ఉక్రెయిన్ తరపున విదేశీ కిరాయి సైనికులు!


ఉక్రెయిన్ తరపున అమెరికా, ఈ‌యూలు కిరాయి సైనికులను రంగంలోకి దింపుతున్నాయి. సొంత సైన్యాలను పంపితే అది రష్యాపై స్వయంగా యుద్ధం ప్రకటించినట్లు! అదే కిరాయి కోసం పని చేసే సైనికులను పంపితే వారు చచ్చినా, బ్రతికినా ‘మాకు సంబంధం లేదు’ అని సింపుల్ గా చేతులు దులుపుకోవచ్చు. పైగా యుద్ధం గెలిస్తే అనధికారికంగా క్రెడిట్ కూడా దక్కించుకోవచ్చు.

కిరాయి సైనికులతో పాటు అమెరికాకు చెందిన ప్రైవేటు మిలట్రీ కంపెనీలు కూడా తమ బలగాలను ఉక్రెయిన్ తరపున యుద్ధరంగానికి తరలిస్తున్నాయి.

“అమెరికా మిలట్రీ ఇంటలిజెన్స్ సంస్థలు ప్రైవేట్ మిలట్రీ కాంట్రాక్టర్లను ఉక్రెయిన్ పంపటానికి పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేపట్టాయి. అమెరికన్ ప్రైవేట్ మిలట్రీ కంపెనీలు ‘అకాడమి’, ‘క్యూబిక్’, ‘డైన్ కార్ప్’ లకు చెందిన కిరాయి బలగాలు ఇప్పటికే బయలుదేరాయి” అని రష్యా రక్షణ శాఖ ప్రతినిధి ఇగోర్ కొనషెంకోవ్ పత్రికలకు తెలిపాడు.

“రష్యా ఒకవైపు ఉక్రెయిన్ లో “చుట్టివేత, అణచివేత” వ్యూహంతో ఉక్రెయిన్ జాతీయవాద (నయా నాజీ గ్రూపులు) ప్రధాన గ్రూపులను తుదముట్టిస్తోంది. మరో వైపు పశ్చిమ దేశాలు యుద్ధ ప్రాంతాలకు కాంట్రాక్టు మిలట్రీ బలగాలను పంపటం తీవ్రం చేశాయి” అని రష్యా రక్షణ శాఖ తెలిపింది.

ఈ వార్తను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ధృవీకరించాడు. టెలిగ్రామ్ చానెల్ లో వీడియోను విడుదల చేస్తూ ఆయన “విదేశాల నుండి 16,000 మందికి పైగా వాలంటరీ సైన్యాలు ఉక్రెయిన్ తరపున యుద్ధం చేసేందుకు వస్తున్నాయి. వారిని మేము ఆహ్వానిస్తున్నాము” అని ప్రకటించాడు.

“మా మిత్ర దేశం జపాన్ నుండి 70 మంది వాలంటరీ సైనికులను ఉక్రెయిన్ కి వస్తున్నారు” అని జపాన్ లోని ఉక్రెయిన్ ఎంబసీ ప్రకటించింది. వారందరూ జపాన్ లో సెల్ఫ్ డిఫెన్స్ గ్రూపులకు చెందినవారని జపాన్ వర్గాలు చెప్పాయి (జపాన్ టుడే, 03/03/2022).

జపనీయులు ఉక్రెయిన్ తరపున యుద్ధం చేసేందుకు ఎందుకు వస్తున్నట్లు? “రష్యా బలగాలు ఉక్రెయిన్ పై దాడులు చేయటం సహించలేకపోతున్నాం” అని కొందరు, “జపనీయులుగా యుద్ధాన్ని ఆపాలనుకుంటున్నాం” అని కొందరు చెప్పారని జపాన్ టుడే తెలిపింది.

“రష్యన్ బలగాలను తిప్పి కొట్టడానికి ఇంటర్నేషనల్ లీజియన్ లో చేరి పని చేసేందుకు విదేశీయులను ఆహ్వానిస్తున్నాం” అని ఉక్రెయిన్ అధ్యక్షుడు ట్విట్టర్ లో ఇచ్చిన పిలుపుకు స్పందంగా ఈ 70 మంది బయలుదేరారని ఎంబసీ తెలిపింది. జెలెన్ స్కీ ట్విట్టర్ లో పెట్టిన పోస్ట్ ని ఆ తర్వాత తొలగించినట్లు తెలుస్తోంది.

