ఆత్మ రక్షణ విధానం వీడి మిలటరీ శక్తిగా మారుతున్న జపాన్!


Japanese troops

జపాన్ తన మిలటరీ విధానాన్ని మార్చుకుంటున్నది. రెండో ప్రపంచ యుద్ధంలో ఓటమి, అణు బాంబు విధ్వంసం దరిమిలా జపాన్, ‘కేవలం ఆత్మరక్షణకే మిలటరీ’ అన్న విధానంతో తనకు తాను పరిమితులు విధించుకుంది. ఇప్పుడు ఆ విధానానికి చరమగీతం పాడుతోంది. తన రక్షణ బడ్జెట్ ను రెట్టింపు చేయనున్నట్లు ప్రకటించింది. అదే జరిగితే జపాన్ మిలటరీ బడ్జెట్ ఇక నుండి ఏటా 100 బిలియన్ డాలర్లకు పైగా పెరగనుంది. జపాన్ అంతటితో ఆగటం లేదు. వివిధ దేశాలతో వరస పెట్టి రక్షణ ఒప్పందాలు చేసుకుంటోంది.

జపాన్ అనుసరిస్తున్న సరికొత్త రక్షణ విధానానికి అమెరికా ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. నిజానికి రక్షణ బడ్జెట్ లు పెంచాలని జపాన్, EU దేశాలను అమెరికా అనేక ఏళ్ళుగా సతాయిస్తున్నది.  అమెరికా నేతృత్వం లోని పశ్చిమ దేశాల కూటమి (జపాన్, ఆస్ట్రేలియా లు ఈ కూటమిలో సహజ సభ్యులు) భద్రతా అవసరాలను తానొక్కటే భరించడం వీలు కాదని, ఇతర మిత్ర దేశాలు కూడా రక్షణ/భద్రతా భారాన్ని భరించాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. కాని జర్మని, జపాన్ తదితర దేశాలు ఇంతకాలం ఉదాసీనంగా ఉంటూ వచ్చాయి. సాంకేతిక పరిశోధన, అభివృద్ధి ద్వారా ఉత్పాదక శక్తి పెంచుకోవడం పైనే దృష్టి కేంద్రీకరించాయి. ఆయుధ రంగంలో కూడా పరిశోధన, అభివృద్ధి జరిపినప్పటికీ, భారీగా ఆయుధాలను సమకూర్చుకోలేదు.

ఇప్పుడు ఉన్నట్లుండి యురోపియన్ యునియన్ నేత జర్మని, ఆసియాలో అమెరికా నమ్మకమైన మిత్రుడు జపాన్ ఇరు దేశాలు తమ రక్షణ బడ్జెట్ పెంచుతున్నట్లు ప్రకటించాయి. కాగా ఈ దేశాలు రక్షణ బడ్జెట్ పెంచితే లబ్ది పొందేది అమెరికాయే. ఎందుకంటే జర్మని, జపాన్ లు రక్షణ కొనుగోళ్ళు చేస్తే అమెరికా నుండే చేస్తాయి. బ్రిటన్, ఫ్రాన్స్ లు కూడా ఆయుధాల మార్కెట్ లో పోటీదారులు అయినప్పటికీ అమెరికా ఒత్తిడి రాజకీయాల వల్ల కొనుగోలు దేశాలు అమెరికా వైపే మొగ్గేట్లు చేస్తాయి.

ఉక్రెయిన్ యుద్ధం సాకు

రష్యా, తన పొరుగున ఉన్న ఉక్రెయిన్ పై దాడి చేసిన తర్వాతనే జపాన్, జర్మనీలు తమ రక్షణ బడ్జెట్ రెట్టింపు చేస్తున్నట్లు ప్రకటించాయి. రష్యా దాడి నేపధ్యంలో తమకు తమ రక్షణ గురించి బెంగ పట్టుకుందని అందుకే తమ రక్షణ విధానం మార్చుకున్నామని అవి ప్రకటించాయి. అయితే ఇలా ప్రకటించడంలో వాస్తవం ఎంతవరకు ఉన్నదో పరిశీలించ వలసి ఉన్నది.

2022 జనవరిలో జపాన్, ఆస్ట్రేలియాతో రక్షణ ఒప్పందం చేసుకుంది. మే 2 తేదీన ఆసియాన్ (ASEAN) కూటమి దేశం ధాయిలాండ్ తో రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. మే 6 తేదీన యునైటెడ్ కింగ్^డం తో కూడా రక్షణ ఒప్పందం కుదుర్చు కునేందుకు అంగీకరించి జపాన్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.

