బై బై డాలర్! సొంత కరెన్సీల్లో ఇండియా, రష్యా వాణిజ్యం


చిన్న రాజ్యాలు కొట్లాడుకుంటే పెద్ద రాజ్యం లాభపడుతుంది. అలాగే పెద్ద రాజ్యాలు కొట్లాడుకుంటే వాటి దగ్గర లాబీయింగ్ చేసే చిన్న రాజ్యాలు లబ్ది పొందుతాయి.

ఓ వైపు ఒకప్పటి అగ్రరాజ్యం సోవియట్ రష్యా వారసురాలు రష్యా; మరో వైపు ఉక్రెయిన్ ని ముందు పెట్టి దాని భుజం మీద తుపాకి పెట్టి కాల్పులు జరుపుతున్న అమెరికా! ఉక్రెయిన్ లో రెండు పెద్ద రాజ్యాలు కొట్లాడుకుంటున్న నేపధ్యంలో ఇండియా వాణిజ్య పరంగా లబ్ది పొందుతోంది.

ఈ లబ్ది రెండు రకాలుగా ఇండియాకు అందుతోందని ఇప్పటివరకు స్పష్టం అయింది.

ఒకటి: రష్యన్ చమురు దాని అసలు ధరలో 20 శాతం డిస్కౌంట్ తో ఇండియాకు అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ రెండు అంగల్లో ఇండియాకు ధర తగ్గిపోతుంది. మొదటి అంగలో… రష్యా చమురు ధర మామూలుగానే బ్రెన్ట్ క్రూడ్, టెక్సాస్ క్రూడ్ మార్కెట్ల కంటే తక్కువగా ఉంటుందని పేరు. రెండో అంగలో… ఆ తక్కువ ధరలోనే మరో 20 శాతం మేర తగ్గించడానికి రష్యా అంగీకరించింది.

మార్చి 23 నాటికి, అంటే నేటి వరకు హిందూస్థాన్ పెట్రోలియం కంపెనీ 2 మిలియన్ బ్యారళ్ళ రష్యన్ చమురు కొనుగోలు చేసింది. ఇండియన్ ఆయిల్ కంపెనీ మరో 3 మిలియన్ బ్యారళ్ళ చమురు కొనుగోలు చేసింది.

అసలు విషయం

ఇక అసలు విషయానికి వస్తే ఇండియా, రష్యా చమురు వాణిజ్యం డాలర్లలో కాకుండా సొంత కరెన్సీలలో అనగా రూపాయి లేదా రూబుల్ లలో జరపడానికి ఇరు దేశాలు అంగీకారానికి వచ్చాయి. ఒక్క చమురు మాత్రమే కాకుండా ఇతర సరుకుల వాణిజ్యం కూడా రూపాయి-రూబుల్ మార్పిడి ద్వారా జరపడానికి నిర్ణయించాయి. ఈ విషయాన్ని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్^పోర్ట్ ఆర్గనైజేషన్స్ సంస్థ అధ్యక్షుడు ఏ శక్తివేల్ మీడియాకు చెప్పాడు (సి‌ఎన్‌బి‌సి, మార్చి 23, 2022).

ఈ నిర్ణయం తీసుకోవటం అంటే రష్యాపై అమెరికా విధించిన ఆంక్షలను పక్కకు నెట్టివేయడమే. ప్రపంచ వాణిజ్యం పరిమాణంతో పోల్చితే ఇండియా-రష్యా వాణిజ్య పరిమాణం ఏనుగు ముందు చీమ తలకాయంత! అయినా సరే, అమెరికా అత్యంత ద్వేషంతో, కక్షతో రష్యాపై ప్రకటించిన తీవ్ర స్థాయి ఆంక్షలను ఉల్లంఘించటానికి ఇండియా నిర్ణయించింది.

ఉక్రెయిన్ పై రష్యా దాడి విషయంలో ఐరాస, భద్రతా సమితి లలో ఇప్పటివరకు జరిగిన అన్ని ఓటింగ్ లలో ఇండియా పాల్గొనకుండా తప్పుకుంది. లేదా abstain అయింది. అమెరికా, దాని మిత్రులు ప్రవేశపెట్టిన తీర్మానాల ఓటింగ్ లో పాల్గొనలేదు, అలాగే రష్యా ప్రవేశపెట్టిన తీర్మానం ఓటింగ్ లో కూడా పాల్గొన లేదు.

రష్యా ఇప్పటి దాకా ఒకటే తీర్మానం ప్రవేశపెట్టింది. అది ఉక్రెయిన్ పౌరులను యుద్ధంలో చిక్కుకుని మరణించకుండా ఉండటానికి సంబంధించినది.

