నమ్మించి దగా చెయ్యటం అమెరికా విద్య -కార్టూన్


తర్వాత ఎవరు?!

కువైట్ దేశం చారిత్రకంగా ఇరాక్ లో భాగం. చమురు వాణిజ్యం విషయమై కువైట్ తో ఇరాక్ కి సమస్య వచ్చింది. చర్చలు జరిగాయి. కువైట్ వినలేదు. ఇక భరించ లేము. కువైట్ ని కలుపుకుంటాం అని సద్దాం అమెరికాకి చెప్పాడు. ఆ విషయం మాకు సంబంధం లేదు. అది మీ సమస్య అని అమెరికా చెప్పింది. సద్దాం అమెరికాని నమ్మాడు. కువైట్ లోకి సైన్యాన్ని నడిపాడు. అంతే. అమెరికా గావు కేకలు వేసింది. సద్దాం పై రెండు సార్లు దాడి చేసి ఆక్రమించింది. సద్దాం వద్దాం వద్ద సామూహిక విధ్వంసక మారణాయుధాలు ఉన్నాయి లోకానికి ప్రమాదం అని చెప్పింది. సద్దాం ని వెతికి పట్టుకుని ఉరి తీసింది. ఇరాక్ ని సర్వ నాశనం చేసింది. ఒకప్పుడు మానవాభివృద్ధి సూచికలో ఐరోపా సరసన ఉన్న ఇరాక్ ఇప్పుడు కుక్కలు చింపిన విస్తరి.

రష్యాకి వ్యతిరేకంగా ఆఫ్ఘన్ లో తిరుగుపాటుని అమెరికా ప్రేరేపించింది. ఒసామా బిన్ లాడెన్, హెక్మత్యర్, మసూద్ తదితరులకు ఆయుధాలు ఇచ్చింది. కమెండో శిక్షణ ఇచ్చింది. ధన రాసులు పంపింది. ఆఫ్ఘన్ ఆక్రమణను పోషించలేక రష్యా స్వయంగా అక్కడి నుండి తప్పుకుంది. ఆఫ్ఘన్ వివిధ గ్రూపుల చేతులు మారి చివరికి అమెరికా, పాక్ సాయంతో తాలిబన్ చేతుల్లోకి వెళ్ళింది. ఈలోపు జంట టవర్ల పై దాడులు జరిగాయి. విచారణ లేకుండా బిన్ లాడెన్ దాడులకు బాధ్యుడు అని అమెరికా చెప్పింది. ప్రపంచం గుడ్డిగా నమ్మింది. లాడెన్ ని అప్పగించాలని అమెరికా హుకుం జారీ చేసింది. తాలిబన్ సాక్ష్యం అడిగింది. అమెరికా మీకేంటి ఇచ్ఛేది అని హుంకరించింది. యాభైకి పైగా దేశాల్ని కలుపుకుని క్రూరంగా దాడి చేసింది. 20 ఏళ్ళు ఆక్రమించి ఆఫ్ఘన్ ను అమెరికా అతలాకుతలం చేసింది. నజీబుల్లా పాలనలో సెక్యులర్ విలువలతో, స్త్రీ విద్యతో అభివృద్ధి దిశలో వెళ్లిన ఆఫ్ఘనిస్థాన్ ఇప్పుడు కూటికి అల్లాడుతున్న దేశం. దండిగా ఖనిజాలున్నా ఉపయోగించుకోలేని దైన్య దేశం. తన డబ్బుని అమెరికాకి అప్పగించి అడుక్కుంటున్న దేశం.

