ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితిపై తప్పుడు వార్తలు


Ukraine servicemen

గత నెల రోజులుగా ఉక్రెయిన్ పై రష్యా దాడి కొనసాగుతూ వచ్చింది. ఉక్రెయిన్ తన శక్తి మేరకు ప్రతిఘటన ఇస్తూ వచ్చింది. ఈ యుద్ధం లేదా రష్యా దాడి ఏ విధంగా పురోగమించింది అన్న విషయంలో పత్రికలు ముఖ్యంగా పశ్చిమ పత్రికలు కనీస వాస్తవాలను కూడా ప్రజలకు అందించలేదు.

భారత పత్రికలు, ఆంధ్ర ప్రదేశ్ లోని తెలుగు పత్రికలతో సహా పశ్చిమ పత్రికల వార్తలనే కాపీ చేసి ప్రచురించాయి. ద హిందూ, ఇండియన్ ఎక్స్^ప్రెస్, ఎన్‌డి‌టి‌వి మొదలు కొని సాక్షి, ఈనాడు ఇతర పత్రికల వరకు పశ్చిమ పత్రికల వార్తలనే వాస్తవాలుగా ప్రచురించాయి.

కానీ ఉక్రెయిన్ లో వాస్తవ పరిస్థితి మన తెలుగు, ఆంగ్ల పత్రికలు అందించిన వార్తలకు పూర్తిగా భిన్నంగా ఉంటూ వచ్చింది. మన తెలుగు పత్రికలకు విదేశాల్లో వార్తలు సేకరించే వనరులు లేవు. యుద్ధ వార్తలు సేకరించే వార్తలు అసలే లేవు. కనుక అవి అనివార్యంగా ఆంగ్ల పత్రికలపై ఆధారపడతాయి.

ఆంగ్ల పత్రికలకు విదేశాల్లో కొద్దో గొప్పో మండి మార్బలం ఉన్నా కూడా పశ్చిమ వార్తా సంస్థలైన రాయిటర్స్, బి‌బి‌సి, బ్లూమ్ బర్గ్ న్యూస్, డబల్యూ‌పి, సి‌ఎన్‌ఎన్… లు అందజేసే వార్తల పైనే ఆధారపడుతున్నాయి. హెడ్ లైన్ లను కాస్త మార్చి యధాతధంగా ప్రచురిస్తున్నాయి. దానితో అమెరికా, ఐరోపాలకు అనుకూలంగా వచ్చే వార్తలే, అవి అసత్యాలు, అర్ధ సత్యాలు అయినా సరే, భారత ప్రజలను చేరుతున్నాయి. ఇది చాలా ఇబ్బందికర, దయనీయ పరిస్థితి.

ఉదాహరణకి ఈ రోజు సాక్షి పత్రికను చూస్తే “ఉక్రెయిన్ లో రష్యా ఉక్కిరి బిక్కిరి’ అన్న హెడ్ లైన్ తో ఓ వార్తా విశ్లేషణ ప్రచురించింది. దీని ప్రకారం ఉక్రెయిన్ లో రష్యాకు ఎదురవుతున్న భంగపాటు అందరినీ ఆశ్చర్యపరుస్తోందట. నెల దాటినా యుద్ధం ఓ కొలిక్కి రాకపోవడంతో రష్యా అసహనం పెరుగుతోందిట. రష్యా ఆయుధాలను ఆధునీకరించలేదట. ఉన్న ఆయుధాలను ఇతర దేశాలకు అమ్మేసుకుందిట. సైన్యానికి శిక్షణ లేదట. ఆయుధాలు పేలవంగా పని చేశాయిట… ఇలా ఇంకా ఏవేవో రాశారు. అందరికీ తెలిసిన కొన్ని వాస్తవాలకు అసత్యాలను మిళితం చేసి పశ్చిమ సంస్థలు ప్రసారం చేసిన వార్తా విశ్లేషణలే ఇవి.

ఈ వార్త నిజమే అయితే ఉక్రెయిన్ ఈరోజు ఇస్తాంబుల్ చర్చల్లో వచ్చిన విధంగా కాళ్ళ బేరానికి వచ్చేదేనా? క్రిమియా రష్యాలో భాగంగా అంగీకరించేందుకు సిద్ధపడింది. డాన్ బాస్ ఏరియా (Lugansk & Donetsk) స్వతంత్రాన్ని గుర్తించింది. అమెరికా శిబిరంలో చేరకుండా తటస్థంగా ఉంటానని చెప్పింది. అణ్వాయుధాల జోలికే పోనని ప్రతిపాదించింది. సెక్యూరిటీ సౌకర్యాలు ఇవ్వాలని రష్యానే అడిగింది. గత నెల రోజుల యుద్ధంలో రష్యాని ఉక్కిరి బిక్కిరి చేసిన ఉక్రెయిన్ ఇంతగా ఎందుకు దిగిపోతుంది? ఆలోచించాలి.

