రష్యాపై అమెరికా పగను ఇండియా పంచుకుంటుందా? -2


Russian pipeline routes to China

గత ఆర్టికల్ తరువాయి భాగం…..

చిరకాల స్నేహం

అనేక దశాబ్దాలుగా ఇండియా రష్యాపై ఆధారపడి ఉంది. ఆయుధాలు కావచ్చు. స్పేస్ టెక్నాలజీ కావచ్చు. మిసైల్ టెక్నాలజీ కావచ్చు. క్రయోజనిక్ టెక్నాలజీ కావచ్చు. చివరికి అణు విద్యుత్ ఉత్పత్తిలో కూడా ఇండియాకు రష్యా పూర్తి స్థాయి సహకారం అందిస్తూ వచ్చింది. ప్రపంచం అంతా అమెరికా నేతృత్వంలో ఇండియాను ఒంటరిని చేసి వెలివేసిన కాలంలో కూడా రష్యా ఇండియాతో స్నేహం, సహకారం, వాణిజ్యం మానలేదు.

కానీ ఇండియాకు చైనాతో తగాదా ఉంది. సరిహద్దు తగాదా విషయంలో చైనా చేతిలో ఓటమి చవి చూసిన చరిత్ర ఇండియాకు ఉన్నది. ఈ నేపధ్యంలో చైనాకు సంబంధించినంతవరకు భారత ప్రజల్లో నెగిటివ్ సెంటిమెంట్లు వ్యాపించి ఉన్నాయి.ఈ ప్రతికూల భావోద్వేగాలను మోడి ప్రభుత్వం మరింతగా రెచ్చగొట్టి పెట్టింది. ఈ బలహీనతను కూడా అమెరికా ఉక్రెయిన్ యుద్ధం సందర్భంగా రష్యా-ఇండియాల మధ్య వైరం పెంచి దూరం పెంచడానికి ఉపయోగిస్తోంది. రష్యాపై ఇండియా ఆధారపడి ఉన్న రంగాలలో తాను ఇండియాకు అండగా ఉంటానని చెబుతూ అందుకు చైనా బూచిని కూడా రంగం మీదికి తెస్తోంది.

“ఇండియా తన ఇంధనం (ఎనర్జీ) మరియు రక్షణ పరికరాల అవసరాలను తీర్చుకునేందుకు సాయం చేసేందుకు అమెరికా సిద్ధంగా ఉన్నది. అయితే దానికి ముందుగా ఇండియా రష్యాపై ఆధార పడటాన్ని తగ్గించాలి. ఇప్పుడు చేస్తున్నట్లుగా రష్యా చమురు కొనుగోలు చేయడాన్ని నిలిపివేయాలి. అమెరికా ఆంక్షలను ఉల్లంఘించడం మానుకోవాలి. ఇంధనం విషయంలో గానీ అంతర్జాతీయ ఆంక్షల పరిధిలోని మరే ఇతర సరుకుల విషయంలో గానీ రష్యా దిగుమతులు వేగంగా పెరగడాన్ని కట్టడి చేసుకోవాలి” అని కోరుతూ దలీప్ చైనా బూచిని చూపిస్తూ ఇలా అన్నాడు. 

“వాస్తవాధీన రేఖ (Line of Actual Control) వెంబడి మరిన్ని చొరబాట్లు జరిగితే గనక, చైనాకు జూనియర్ పార్టనర్ గా ఉన్న రష్యా ఇండియాకు సహాయం చేసేందుకు ముందుకు వస్తుందని అనుకోవద్దు” అని దలీప్ సింగ్ హెచ్చరించాడు. చైనా బూచిని చూపిస్తే ఇండియా తేలికగా దారికి వస్తుందని అమెరికా అంచనాగా కనిపిస్తోంది. అమెరికా ఈ అంచనాకు రావడానికి గాను దానికి అనుభవం ఉన్నదేమో మనకు తెలియదు. కానీ రష్యాకు మద్దతు ఇవ్వడానికి లేదా కనీసం తటస్థంగా ఉండేందుకు ఇండియాకు అనేక కారణాలు ఉన్నాయి.

