ఇండియా-రష్యా వాణిజ్యంపై అమెరికా సినికల్ దాడి!


During SCO summit on June 9 2017

అమెరికాతో స్నేహం చేయడం అంటే మన గొయ్యి మనం తవ్వుకోవడం అని మరోసారి రుజువు అవుతోంది. ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధం సందర్భంగా అమెరికా తన వక్ర బుద్ధిని, ఆధిపత్య అహంభావాన్ని, సిగ్గులేనితనాన్ని, మానవత్వ రాహిత్యాన్ని పచ్చిగా, నగ్నంగా, నిర్లజ్జగా ప్రదర్శిస్తోంది.

ఆరు నూరైనా అమెరికా మాట వినాల్సిందే. మనకు ఎంత నష్టం అయినా దాని మాట విని తీరాల్సిందే. ద్రవోల్బణం పెరిగి, నిత్యవసరాల ధరలు పెరిగి భారత ప్రజలు అల్లాడుతున్నా సరే అమెరికా షరతులు అమలు చేసి తీరాల్సిందే. భారత ప్రయోజనాలను తీవ్ర స్థాయిలో నష్టపరుచుకునయినా సరే అమెరికా చెప్పినట్లు విని మన వాణిజ్య ప్రయోజనాలను గాలికి వదిలేయాల్సిందే.

ప్రస్తుతం ఇండియాలో ఉన్న అమెరికా డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ (ఇంటర్నేషనల్ ఎకనమిక్స్ విభాగం) దలీప్ సింగ్ (అవును మన ఇండియా నుండి వెళ్ళి అమెరికాకి సేవ చేసి తరిస్తున్న వ్యక్తి) భారత ప్రభుత్వానికి జారీ చేస్తున్న బెదిరింపులు ఈ విషయాన్ని మరోసారి తేటతెల్లం చేస్తున్నాయి.

రష్యాపై అమెరికా, ఈ‌యూలు విధించిన అమానవీయ ఆంక్షలను అమలు చేయటానికి ఇండియా ముందుకు రాకపోవటంతో అమెరికా, ఐరోపా దేశాల నేతలు వరస పెట్టి ఇండియాకి వస్తున్నారు. కొందరు ఇండియాని బుజ్జగిస్తున్నారు. ఇంకొందరు బెదిరిస్తున్నారు. మరికొందరు ఇతర ప్రయోజనాలను ఆశ చూపిస్తున్నారు. మొత్తం మీద చిరకాలంగా ఇండియా స్నేహ సంబంధాలు నెరుపుతున్న రష్యాతో కయ్యం పెట్టుకోవాలని, సంబంధాలు తెంచుకోవాలని, మన కాలిలో మనమే షూట్ చేసుకోవాలని బలవంతపెడుతున్నారు.

జర్మనీ, జపాన్, ఇంగ్లండ్, అమెరికా… ఇలా అనేక పశ్చిమ దేశాల నుండి ముఖ్య నాయకులు, మంత్రులు, అధికారులు, కొండొకచో ప్రధాన మంత్రి సైతం ఇండియా వచ్చి బుజ్జగింపులు, బెదిరింపులు, ఆశ చూపడాలు చేస్తున్నారు. వీళ్ళంతా వచ్చి వెళ్ళాక ఇండియా ఎక్కడ తన వైఖరి మార్చుకుంటుందో అన్న బెంగతో రష్యా విదేశీ మంత్రి సెర్గి లావరోవ్ కూడా వచ్చేశాడు. ప్రస్తుతం ఆయన ఇండియాలోనే ఉన్నాడు.

పశ్చిమ దేశాల ఒత్తిళ్లకు తల ఒగ్గితే గనక ఇండియా తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుంది. అమెరికా, బ్రిటన్ తదితర పశ్చిమ దేశాలు పచ్చి స్వార్ధపర దేశాలు, ఇండియాను శతాబ్దాల పాటు వలస దేశంగా మార్చుకుని సర్వస్వం దోచుకుని దేశం తన మానాన తాను అభివృద్ధి కాకుండా అడ్డం పడి అనేక శతాబ్దాలు వెనక్కి నెట్టేసిన ఈ తెల్లజాతి తోడేళ్లు చెప్పే ప్రతి మాటా సొంత లాభం కోసం చెప్పేవే. అవి ఇచ్చే ప్రతి హామీ అడ్డంగా ఉల్లంఘించడానికే. ఉక్రెయిన్ ని సాకుగా చూపిస్తూ రష్యాని సర్వ విధాలా భ్రష్టు పట్టించడానికి కంకణం కట్టుకున్న దేశాలు ఇండియా మేలు కోరే సమస్యే లేదు.