నిజం ఏమిటి? రష్యా, ఉక్రెయిన్ ల మధ్య లోతైన సాంస్కృతిక సంబంధాలు నెలకొని ఉన్నాయి. ఉక్రెయిన్ లో రష్యా నుండి వచ్చి స్థిరపడిన వారు చాలా మంది ఉన్నారు. రష్యాకు కావలసింది తమ పట్ల సానుకూల దృక్పధంతో ఉన్న ఉక్రెయిన్ (ప్రజలు) తప్ప శత్రువైఖరితో ఉన్న ఉక్రెయిన్ కాదు. ఉక్రెయిన్ తో రష్యాకు సత్సంబంధాలు కావాలి.

ఈ కారణాల వల్ల అధ్యక్షుడు పుతిన్ తన సైన్యానికి కొన్ని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాడు. ఉక్రెయిన్ పౌరులకు గాని, పౌర నిర్మాణాలకు గాని ఏ మాత్రం నష్టం జరగకుండా సైన్యం వ్యవహరించాలి. కేవలం ఉక్రెయిన్ మిలట్రీని, నయా-నాజీ శక్తులను మాత్రమే టార్గెట్ చెయ్యాలి. నగరాలు, పట్టణాలు, గ్రామాలపై విచక్షణారహితంగా యుద్ధ వాహనాలు నడపరాదు. రోడ్లు పాడు చేయకుండా సాధ్యమైనంతగా పక్క మార్గాల్లో వెళ్ళాలి.

ఈ పరిమితులతో యుద్ధం చెయ్యడం ఏ సైన్యానికయినా ఆచరణలో సాధ్యం అయ్యే పని కాదు. అందుకే మొదటి ఐదు రోజులూ రష్యా సైన్యం, యుద్ధ వాహనాలు చాలా నెమ్మదిగా పురోగమించాయి. అసలు దాడి జరుగుతోందా లేదా అన్న అనుమానం పశ్చిమ పత్రికలే వ్యక్తం చేశాయి. రష్యా సైన్యాన్ని ఏకసక్కెం చేశాయి కూడా.

ఈ కాలంలో రష్యా సైన్యాలు రష్యా భూభాగం నుండే ఉక్రెయిన్ ఆయుధాగారాలు, వాయు సేనల స్థావరాలు, గిడ్డంగులు, సైనిక శిక్షణ కేంద్రాలు మొ.న వాటిని క్షిపణులతో, డ్రోన్ లతో నాశనం చేసింది. స్థావరాల నుండి సరఫరాలు, మందుగుండు అందకుండా నాశనం చేసింది. విమాన స్థావరాలను ధ్వంసం చేయడంతో ఉక్రెయిన్ కు ఎయిర్ ఫోర్స్ అన్నదే లేకుండా పోయింది.

మరో పక్క ఉక్రెయిన్ సైన్యం అంతర్జాతీయ యుద్ధ ఒప్పందాలకు భిన్నంగా పౌరుల ఆవాసాల్లో తమ యుద్ధ వాహనాలను, వివిధ ఆయుధాలను, రాకెట్ ప్రయోగ కేంద్రాలను, క్షిపణి ప్రయోగ వాహనాలను కేంద్రీకరించింది. స్కూళ్ళు, హోటళ్లు, అపార్ట్^మెంట్లు, ఆసుపత్రుల నుండి జనాన్ని తరిమేసి అక్కడ ఆయుధాలను నిలిపింది. అక్కడి నుండి రష్యన్ ట్యాంకులు, సైన్యాలపై రాకెట్లు ప్రయోగించింది.