ఉక్రెయిన్ లో ప్రధాన నగరాలను రష్యా సైన్యం చుట్టుముట్టి దాడులు చేస్తోంది. పౌరులు యుద్ధంలో చిక్కుకోకుండా ఉండేందుకు హ్యూమానిటేరియన్ కారిడార్ పేరుతో సురక్షిత మార్గాన్ని రష్యా సైన్యం వదిలిపెడుతోంది. అంటే నిర్దేశిత రూట్ ని ప్రకటించి ఆ రూట్ లో బాంబింగ్ చేయకుండా ఉంటుంది. నగరం/పట్నం నుండి బైటికి వెళ్ళేవాళ్లు ఆ రూట్ లో వెళ్లవచ్చన్నమాట!

కానీ నగరాల్లో ఉన్న ఉక్రెయిన్ సైన్యం, ముఖ్యంగా అజోవ్ బెటాలియన్ లాంటి నయా-నాజీ మిలీషియా పౌరులు నగరాలు విడిచి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. వారిని హ్యూమన్ షీల్డ్ గా వాడుకుంటున్నారు. చర్చల్లో హ్యూమానిటేరియన్ కారిడార్ లపై ఒప్పందం జరిగినా కూడా ఉక్రెయిన్ సైన్యం వాటిని అమలు చేయడం లేదు. అమలు చేస్తే వారి పైన రష్యా సైన్యం విచక్షణా రహితంగా విరుచుకు పడుతుందని వారికి తెలుసు.

ఇలా ఉక్రెయిన్ సైన్యం ముఖ్యంగా నయా-నాజీ మిలీషియాలు ఉక్రెయిన్ పౌరులను నగరాలు/ పట్టణాలు విడిచి వెళ్లకుండా ఆటంకపరచటాన్ని విమర్శిస్తూ రష్యా భద్రతా సమితిలో తీర్మానం ప్రవేశపెట్టింది. ఆ తీర్మానం ఓటింగ్ లో కూడా ఇండియా పాల్గొనకుండా తప్పుకుంది. తటస్థంగా ఉండిపోయింది.

ఈ తటస్థ వైఖరి అమెరికాకు నచ్చటం లేదు. తాను గీసిన గీత ఇండియా దాటడం దానికి అవమానంగా ఉంది. రష్యా పై ఆంక్షల విషయంలో ఇండియా ఊగిసలాడుతోంది అంటూ అమెరికా అధ్యక్షుడు పరోక్షంగా విమర్శించాడు కూడా. ఇండియా క్వాడ్ కూటమి సభ్య దేశం గనుక అది విధిగా అమెరికాని అనుసరించాల్సి ఉంటుంది అని అమెరికా కింది స్థాయి అధికారి ఒకరు హెచ్చరించారు కూడాను.

దానికి తోడుగా అంతర్జాతీయ వాణిజ్యంలో రూపాయి-రూబుల్ స్వాపింగ్ కి నిర్ణయం తీసుకోవడం అమెరికాకు ఖచ్చితంగా కోపం తెప్పిస్తుంది. అయితే ఆ కోపాన్ని అప్పుడే అమెరికా చర్యల రూపంలో ప్రదర్శించదు. అదును చూసి ఎప్పుడో ఒకప్పుడు దెబ్బ తీస్తుంది.

చిన్న విషయం కాదు

రూపాయి-రూబుల్ స్వాపింగ్ నిర్ణయం చిన్నది కాదు. మామూలుగా అంతర్జాతీయ వాణిజ్యం అంతర్జాతీయ కరెన్సీలో జరుగుతుంది. బంగారం/డాలర్/యూరో/యెన్/యువాన్ వీటిని మాత్రమే అంతర్జాతీయ అమ్మకందార్లు అనుమతిస్తారు. తద్వారా విదేశీ మారకద్రవ్య నిల్వలు పెంచుకోవాలని ఏ దేశమైనా భావిస్తుంది. సాధారణంగా ఎగుమతులకు డాలర్లు తీసుకుంటారు. దిగుమతులకు డాలర్లు చెల్లిస్తారు.

తాజా నిర్ణయం ఫలితంగా ఇండియా రష్యా దిగుమతులకు రూబుల్ లలో చెల్లిస్తుంది. అదే తన సరుకులు ఎగుమతి చేస్తే రూపాయి చెల్లింపులు అనుమతిస్తుంది. ఇక్కడ రూపాయి-రూబుల్ మారకం కాగితాలకే పరిమితం అవుతుంది. అంతిమంగా ఎవరికి మిగులు తేలితే వారికి డాలర్లు లేదా బంగారం రూపంలో చెల్లింపు జరుగుతుంది.

