
Slaughter of Red Indians on North American soil
మానవ జాతి నాగరికత మరియు అభివృద్ధి, పరస్పర సహకారం మరియు సౌభ్రాతృత్వం, సమస్త మానవుల ప్రజాస్వామ్యం-సమానత్వం ఇవి మానవ సమాజం సాధించిన మహోన్నత విలువలు. ఈ విలువలతో పోల్చితే అమెరికా, పశ్చిమ దేశాలు తాము ఎంత అనాగరిక పాశవిక దశలో ఉన్నామో స్పష్టంగా తమ నోటి తోనే ప్రకటించుకుంటున్నాయి. ఉక్రెయిన్ కేంద్రంగా రష్యా, నాటో దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం వారికి ఆ అవకాశం ఇచ్చింది.
రష్యాపై విధించిన ఆంక్షలకు మద్దతు ఇవ్వకుండా తటస్థ వైఖరిని పాటిస్తున్న భారత పాలకులను “ఉంటే మాతో ఉండు లేదా మా శత్రువుతో ఉన్నట్లే’ అని హెచ్చరించడానికి వచ్చిన అమెరికా డెప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ దలీప్ సింగ్ కూసిన కూతలు అమెరికా, పశ్చిమ దేశాల జంతు మనస్తత్వాన్ని, విలువల రాహిత్యాన్ని పట్టిచ్చాయి.
“మేము చేస్తున్నది ఏమిటంటే రష్యాను దశాబ్దాల వెనక్కి నెట్టివెయ్యడం. సాంకేతిక పరిజ్ఞానపరమైన అధునాతనత్వం రీత్యా వారు యూఎస్‌ఎస్‌ఆర్ కాలం నాటికి వాళ్ళని నెట్టివేస్తున్నామని భావిస్తున్నాం. తద్వారా ప్రపంచ వేదిక పైన ప్రభావాన్ని, శక్తిని చూపించగల సామర్ధ్యాన్ని పుతిన్ ఇక ఎంత మాత్రం ప్రదర్శించలేనంత దశకు తగ్గించేస్తున్నాం” అని దలీప్ సింగ్ భారత విలేఖరులతో మాట్లాడుతూ అన్నాడు.
రష్యాన్ని దశాబ్దాల వెనక్కి నెట్టే లక్ష్యంలో భాగంగా అమెరికా, ఈయూ దేశాలు ఆ దేశంపై పంచ ముఖ దాడిని చేపట్టాయి. అనగా 5 చానెళ్లలో లేదా మార్గాలలో లేదా కోణాలలో రష్యాను ముట్టడించి నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్నాయి.
అమెరికా, ఈయూ లు ప్రకటించిన ఐదు ఛానెళ్ల దాడి ఎలా ఉంటుందో దలీప్ సింగ్ ఇలా వివరించాడు.
-
రష్యా లోని అతి పెద్ద బ్యాంకులకు, ఆ దేశ సెంట్రల్ బ్యాంకుకు “ఫైనాన్షియల్ షాక్’ ఇవ్వటం
-
రష్యాకు సాంకేతిక పరిజ్ఞానం బదిలీ చేయకుండా కత్తిరించడం.
-
‘అంత్యంత ప్రాధాన్యతా దేశం’ (మోస్ట్ ఫేవర్డ్ నేషన్) హోదాను రద్దు చేయడంతో సహా అంతర్జాతీయ ప్రపంచ వ్యవస్థ నుండి బహిష్కరించడం
-
ఐఎంఎఫ్ మరియు ప్రపంచ బ్యాంకుల నుండి అప్పులు ముట్టకుండా నిరోధించి, పుతిన్ ప్రభుత్వానికి సన్నిహితులైన వ్యక్తిగత సంపన్నులపై ఆంక్షలు విధించడం
-
రష్యా స్థాయిని అతి పెద్ద ఇంధన సరఫరాదారు స్థాయి నుండి కిందకు తోసివేయటం
ఈ పంచ సూత్రాల ముట్టడి వ్యూహానికి రూపకర్త దలీప్ సింగే కావటమూ, ఆయన భారత దేశంలో పుట్టి నానా జాతుల సమూహాలకు నిలయం అయిన అమెరికాకి వలస వెళ్ళి తెల్లజాతి పెత్తందారీ దోపిడి ముఠాలకు సగర్వంగా రాజకీయ సేవలు చేస్తూ తరిస్తున్న వ్యక్తి కావటమూ… పైగా ఇక్కడికి వచ్చి అమెరికా చెప్పింది చేస్తావా, చస్తావా అని వార్నింగ్ లు ఇవ్వటమూను….!?