లిబియాలో గడ్డాఫీ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారని ఉన్నట్లుంది హఠాత్తుగా పశ్చిమ పత్రికలు ప్రచారం మొదలు పెట్టాయి. ఈజిప్టు తర్వాత అరబ్ వసంతం లిబియాలోనే అన్నాయి. బెంఘాజిలో జనాన్ని కల్నల్ గడాఫీ ఊచకోత కోస్తున్నాడని వారిని రక్షించాలని ఐరాసకు చెప్పాయి. గడాఫీ టెర్రరిస్టులకు కూడా మద్దతు ఇస్తున్నాడని నమ్మబలికాయి. లిబియాపై ‘నో ఫ్లై జోన్’ విధించాలని లేకుంటే అక్కడి జనాన్ని గడాఫీ చంపేస్తాడని చెబితే అరబ్ లీగ్ దేశాలు నమ్మేశాయి. ‘నో ఫ్లై జోన్’ కు తామూ మద్దతు పలికాయి. ఆ తర్వాత మొదలయింది నరహంతక యజ్ఞం! ‘నో ఫ్లై జోన్’ లో నాటో ఫైటర్ జెట్ లు యధేచ్ఛగా ఎగిరాయి. లిబియాపై బాంబుల వర్షం కురిపించాయి. ఏళ్లతరబడి కష్టపడి కట్టుకున్న మౌలిక నిర్మాణాలను నేలమట్టం కావించాయి. రోడ్లు, వంతెనలు, భవనాలు, చమురు శుద్ధి పరిశ్రమలు అన్నింటిని ధ్వంసం చేశాయి. గడాఫీ దేశం వదిలి వెళ్లడానికి సిద్ధపడి తాను వెళ్ళే రూట్ సమాచారం అప్పటి అమెరికా విదేశీ మంత్రి (సెక్రటరీ ఆఫ్ స్టేట్) హిల్లరీ క్లింటన్ కి పంపాడు. అలా చేస్తే తాను వెళ్ళే రూట్ లో బాంబులు వెయ్యరని గడాఫీ నమ్మాడు. ఆ సమాచారాన్ని హిల్లరీ క్లింటన్ తిరుగుబాటు పేరుతో విధ్వంసానికి పాల్పడుతున్న ఐసిస్ టెర్రరిస్టు మూకలకు అందజేసింది. వాళ్ళు గడాఫిని అడ్డగించి అత్యంత పాశవికంగా గడాఫిని చంపేశారు. గడాఫీ పాలనలో లిబియా అసాధ్యాల్ని సుసాధ్యం చేసింది. ఎడారిలో మంచి నీటి చెరువులు నిర్మించుకున్నారు. చమురు ద్వారా సమకూరిన సొమ్ముతో విద్య, వైద్య సౌకర్యాలు కల్పించారు. టెక్నాలజీ అభివృద్ధి చేశారు. ఆఫ్రికా దేశాలకు సాయం చేశారు. ఆఫ్రికా యువతకు ఉపాధి కల్పించారు. ప్రజలు సాపేక్షికంగా సమస్యలు లేకుండా గడిపారు. ఇప్పుడు ఆ దేశంలో ప్రభుత్వం లేదు. అమెరికా మద్దతు ఉన్న ప్రభుత్వం రాజధాని ట్రిపోలి దాటితే గతి లేదు. ప్రజల మద్దతు ఉన్న తిరుగుబాటు నేత ఖలీఫా హఫ్తార్ కు ఐరాస గుర్తింపు లేదు. ఒకవైపు రష్యా ప్రైవేటు మిలట్రీ కంపెనీలు (పి‌ఎం‌సి) హఫ్తార్ కు మద్దతు ఇస్తుంటే మరో పక్క టెర్రరిస్టు మూకల చేతుల్లో ఉన్న ట్రిపోలి ప్రభుత్వానికి టర్కీ పి‌ఎం‌సి లు మద్దతు ఇస్తున్నాయి. అక్కడి చమురుని టెర్రరిస్టులు, అమెరికా అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నాయి.

సిరియాలోను అంతే. నియంతృత్వానికి వ్యతిరేకంగా జనం తిరుగుబాటు చేస్తున్నారని అధ్యక్షుడు బషర్ అస్సాద్ తన జనాన్ని తానే చంపేస్తున్నాడని పశ్చిమ పత్రికలు ప్రచారం ప్రారంభించాయి. ప్రపంచం నమ్మేసింది. ఇరాక్ లో అమెరికా ప్రవేశపెట్టిన ఐసిస్ టెర్రరిస్టు మూకలు సిరియాలోనూ తిరుగుబాటు పేరుతో ప్రవేశపెట్టారు. అమెరికా, బ్రిటన్, ఈ‌యూ, ఇజ్రాయెల్, టర్కీ, కతార్, యూ‌ఏ‌ఈ తదితర దేశాలు కుమ్మక్కై ఐసిస్ మూకలకు డబ్బు, ఆయుధాలు సరఫరా చేశారు. సిరియా అంతటా విధ్వంసం తాండవించింది. అధ్యక్షుడిపై హత్యాయత్నం చేశారు. ఆయన తృటిలో తప్పించుకున్నాడు. సిరియా వద్ద రసాయన ఆయుధాలు ఉన్నాయని చెబుతూ ఆ దేశంపై దాడికి ఒబామా ఉపక్రమించాడు. రష్యా జోక్యం చేసుకుని ఐరాస అంతర్జాతీయ రసాయన ఆయుధాల నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో సిరియాలో మిగిలి ఉన్న రసాయన ఆయుధాలను ధ్వంసం చేయించింది. దాంతో అమెరికా దాడి చేయలేకపోయింది. కానీ సిరియా తూర్పు ప్రాంతంలో కొంత భూమిని ఆక్రమించి సైనిక స్థావరం ఏర్పాటు చేసింది. ఐసిస్ పురోగమనానికి వీలుగా బషర్ సైన్యాలపై ఏరియల్ దాడులు చేసింది. ఇజ్రాయెల్ అందుకు సహకరించింది. ఒకటిన్నరేళ్లలో ఇక బషర్ ఓటమి, చావు తధ్యం అనుకున్న పరిస్థితుల్లో సిరియా, రష్యా సాయాన్ని కోరింది. పుతిన్ తన సైన్యాన్ని రంగంలోకి దించి పరిస్థితిని పూర్తిగా తలకిందులు చేశాడు. రాజధాని డమాస్కస్ వరకే పరిమిత మైన బషర్ ప్రభుత్వం కిందికి మూడింట రెండు వంతుల సిరియా వచ్చేసింది. అమెరికా మద్దతుతో కుర్డులు మూడో వంతు ఉన్న ఈశాన్య సిరియాను వశం చేసుకున్నాయి. బషర్ బలగాలు, రష్యా సాయంతో ఇసిస్ టెర్రరిస్టులను పశ్చిమ మూలలో ఉన్న ఇడ్లిబ్ వరకు నెట్టుకుంటూ వెళ్ళాయి. వారికి అమెరికా, టర్కీ, బ్రిటన్, ఈ‌యూ లు రాజకీయ, ఆయుధ, ధన మద్దతు ఇస్తున్నాయి. ఇప్పటికీ ఇజ్రాయెల్ సిరియాపై బాంబు దాడులు చేస్తోంది. అమెరికా ఇసిస్ మూకలతో విధ్వంసం చేయిస్తున్నది. టర్కీ, అమెరికా, ఇజ్రాయెల్ లు సిరియా చమురుని తోడుకుని బ్లాక్ మార్కెట్ లో అమ్మి సొమ్ము చేసుకుంటున్నాయి. సిరియా ప్రజలు మాత్రం జీవన వనరులు పరుల పరం కాగా దరిద్రంతో బ్రతుకుతున్నారు. నిత్యం బాంబు దాడుల మధ్య గడుపుతున్నారు.

