా ఎదుగుతూ అమెరికాకు సవాల్ విసురుతున్న నేపధ్యంలో రూపుదిద్దుకున్న ప్రాంతం. ఈ పదబంధం రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఆసియా పై ఆధిపత్యం సాధించే వ్యూహంలో భాగంగా నాజీ హిట్లర్ ప్రభుత్వం ముందుకు తెచ్చినది. హిట్లర్ ఓటమితో అది కను మరుగయింది. ఇప్పుడు మళ్ళి చైనా పుణ్యాన అమెరికా మళ్లీ తెర మీదకు తెచ్చింది. అలాంటి అమెరికా ఆధిపత్య వ్యుహాన్నే జపాన్ తన RAA ఒప్పందాల్లో పరోక్షంగా పొందుపరుస్తోంది.
జపాన్ వల్లె వేస్తున్న మరి కొన్ని పదబంధాలు “నియమబద్ద ప్రపంచ భద్రతా అమరిక (rules based world order); అంతర్జాతీయ సమాజం (international community)…! సాధారణంగా ప్రపంచ స్థాయిలో నియమబద్ద అమరిక అంటే ఐక్య రాజ్య సమితి స్ఫురణకు రావాలి. కాని అమెరికా తన ఏక పక్ష విధానాలను ప్రపంచంపై రుద్దడం ద్వారా ఐరాసను ఎన్నడో నామ మాత్రం చేసింది. పేపర్ టైగర్ గా మార్చింది. రూల్స్ ఆధారిత ప్రపంచం అంటే ఐక్యరాజ్య సమితి నియమ నిబంధనలను అనుసరించవలసిన ప్రపంచం అని కాకుండా అమెరికా, పశ్చిమ దేశాల భద్రత మరియు వాణిజ్య అవసరాలను నెరవేర్చే నియమాలను అనుసరించే ప్రపంచంగా మార్చివేసింది.
అమెరికా, పశ్చిమ దేశాల నియమ నిబంధనలు కేవలం అమెరికా, ఐరోపాలతో పాటు జపాన్, ఆస్ట్రేలియా లాంటి దాని మిత్ర దేశాలకు మాత్రమే అనుకూలంగా ఉంటాయి. ఎక్కడ ఏ చమురు బైట పడినా లేదా యురేనియం, నికెల్, కొబాల్ద్ లాంటి అరుదైన ఖనిజ వనరులు బైటపడినా అవి అమెరికా దాని మిత్ర దేశాలకే చెందాలి. సదరు ఖనిజాలను తవ్వి తీసే కాంట్రాక్టులు అమెరికా, పశ్చిమ రాజ్యాల కపెనీలకే చెందాలి. ఏ దేశంలో ప్రభుత్వాలు ఏర్పడినా అవి అమెరికా అనుమతితోనే విధానాలు రూపొందించు కోవాలి. ముఖ్యంగా ఆర్ధిక, రక్షణ/భద్రత, విదేశీ విధానాలు అమెరికా కనుసన్నల్లో నడవాలి. ఆయుధాలు, టెక్నాలజీ వారి నుండే కొనుగోలు చేయాలి. శాస్త్ర సాంకేతిక రంగాల్లో సొంతగా పరిశోధన, అభివృద్ధి సౌకర్యాలు నిర్మించుకోవటం నిషిద్ధం. అలాంటిది కావాలంటే అమెరికా, ఐరోపాలనే అడగాలి. అడిగితే అవి సరఫరా చేస్తాయన్న గ్యారంటి అయితే ఉండదు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆ దేశానికి అవసరమా లేదా అన్నది అమెరికా, పశ్చిమ దేశాలే నిర్ణయించి, ఆ నిర్ణయాన్ని బట్టి దానిని ఇవ్వడమా మానడమా అన్నది ఆధారపడి ఉంటుంది.
సొంతగా ఆయుధ శక్తి పెంచుకో కూడదు. ఆయుధాలు కావాలంటే అమెరికా, ఐరోపా లనే అడగాలి. ముఖ్యంగా అణు పరిజ్ఞానం సంపాదించుకోకూడదు. ఒకవేళ అందుకు ప్రయత్నాలు చేస్తే ఇరాన్, ఉత్తర కొరియాలకు పట్టిన గతే పడుతుంది. అనేక సాకులు చూపి సవా లక్షా ఆర్ధిక, వాణిజ్య, దౌత్య, రవాణా షరతులు విధిస్తాయి. “అంతర్జాతీయ సమాజం” పేరుతొ అమానవీయమైన షరతులు, ఆంక్షలు విధించి ఆ దేశాన్ని సర్వ విధాలుగా భ్రష్టు పట్టిస్తాయి. ఇక ఓపలేక దేహి అని వారి ముందు చేయి చాపే వరకు వేధిస్తాయి. లక్షల కొద్ది పేదలు, స్త్రీలు, పిల్లలు ఆకలి, దరిద్రంతో మల మల మాడి చస్తున్నా సరే అవి కనికరించవు. వారి మాట కాదని సొంత కాళ్ళపై నిలబడితే దాడులు చేస్తాయి. మూకుమ్మడిగా ఐరాస అనుమతి లేకుండా సర్వ నియమాలు, ఒప్పందాలు కాదని సాయుధ దురాక్రమణకు తెగబడతాయి. ఇరాక్, సిరియా, ఆఫ్ఘనిస్థాన్ ల దీన గాధలు ఈ సంగతినే చెబుతాయి.
