
Russian negotiators Medinsky and Alexander Fomin
ఉక్రెయిన్ పై రష్యా జరుపుతున్న దాడి మెల్లగా విరమించే వైపుగా వెళుతున్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. తాజా ఇస్తాంబుల్ చర్చల దరిమిలా రష్యా నుండి వెలువడిన ప్రకటనలను బట్టి ఈ అభిప్రాయానికి రావలసి వస్తోంది.
టర్కీ నగరం ఇస్తాంబుల్ లో ఇరు పక్షాల మధ్య జరుగుతున్న చర్చలలో ఉక్రెయిన్ నుండి నిర్దిష్టంగా స్పష్టమైన ప్రతిపాదనలు తమకు అందాయని రష్యన్ చర్చల బృందం ప్రకటించింది.
“టర్కీ నగరం ఇస్తాంబుల్ లో మార్చి 29 తేదీన జరిగిన చర్చల సందర్భంగా ఉక్రెయిన్ బృందం నుండి స్పష్టమైన అవగాహనతో కూడిన ప్రతిపాదనలు మాకు అందాయి” అని రష్యన్ చర్చల బృందం నేత వ్లాదిమిర్ మెడిన్ స్కీ ప్రకటించాడు.
“ఈ రోజు చర్చలు స్వభావం రీత్యా నిర్మాణాత్మకంగా జరిగాయి” అని మెడిన్ స్కీ తెలిపాడు.
“మాస్కో (రష్యా ప్రభుత్వం) మిలట్రీ మరియు రాజకీయ పరంగా ఉద్రిక్తతల-ఉపసంహరణ చర్యలు (De-escalation steps) తీసుకోవాలని భావిస్తున్నది” అని మెడిన్ స్కీ ముఖ్యమైన ప్రకటన చేశాడు. (స్పుత్నిక్ ఇంటర్నేషనల్, 29 మార్చి 2022)
“తాము తటస్థంగా ఉంటామని, అలీనత పాటిస్తామని, అణ్వస్త్రాలను తయారు చేసే ప్రయత్నాలు విరమిస్తామని స్పష్టం చేస్తూ ఉక్రెయిన్ నుండి లిఖిత ప్రతిపాదనలను మాకు అందాయి. అలాగే రసాయన మరియు క్రిమి ఆధారిత ఆయుధాలు లాంటి సామూహిక విధ్వంసక మారణాయుధాలను ఉత్పత్తి చేయడం, నెలకొల్పడం లాంటివి చేసేందుకు నిరాకరిస్తామని ప్రతిపాదించారు. ఉక్రెయిన్ నేలపై విదేశీ మిలట్రీ స్థావరాలను, విదేశీ సైన్యాలను అనుమతించబోమని లిఖిత హామీ ఇచ్చారు” అని మెడిన్ స్కీ పత్రికలకు చెప్పాడు.
మెడిన్ స్కీ చెబుతున్న ఉద్రిక్తతల-ఉపసంహరణ చర్యలు ఎలా ఉండబోతున్నాయి?
ఆయన మాటల్లోనే చెప్పాలంటే
-
కీవ్ నగరం, చెర్నిగొవ్ నగరాల దిశలో జరుగుతున్న రష్యన్ మిలట్రీ చర్యలు గణనీయమైన స్థాయిలో తగ్గిస్తాము. ఇది మిలటరీ డీ-ఎస్కలేషన్ చర్య.
-
రష్యా మరియు ఉక్రెయిన్ అధ్యక్షుల మధ్య చర్చలు జరిగే అవకాశాలను రష్యా పరిశీలిస్తుంది. అనగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ లు వ్యక్తిగతంగా కలుసుకుని చర్చలు జరిపే అవకాశాలను రష్యా పరిశీలిస్తుంది. ఇది పోలిటికల్ డీ-ఎస్కలేషన్ చర్య.
రష్యా అధ్యక్షుడు పుతిన్ తో వ్యక్తిగతంగా కలుసుకుని చర్చలు జరుపుతానని జెలెన్ స్కీ కొన్ని వారాలుగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కనీస ఏకాభిప్రాయానికి రాకుండా అధ్యక్షులు కలిసి చేసేది ఏమీ ఉండదని రష్యా ప్రతినిధులు చెబుతూ వచ్చారు.
కీవ్ ప్రతిపాదించిన నిర్దిష్ట ప్రతిపాదనలను మాస్కో సమీక్షిస్తుందని రష్యా ప్రతినిధి మెడిన్ స్కీ చెప్పాడు. అనంతరం సదరు ప్రతిపాదనలను అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ముందు ఉంచుతారు. ఆ తర్వాత కీవ్ ప్రతిపాదనలను అంతిమ ఇప్పందంలో ఇముడ్చుకునేందుకు రష్యాకు అంగీకారం ఉన్నదో లేదో అన్న సంగతి కీవ్ (ఉక్రెయిన్) కు తెలిజయేస్తారు.
ఈ అంశంపై మరిన్ని వార్తలు త్వరలో….