ఓ పక్క స్నేహం అంటూనే మన వాణిజ్య ప్రయోజనాలకు గండి కొట్టే చర్యలు తీసుకోవాలని అమెరికా తరపున వచ్చిన దలీప్ సింగ్ డిమాండ్ చేస్తున్నాడు. తాము చెప్పే చర్యలు అమలు చేయకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని బెదిరిస్తున్నాడు కూడాను. “నేను మన స్నేహ సంబంధాల స్ఫూర్తితో ఇక్కడికి వచ్చాను” అంటూనే “మేము ప్రకటించిన ఆంక్షల మెకానిజంను వివరించడానికి, మాతో కలిసి పని చేయాల్సిన ప్రాముఖ్యతను మరియు మన ఉమ్మడి విలువలను గుర్తు చేయటానికి వచ్చాను” అని దలీప్ సింగ్ వాకృచ్చాడు.

అంతటితో ఆగకుండా బెదిరింపుల్లోకి దిగాడు. “అవును. మేము విధించిన ఆంక్షలను ఉల్లంఘిస్తూ, ఆంక్షలకు దొరక్కుండా వీలుగా మరో మార్గం వెతికే దేశాలు తగిన పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుంది” అని హెచ్చరించాడు. ఓ పక్క భారత అధికారులతో, మంత్రులతో సమావేశాలు జరుపుతూనే సమావేశాల మధ్యలో విలేఖరులతో మాట్లాడుతూ ఈ హెచ్చరికలు జారీ చేశాడు.

“అన్ని దేశాలు, ముఖ్యంగా మా మిత్ర దేశాలు, భాగస్వాములు (రష్యన్) రూబుల్ లాభపడే విధంగా ఎలాంటి మెకానిజం లను సృష్టించకూడదన్న విషయంలో మేము చాలా పట్టింపుగా ఉన్నాము. డాలర్ ఆధారిత ద్రవ్య వ్యవస్థ (ఫైనాన్షియల్ సిస్టం) ను బలహీనపరిచేందుకు ప్రయత్నాలు చేసే వాటి పట్ల మేము దృష్టిని కేంద్రీకరించాము” అని దలీప్ సింగ్, ఇండియాను నేరుగానే హెచ్చరించాడు. రష్యా పైన అమెరికా ప్రకటించిన ఆంక్షలకు రూప కల్పన చేసింది దలీప్ సింగే కావడం గమనార్హం. ఇండియాను ఒప్పించడానికి మాజీ ఇండియన్ నే పంపించడం అమెరికా కుటిల నీతిలో ఒక భాగం. ఆయన బదులు తెల్ల తోలు అధికారిని పంపితే అమెరికా వ్యతిరేక సెంటిమెంటు భారత ప్రజల్లో తలఎత్తవచ్చన్న ముందు చూపుతో అమెరికా తన ప్రతినిధిని ఎంపిక చేసుకుంది.

వలస పాలనా యుగంలో బ్రిటిష్ ఆక్రమణలో ఉన్నప్పుడు భారత ఆందోళన కారులపై లాఠీ చార్చి చేసిన బ్రిటిష్ ప్రభుత్వ పోలీసుల్లో అత్యధికులు వేతన బానిసలైన భారతీయులే. ఇప్పుడు సామ్రాజ్యవాద యుగంలో భారత ప్రయోజనాలను కాలదన్నుకుని అమెరికా, ఐరోపా దేశాల ప్రయోజనాలను గెలిపించడానికి ఇండియా నుండి వలస వెళ్ళి తెల్ల దేశాల పౌరసత్వం పుచ్చుకున్న మేధో బానిసలను ఉపయోగించుకోవడం కాకతాళీయం ఎంతమాత్రం కాదు. వలస పాలన ఫలితంగా సంక్రమించిన అభివృద్ధి లేమి ఫలితంగా భారతీయ వారసత్వం వలస దాస్యం నుండి సామ్రాజ్యవాద దాస్యానికి మారిందే తప్ప స్వతంత్రత సాధించలేదనడానికి ఇంతకంటే తార్కాణం అవసరం లేదు.