ముందే చెప్పుకున్నట్లు రష్యా చౌకగా 20 శాతం సబ్సిడీ ధరతో అందిస్తున్న చమురు ప్రస్తుత పరిస్థితుల్లో ఇండియాకు చాలా అవసరం. దీనిని ‘యుద్ధాన్ని ఎకనమిక్ అడ్వాంటేజ్ గా తీసుకోవడంగా జర్మనీ, యూరోపియన్ యూనియన్ అభివర్ణిస్తున్నాయి. అసలు వాణిజ్యం అంటేనే ‘ఎకనమిక్ అడ్వాంటేజీ’ కోసం వెతుక్కోవడం. అంతర్జాతీయ వాణిజ్యంలో సానుకూల ధరల కోసం చూడటం సర్వ సాధారణం. అలా చేస్తేనే ఆయా దేశాల జాతీయ ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నట్లు. అలా కాకుండా ఏ అమెరికా పెత్తనానికో లేదా యూరోపియన్ యూనియన్ హెచ్చరికలకో భయపడి వాణిజ్య నష్టాలను చవి చూసేందుకు పాలకులు సిద్ధపడితే అది ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించడమే కాకుండా జాతీయ భద్రతకు బిన్నంగా వ్యవహరించడమే అవుతుంది. ఆర్ధిక భద్రత అనివార్యంగా భౌతిక భద్రతతో ముడిపడి ఉంటుంది గనక.

ఇండియా తన బ్రహ్మోస్ క్షిపణి గురించి తరచుగా చెప్పుకుంటుంది. ఇండియా ఆయుధ నిల్వల్లో ఇది కీలకమైనదిగా చెబుతారు. చెప్పడానికి స్వదేశీ తయారీ అని చెప్పినప్పటికి వాస్తవానికి రష్యా అందజేసిన టెక్నాలజీతో రష్యాతో కలిసి సంయుక్తంగా ఇండియా బ్రహ్మోస్ క్షిపణిని అభివృద్ధి చేసింది. రష్యా కంపెనీ NPO Mashinostroyeniya, ఇండియా కంపెనీ DRDO లు ఉమ్మడిగా ఈ క్షిపణిని అభివృద్ధి చేశాయి. అలాగే అత్యంత శక్తివంతమైన క్షిపణి రక్షణ వ్యవస్థ ఎస్-400 లను రష్యా, ఇండియాకు సరఫరా చేసింది. వచ్చే నాలుగేళ్లలో మరో 5 ఎస్-400 లను రష్యా సరఫరా చేస్తుంది. (చైనా కూడా ఎస్-400 లను లడక్, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులలో మోహరించినట్లు వినికిడి).

An advanced version of the BrahMos cruise missile

మరే ఇతర దేశం ఇవ్వనంత స్థాయిలో రష్యా ఇండియాకు తన ఆయుధాలు, టెక్నాలజీలను సరఫరా చేసింది. ఆ సరఫరా కూడా సరసమైన ధరలకు చేసింది. అమెరికా అయితే ఇదే స్థాయి ఆయుధాలు గానీ, టెక్నాలజీ గాని ఇవ్వడానికి సవాలక్ష షరతులు విధిస్తుంది. ఎఫ్-16 విమానాల కోసం ఇండియా ఎంత దేబిరించినా అమెరికా ఇవ్వలేదు. అణు ఒప్పందం జరిగిన తర్వాత కూడా అణు రియాక్టర్లు ఇవ్వటానికి అమెరికా సిద్ధపడలేదు. టెక్నాలజీ సరఫరా అయితే అమెరికా చేయనే చేయదు.