“స్వేచ్చాయుతమైన, బహిరంగ ఇండో పసిఫిక్ ప్రాంతాన్ని సాకారం చేయటంలో భాగంగా ఇరు దేశాలు రక్షణ సహకార ఒప్పందం చేసుకునేందుకు సూత్రప్రాయంగా అంగీకరిస్తున్నాము” అని బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా లండన్ లో మే 6 తేదీన ప్రకటించారు (క్యోడో న్యూస్, మే 6, 2022).  కొద్ది నెలల్లో సంతకాలు చేయబోయే ఒప్పందానికి “పరస్పర ప్రవేశ ఒప్పందం” (రెసిప్రోకల్ యాక్సెస్ అగ్రిమెంట్ -RAA) గా జపాన్, బ్రిటన్ లు పిలుస్తున్నాయి. ఈ ఒప్పందం అనంతరం ఇరు దేశాలు తమ తమ బలగాలను వేగంగా అవతలి దేశంలోకి పంపేందుకు వీలవుతుంది. అలాగే ఇరు సైన్యాలు ఉమ్మడి శిక్షణలో పాల్గొనేందుకు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో పునరావాస-రక్షణ చర్యలు చేపట్టేందుకు ఒప్పందం వీలు కల్పిస్తుంది.

ఇరు దేశాల నేతల భాష, పదజాలాన్ని గమనించాలి. “స్వేచ్చాయుతమైన, బహిరంగ ఇండో పసిఫిక్ ప్రాంతం” అన్నది అమెరికా నేతల నుండి తరచూ వినిపించే పదజాలం. ఇండో – పసిఫిక్  ప్రాంతం అన్నది అమెరికా భౌగోళిక రాజకీయ ఆధిపత్య వ్యూహంలో భాగంగా వాడుక లోకి తెచ్చిన అవగాహన. చైనాను నిలువరించే లక్ష్యంతో ఈ వ్యూహానికి అమెరికా రూప కల్పన చేసింది. ఈ భాషనే బ్రిటన్, జపాన్ దేశాల నేతలు చిలక పలుకుల వలే వల్లిస్తున్నారు.

అమెరికా (అధ్యక్షుడు బారక్ ఒబామా) ప్రకటించిన ఆసియా-పివోట్ వ్యూహంలో భాగంగా ముందుకు తెచ్చిన ఇండో-పసిఫిక్ ప్రాంతంలో తన మిలటరీ శక్తిని అమెరికా కేంద్రీకరిస్తున్న నేపధ్యంలో సదరు వ్యూహంలో భాగంగానే జపాన్ వరుసగా మిలటరీ ఒప్పందాలు చేసుకుంటున్నది అన్న సంగతి స్పష్టంగా అర్ధం అవుతోంది. ఇది దాదాపు 15 సంవత్సరాలుగా అమలులో ఉన్న వ్యూహం. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఈ ఒప్పందాలు త్వరిత గతిన పూర్తి చేసేందుకు పురి కొల్పి ఉండవచ్చు గానీ ఆ యుద్ధమే జపాన్ రక్షణ ఒప్పందాలకు కారణం అన్నది అర్ధ సత్యం మాత్రమే.

పైగా ఒప్పంద సమయంలో జపాన్, బ్రిటన్ ఇరు దేశాలు ప్రధానంగా చైనా ప్రమాదాన్నే గుర్తు చేసుకున్నాయి. తూర్పు మరియు దక్షిణ చైనా సముద్రాలలో యధాతధ స్థితిని చైనా ఏకపక్షంగా మార్చుతున్నదని, ఈ ప్రాంతంలో చైనా “అత్యంత వేగంగా, రహస్యంగా బలగాలు కేంద్రీకరిస్తూ మిలటరీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడని ఇరు దేశాలు ఆందోళన వ్యక్తం చేసాయి. అలాంటి ఏక పక్ష చర్యలను, బలవంతపు ఆర్ధిక ఒత్తిడులను నిశ్చయంగా దృఢంగా తిప్పి కొడతామని జాన్సన్, కిషిడా లు స్పష్టం చేశారు. ఈ “తిప్పి కొట్టడం” లో చైనా ప్రసక్తిని వాళ్ళు ఎత్తలేదు. తద్వారా చైనాతో పాటు రష్యా కూడా కలిసి వచ్చేలా జాగ్రత్త పడ్డారు.

