
ఈ ఫోటోకి ప్రత్యేకంగా వ్యాఖ్యానం అవసరం లేదేమో!
నిజమే. ముస్లింలలో కొందరిని, వారి హింసాయుత చర్యల కారణంగా, అది కూడా వారి హింసకు వారి మతాన్ని అడ్డం పెట్టుకుంటున్న కారణంగా… తప్పు పట్టకుండా ఉండలేం.
కానీ ఆ బాపతు జనాలు అన్ని మతాల్లోనూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ప్రత్యేకంగా ఒక్క ముస్లిం హింసావాదులనే ఎంచి చూపడం, ప్రత్యేకంగా ఆ మతం పైనే దాడి చెయ్యడం… అన్నది ఓ కుట్రలో భాగంగా జరుగుతోంది.
2001 సెప్టెంబర్ 11 తేదీన WTC జంట టవర్ల పై దాడి జరిగాక ఈ ధోరణి విపరీతంగా పెరిగింది. అమెరికా ప్రారంభించిన ఈ కుట్ర అనంతర వాతావరణాన్ని ఇండియాతో సహా అనేక దేశాల పాలకులు తమ స్వార్ధ రాజకీయ-ఆర్ధిక-సామాజిక ప్రయోజనాల కోసం విజయవంతంగా వినియోగించుకుంటున్నారు.
తమ మతం వరకు వచ్చేసరికి ‘ఉగ్రవాదానికి మతం లేదు’ అని చాటి చెబుతారు. అదే ముస్లిం మతం వరకు వచ్చేసరికి ఇస్లాం మతమే టెర్రరిజం అని ఆరోపిస్తారు.
మతాలు ఏనాడూ శాంతిని స్థాపించిన దాఖలాలు చరిత్రలో లేవు. కానీ ఆ మతాల్ని నమ్ముకోవటం జనం మాన లేరు. ఎందుకంటే కారల్ మార్క్స్ అన్నట్లు….
రాజ్యం, సమాజం తలకిందులుగా ఉన్న ప్రపంచం కనుక మతం, ప్రపంచం యొక్క తలకిందులుగా ఉన్న చైతన్యం. మతం, ఈ ప్రపంచం యొక్క సాధారణ సిద్ధాంతం. మతం, ప్రపంచ విజ్ఞాన సర్వస్వం యొక్క సారం. మతం, ప్రపంచపు ప్రజాదరణ పొందిన రూపంలోని తర్కం. మతం, ప్రపంచపు అత్యాధ్మిక గౌరవాన్ని సమున్నతపరిచే అంశం. మతం ప్రపంచం యొక్క ఉత్సుకత, నైతిక నియమం, వైదిక అనుబంధితం (solemn complement), మరియు ప్రపంచపు ఊరటకూ, ఔచిత్యానికీ సార్వజనీన ప్రాతిపదిక. మానవ సారం (human essence) ఏ విధంగానూ నిజమైన వాస్తవికతను సంతరించుకోని పరిస్ధితుల్లో అది మానవ సారం యొక్క అద్భుతమైన సాక్షాత్కారం…!
…మతం, అణచివేతకు గురవుతున్న ఒక జీవి విడిచే నిట్టూర్పు. హృదయం రహిత ప్రపంచానికి హృదయం, అత్మరహిత పరిస్ధితులకు ఆత్మ. అది ప్రజలపాలిట మత్తుమందు….
ఈ పరిస్ధితి కొనసాగినంతవరకూ మతాలు ప్రజాదరణ పొందుతూనే ఉంటాయి. ఆ మతం పేరుతో వైషమ్యాలు, హింస, వినాశనం కొనసాగుతూనే ఉంటాయి. ‘మా మతం శాంతిని ప్రభోదిస్తుంది’ అని ప్రతి మతం వాళ్ళూ చెబుతున్నప్పటికీ ఇవి కొనసాగుతూ ఉంటాయి. అదే అసలు దౌర్భాగ్యం!