ఒక అంచనా ప్రకారం 2016-2020 మధ్య రష్యా ఆయుధ ఎగుమతుల్లో 23 శాతం ఇండియాకే జరిగాయి. ఇండియా వైపు నుండి చూస్తే తన ఆయుధ కొనుగోళ్లలో 49 శాతం రష్యా నుండే పొందింది. ఆయుధ కొనుగోలు అన్నది ఒక్క కొనుగోలు తోనే పూర్తయ్యేది కాదు. కొనుగోలు తర్వాత సర్వీసింగ్ కాంట్రాక్టు సదరు ఆయుధాల జీవిత కాలం పాటు కొనసాగుతుంది. అనగా రెండు దేశాల మధ్య పరస్పర నమ్మకంతో కూడిన స్నేహ సంబంధాలు కొనసాగితేనే ఆయుధాల కొనుగోలు సఫలం/విజయవంతం అవుతుంది. సంబంధాలు చెడినట్లయితే ఆయుధ పరికరాలు దాదాపు వృధా అయినట్లు భావించవచ్చు, సొంతగా సదరు పరిజ్ఞానాన్ని ఆవాహన చేసుకుంటే తప్ప. ఎంత ఆవాహన చేసుకునే సదరు టెక్నాలజీలో మునుముందు జరిగే అభివృద్ధిని మార్పిడి చేసుకునే కాంట్రాక్ట్ కొనసాగాలంటే సుదీర్ఘ కాలం పాటు సంబంధాలు నెలకొల్పుకోక తప్పదు.

1953 నుండీ రష్యా ఆయుధాలపై ఇండియా ఆధాపడుతూ వచ్చింది. ఇండియా ప్రధాన యుద్ధ ట్యాంకులు రష్యా తయారీవే. టి-90 ట్యాంకులు 464, టెక్నాలజీతో సహా, కొనుగోలు చేసేందుకు గత సంవత్సరమే ఇండియా ఒప్పందం చేసుకుంది. ఇండియాకు ఒకే ఒక్క విమాన వాహక నౌక ఉండగా అది కూడా రష్యా సరఫరా చేసిందే. ఈ నౌక పైన ఉండే ఫైటర్ జెట్ విమానాలు 43 ఉండగా అవన్నీ రష్యా తయారీ అయిన MiG-29K లే. ఇండియాకు 10 మిసైల్ క్యారియర్ లు ఉండగా అందులో 4 రష్యా సరఫరా చేసినవి. 17 ఫ్రిగేట్ (వార్ షిప్) లలో 6 రష్యా ఇచ్చినవి. మరో 4 కొత్త ఫ్రిగేట్ల సరఫరాకు ఇరు దేశాలు ఒప్పందం చేసుకున్నాయి. 2023 లోపు ఇవి అందాలి. అణు సబ్ మెరైన్ లు రెండూ రష్యా నుండి లీజుకు తీసుకున్నవి. మూడో సబ్ మెరైన్ త్వరలో లీజుకు తీసుకోనున్నారు.

ఇండియా వాయు బలగంలో ప్రధానమైనవి Su-30, MiG-21, మిగ్-29 విమానాలు. ఇటీవల మాత్రమే ఫ్రాన్స్ నుండి రాఫెల్ యుద్ధ విమానాలను ఇండియా కొనుగోలు చేసింది. అమెరికా కంపెనీ లాక్ హీడ్ నుండి ఎఫ్-21 విమానాల కొనుగోలుకు ఇండియా ప్రయత్నిస్తున్నా అది కొలిక్కి రావటం లేదు. ఇండియా వద్ద ఉన్న ఆరు ఎయిర్ ట్యాంకర్లూ (మంటలను ఆర్పేందుకు గ్యాస్, నీళ్ళు మోసుకెళ్ళేవి) రష్యా సరఫరా చేసినవే. వీటన్నింటితో పాటు రష్యా ఇండియాకు బ్రిక్స్ కూటమిలో భాగస్వామి.

చైనా మెలిక

చైనా నుండి ఎదురయ్యే సవాలుకు రష్యా అడ్డుగోడగా నిలబడుతుందని భారత పాలకులు భావిస్తున్నారని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ అంచనాతోనే అమెరికా డెప్యూటీ ఎన్‌ఎస్‌ఏ దలీప్ సింగ్, చైనా నుండి చొరబాట్లు ఎదురయితే రష్యా ఆదుకోదని హెచ్చరిస్తున్నాడు. నిజానికి అమెరికా, ఈ‌యూ లు విధిస్తున్న ఆంక్షలే ఇండియా-చైనాల మధ్య వైరంలో చైనాకు అనుకూలంగా మారుతోందని భారత పాలకులు భావిస్తున్నట్లు సూచనలు వస్తున్నాయి.