“ఉక్రెయిన్ రేపటి తూర్పు ఆసియా కావచ్చు” అని జపాన్ ప్రధాని లండన్ లో వ్యాఖ్యానించడం గమనించ దగ్గ విషయం. జాన్సన్ తో సమావేశం ముగిశాక విలేఖరులతో మాట్లాడుతూ “రష్యా దూకుడు కేవలం ఐరోపాకు మాత్రమే సమస్య కాదు. ఇండో-పసిఫిక్ ప్రాంతం కూడా కలిసి ఉన్న అంతర్జాతీయ అమరిక ఇప్పుడు ప్రమాదంలో పడింది” అని కిషిడా ప్రకటించాడు. “ఈ నేపధ్యంలో ప్రధాని జాన్సన్ తో సూత్రప్రాయ అంగీకారానికి రావటం ముఖ్యమైన పరిణామం” అని ఆయన నొక్కి చెప్పాడు. ‘ఉక్రెయిన్ రేపటి తూర్పు ఆసియా’ అనడంలో రెండు అర్ధాలు దాగి ఉన్నాయి. ఒకటి: తూర్పు ఆసియాలో చైనా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నట్లే రేపు ఉక్రెయిన్ లో రష్యా వ్యవహరిస్తుంది, అని. రెండు: రష్యా ఉక్రెయిన్ పై దాడి చేసినట్లే చైనా, తైవాన్ పై దాడి చేస్తుంది, అని. మొత్తం మీద చైనా, రష్యా రెండింటిని జపాన్ ప్రధాని టార్గెట్ చేశాడు. రెండో ప్రపంచ యుద్ధం దరిమిలా రష్యా స్వాధీన చేసుకున్న కుర్లీ ద్వీపాలను తనకు తిరిగి అప్పగించాలని జపాన్ ఇటివలి కాలంలో గొంతు పెంచి డిమాండ్ చేస్తుండడం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి.

నిజానికి ఇరు దేశాల చర్చల్లో ఉక్రెయిన్ యుద్ధం ఒక ముఖ్య ఎజెండాగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ యుద్ధం ప్రభావంతో చైనా, తైవాన్ ను సాయుధ దాడితో ఆక్రమించుకునే ప్రమాదం ఉన్నదని జపాన్ అడపా దడపా ప్రకటిస్తూనే ఉన్నది. జి7 గ్రూపు దేశాలతో కలిసి రష్యాపై ఆంక్షలు కఠినంగా అమలు చేయడంలో అంతర్జాతీయ సమాజానికి ఇరు దేశాలు నాయకత్వం వహించాలని ఇరు ప్రధాన మంత్రులు అంగీకరించారట! తమ ప్రభావంలో ఉన్న దేశాలను నయాన భయాన ఒప్పించి రష్యా పై ఆంక్షలు అమలు చేసేలా ఒత్తిడి చేయటంలో ఈ దేశాలు ఇక నిమగ్నం అవుతాయన్న మాట!

ఇటివల మార్చి 19 న జపాన్ ప్రధాని ఇండియా వచ్చినపుడు “వచ్చే ఐదేళ్ళలో జపాన్ 5 ట్రిలియన్ యెన్ లు (42 బిలియన్ డాలర్లు లేదా రు. 3.2 లక్షల కోట్లు) పెట్టుబడులుగా సమకూర్చేందుకు లక్ష్యంగా పెట్టుకుందని ప్రధాని మోడీ ప్రకటించడం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవచ్చు.  2014 లో ఇండియా వచ్చిన అప్పటి జపాన్ ప్రధాని షింజో అబే ఐదేళ్ళలో 3.5 ట్రిలియన్ యెన్ ల పెట్టుబడి వాగ్దానం చేశాడు. ఈ నిధులతో గంగా ప్రక్షాళన, స్మార్ట్ సిటీల నిర్మాణం, నెక్స్ట్ జనరేషన్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ నిర్మాణం, స్కిల్ డెవలప్మెంట్, ఫుడ్ ప్రాసెసింగ్, అగ్రికల్చరల్ కోల్డ్ చైన్ వగైరా వగైరా పరిపూర్తి చేస్తామని అప్పట్లో మోడీ ప్రకటించాడు. అవేవి అతి గతి లేవు. ఇప్పుడు మరో 5 ట్రిలియన్ యెన్ లు ఇస్తారట!