రూబుల్ – రూపాయి స్వాపింగ్ ద్వారా చమురు తో పాటు ఇతర సరుకుల వాణిజ్యం కూడా చేయాలని ఇండియా, రష్యాలు నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఉక్రెయిన్ యుద్ధం, అమెరికా-ఈ‌యూలు రష్యాపై విధించిన ఆంక్షల నేపధ్యంలో తన వాస్తవ ధరలో 20 శాతం తగ్గించి చమురు అమ్మడానికి రష్యా ముందుకు వచ్చింది. ఇండియా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంది. యుద్ధం ప్రారంభం అయిన ఫిబ్రవరి 24 తేదీ నుండి ఇప్పటివరకు ఇండియా 13 మిలియన్ బ్యారెళ్ళు రష్యన్ చమురు కొనుగోలు చేసింది. నెల రోజుల వ్యవధిలో ఇంత మొత్తం చమురు రష్యా నుండి కొనుగోలు చేయడం ఇండియాకు ఇదే ప్రధమం. గత సంవత్సరం మొత్తం మీద ఇండియా కొనుగోలు చేసిన రష్యన్ చమురు కేవలం 16 మిలియన్ బ్యారెళ్ళు మాత్రమే.

ఇండియాలో ప్రస్తుతం చమురు ధరలు, గ్యాస్ సిలిండర్ ధరలు మామూలు స్థాయిలో లేవు. కొండెక్కినా అందనంత స్థాయిలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశంలో విహరిస్తున్నాయి. ఎన్నికల వల్ల రెండు నెలలు పైగా ధరలు పెంచకుండా ఉగ్గబట్టిన మోడి ప్రభుత్వం ఎన్నికలు ముగిశాక పాత బాకీని ముక్కు పిండి వసూలు చేస్తోంది. ప్రతి రోజూ ధరలు పెంచుతోంది. ఈ పరిస్థితిలో రష్యన్ చమురు 20 శాతం తక్కువ ధరకు అందుబాటులో ఉండడం అటు మోడి ప్రభుత్వానికే కాకుండా ఇటు భారత ప్రజలకు కూడా కాస్త ఉపశమనం కలిగిస్తుంది.

అలాంటి కాస్త ఉపశమనాన్ని కూడా లాగేసుకోవాలని అమెరికా ప్రయత్నించడం అత్యంత పాశవిక, తీవ్రవాద చర్య. ఇది సామ్రాజ్యవాద తీవ్రవాదం. నగర కూడళ్లలో బాంబులు పేల్చితే కొన్ని డజన్ల మంది చనిపోతారు. కానీ అమెరికా విధించే ఆంక్షల వల్ల దేశాలకు దేశాలే సర్వనాశనం అవుతున్నాయి. రష్యాపై ఆంక్షలను అమలు చేయాలని ఇండియాను ఒత్తిడి చేయడం ద్వారా దేశం లోని కోట్లాది భూమి లేని పేదలు, దినసరి కూలీలు ఆకలితో, అర్ధాకలితో మాడిపోయే పరిస్థితి మరింత తీవ్రం అవుతుంది. కనుకనే అమెరికా అందరికంటే అతి పెట్ట తీవ్రవాద దేశం అనడంలో ఎలాంటి సందేహము లేదు.

2003లో ఇరాక్ పై దురాక్రమణ యుద్ధం చేయక ముందు 10 సంవత్సరాల పాటు ఆ దేశం పై అమెరికా విధించిన అమానుష ఆంక్షల వల్ల అక్కడ పాల డబ్బాలు కూడా దొరక్క 5 లక్షల మంది పసి పిల్లలు చనిపోయారు. ఈ విషయాన్ని ఎత్తిచూపినప్పుడు అప్పటి అమెరికా విదేశీ మంత్రి మేడలిన్ ఆల్ బ్రైట్ (కొద్ది రోజుల క్రితం చనిపోయింది) “అందుకు తగిన ప్రయోజనం దక్కింది” (It was worth it) అని వ్యాఖ్యానించింది. తద్వారా అమెరికా హృదయ రాహిత్యాన్ని, మానవతా రాహిత్యాన్ని, పచ్చి స్వార్ధపరత్వాన్ని, శవాలపై వ్యాపారం చేసే రాబందు మనస్తత్వాన్ని డప్పు కొట్టి మరీ చాటింది.