ఎలాగంటే పశ్చిమ దేశాల ఆంక్షల రష్యాను మరింతగా చైనాపై ఆధారపడేట్లు నెడుతున్నాయి. ఉదాహరణకి ఐరోపా (ఈ‌యూ) గ్యాస్ కోసం రష్యాపై ఆధారపడడం తగ్గించుకోవాలని నిర్ణయించినట్లు చెబుతోంది. నార్డ్ స్ట్రీమ్ -2 కు అనుమతి ఇచ్చే ప్రక్రియను నిలిపినట్లు జర్మనీ కూడా ప్రకటించింది. ఐరోపా మార్కెట్ బదులు ఇప్పుడు చైనా మార్కెట్ పై ప్రధానంగా ఆధారపడే పరిస్థితి రష్యాకు ఏర్పడింది. ఈ మేరకు రష్యా, చైనాల మధ్య తూర్పు తీరంలో సఖాలిన్ ద్వీపం నుండి మరో పైప్ లైన్ నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ‘పవర్ ఆఫ్ సైబీరియా’ పేరుతో ఇప్పటికే ఒక పైప్ లైన్ ద్వారా గ్యాస్ సరఫరా అవుతోంది. దీని వార్షిక సామర్ధ్యం 38 బిలియన్ క్యూబిక్ మీటర్లు (bcm). కాగా సఖాలిన్ పైప్ లైన్ సామర్ధ్యం 10 బి‌సి‌ఎంలు. ఇది కాకుండా ‘పవర్ ఆఫ్ సైబీరియా 2’ పేరుతో మంగోలియా మీదుగా చైనాకు 50 బి‌సి‌ఎం ల సామర్ధ్యంతో పైప్ లైన్ నిర్మాణానికి పూనుకుంటున్నట్లు రష్యన్ కంపెనీ గాజ్ ప్రోమ్ మార్చి 1 తేదీన ప్రకటించింది.

చైనా ఇప్పటి వరకు గ్యాస్ కోసం అమెరికా, ఆస్ట్రేలియాలపై ఆధారపడింది. చైనా గ్యాస్ అవసరాల్లో 40% అమెరికా తీర్చగా 10 శాతం ఆస్ట్రేలియా తీర్చింది. చైనా లక్ష్యంగా చేసుకుని ఏర్పడిన మిలట్రీ కూటమి క్వాడ్ లో ఈ రెండూ సభ్య దేశాలే. కనుక అమెరికా, ఆస్ట్రేలియాపై ఆధారపడడం తగ్గించుకోవడం చైనాకు కూడా అవసరమే. గ్లోబల్ టైమ్స్ పత్రిక ప్రకారం చైనా, రష్యాలు మరో 4 పైప్ లైన్లు నిర్మించాలని నిర్ణయించాయి. చైనాలోని జిన్ జియాంగ్ ప్రాంతం గుండా వెళ్ళే అల్టాయ్ లింగ్ పైప్ లిన్ ఇందులో ఒకటి.

2021 లో రష్యా, ఐరోపా దేశాలకు మొత్తం 155 బిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ సరఫరా చేసింది. చైనా కు వెళ్ళే ఇతర పైప్ లైన్ నిర్మాణాలు కూడా పూర్తయితే సంవత్సరానికి 100 బి‌సి‌ఎం లకు పైన చైనాకు రష్యా సరఫరా చేసినట్లు అవుతుంది. కనుక ఐరోపాలో కోల్పోయిన మార్కెట్ లో మూడింట రెండు వంతులు చైనా ద్వారా రష్యా పూడ్చుకోవచ్చు. పైగా రష్యా గ్యాస్ తో పూర్తిగా తెగతెంపులు చేసుకునేందుకు, ఇప్పటికైతే, ఐరోపా సిద్ధంగా లేదు. కనుక ఐరోపాలో కోల్పోయినంత మేరకు చైనా కు సరఫరా చేయడం ద్వారా రష్యా తన మార్కెట్ నష్టాన్ని పూడ్చుకోవచ్చు. ఈ విధంగా రష్యాను పశ్చిమ రాజ్యాలు ఎంతగా దూరం నెట్టి బలహీనపరచాలని భావిస్తే రష్యా అంతగా చైనాకు దగ్గర అయ్యే అవకాశాలు పెరుగుతాయి.