బ్రిటన్ తో పాటు ఇటలీ, ఇండోనేషియా, ధాయిలాండ్, వియత్నాం దేశాలను జపాన్ ప్రధాని చుట్టి వెళ్ళాడు. ఉక్రెయిన్ సంక్షోభం దరిమిలా రష్యాపై ఆంక్షలను దృఢంగా అమలు చేయడంలో సహకరించాలని ఈ 5 దేశాలను కిషిడా కోరాడు. “స్వేచ్చాయుత మరియు బహిరంగ” ఇండో-పసిఫిక్ సాధించుకుందామని రెచ్చగొట్టాడు. ఈ ఐదింటిలోని 3 ఆసియా దేశాలు మాత్రం రష్యా పై ఆంక్షలకు సానుకూలగా స్పందించక పోవడం విశేషం. ఈ దేశాలకు ఆయుధాలు సరఫరా చేసేది రష్యాయే. కష్టాల్లో ఆదుకున్నది రష్యాయే. ఐరాస లో ఉక్రెయిన్ పై జరిగిన వివిధ ఓటింగు లలో ఈ దేశాలు తటస్థ వైఖరిని పాటించాయి తప్ప అమెరికా, పశ్చిమ దేశాల తీర్మానాలకు మద్దతు ఇవ్వలేదు.

జపాన్ మాత్రం త్రికరణ శుద్ధిగా ఆంక్షలు అమలు చేస్తున్నది. అమెరికా ఆంక్షలు, G7 దేశాల ఆంక్షలు, EU ఆంక్షలు అన్నింటిని అమలు చేస్తున్నది. రష్యాకు చెందిన వివిధ బ్యాంకుల ఆస్తులను స్తంభింప జేసింది. 140 మంది రష్యన్ ధనిక వ్యాపారుల ఆస్తులు స్తంభింప జేసింది. 70 రష్యన్ మిలటరీ సంస్థల ఎగుమతుల పై నిషేధం పెట్టింది. రష్యాకు ఆధునిక సాంకేతిక ఎగుమతులు ఆపేసింది. ఇంకా మరిన్ని ఆంక్షలు విధించబోతున్నట్లు ప్రకటించింది.

రక్షణ సహకారంలో జపాన్ తో విశాల ప్రాతిపదికన ఒప్పందానికి బ్రిటన్ సిద్ధపడిన నేపధ్యంలో బ్రిటన్ కూడా అమెరికా అనుసరిస్తున్న ఇండో-పసిఫిక్ వ్యూహంలో క్రియాశీలక పాత్ర పోషించేందుకు తయారవుతున్నట్లు స్పష్టం అవుతోంది. యుద్ధ పరికరాల మందు గుండు, ఇతర యుద్ధ సరఫరాల సేకరణ, పరస్పర మార్పిడి అంశాలలో కుడా బ్రిటన్, జపాన్ లు ఒప్పందానికి వచ్చినందున ఇరు దేశాల మధ్య భద్రతా సహకారం మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆసియా, పసిఫిక్ దేశాలు కుదుర్చుకున్న “ట్రాన్స్-పసిఫిక్ పార్టనర్ షిప్” (TPP) ఒప్పందం లోకి బ్రిటన్ ను జపాన్ ఆహ్వానించింది. తద్వారా ఆసియా-పసిఫిక్ వాణిజ్య రంగంలో మరోసారి కీలక పాత్ర పోషించేందుకు బ్రిటన్ ఏర్పాట్లు చేసుకుంటోంది.

……………. ఇంకా ఉంది

2 thoughts on “ఆత్మ రక్షణ విధానం వీడి మిలటరీ శక్తిగా మారుతున్న జపాన్!

  1. శాంతి కాముక దేశాలుగా పేరు తెచ్చుకొన్న ఫిన్లాండ్,స్వీడన్ లు రష్యాను బూచిగా చూపి నాటో లో చేరనున్నాయి! ఈ విధంగా అమెరికాకు అనుకూల రాజకీయ,ఆర్ధిక పరిస్థితులు ఏర్పడు తున్నాయని భావించవచ్చా?

  2. పరిమిత అర్ధంలో భావించవచ్చు. అయితే ఇది శాశ్వతం కాదు. యుద్ధంలో రష్యా గెలుపు అనంతర పరిస్థతి బట్టి నిర్దిష్టంగా ఏమిటి అన్నది తెలుస్తుంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s