ఉదాహరణకి ఇండియా 10 బిలియన్ డాలర్ల చమురు కొనుగోలు చేసింది అనుకుందాం. అలాగే 6 బిలియన్ డాలర్ల ఔషధాలు, సుగంధ ద్రవ్యాలు, టెక్స్ టైల్స్ ఎగుమతి చేసింది అనుకుందాం. మామూలుగా అయితే ఇండియా 10 బిలియన్ డాలర్లు చెల్లిస్తుంది. రష్యా 6 బిలియన్ డాలర్లు చెల్లిస్తుంది. అనగా మొత్తం 16 బిలియన్ డాలర్లు చేతులు మారుతుంది. లేదా 16 బిలియన్ల మేర డాలర్ కరెన్సీ చేతులు మారుతుంది. ఈ వాణిజ్యం డాలర్ కరెన్సీ విలువపై సానుకూల ప్రభావం చూపుతుంది.

రూబుల్-రూపాయి స్వాపింగ్ ప్రక్రియలో అంతిమ బ్యాలన్స్ ఎంతైతే అంత మొత్తమే డాలర్ కరెన్సీ చేతులు మారుతుంది. పైన ఉదాహరణలో రష్యా 4 బిలియన్ డాలర్లు మిగులు వాణిజ్యం జరిపింది. కనుక అంతిమంగా 4 బిలియన్ల మేరకు మాత్రమే డాలర్ కరెన్సీలో వాణిజ్యం నమోదు అవుతుంది. అంటే 16 బిలియన్ డాలర్ల వాణిజ్యం నమోదు కావలసి ఉండగా 4 బిలియన్ డాలర్లు మాత్రమే నమోదు అయింది. మిగిలిన 12 బిలియన్ డాలర్ల వాణిజ్యం చెరిసగం అనగా 6 బిలియన్ డాలర్ల రూబుల్ కరెన్సీ వాణిజ్యం, మరో 6 బిలియన్ డాలర్ల రూపాయి కరెన్సీ వాణిజ్యం అంతర్జాతీయంగా నమోదు అవుతుంది. ఇది డాలర్ ప్రభావాన్ని, పలుకుబడిని, ఆధిపత్యాన్ని తగ్గిస్తుంది, అది ఎంత చిన్న మొత్తం అయినా సరే.

ఇరాక్ పై దాడికి ముందు అప్పటి ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్, తన దేశ చమురు వాణిజ్యానికి డాలర్లు స్వీకరించడం ఆపేసి యూరోలు స్వీకరించాలని నిర్ణయించాడు. అంటే పెట్రో డాలర్ స్థానం లో పెట్రో యూరో ని ప్రవేశపెట్టడానికి మొదటి అడుగు వేసేందుకు సద్దాం నిర్ణయించాడు. ఇరాక్ పై దాడికి అమెరికాని పురికొల్పిన ప్రధాన కారణాల్లో ఇది ఒకటిగా పని చేసింది.

అమెరికా ఆర్ధిక ఆధిపత్యం అంతా డాలర్ లోనే ఉన్నది. డాలర్ అంతర్జాతీయ కరెన్సీగా ఉన్నంత వరకు అమెరికా ఫైనాన్స్ ఆధిపత్యం కొనసాగుతుంది. డాలర్ అంతర్జాతీయ కరెన్సీగా ఉనికిలో లేకపోతే అమెరికా ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. డాలర్, అంతర్జాతీయ కరెన్సీ కావటం మూలాన అమెరికా ట్రెజరీకి విచక్షణా రహితంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ లభిస్తోంది. అమెరికా ట్రెజరీ జారీ చేసే సావరిన్ డెట్ బాండ్లకు ఎనలేని గిరాకీ ఉంటోంది. ప్రపంచంలో ఎక్కడ సంక్షోభం తలెత్తినా అక్కడ పెట్టుబడి అంతా పరుగెట్టుకుంటూ ట్రెజరీ బాండ్లలోకి వచ్చి చేరుతుంది. డాలర్ డినామినేషన్ లో జారీ అయ్యే అమెరికా బాండ్లు అత్యంత సురక్షితమైనవి అన్న నమ్మకమే దానికి కారణం.

