ఆరు నెలల్లో అమరావతి పూర్తి కావాలి -హై కోర్టు


AP High Court Full Bench

ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. రాష్ట్ర ప్రభుత్వం ఆరు నెలల్లో ఆంద్ర ప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి చేయాలని స్పష్టం చేసింది. రాజధానిని ఎలా వీలుంటే అలా ఒక చోటి నుండి మరొక చోటికి మార్చే హాక్కు గాని, లేదా ప్రభుత్వ అంగాలను చిత్తం వచ్చిన రీతిలో ముక్కలు చేసే అధికారం గానీ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అని హై కోర్టు తీర్పు చెప్పింది.

మూడు రాజధానుల చట్టాన్ని రద్దు చేస్తున్నట్లు లేదా ఉపసంహరించుకున్నట్లు హై కోర్టులో ప్రకటించిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు “మూడు రాజధానుల నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం” అని ప్రకటించడం ఇక కుదరదు అని హై కోర్టు తన తీర్పు ద్వారా స్పష్టం చేసింది. రాజధాని నిర్మాణాన్ని 6 నెలల్లో పూర్తి చేసి భూములు ఇచ్చిన వారికి తగిన న్యాయం చేయాలని కోరడం ద్వారా హై కోర్టు అమరావతి రైతులకు సంతోషాన్ని కలిగించింది.

హై కోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వం గత మూడేళ్లుగా రాజధాని విషయంలో సాగిస్తున్న దోబూచులాటకు ముగింపు పలికింది. హై కోర్టు తీర్పు కంటే ముందు గానే మూడు రాజధానుల చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్నందున హై కోర్టు తీర్పు పై సుప్రీం కోర్టుకు వెళ్ళే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నదా లేదా అన్నది సంశయంగా మిగిలింది.

హై కోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎం సత్యనారాయణ మూర్తి, జస్టిస్ డి‌వి‌ఎస్‌ఎస్ సోమయాజులు లతో కూడిన ఫుల్ బెంచి ఈ రోజు, మార్చి 3 తేదీన ఈ సంచలన తీర్పు వెలువరించింది. తీర్పులో హై కోర్టు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను తప్పు పడుతూ వివిధ వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా రెండున్నరేళ్లు పైగా అమరావతి కోసం ఆందోళన చేస్తున్న స్థానిక రైతులను, సొంత భూములను రాజధానికి నయానో, భయానో ఇచ్చిన రైతులను హై కోర్టు తీర్పు సంతోష పెట్టింది.

మూడు రాజధానుల చట్టాన్ని రద్దు చేసినందున రద్దులో భాగంగా ఏ‌పి‌సి‌ఆర్‌డి‌ఏ చట్టం 2014 ను పునరుద్ధరించబడింది. కనుక ఈ పునరుద్ధరించబడిన చట్టం ప్రకారం మరియు ల్యాండ్ పూలింగ్ రూల్స్ 2015 చట్టం ప్రకారం చట్టం లోని నియమ నిబంధనల ప్రకారం రాజధానిని 6 నెలల లోపు నిర్మించాలని కోర్టు స్పష్టం చేసింది.

ఏ‌పి డీసెంట్రలైజేషన్ అండ్ ఇంక్లూజివ్ దవలప్మెంట్ ఆఫ్ అల్ రీజియన్స్ యాక్స్ 2020 మరియు ఆంధ్ర ప్రదేశ్ కేపిటల్ రీజియన్ దవలప్మెంట్ (రిపీల్) యాక్ట్ 2020… ఈ రెండు చట్టాల ద్వారా జగన్ ప్రభుత్వం ఏ‌పి‌సి‌ఆర్‌డి‌ఏ చట్టాన్ని రద్దు చేసి, అమరావతి, కర్నూలు, విశాఖపట్నం లలో మూడు రాజధానులు నిర్మించనున్నట్లు ప్రకటించింది. కానీ అమరావతి పరిరక్షణ సమితి పేరుతో రైతులు ఆందోళనకు దిగి, కోర్టు మెట్లు ఎక్కడంతో రాజధాని నిర్మాణం అనేదే లేకుండా పోయింది.

2020 చట్టాలను జగన్ ప్రభుత్వం ఉపసంహరించుకున్న తర్వాత కూడా హై కోర్టు విచారణ కొనసాగించింది. అసలు ఈ చట్టాలను చేయగల అధికారం, చట్టబద్ధత రాష్ట్ర ప్రభుత్వానికి లేదని కోర్టు స్పష్టం చేసింది.