అసలు ఇరాక్, ఆఫ్ఘనిస్థాన్, లిబియా, సిరియా, సోమాలియా, యెమెన్ మొ.న దేశాలపై ఎలాంటి కారణం లేకుండా ఆ దేశాల దరిదాపుల్లో కూడా లేని అమెరికా దురాక్రమణ దాడులు చేసి, లక్షల మందిని చంపేసిన అమెరికాపై ఆంక్షలు ఎవరు అమలు చేస్తారు? రష్యా కంటే అనేక వందల రెట్లు ఆంక్షలు విధించడానికి అమెరికా ఎప్పుడో అర్హత సాధించింది.

ఈ వారమే రష్యా సెంట్రల్ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ రష్యా అధికారులు భారత రిజర్వ్ బ్యాంకు అధికారులతో కలిసి చర్చలు జరిపారు. రష్యాపై ఆంక్షలు విధించిన నేపధ్యంలో భారత వాణిజ్య ప్రయోజనాలకు భంగం కలగకుండా విధంగా చెల్లింపుల మార్గాన్ని నెలకొల్పేందుకు వీరు కృషి చేశారు. అమెరికా, ఈ‌యూ లు ప్రకటించిన అంతర్జాతీయ ఆంక్షల పరిధిలో లేని బ్యాంకుల ద్వారా చెల్లింపులు జరిపే మార్గం గురించి చర్చించారు. ఈ విషయాన్ని భారత విదేశీ మంత్రి ఎస్ జైశంకర్ స్వయంగా పార్లమెంటులో చెప్పారు. భారత ఆర్ధిక మంత్రిత్వ శాఖ నేతృత్వంలో ప్రత్యేకంగా వివిధ మంత్రిత్వ శాఖల ప్రతినిధులతో గ్రూపుని ఏర్పరిచ్చామని రష్యాతో ఎగుమతులు, దిగుమతుల విషయంలో ఆంక్షల వల్ల తలెత్తిన సమస్యలను పరిష్కరించే కర్తవ్యాన్ని ఈ గ్రూపుకి అప్పగించామని ఆయన చెప్పాడు.

ఈ మేరకు ఇరు దేశాల ఎగుమతులు, దిగుమతుల చెల్లింపుల కోసం ప్రత్యామ్న్యాయ మార్గాన్ని సిద్ధం చేసినట్లుగా స్పుత్నిక్ న్యూస్ ప్రకటించింది. ఇండియాలో ఉన్న రష్యా రూబుల్ నిల్వలను రూపాయిలు గా మార్చడానికి అలాగే రష్యాలోని ఇండియన్ రూపాయి నిల్వలను రూబుళ్లుగా మార్చడానికి నిర్ణయం జరిగినట్లు ఈ వార్త తెలియజేసింది. తద్వారా ఇండియా రూపాయిల లోనూ, రష్యా రూబుళ్ల లోనూ చెల్లింపులు చేసేందుకు అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది. ఈ ఏర్పాటు ఒక్క చమురు వాణిజ్యం మాత్రమే కాకుండా ఇతర సరుకుల వాణిజ్యంలోను వర్తింపజేసే ఏర్పాటు చేసుకున్నారు. ఈ ప్రత్యామ్నాయ ఏర్పాటునే అమెరికా ప్రతినిధి దలీప్ సింగ్ ఎత్తి చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది. అమెరికా ఆంక్షలను ఉల్లంఘించే ప్రత్యామ్నాయ మార్గాలను సహించేది లేదని ఆయన ఇండియా వచ్చి మరీ హెచ్చరిస్తున్నాడు. అమెరికా హెచ్చరికలకు ఇండియా నుండి ఇంతవరకు సమాధానం వచ్చినట్లు కనిపించడం లేదు.