దలీప్ సింగ్ దృష్టిలో లేదా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న అమెరికా దృష్టిలో రష్యా అంటే పుతిన్ మాత్రమే కనిపిస్తున్నాడు. తమ ముందు సాష్టాంగ నమస్కారంతో సాగిలపడ్డ బోరిస్ యెల్టిసిన్ స్థానంలో తాత్కాలిక అధ్యక్షుడుగా పదవి చేపట్టి, ఆనక ఏకు మేకైనట్లుగా అధ్యక్ష స్థానంలో స్థిరపడి పోయి, రష్యాను తమకు చమురు, సహజవాయువు సరఫరా చేసి పెట్టే పెరటి దొడ్డిగా మార్చుకోవాలను కున్న అమెరికా సామ్రాజ్యవాద ప్రభువులు కన్న కలలను వెక్కిరిస్తూ తమ దేశాన్ని స్వతంత్ర పంధాలో నడిపించడమే కాకుండా తమకే చెమటలు పట్టించే ఆయుధ పరిజ్ఞాన పాటవంతో భద్రతా రంగంలో సవాలు విసురుతున్న వ్లాదిమిర్ వ్లాదిమిరోవిచ్ పుతిన్ అంటే అమెరికాకు ఎంత వణుకో దలీప్ సింగ్ మాటలు మరోసారి వివరించి చెప్పాయి.
కానీ రష్యా అంటే పుతిన్ మాత్రమే కాదు. సోవియట్ రష్యా కూలిపోయిన దరిమిలా అమెరికా, పశ్చిమ దేశాల ఉక్కు పరిష్వంగంలో చిక్కుకుని మాఫియా మూకల నేర సామ్రాజ్యంగా మారిన రష్యన్ సమాజాన్ని సాపేక్షికంగానైనా ఒక దారికి తెచ్చిన రష్యన్ నేత వ్లాదిమిర్ పుతిన్. దాదాపు 15 కోట్ల మంది రష్యన్ ప్రజల ఆరాధ్యుడు పుతిన్. రెండు శతాబ్దాల పాటు అధ్యక్షుడుగా, ప్రధాన మంత్రిగా, తిరిగి మళ్ళీ అధ్యక్షుడుగా ఎన్నుకుని రష్యన్ ప్రజలు తమ నెత్తిన పెట్టుకున్న నేత పుతిన్. పచ్చి నియంత అనీ, మూర్ఖుడనీ, రక్త పిశాచి అనీ ఎన్ని రకాలుగా తిట్టిపోసినప్పటికీ, వ్లాదిమిర్ పుతిన్ రష్యా రాజ్యానికి పాలకుడు. సో-కాల్డ్ ప్రజాస్వామ్యంగా పశ్చిమ దేశాలే స్టాంపు గుద్ది ప్రకటించే ఎన్నికల్లో పదే పదే నెగ్గుతున్న నేత.
వ్లాదిమిర్ పుతిన్ పులుగడిగిన ముత్యం ఏమీ కాదు. ఆయన బైడెన్, షోల్జ్, మేకరాన్, జాన్సన్… ఇత్యాది నేతల వలెనే ఒక బూర్జువా నేత. రష్యన్ సమాజాన్ని గుప్పిట పెట్టుకున్న రష్యన్ సంపన్న వర్గాలకు రాజకీయ నాయకుడు. వెరసి రష్యన్ సమాజానికి బూర్జువా నియంతృత్వ పాలకుడు. అవును, నియంతృత్వ పాలకుడే! కానీ, ఎవరు కాదు?
బోరిస్ జాన్సన్ కూడా తెగబలిసిన బ్రిటిష్ సామ్రాజ్యవాద ఫైనాన్షియల్, మాన్యుఫాక్చరింగ్ పాలకవర్గాల ప్రయోజనాలు నెరవేర్చే బ్రిటిష్ బూర్జువా నియంతృత్వ ముఠాకు నాయకుడు కాదా?
ప్రపంచాన్ని దశాబ్దాలుగా పట్టి పీడిస్తున్న అమెరికన్ వాల్ స్ట్రీట్ కంపెనీల నేతల ముఠాలకు నాయకత్వం వహిస్తూ 8 బిలియన్ల ప్రపంచ జనాభా నెత్తిన ఎక్కి తొక్కుతున్న దోపిడి దొంగల ముఠాకు జో బైడెన్ నాయకుడు కాదా?
అలాగే ఒక మేకరాన్, ఒక ఒలాఫ్ షోల్జ్, ఒక మెరియో ద్రాఘి…. అందరూ ఆయా సామ్రాజ్యవాద దోపిడి దొంగల ముఠాలకు నాయకులే.
నిజంగా న్యాయం పక్షం వహించే న్యాయ స్థానం ఏదైనా ఉంటే, అందులో పక్షపాతం లేకుండా విచారణ జరిగి శిక్షలు పడితే రెండు దశాబ్దాల క్రితం మాత్రమే పదవి చేపట్టిన పుతిన్ కంటే ముందు అమెరికా, పశ్చిమ దేశాల నియంతృత్వ ముఠా నేతలు మొదట యావజ్జీవ శిక్షో, జీవిత కాలపు జైలు శిక్షో లేదా ఉరికంబం ఎక్కడమో ఏది సరైనదో ఆ శిక్షను అనుభవించాల్సి ఉంటుంది.