“రాజధానిని మరియు ప్రభుత్వానికి చెందిన మూడు విభాగాల అధిపతులను ద్వివిభజన లేదా త్రివిభజన చేస్తూ చట్టం చేసే సమర్ధత (competence) రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. హై కోర్టు లేదా మరే ప్రభుత్వ విభాగాన్నైనా రాజధాని తప్ప మరే ఇతర ప్రాంతానికి తరలించే సమర్ధత కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఏ‌పి‌సి‌ఆర్‌డి‌ఏ చట్టం 2014 లోని సెక్షన్ 3 ప్రకారం మరియు ఆంధ్ర ప్రదేశ్ కేపిటల్ సిటీ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ రూల్స్ 2015 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సమర్ధతలు దఖలు పడలేదు” అని హైకోర్టు తేల్చి చెప్పింది.

ఒక్క ముక్కలో చెప్పాలంటే 2020 లో జగన్ ప్రభుత్వం తెచ్చిన రెండు చట్టాలను తెచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో లేదు అని హై కోర్టు తేల్చింది.

తమ భూములను రాజధాని కోసం ఇచ్చిన రైతులకు అభివృద్ధ్ చేసిన పునర్నిర్మాణం చేసిన ప్లాట్లను 2018 లోపు ఇస్తామన్న హామీని రాష్ట్ర ప్రభుత్వం నిలుపుకోవటంలో విఫలం అయిందని, రాజధాని నిర్మాణం చేసి ఇవ్వలేకపోయిందని కోర్టు తప్పు పట్టింది.

“రాజధాని కోసం 33,000 మండి రైతులు భూములు ఇచ్చారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం 2020లో మూడు రాజధానుల ప్రతిపాదన చేయడంతో రైతుల కుటుంబాలు జీవనోపాధి కోల్పోయారు. అందువల్లనే వారు కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది” అని కోర్టు గుర్తించింది.

రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో చేపట్టిన చర్య రాజ్యాంగం లోని ఆర్టికల్ 21 మరియు ఆర్టికల్ 300-A లను ఉల్లంఘించింది. ఈ చర్య ఏకప్క్షం అని కోర్టు తన తీర్పులో పేర్కొంది.

“ఇప్పటి ప్రభుత్వం గత ప్రభుత్వం ఇచ్చిన ప్రాజెక్టులను, అవి రాజ్యాంగ విరుద్ధం అయితే తప్ప, పూర్తి చేయవలసిన చట్టబద్ధ బాధ్యత కలిగి ఉన్నది. నిర్మాణం మరియు ఇతర కార్యకలాపాలకు ఖర్చు చేసిన 15,000 కోట్లు, మరియు అభివృద్ధి పనులకు, గ్రౌండింగ్ పనులకు 32,000 కోట్ల సొమ్ముకు రాష్ట్ర ప్రభుత్వం తగిన బాధ్యత స్వీకరించాల్సి ఉన్నది. రాష్ట్రం, ఏ‌పి‌సి‌ఆర్‌డి‌ఏ లు నమ్మకాన్ని నిలుపుకోవడం లో విఫలమై సుపరిపాలనకు వ్యక్తిరేకంగా చర్యలు చేపట్టి రాజ్యాంగ పరమైన నమ్మకాన్ని ఉల్లంఘించినందున ఆర్టికల్ 226 ద్వారా సమకూరిన విశేషాధికారాలను వినియోగించి  రాష్ట్ర ప్రభుత్వ పనుల నిమిత్తం, సేకరించిన భూములలో మౌలిక రంగాల నిర్మాణాల పూర్తి చేసేందుకు తగిన ఉత్తర్వులు ఇవ్వవచ్చు” అని కోర్టు ఏ అధికారాల ప్రకారం తాను తీర్పు ఇచ్చినది తెలియజేసింది.

కోర్టు కింది ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది.