ప్రస్తుతం ప్రపంచంలోని మిసైల్ వ్యతిరేక రక్షణ వ్యవస్థలలో కెల్లా అత్యంత ఆధునికమైనది, గురి తప్పనిది రష్యాకు చెందిన ఎస్-400 మిసైల్ రక్షణ వ్యవస్థ. మన దేశంపై శత్రు దేశాలు మిసైళ్లతో దాడి చేసినప్పుడు ఎస్-400 రక్షణ వ్యవస్థ తన రాడార్లతో పసిగట్టి అవి భూమిని చేరకుండా గాలిలోనే అడ్డుకుని నాశనం చేస్తుంది. అమెరికా వద్ద కూడా ఈ తరహా పటిష్ట రక్షణ వ్యవస్థ లేదని ఆయుధ నిపుణులు ఏకగ్రీవంగా అంగీకరించే మాట. అలాంటి రక్షణ వ్యవస్థలను ఇండియా కొనుగోలు చేసింది. చైనా నుండి రక్షణ కోసం వాటిని ఉపయోగిస్తోంది. వాటిలో కొన్నింటిని చైనా సరిహద్దుల్లో మోహరించినట్లు కూడా పత్రికలు వార్తలు ప్రచురించాయి. ఎస్-400 వ్యవస్థల కొనుగోలు కోసం ఇండియా రూపాయి-రూబుల్ స్వాపింగ్ మార్గం ద్వారానే కొనుగోలు చేసింది.

ఈ మార్గం ఇండియా లాంటి దేశాలకు అంతో సురక్షితం మరియు లాభదాయకం. డాలర్లలో చెల్లింపులు చేయాలంటే ఇండియా వద్ద ఉన్న విదేశీ మారకద్రవ్య నిల్వలను ఖర్చు చేయాల్సి ఉంటుంది. కనుక ప్రత్యామ్నాయ చెల్లింపుల మార్గం వల్ల భారత విదేశీ మారక ద్రవ్యం వెచ్చించకుండానే పని జరిగిపోతుంది. ఓ వైపు అమెరికాకు సవాలు విసురుతున్న ఎస్-400 వ్యవస్థలను కొనుగోలు చేయడమే కాకుండా సదరు కొనుగోలులో డాలర్ల ను కాకుండా రూపాయి-రూబుల్ స్వాపింగ్ మార్గాన్ని ఎంచుకోవడం అమెరికాకు పుండు మీద కారం రాసినట్లయింది. ఎవరి పుండుకి కారం అయినా భారత ప్రయోజనాలను త్యాగం చేసి అమెరికా స్వార్ధ ప్రయోజనాలు నెరవేర్చాల్సిన అవసరం లేదు.

ఎస్-400 వ్యవస్థల కొనుగోలు కూడా ఆంక్షల పరిధిలోకి వస్తుందా అన్న ప్రశ్నకు దలీప్ సింగ్ సమాధానం దాట వేశాడు. ఆ సంగతిని ఇండియా ప్రభుత్వంతో ప్రైవేటుగా చర్చిస్తామని చెప్పాడు. అంటే నాలుగ్గోడల మధ్య ఇండియాను బుజ్జగించడానికి, అందుకు లొంగకపోతే బెదిరించడానికి అమెరికా నిర్ణయించుకున్నట్లే కనిపిస్తోంది.

దలీప్ సింగ్ కి ముందు ఇండియా వచ్చిన జర్మనీ, బ్రిటన్, యూరోపియన్ యూనియన్ అధికారులు కూడా ఈ తరహా లోనే ఇండియాను హెచ్చరించి వెళ్లారు. “పశ్చిమ దేశాల ఆంక్షలను ‘ఆర్ధిక సానుకూలత’ (economic advantage) గా ఇండియా మార్చుకోకూడదు. యుద్ధం అవకాశంగా తీసుకుని మా ఆంక్షలను నీరు గార్చడానికి అసలే ప్రయత్నించకూడదు అని జర్మనీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ (ఎన్‌ఎస్‌ఏ) జెన్స్ ప్లాట్నర్ హుకుం జారీ చేశాడు. ఇండియా ఎన్‌ఎస్‌ఏ అజిత్ దోవల్, విదేశీ మంత్రి జైశంకర్, ఫారెన్ సెక్రటరీ హర్ష్ శ్రింగ్లాలతో చర్చలు జరిపిన అనంతరం పత్రికలతో మాట్లాడుతూ ప్లాట్నర్ తమ వాదన వినిపించాడు.