ఇండియాకు సంబంధించినంత వరకు భౌగోళిక రాజకీయాల రీత్యా ఇది సానుకూలం కాదు. రష్యా, చైనా పైన ఆధారపడడం పెరిగితే ఇండియాలో చైనా జరిపే చొరబాట్లకు అభ్యంతరం చెప్పగల పరిస్థితి రష్యాకు తగ్గిపోతుంది. అనగా చైనాతో వైరంలో ఇండియాకు రష్యా నుండి సహకారం అందే అవకాశం తగ్గిపోతుంది. ఈ బలహీనతనే అమెరికా, పశ్చిమ దేశాలు గురిగా పెట్టుకున్నాయి.

పరాధీన పెట్టుబడి

అయితే ఇండియాకు సంబంధించినంతవరకు భౌగోళిక రాజకీయాల్లో రష్యా, చైనాలు వ్యవహరించి నంత  స్వతంత్రంగా వ్యవరించగల సత్తా భారత పాలకులకు లేదు. అంబానీ, ఆదాని, టాటా, ప్రేమ్ జీ, నారాయణ మూర్తి.. ఇలా ఎంతమంది వ్యాపార సామ్రాజ్యాలు ఉదాహరణగా తీసుకున్నా అవన్నీ వాల్ స్ట్రీట్, ద సిటీ (లండన్) లాంటి సామ్రాజ్యవాద ఫైనాన్స్ పెట్టుబడి పై ఆధారపడిన కంపెనీలే. ఈ కంపెనీలు తమ లాభాలను తిరిగి స్వతంత్ర పెట్టుబడిగా వినియోగించుకుని స్వతంత్ర లాభాలు సంపాదించుకోవటానికి వినియోగించుకునే శక్తిని కలిగి లేవు. అంతర్జాతీయ మార్కెట్ లలోని అనేకానేక అంతర్గత మాయా చిక్కు ముడులతో కూడిన అంతఃసంబంధ లింకుల ద్వారా విస్తరించి ఉండే నెట్ వర్క్ లలో భారతీయ కంపెనీలది చాలా చిన్న మరియు ఆధారిత పాత్ర. అనగా పైకి భారతీయ పెట్టుబడిగా కనిపించేది వాస్తవంగా భారతీయతను కలిగి ఉండదు. అంతిమ పరిశీలనలో అది సామ్రాజ్యవాద ఫైనాన్స్ పెట్టుబడి ప్రయోజనాలకు లోబడి ఉంటుంది తప్ప స్వంతగా దేశం కోసం ఒక్క అడుగు కూడా ముందుకు వేయగల శక్తి సామర్ధ్యాలు ఉండవు.

ఇంకా స్పష్టంగా చెప్పాలంటే భారత బడా పెట్టుబడిదారుల పెట్టుబడి ప్రయోజనం వాల్ స్ట్రీట్, లండన్ పెట్టుబడి ప్రయోజనాలకు లోబడి ఉంటుంది. వాల్ స్ట్రీట్ పెట్టుబడి ఎటువైపు వేలు చూపిస్తే అటు వైపు వెళ్లిపోవాలి. రుణాల రూపంలో భారతీయ కంపెనీలను నియంత్రించే శక్తిని సామ్రాజ్యవాద పెట్టుబడి తన చేతిలోనే ఉంచుకుంటుంది. వాణిజ్య రీత్యా విలీనం, స్వాధీనం ప్రక్రియలలో గానీ, వాణిజ్య విస్తరణలో గానీ ఈ కంపెనీలు వాల్ స్ట్రీట్ కంపెనీలని లేదా లండన్ కంపెనీలనే అడగాలి తప్ప స్వంత పెట్టుబడి అందుబాటులో ఉండడం చాలా తక్కువ. ఒక వేళ ఉన్నా వాల్ స్ట్రీట్, లండన్ పెట్టుబడుల ప్రయోజనాలకు విరుద్ధంగా లేదా పోటీగా తన పెట్టుబడిని అవి వినియోగించలేవు. వినియోగించాలని ప్రయత్నిస్తే తెల్లవారే లోపు వారిని అడగదొక్కి మార్కెట్ లో చిరునామా లేకుండా చేయగల సత్తా సామ్రాజ్యవాద ఫైనాన్స్ పెట్టుబడికి ముఖ్యంగా వాల్ స్ట్రీట్, లండన్ ఫైనాన్స్ పెట్టుబడికి ఉంటుంది.