డాలర్ కి ఉన్న శక్తి ప్రధానంగా పెట్రో డాలర్ ద్వారా సమకూరినదే. పెట్రో డాలర్ అంటే ప్రత్యేక లక్షణాలు ఏమీ ఉండవు. చమురు అమ్మకం ద్వారా సమకూరే డాలర్లనే పెట్రో డాలర్లు అంటారు. అయితే పెట్రోలియం అన్నది ఎనర్జీ/శక్తి వనరు. మానవ జీవితంలో ప్రతి అంశమూ పెట్రోలుతో ముడి పడి ఉంటుంది. పెద్ద పెద్ద మాన్యుఫాక్చరింగ్ పరిశ్రమల నుండి రవాణా వరకు సమస్తము పెట్రోలియం ఉత్పత్తులపై ఆధారపడి ఉన్నందున పెట్రోలియం ఉత్పత్తి ద్వారా పొగుబడే విలువ భారీ మొత్తంలో ఉంటుంది. ఈ విలువ ఏ కరెన్సీలో జరిగితే ఆ కరెన్సీకి అంతర్జాతీయ కరెన్సీ స్థాయి వచ్చి చేరుతుంది. పెట్రోలియం ప్రపంచం నలుమూలలకి వెళ్తుంది గనక.

ఇదే కాదు. సౌదీ అరేబియా కూడా తన చమురు అమ్మకాలకు చైనా నుండి ఆ దేశ కరెన్సీ రెన్ మిన్ బి (ఆర్‌ఎం‌బి) చెల్లింపులు స్వీకరించడానికి అంగీకరించిందని వార్తలు వస్తున్నాయి. (లేదా చైనా కరెన్సీ అంగీకరించే ఆలోచనలో ఉన్నట్లుగానో). అధికారికంగా అయితే ఏ ప్రకటనా వెలువడ లేదు. ఇది నిజమైతే డాలర్ ఆధిపత్యానికి గండి పడడం మొదలైనట్లే అని భావించవచ్చు, ఇది సాకారం కావటానికి మరిన్ని సంవత్సరాలు లేదా మరి కొన్ని దశాబ్దాలు పట్టినా సరే. ఆరంభం ఆరంభమే కదా!

అసలు రష్యా సెంట్రల్ బ్యాంకు అమెరికా ట్రెజరీల్లో దాచి ఉంచిన (మదుపు చేసిన) 650 బిలియన్ డాలర్ల సొమ్ముని రష్యా ఉపయోగించుకోకుండా స్తంభింపజేయడం ద్వారా అమెరికా తన డాలర్ పతనానికి తానే దారి వేసుకుందని పండితులు ఇప్పటికే విశ్లేషిస్తున్నారు. వివిధ దేశాల జాతీయ ప్రభుత్వాలు లేదా వారి సెంట్రల్ బ్యాంకులు తమ మిగులును గానీ, అప్పు గానీ అమెరికా ట్రెజరీల్లో మదుపు చేస్తాయి. మదుపు చేసిన సొమ్ముని అవసరం అయినప్పుడు తీసుకునే వీలు ఉండాలి. లేకుంటే మదుపు చేయడం ఆపేస్తారు. రష్యా దాచుకున్న సొమ్ముని ఉక్రెయిన్ పై దాడి సాకుగా చూపిస్తూ తన అవసరానికి వాడుకోకుండా రష్యాని అమెరికా నిరోధించింది. ఇలాంటి పరిస్థితి రేపు తమకు కూడా వస్తుందేమో అని ఇతర దేశాలు లేదా కంపెనీలు లేదా సంపన్నులు భావిస్తే…?

అటువంటి భావన బలపడితే డాలర్లలో మదుపు చేయడం ఆపేస్తారు. డాలర్లలో సావరిన్ డెట్ బాండ్లు జారీ చేయడం దేశాలు ఆపేస్తాయి. అది జరిగితే ఇక డాలర్ ని ఎవరూ నమ్మరు. ఆ విధంగా డాలర్ ఆధిపత్యం కూలిపోతుంది. కాబట్టి రష్యాపై విచక్షణా రహితంగా ఆంక్షలు విధించడం ద్వారా అమెరికా తన గొయ్యి కూడా తవ్వుకుంటోందని ఆర్ధిక పండితులు అంచనాలు ప్రారంభించారు. తధాస్తు!

2 thoughts on “బై బై డాలర్! సొంత కరెన్సీల్లో ఇండియా, రష్యా వాణిజ్యం

  1. రష్యాతో భారత్ మెరుగైన వాణిజ్య సంబంధాలను కొనసాగించడం సంతోషకరమే, అయినప్పటికీ అమెరికా నాయకత్వంలోని పాశ్చాత్య దేశాల ఒత్తిడులను తట్టుకొని రష్యా ను సంతోషపెట్టడానికి గల కారణాలను తెలుపగలరు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s