దానితో రష్యన్ సైన్యం ఆరంభంలో అనుకోని నష్టాలు చవి చూసింది. ఇలా 5 రోజులు చూశాక ఉక్రెయిన్ సైన్యాలు, ఆయుధాలు ఎక్కడ ఉన్నాయో, ఎక్కడి నుండి తమపై దాడి జరుగుతోందో రష్యా సైన్యానికి తెలిసి వచ్చింది. ఆ మేరకు చర్యలు తీసుకుంది. ప్రధాన నగరాలపై కేంద్రీకరించింది. ఉక్రెయిన్ సైన్యాలు కేంద్రం చేసుకున్న అపార్ట్^మెంట్లు, స్కూళ్ళను నేలమట్టం చేసింది. వాటినే పశ్చిమ పత్రికలు ఫోటోలు తీసి ‘రష్యా సైన్యం స్కూళ్లపైనా, ఆసుపత్రుల పైనా క్రూరంగా దాడులు చేస్తోంది” అంటూ ప్రచారం చేసి గగ్గోలు పెట్టాయి. వాస్తవానికి అక్కడ జనాల్ని నాజీ సేనలు ముందే తరిమేశారు. చాలా చోట్ల జనాలు గ్రామాలు, నగరాలు విడిచి వెళ్లకుండా అడ్డుకుని వారిని హ్యూమన్ షీల్డ్ గా ఉపయోగించుకున్నారు.

రష్యా సైన్యాలు ప్రధాన నగరాలు, పట్టణాలను చుట్టు ముట్టాయి. అక్కడ ప్రజలను నాజీ మూకలు హ్యూమన్ షీల్డ్ గా అడ్డం పెట్టుకుంటే గనక ఆ నగరాల లోపలికి వెళ్లలేదు. శివార్లలోనే ఆగిపోయి సరఫరాలు అందకుండా చేశారు. ప్రజలు బైటికి వెళ్లడానికి వీలుగా కొన్ని కారిడార్ లు వదిలిపెట్టారు. కానీ అనేక చోట్ల ఆ కారిడార్ లను ప్రజలు ఉపయోగించకుండా ఉక్రెయిన్ సైన్యం నాజీ మూకలు (అజోవ్ బెటాలియన్, రైట్ సెక్టార్, యూ‌పి‌ఏ మొ.వి) ఆటంకపరిచాయి. అందువల్ల నెల రోజులు గడిచినా ఖార్కివ్, మరియుపోల్, క్రమటార్స్క్ లాంటి ప్రధాన నగరాలను రష్యా సేనలు వశం చేసుకోలేదు.

అయితే ఈ నగరాల్లో ఉక్రెయిన్ సేనలకు సరఫరాలు అందకపోవడంతో అనేక చోట్ల అవి గుంపులు గుంపులు గా బైటకి వచ్చి రష్యా సేనలకు లొంగిపోయారు. ఈ లొంగుపాటు వీడియోలు స్పుత్నిక్ న్యూస్, ఆర్‌టి లాంటి వార్తా సంస్థలు ప్రసారం చేశాయి. కానీ ఈ వార్తా సంస్థలను అమెరికా, ఈ‌యూ లు తమ దేశాల్లో నిషేధించాయి. దానితో అవి బైటికి రాలేదు. మొబైల్ ఫోన్లలో టెలిగ్రామ్ లాంటి మెసేజింగ్ అప్లికేషన్ లలో వీటికి చానెళ్లు ఉన్నాయి. టెలిగ్రామ్ అప్లికేషన్ ఉన్నట్లయితే యుద్ధానికి చెందిన వాస్తవ వార్తలను, వీడియోలను చూడవచ్చు. ఇవి రష్యాకు చెందినవి కనుక నమ్మవచ్చా అన్న అనుమానం రావచ్చు. ఏది వాస్తవం అన్నది యుద్ధం ఎలాంటి పరిస్థితిలో ముగిసింది అన్న సంగతి తేలికగా పట్టిస్తుంది. కాస్త ఓపిక పడితే వార్తల స్వభావం నుండే నిజం ఏమిటన్నది అనుభవంలో తెలుస్తుంది.