ఈ పరిస్థితే భౌగోళిక రాజకీయాల్లో, అంతర్జాతీయ దౌత్య సంబంధాల్లో కూడా ప్రతిఫలిస్తుంది. ఐరాస, భద్రతా సమితి లాంటి అంతర్జాతీయ రాజకీయ సంస్థల్లో అనివార్యంగా అమెరికా, రష్యా, బ్రిటన్  రాజ్యాలను అనుసరించాల్సిన పరిస్థితే ఉంటుంది. అలా కాకుండా రాజకీయ నిర్ణయాల్లో స్వతంత్రంగా, నీతిగా కనీసం స్వప్రయోజనాల కోసం పని చేసినట్లయితే దాని ప్రభావం వెంటనే ఆర్ధిక, వాణిజ్య సంబంధాలపై ప్రతీకార చర్యల రూపంలో పడుతుంది. ఎంతో ఆయుధ శక్తి ఉండి, ఒకప్పుడు అగ్రరాజ్యంగా వెలుగొందిన రష్యాని కూడా అణగదొక్కడానికి అమెరికా ఎన్ని కుట్రలు పన్నుతున్నదో మనం చూస్తున్నాం. అలాంటిది ఇండియా లాంటి బలహీన దేశాలు స్వతంత్రంగా వ్యవరించడానికి అమెరికా అవకాశం ఇవ్వదు.

అయితే ఇండియా లాంటి వర్ధమాన ఆర్ధిక వ్యవస్థల (ఎమర్జింగ్ ఎకానమీ) పాలకులకు ఎంతో కొంత శక్తి సామర్ధ్యాలు వచ్చి చేరే సందర్భాలు కొన్ని ఉంటాయి. రెండు లేదా అంతకు ఎక్కువ సంఖ్యలో బలమైన రాజ్యాలు పోటా పోటీగా కొట్లాడుకుంటున్న పరిస్థితులు ఏర్పడినప్పుడు సదరు పెద్ద రాజ్యాలు తమ బలం పెంచుకోవటానికి ప్రయత్నిస్తాయి. సాధ్యమైనన్ని ఎక్కువ దేశాలను తమ వైపు కూడగట్టేందుకు ప్రయత్నాలు చేస్తాయి. ఇండియా లాంటి ప్రాంతీయ శక్తులను తమ వైపు లాక్కోవటానికి పోటీ పడతాయి. అగ్రరాజ్యాల మధ్య జరిగే ఈ పోటీలో ఇండియా లాంటి పాలకులకు సహజంగానే తాత్కాలికంగా నిర్ణయ శక్తి పెరుగుతుంది. సాధ్యమైనత ఎక్కువ వాటా గుంజుకునేందుకు వాళ్ళు పెద్ద రాజ్యాలతో బేరసారాలు సాగిస్తారు.

ఈ బేరసారాల శక్తిని చూసి కొందరు స్వతంత్రతగా, అగ్ర రాజ్యాలను లొంగ దీసే శక్తిగా పొరబడుతుంటారు. ఈ బేరసారాల ద్వారా దళారీ స్వభావం కలిగిన భారత బడా పెట్టుబడిదారులకు నిర్దిష్ట మార్కెట్ లో మరింత వాటా పొందేందుకు పాలకులు బేరాలు సాగిస్తారు. లేదా ప్రాంతీయ వైరం ఉన్న దేశాలతో పై చేయి సాధించేందుకు ప్రయత్నాలు చేయవచ్చు. తద్వారా దేశం లోపల తమ రాజకీయ పలుకుబడి పెంచుకునే ప్రయత్నం చేయవచ్చు. లేదా ఫలానా అంతర్జాతీయ కాంట్రాక్టులో స్థానం సంపాదించేందుకు ప్రయత్నించవచ్చు. ఇవన్నీ అప్పటికి ఉనికిలో ఉన్న ఆర్ధిక, భౌగోళిక-రాజకీయ, దౌత్య పరిస్ధితులపై ఆధారపడి ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