వెనిజులా, ఇరాన్ లు చమురు సంపన్న దేశాలు. తమ చమురు తమ ప్రజలకే అన్న విధానాన్ని అవి చేపట్టాయి. సొంత అభివృద్ధి పంధా అనుసరించాయి. ఫలితంగా ఆ దేశాలపై అమెరికా, దాని మిత్ర రాజ్యాలు విధించిన ఆంక్షలు అన్నీ, ఇన్నీ కావు. ఈ ఆంక్షల వల్ల వెనిజులా ఆర్ధిక వ్యవస్థ నాశనం అయింది. ద్రవ్యోల్బణం వేలు, లక్షలకు చేరింది. ఇరాన్ లో పసి పిల్లలు పాల డబ్బాలకు, రోగులు ఔషధాలకు కొరత ఎదుర్కొంటున్నారు. అణు పరీక్ష జరిపినందుకు ఇండియాను రెండు సార్లు అమెరికా ఆంక్షలు విధించి ఒంటరిని చేసింది. ఇండియా పరిశోధన & అభివృద్ధి రంగాలలో పెట్టుబడి పెట్టకుండా అమెరికా నిరోధిస్తుంది.
జపాన్ చెబుతున్న నియమబద్ద ప్రపంచ వ్యవస్థ, అన్తర్జాతీయ సమాజం ఇవే. అనగా అమెరికా నేతృత్వం లోని సామ్రాజ్యవాద ఆధిపత్య వ్యవస్థకు జపాన్ కొమ్ము కాస్తున్నది. అమెరికా ఆధిపత్యాన్ని సవాలు చేస్తున్న రష్యా, చైనాల పక్షానికి ఆసియా దేశాలు చేరకుండా ఉండటానికి ప్రయత్నాలు చేస్తున్నది. నాటో మిలటరీ కూటమికి అనుబంధంగా ఆసియాలో ద్వైపాక్షిక మిలటరీ ఒప్పందాలు చేసుకుంటూ సరికొత్త మిలటరీ కూటముల నెట్ వర్క్ ని నిర్మిస్తోంది. ఈ నెట్ వర్క్ అంతిమంగా నాటో కు అనుబంధంగా మాత్రమే పని చేస్తుంది. అనగా అమెరికా భద్రతా ఫ్రేం వర్క్ ను ఆసియాకు విస్తరింపజేసి మరింత శక్తివంతం చేస్తుంది. జపాన్ ఆత్మరక్షణ బలగాల అధిపతి (ఛీఫ్ ఆఫ్ జాయింట్ స్టాఫ్) జనరల్ కోజి యమజాకి వచ్చే గురువారం (మే 19) బ్రసెల్స్ లో జరగనున్న నాటో డిఫెన్స్ అధిపతుల సమావేశానికి హాజరు కానుండడం బట్టి జపాన్ ఎత్తులు అర్ధం చేసుకోవచ్చు. నాటో మిలటరీ అధిపతుల సమావేశానికి నాటో యేతర దేశం నుండి హాజరు కావటం ఇదే మొదటి సారి మరి.
అమెరికా ఆధిపత్యానికి ప్రత్యామ్నాయ కేంద్రాలు ఎదగకుండా ఉండేందుకు బహుళ ధృవ ప్రపంచం ఆవిష్కృతం కాకుండా నిరోధించేందుకు జపాన్ రక్షణ ఒప్పందాలు ఉద్దేశించ బడ్డాయి. ఈ ఒప్పందాలను ఆయా దేశాల ప్రజలు దృఢంగా తిరస్కరించాలి. నిజమైన స్వేచ్చాయుత, బహిరంగ ప్రపంచం అంటే ఏ ఒక్క సామ్రాజ్యవాద దేశానికి ఆధిపత్యం లేనప్పుడు మాత్రమే ఏర్పడుతుంది. ఒక మనిషిని మరొక మనిషి, ఒక జాతిని మరొక జాతి, ఒక దేశాన్ని మరొక దేశం దోచుకో లేని, ఆధిపత్యం వహించలేని, అణచివేయలేని ప్రపంచ వ్యవస్థ మాత్రమే ప్రజల వాస్తవ అవసరాలు తీర్చగలదు.
…………………….అయిపోయింది.