ఉక్రెయిన్ పై రష్యా మిలట్రీ చర్య ప్రకటించి 12 రోజులు గడిచాయి. అనుకున్న స్థాయిలో రష్యా సేనలు ఉక్రెయిన్ లో పురోగమించలేకపోతున్నాయని దానికి కారణం ఉక్రెయిన్ బలగాలు రష్యా పై ఆధిక్యత సాధించడమే అనీ పశ్చిమ పత్రికలు నమ్మ బలుకుతున్నాయి.
అయితే ఈ వాదనను కొందరు విశ్లేషకులు తిరస్కరిస్తున్నారు. రష్యా ఉద్దేశ్యపూర్వకంగానే మిలట్రీ చర్యను నెమ్మదిగా ముందుకు తీసుకుపోతోందని, తద్వారా ఉక్రెయిన్ పౌరులు చనిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటోందని వారు వివరిస్తున్నారు.
సిరియాలో చేసినట్లుగానే ఉక్రెయిన్ బలగాలను, వారి తరపున పని చేస్తున్న విదేశీ కిరాయి బలగాలను, నాజీ గ్రూపుల మిలిటెంట్లను నిర్దిస్థ ప్రాంతానికి నెట్టుకుంటూ వెళ్ళి చుట్టుముట్టి లొంగిపొమ్మని కోరడం లేదా అంతం చేయడం… ఈ తరహా ఎత్తుగడను ఉక్రెయిన్ లో కూడా రష్యా అనుసరిస్తోందని రష్యా సైన్యం కదలికలు తదితర పరిణామాలు తెలియజేస్తున్నాయి.
కాగా రష్యా పై అమెరికాపై కనీ వినీ ఎరుగని స్థాయిలో ఆంక్షలు విధించిన అమెరికా, యూరోపియన్ యూనియన్ లు రష్యా నుండి ఆయిల్ దిగుమతులను కూడా రద్దు చేసుకుంటామని చెబుతున్నాయి. ఈ మేరకు రద్దు నిర్ణయం ప్రకటించాలని అమెరికా, ఈయూ పై తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు పత్రికల ద్వారా తెలుస్తోంది.
ఉక్రెయిన్ పై దాడి అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని, మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడటమే అనీ, ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రతకు భంగకరమని అమెరికా, ఈయూ లు ఆరోపిస్తున్నాయి. అయితే ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, లిబియా, సిరియా, సోమాలియా, యెమెన్ దేశాలపై భీకర దాడులు చేసి ఆ దేశాలను సర్వనాశనం చేసిన అమెరికా, నాటో దేశాలకు హిత బోధ చేసే హక్కు గానీ, ఆంక్షలు అమలు చేయగల నైతిక ధృతి గాని ఉన్నాయా అన్నది ప్రశ్న.
ముఖ్యంగా ఉక్రెయిన్ విషయంలో అమెరికా ప్రదర్శిస్తున్న హిపోక్రసీ మానవ నాగరికత సిగ్గు పడేలా చేస్తుందనడంలో సందేహం లేదు.