రష్యా పై చేయి

ఇప్పటి వరకు భారత పాలకులకు రష్యా నుండి అందినంత సహకారం అమెరికా శిబిరం నుండి అందలేదు. అమెరికా శిబిరానికి గతంలో ఉన్నంత ఆర్ధిక శక్తి ప్రస్తుతం లేదు. డాలర్ ఆధిపత్యమే లేనట్లయితే అమెరికాని నిలబెట్టి గుంజీళ్ళు తీయించే శక్తి రష్యా-చైనాలకు ఇప్పటికే ఉన్నది. కానీ ఆ డాలర్ ఆధిపత్యానికి కూడా తూట్లు పొడిచే రీతిలో రష్యాపై ఆంక్షలను పశ్చిమ దేశాలు అమలు చేస్తున్నాయి. ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్ ఓటమి తధ్యం. అది ఈ రోజా రేపా అన్నదే సమస్య తప్ప రష్యా గెలుపులో అనుమానం లేదు. యుద్ధాన్ని సాధ్యమైనంత దీర్ఘకాలం సాగేలా చేస్తే రష్యా యుద్ధంలో గెలిచినా ఆర్ధికంగా బాగా బలహీనపడుతుంది. ‘ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్’ అన్న పరిస్థితి వస్తుందని అమెరికా ఆశిస్తోంది.

కానీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటోంది. మరియుపోల్, కీవ్ లాంటి చోట్ల రష్యాకు గట్టి ప్రతిఘటన ఎదురవుతున్నప్పటికి దానిని ఎదుర్కొనే అనుభవం సిరియా (కొంత వరకు లిబియా, ఆఫ్రికా దేశాల) ద్వారా దానికి ఉన్నది. మరియుపోల్ లో కొద్ది భాగం మాత్రమే ఉక్రెయిన్ (అజోవ్) బలగాల చేతుల్లో ఉన్నది. కీవ్ ను చుట్టుముట్టదమే తప్ప ఆక్రమణ కోసం రష్యా ప్రయత్నించడం లేదు.  రష్యా షరతులను దాదాపుగా అంగీకరిస్తూ ఇస్తాంబుల్ చర్చల్లో ఉక్రెయిన్ పత్రాలు సమర్పించింది. ఒప్పందం పూర్తయ్యే లోపు యుద్ధరంగంలో సాధ్యమైనత పై చేయి సాధించేందుకు ఇరు పక్షాలు ప్రయత్నాలు చేస్తాయి కాబట్టి కాల్పుల మోత మరింత గట్టిగా వినిపిస్తుంది. అది శాంతి ఒప్పందానికి విఘాతంగా భావించనవసరం లేదు. హిట్లర్ సైన్యంపై రెడ్ ఆర్మీ విజయం సాధించిన “విక్టరీ డే” అయిన మే 9 లోపు యుద్ధాన్ని ఓ కొలిక్కి తేవాలని పుతిన్ ఆదేశించినట్లు పత్రికలు చెబుతున్నాయి.

ఈ నేపధ్యంలో ఇప్పటి వరకు చూస్తే యుద్ధంలో రష్యా పై చేయి సాధించింది. ఈ పై చేయి ఉక్రెయిన్ పైన అనుకుంటే పొరపాటు. ఉక్రెయిన్ ని ముందు నిలబెట్టి అమెరికా, నాటో లు రష్యాతో యుద్ధం చేస్తున్నాయి. అంటే టెక్నికల్ గా ఇది ఉక్రెయిన్ పై రష్యాపై దాడి అయినప్పటికి ఆచరణలో రష్యా, నాటో ల మధ్య ఆధిపత్యం కోసం జరుగుతున్న యుద్ధం. ఖచ్చితంగా చెప్పాలంటే రష్యాను సర్వ విధాలుగా భ్రష్టు పట్టించి లొంగ దీసుకోవడం కోసం నాటో చేస్తున్న యుద్ధం. ఈ యుద్ధాన్ని అమెరికా రష్యాలో పుతిన్ అధికారం చేపట్టి స్వతంత్ర పంధా అనుసరిస్తున్నప్పటి నుండే మొదలు పెట్టింది. నాటో విస్తరణ ద్వారా ప్రారంభించి 2014లో ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని కూల్చడం ద్వారా కీలక దశకు చేర్చి జెలెన్ స్కీ దూకుడు విధానాల ద్వారా ప్రత్యక్ష యుద్ధానికి రష్యా దిగేవరకు నాటో ప్రతి దశలో తెరవెనుక ప్రధాన పాత్ర నిర్వహిస్తు వచ్చింది.