ప్రస్తుతం అమెరికా ఉక్రెయిన్ ని రెచ్చగొట్టి రష్యా దాడి చెయ్యక తప్పని పరిస్థితిని కల్పించింది. నాటోని రష్యా సరిహద్దుల వరకు విస్తరించడంతో తన భద్రత కోసం రష్యా వెంపర్లాడవలసి వచ్చింది. సాంస్కృతిక, సామాజిక సంబంధాల రీత్యా సోదరులతో సమానమైన ఉక్రెయిన్ ప్రజలకు యుద్ధ విధ్వంసాన్ని చవి చూపించవలసి వస్తోంది. ఉక్రెయిన్ ప్రజల భద్రత రీత్యానే రష్యా మెల్లగా పురోగామిస్తోంది. మామూలుగా అయితే రష్యా సైనిక శక్తిని తగిన రీతిలో వినియోగిస్తే కీవ్ ని వశం చేసుకోవడం రష్యాకు ఇన్ని రోజులు పట్టదు. (స్కాట్ రిట్టర్, అమెరికన్, ఐరాస ఆయుధ తనిఖీ అధికారి, యుద్ధ విశ్లేషకుడు). ఉక్రెయిన్ ప్రజల ప్రాణాలకు సాధ్యమైనంత తక్కువ నష్టం జరిగేలా చూసే లక్ష్యంతో రష్యన్ సైన్యం జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. ఉక్రెయిన్ ప్రజలు ప్యానిక్ చెందకుండా ఇంటర్నెట్, టెలిఫోన్, మొబైల్ కమ్యూనికేషన్లను రష్యా ధ్వంసం చేయలేదు. ఆ లక్ష్యంతో సొంత సైన్యానికి నష్టం కలుగుతున్నా ఓపిక వహిస్తోంది. (మింట్ ప్రెస్ న్యూస్).

అమెరికా ఆధిపత్యం ధ్వంసం కాకపోతే, అమెరికా సామ్రాజ్యవాద ఆర్ధిక, సైనిక ఆధిపత్యం పతనం కాకపోతే మరిన్ని దేశాలు ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, లిబియా, సిరియా, ఉక్రెయిన్ దేశాల సరసన చేరుతాయి. ఆయా దేశాల ప్రజల మేలు కోసమే అని చెబుతూ వాటిని ధ్వంసం చేస్తుంది. “నీ క్షేమం కోసమే నిన్ను చంపుతున్నాం” అని నిస్సిగ్గుగా, ఏ మాత్రం లాజిక్ లేకుండా, సాధారణ పరిజ్ఞానాన్ని కూడా అపహాస్యం చేస్తూ చెప్పగలిగేది అమెరికా ఒక్కటే. అమెరికా చెబితే బ్రిటన్ వెకిలి మొఖం వేసుకుని ‘తందాన’ అంటుంది. ఇతర ఈ‌యూ దేశాలు భయంతో చేతులు కట్టుకుని ‘అంతే కదా’ అంటాయి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s