సైనిక స్థావరాలు, కమ్యూనికేషన్ స్థావరాలు ధ్వంసం కావడంతో ఉక్రెయిన్ సైన్యంలో కమాండ్ వ్యవస్థ లేకుండా పోయింది. ఒక ప్రాంతానికి మరో ప్రాంతానికి సంబంధాలు తెగిపోయాయి. కమాండ్ స్ట్రక్చర్ అన్నది పూర్తిగా ధ్వంసం అయింది. దానితో ఉక్రెయిన్ సేనలు ఎవరికి వారే అయ్యారు. యూనిఫైడ్ కమాండ్ ద్వారా ఒకే వ్యూహంతో వ్యవహరించే పరిస్థితి రద్దయింది. వివిధ గ్రూపులుగా చిన్న చిన్న బృందాలుగా వాళ్ళు విడిపోయారు. ఎవరి కమాండ్ వారిదే అయింది. మరో పక్క మందుగుండు అయిపోయింది. దానితో అనేక చోట్ల లొంగిపోక తప్పలేదు. అజోవ్ బెటాలియన్ లాంటి నాజీ సైన్యాలు మాత్రం గట్టిగా ప్రతిఘటించాయి. అలాంటి చోట్ల రష్యా సేనలు ఎలాంటి మినహాయింపు లేకుండా లోపలికి చొరబడి దాడి చేసి నాశనం చేశాయి.

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ని పశ్చిమ దేశాలు తమ పార్లమెంటులలో ప్రసంగాలు ఇప్పించుకుని ఆయన్ని ఒక హీరోగా ప్రపంచం ముందు నిలబెట్టాయి. తమ వార్తా సంస్థలు, ఛానెళ్లలో పూర్తి కవరేజి ఇచ్చి రష్యాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న హీరోగా సర్టిఫికేట్ ఇచ్చి ప్రచారం కల్పించారు. అయితే ఇది పబ్లిక్ రిలేషన్స్ క్యాంపెయిన్ మాత్రమే. ఇది ప్రచారం వరకే పరిమితం.

Volodymyr Zelensky

నిజానికి రష్యాతో చర్చల్లో ముందడుగు పడకుండా అమెరికాయే జెలెన్ స్కీ ని నిరోధిస్తూ వచ్చింది. ప్రభుత్వంలో చోటు సంపాదించిన నాజీ ముఠాలు కూడా రష్యాతో ఒప్పందానికి రాకుండా జెలెన్ స్కీ ని బెదిరిస్తూ వచ్చాయి. ఒక దశలో అజోవ్ బెటాలియన్ నుండే జెలెన్ స్కీ కి చంపేస్తామని బెదిరింపులు ఎదురయ్యాయి. నిర్దిష్ట ప్రతిపాదనలు ఉక్రెయిన్ నుండి రావడం వెనుక ఏయే శక్తులు పని చేశాయి లేదా ఏయే శక్తులు బలహీనపడితే జెలెన్ స్కీ వర్గానికి ముందడుగు వేసే అవకాశం వచ్చిందీ తెలియవలసే ఉన్నది. ఈ ముందడుగు ఇంకా ముందుకు పోతుందా లేదా అన్నది అప్పుడే చెప్పలేము. వచ్చే రోజుల్లో జరిగే పరిణామాల ద్వారానే ఆ సంగతి తెలుస్తుంది.

రష్యా ఉక్రెయిన్ మధ్య చర్చలు జరగడంలో రష్యా సంపన్నుడు రోమన్ అబ్రమోవిక్ ముఖ్య పాత్ర పోషించాడు. ఈయనా, ఉక్రెయిన్ చర్చల బృందం ఇస్తాంబుల్ లో విష ప్రయోగానికి గురైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విష ప్రయోగానికి రష్యానే బాధ్యురాలిని చేస్తూ అమెరికా ఇప్పటికే ప్రకటనలు గుప్పిస్తోంది. కనుక చర్చలు విఫలం అయేందుకు కృషి జరుగుతోందని స్పష్టం అవుతోంది. చర్చలు విఫలం అయితే అమెరికాకే ప్రయోజనం. సఫలం అయితే రష్యాకి ప్రయోజనం. కాబట్టి విష ప్రయోగం వెనుక ఎవరు ఉన్నది తెలియడానికి తెలివితేటలు అవసరం లేదు.

చర్చలు సఫలం అయితే మొదట ఉక్రెయిన్ ప్రజలు ఊపిరి పీల్చుకోవచ్చు. యుద్ధం వల్ల మొదట నష్టపోయేది పేదలు, మధ్య తరగతి ప్రజలే. సైన్యంలో చేరేది వాళ్ళే. సంపన్నులు ఎవరు సైన్యంలో చేరరు. కాందిశీకులుగా మారేది కూడా పేదలు, మధ్య తరగతి ప్రజలే. కనుక చర్చలు సఫలమై ఉక్రెయిన్ ప్రజలకు శాంతి చేకూరాలని ఆశిద్దాం.

One thought on “ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితిపై తప్పుడు వార్తలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s