15 కోట్ల మంది నివసించే ఒక దేశాన్ని దశాబ్దాల వెనక్కి నెట్టడం అంటే ఏమిటో దలీప్ సింగ్ కి గానీ, ఆయన్ని పంపిన అమెరికా నేతలకు గానీ, ఇతర ఐరోపా నేతలకు గానీ తెలియదని అనుకోలేము.
ప్రపంచంలో అన్ని జాతుల సమూహాలతో పాటు ఎదుగుతూ వచ్చిన సాటి ప్రజా సమూహానికి చెందిన సమస్త ఆర్ధిక, సామాజిక జీవన వనరులను దిగ్బంధం కావించి ఇతర ప్రపంచంతో సంబంధాలను తెంచి వేసి అతి పెద్ద ఓపెన్ ఎయిర్ జైలు గా రష్యాను మార్చుతామని వారు ప్రకటిస్తున్నారు.
అనగా అమీబా మొదలు కొని హోమో సెపియన్ వరకు అనేక జీవ దశలను దాటి మానవ రూపం దాల్చిన దరిమిలా వేల యేళ్ళ తరబడిన అభివృద్ధి పరిణామ క్రమంలో అనేక సామాజిక దశలను దాటుకుని శాస్త్ర, సాంకేతిక ఆవిష్కరణలతో జీవనాన్ని సుసంపన్నం కావించుకోవడమే కాకుండా మానవ సంబంధాలను సైతం అత్యున్నత ప్రజాస్వామిక స్థాయికి చేర్చిన నాగరికతను ఒక్క పెట్టున పెటేల్మని నాశనం చేయడమే కాదా?
మనలో నుండి ఒక 15 కోట్ల మందిని వేరు చేసి సదరు నాగరికత నుండి తొక్కిపారేస్తామని శపధం చేయడం ద్వారా ఆ నాగరికతకు చేరే అర్హత తమకు లేనే లేదని దలీప్ సింగ్ ఆయన వెనక ఉన్న దగుల్బాజీ ముఠా చాటుకుంటోంది!
నిజానికి వీరికిది కొత్త కాదు. ఏ అభివృద్ధి పరిణామక్రమం ఫలితంగా అమెరికా ఖండాన్ని కనుగొన్నారో అదే అభివృద్ధికి పుట్టిన దోపిడీ కేన్సర్ అవయవాలతో, కేన్సర్ మెదడు కణాలతో తమ నాగరికతను కుళ్ళ బెట్టుకుని రెడ్ ఇండియన్లను సామూహికంగా వధించి రక్తపుటేరులు పారించి వారి సమాధులపై ఆకాశహర్మ్యాలతో భూతల స్వర్గాన్ని నిర్మించామని చాటే తెల్ల జాతి నడమంత్రపు సిరిగాళ్ల నుండి ఇంతకు మించిన నాగరికతను ఆశించడం వృధా ప్రయాస కాగలదు.
అత్యంత ప్రాచీనమైన మెసపుటోమియా నుండి ప్రాచీన ఈజిప్టు, సింధు లోయలోని మొహంజదారో-హరప్పా, మాయా, చైనీయ, ప్రాచీన గ్రీసు, పర్షియన్, రోమన్, ఆజ్టేక్, ఇన్కాన్ నాగరికతల వరకు ఏ ఒక్క నాగరికతలోనైనా వీరు పాలు పంచుకున్నా వారికి నాగరికతా విలువల్లో మనిషి ప్రాముఖ్యత ఏమిటో, మానవ జీవితానికి ఉన్న విలువ ఏమిటో తెలిసి ఉండేది. అదే తెలిసి ఉంటే ఒక దేశం దేశాన్నే దశాబ్దాల పాటు వెనక్కి నెట్టేస్తామన్న వెర్రి కూతలు కూయరు.
సరుకుల మార్పిడితో సమకూరే పెట్టుబడి కుప్పల కోసం పడవల్లో బయల్దేరి వచ్చి సమస్త నాగరికతలను వ్యాపార లాభాల సముపార్జనా యజ్ఞంలో శలభాలకు మాడ్చి నుసి చేసిన అనాగరికులకు నాగరికతా పాఠాలు నేర్వబూనడం కూడా వృధా ప్రయాసే కాగలదు. దానికి బదులుగా వారికి తెలిసిన నర హంతక ముఠా భాషలోనే సమాధానం చెప్పాల్నా?
పుతిన్ నాయకత్వం లోని రష్యా చేస్తున్నది ఆదేనా? కానీ అదేదో ఉక్రెయిన్ నేలకు బదులుగా వారి సొంత నేలపైనే చేయగలిగితేనా…..!
Daleep Singh was born in the USA. His great grandfather was Indian.
Yes. I read his gr grand father/uncle also served in senate or house. His family had history of supporting Indian independence movement. And this fellow is threatening India to lose independence. 😒
During Indian Independence Movement, many Sikhs conspirated against the King George’s government and some of them fled away to Canada. Scions of those Sikh conspirators still live in North America.