  1. ల్యాండ్ పూలింగ్ రూల్స్, 2015 లోని షెడ్యూల్ II, III ల క్రింద రూపొందించిన విధులను నిర్వర్తించాలి.
  2. రాజధాని నగర నిర్మాణం లేదా రాజధాని ప్రాంత అభివృద్ధికి తప్ప సేకరించిన భూములను పరాయీకరణ (బేదఖలు) చేయడం / తాకట్టు పెట్టడం లేదా మూడవ పార్టీకి ప్రయోజనాలు కల్పించడం చేయరాదు.
  3. అమరావతి రాజధాని నగరం మరియు ప్రాంతాలలో అభివృద్ధి మరియు మౌలిక నిర్మాణాలను పూర్తి చేయాలి. ఏ‌పి‌సి‌ఆర్‌డి‌ఏ చట్టం, ల్యాండ్ పులింగ్ రూల్స్ 2015, రూల్ 12(6) ప్రకారం రోడ్లు, తాగు నీరు, డ్రైనేజి, విద్యుత్ లాంటి మౌలిక సౌకర్యాలను ఈ ఆదేశం వెలువడిన నెలలోపు కల్పించాలి.
  4. ఏ‌పి‌సి‌ఆర్‌డి‌ఏ చట్టం సెక్షన్ 61 ప్రకారం టౌన్ ప్లానింగ్ స్కీమ్ ను పూర్తి చేయాలి.
  5. ఏ‌పి‌సి‌ఆర్‌డి‌ఏ చట్టం మరియు ల్యాండ్ పూలింగ్ రూల్స్ 2015 మేరకు ఫారం 9.14 లో పేర్కొన్న విధంగా ‘అభివృద్ధి ఒప్పందం కమ్ ఇర్రివోకబుల్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ లో అంగీకరించిన మేరకు అమరావతి రాజధాని నగరాన్ని మరియు రాజధాని ప్రాంతాన్ని 6 నెలల లోపు నిర్మించాలి.
  6. అమరావతి రాజధాని ప్రాంతం లోని భూ యజమానులకు చెందిన ప్లాట్లను రాష్ట్రం మరియు ఏ‌పి‌సి‌ఆర్‌డి‌ఏ లు అభివృద్ధి చేసి అప్రోచ్ రోడ్లు, తాగునీరు, విద్యుత్ కనెక్షన్, డ్రైనేజి ప్రతి ప్లాట్ కు కల్పించి ఇవ్వాలి. అమరావతి రాజధాని నగరంలో సదరు ప్లాట్లు నివాసయోగ్యంగా ఉండాలి.
  7. అమరావతి రాజధాని ప్రాంతంలో అభ్వృద్ధి చేసి పునః రూపొందించిబడిన ప్లాట్ లను రాష్ట్ర ప్రభుత్వం మరియు ఏ‌పి‌సి‌ఆర్‌డి‌ఏ లు అభివృద్ధి చేసి ఆయా భూముల యజమానులకు అప్రోచ్ రోడ్ లతో సహా హామీ ఇచ్చిన మేరకు 3 నెలల లోపు అప్పగించాలి.

జగన్ ప్రభుత్వం పట్టుదలకు పోకుండా హై కోర్టు తీర్పును అమలు చేయడం అన్నివిధాల శ్రేయస్కరం. ఏళ్ల తరబడి ఒక రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన ఘనత ఏ‌పి రాష్ట్ర పాలకులకు దక్కుతుంది. హైదారాబాద్ పోయింది మొర్రో అని ఏడ్చిన ఈ పెద్ద మనుషులు ఏ మాత్రం చేవ ఉన్న స్వార్ధ రాజకీయాలు పక్కనపెట్టి అంతకు మించిన రాజధాని నగరాన్ని ప్రణాళికా బద్ధంగా ఎటువంటి సమస్యలు భవిష్యత్తులో తలెత్తని విధంగా నిర్మిచగలిగినట్లయితే జనం మెచ్చుకుంటారు.

దానికి బదులు కులాల లెక్కన తమను తామే విభజించుకుని రియల్ ఎస్టేట్ లాభాలను జుర్రు కోవడం కోసం ‘సింగపూర్ తెస్తా’ అని ఒకరు, ‘మూడు రాజధానులు నిర్మిస్తా’ అని ఇంకొకరు జనాల్ని వెర్రి వాజమ్మలను చేసి ఆడుకుంటూ వచ్చారు. వీరిలో ఏ ఒక్కరూ తాము పరిపాలనా దక్షులమని నిరూపించుకోలేకపోయారు. పాలనా దక్షత అన్నది ఇలాంటి అత్యవసరమైన సమయాల్లోనే బైటపడుతుంది. పాత పాలకులు అందించిన నిర్మాణాలను, వ్యవస్థలను యధావిధిగా కొనసాగిస్తూ ‘ఎక్కడున్నవే గొంగళి అంటే నువ్వు వేసిన దగ్గరే’ అన్నట్లుగా ఏ మాత్రం సృజనాత్మకత లేకుండా  నిలవ నీటిలో ఈదుతూ గడిపే పాలకులు ఉండిననేమి, మండినేమి?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s