భారత పాలకులకు ప్రస్తుత పరిస్ధితిలో అమెరికా కంటే రష్యా శిబిరమే లాభసాటిగా కనిపిస్తోంది. ట్రంప్ హయాంలో అందిన ఆదరణ బైడెన్ హయాంలో మోడీ ప్రభుత్వానికి అందడం లేదు. తన క్లయింటు దేశాల పాలకుల జుట్టు తన చేతుల్లో ఉంచుకోవడం అమెరికా ఒక ఎత్తుగడగా అమలు చేస్తుంది. మోడి పాలనలో ముస్లింలపై అణచివేతను, మత వివక్షను వివిధ నివేదికల్లో ఎత్తి చూపిస్తూ ‘నీ జుట్టు నా చేతుల్లో ఉంది సుమా’ అని అమెరికా తరచూ గుర్తు చేస్తూనే ఉంది. ఇది బైడెన్ హయాంలో ఎక్కువయింది. ఈ వైఖరి మోడీకి దేశంలో సమస్యలు తెచ్చి పెడుతోంది. రష్యా నుండి మోడీకి ఈ సమస్యలు ఏవి లేవు. ఈ పరిస్ధితుల్లో ఓ వైపు అమెరికాకు దూరం కాకుండానే రష్యా శిబిరం నుండి సాధ్యమైనంత లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా మోడి ప్రభుత్వ చర్యలు సూచిస్తున్నాయి. మోడి అనుసరిస్తున్న మితవాద ఆర్ధిక విధానాలు రెండు శిబిరాలకూ ఆకర్షణీయమే కనుక అందులో సమస్య లేదు. భారత దళారీ పాలకులు ఉక్రెయిన్ యుద్ధం ద్వారా వచ్చిన అవకాశాలను పూర్తిగా సద్వినియోగపరుచుకుంటున్నారు.

కొద్ది రోజుల క్రితం ఇండియా వచ్చిన జపాన్ ప్రధాని ఇండియాలో వచ్చే పదేళ్ళలో 42 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడతానని హామీ ఇచ్చి వెళ్ళాడు. రష్యా ఆంక్షలకు సహకరిస్తే ఆయుధ, ఆర్ధిక, పెట్టుబడి సహకారం అందిస్తానని అమెరికా హామీ ఇచ్చింది. జర్మనీ, బ్రిటన్ లు నాలుగు గోడల మధ్య ఏయే హామీలు ఇచ్చారో ఇంకా వెల్లడి కాలేదు. ఈ పరిస్ధితుల్లో ఇరు శిబిరాల మధ్య సమతూకం పాటించటమే లాభసాటిగా భారత పాలకులు భావిస్తున్నారు. ట్రంప్ హయాంలో పూర్తిగా అమెరికా వైపు మొగ్గినప్పటికీ రష్యా స్నేహంతో ఇండియాకు సమస్య రాలేదు. ట్రంప్ కూడా రష్యాను శత్రువుగా భావించలేదు గనక బైడెన్ హయాంలో రష్యాతో వైరం తీవ్రం చేయడంతో సమతూకాన్ని భారత పాలకులు పాటిస్తున్నారు. యుద్ధం ముగిసినా రష్యాతో వైరాన్ని అమెరికా కొనసాగించి తీరుతుంది. కానీ యుద్ధం ముగిసే పరిస్థితిని, స్వభావాన్ని బట్టి భారత పాలకుల వైఖరి మరింత స్పష్టం అవుతుంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s