యూ‌కే/బ్రిటన్/ఇంగ్లండ్ ఫారెన్ సెక్రటరీ (విదేశీ మంత్రి) లిజ్ ట్రస్ కూడా ప్రస్తుతం ఇండియాలోనే ఉంది. ఈమె ఇంకా భారత మంత్రులతో, అధికారులతో చర్చలు జరపలేదు. అయితే ద హిందూ పత్రిక ఆమెను ఇంటర్వూ చేసింది. ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమె “ఆంక్షలను కఠినతరం చేయాలని మేము ప్రయత్నిస్తున్నాము. చమురు, గ్యాస్ లపై మరిన్ని ఆంక్షలు విధిస్తాము… బంగారం విషయాన్ని మేము చర్చిస్తాము. సెంట్రల్ బ్యాంకులపై విధించిన ఆంక్షలను దాటవేసేందుకు కొన్ని దేశాలు బంగారాన్ని ఉపయోగిస్తున్నాయి. ఇతరులు అందరూ రష్యన్ ఓడల దిగుమతులపై ఆంక్షలు అమలు చేయాలని కోరుతున్నాము. రష్యాకు చెందిన మరిన్ని రష్యా సిగుమతులు, మరింతమంది రష్యన్ సంపన్నులపై ఆంక్షలు అమలు చేయాలి. ఆంక్షలు పని చేస్తున్నాయి. రష్యా ఇప్పటికే 15 యేళ్ళు వెనక్కి వెళ్లింది. అయినా ఇంకా చేయాలి. ఆంక్షలు మరిన్ని దేశాలు అమలు చేయాలని కాంక్షిస్తున్నాము. జి7, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, సింగపూర్, స్విట్జర్లాండ్… ఇవన్నీ ఆంక్షలు అమలు చేస్తున్నాయి. ఈ సంఖ్య పెరగాలి….” అని ఇచ్ఛా ప్రకటన చేశారు.

లిజ్ ట్రస్ ఉద్దేశ్యం స్పష్టమే. ఆంక్షలు అమలు చేసే దేశాల్లో ఇండియా కూడా చేరాలి. రష్యా చమురు దిగుమతి ఆపేయాలి. ఇతర సరుకుల కొనుగోలు కూడా ఆపేయాలి. రష్యాని 15 యేళ్ళు వెనక్కి నేత్తాము. ఇంకా మరిన్ని సంవత్సరాలు వెనక్కి నేట్టేందుకు ఇండియా సహకరించాలి. ఇవీ లిజ్ ట్రస్ డిమాండ్లు. రెండు శతాబ్దాల పాటు ఇండియా నెత్తి మీద కూర్చుని భారత సామాజిక వ్యవస్థ మధ్య యుగాల కుల-మత బంధనాల నుండి పురోగమించకుండా అడ్డుకుని, తన సహజ సామాజిక అభివృద్ధి క్రమాన్ని నిరోధించి సో-కాల్డ్ స్వాతంత్రం తర్వాత కూడా పశ్చిమ దేశాల పెత్తనం కింద బ్రతికేలా ఇండియా భవిష్యత్తుని ముందే శాసించి వెళ్ళిన బ్రిటన్/ఇంగ్లండ్ ఇప్పుడు రష్యాని మరిన్ని దశాబ్దాలు వెనక్కి వెళ్ళేలా అణచివేయడంలో సహకరించమని అదే ఇండియాని అడుగుతోంది ఘనత వహించిన యునైటెడ్ కింగ్^డమ్! లిజ్ ట్రస్ ఆకాంక్షలకు తల ఒగ్గినట్లయితే ఇప్పటికే ప్రజల నెత్తిమీద బాదుతున్న మోడి ప్రభుత్వం మరింత భారాన్ని భారత జనం పై మోపి మరింత దరిద్రం లోకి భారతీయులను నెట్టినట్లే.

అమెరికా, బ్రిటన్, జర్మనీ, యూరోపియన్ యూనియన్ ఇత్యాది పెత్తందారీ, స్వార్ధపూరిత దేశాల డిమాండ్లకు భారత ప్రభుత్వం అంగీకరిస్తుందా? భారత పాలకులు ఏమి చేయబోతున్నట్లు?

>>>>>>తర్వాత రెండో భాగంలో>>>>>>>>>>>>>>

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s