జపాన్ చట్టాల ప్రకారం జపనీయులు విదేశీ మిలట్రీ రిక్రూట్ మెంట్ లో పాల్గొనడం చట్టరీత్యా నేరం. ప్రైవేటుగా విదేశాలపై యుద్ధం చేయటాన్ని జపాన్ చట్టాలు అంగీకరించవు. ఈ నేపధ్యంలో జపాన్ చీఫ్ కేబినెట్ సెక్రటరీ హిరోకాజు మత్సునో జపనీయులను ఉక్రెయిన్ వెళ్లొద్దని విజ్ఞప్తి చేశాడు. “కారణం ఏదైనా ఉక్రెయిన్ కు ప్రయాణం చేయ్యుద్దు” అని ఆయన కోరాడు.

జపాన్ నుండి కొందరు యుద్ధంలో పాల్గొనేందుకు వెళ్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని జపాన్ విదేశీ మంత్రి యోషిమాస హయాషి కూడా ధృవీకరించాడు. జపాన్ లోని ఉక్రెయిన్ ఎంబసీ జపాన్ నుండి యుద్ధం నిమిత్తం 17.4 మిలియన్ డాలర్ల విరాళాన్ని సేకరించినట్లు కూడా ప్రకటించింది.

కిరాయి సైనికులు, ప్రైవేటు మిలట్రీ బలగాలు యుద్ధానికి సంబంధించిన ఎలాంటి నిబంధనలు, అంతర్జాతీయ చట్టాలు, జెనీవా ఒప్పందాలను పట్టించుకోవు. అత్యంత క్రూరమైన పద్ధతుల్లో వారు వినాశనానికి దిగుతారు. అనేక విధ్వంసక చర్యలకు దిగుతారు, జనావాసాలన్న లెక్క ఉండదు. ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్లకు పాల్పడతారు. అంటే తామే ఉక్రెయిన్ ప్రజలపై విధ్వంసక దాడులు చేసి ఆ పని రష్యన్ సైన్యం చేసిందని ప్రచారం చేస్తారు. ఈ ప్రచారాన్ని అందుకోవటానికి పశ్చిమ మీడియా సిద్ధంగా ఉంటుంది.

ముఖ్యంగా అమెరికా, ఈ‌యూ లకు చెందిన కిరాయి బలగాలు ఇటువంటి విద్యలలో ఆరితేరాయి. ఇరాక్, సిరియా, లిబియా, యెమెన్, సోమాలియా లాంటి చోట్ల కిరాయి తిరుగుబాట్లు రెచ్చగొట్టి పెద్ద ఎత్తున ప్రాణ, ధన, ఆస్తుల నష్టానికి పాల్పడ్డారు. అమెరికా, యూరోపియన్ యూనియన్ లు ఈ ప్రక్రియను ఒక శక్తివంతమైన ఎత్తుగడగా అమలు చేస్తూ వస్తున్నాయి. తమ ప్రయోజనాలను, తమ కంపెనీల వాణిజ్యాలను వ్యతిరేకించే ఏ దేశం పైనైనా ఇలాంటి చర్యలకు దిగడం అమెరికా, పశ్చిమ దేశాలకు ఆనవాయితీగా మారిందని అమెరికా పత్రికలు సైతం అప్పుడప్పుడూ అంగీకరించే నిజం.

“ఉక్రెయిన్ కు విదేశాల నుండి వచ్చే కిరాయి సైనికులు రష్యన్ యుద్ధ పరికరాల కాన్వాయ్ లపైనా, మెటీరీయల్ సరఫరాల పైనా, వాటిని కవర్ చేసే విమానాల పైనా దొంగచాటు విధ్వంసక చర్యలకు పాల్పడతారు” అని రష్యా ప్రతినిధి కొనషెంకోవ్ తెలిపాడు.

క్రొయేషియా నుండి 200 మంది కిరాయి సైనికులు ఇప్పటికే ఉక్రెయిన్ వచ్చారని రష్యా తెలిపింది. అలాగే యూ‌కే, డెన్మార్క్, లాట్వియా, పోలండ్ దేశాలు కూడా తమ వంతుగా కిరాయి బలగాలను ఉక్రెయిన్ పంపాయని తెలుస్తోంది.

రష్యాతో నేరుగా యుద్ధం చేయడం నాటో కు సమ్మతం కాదని చెప్పిన అమెరికా, ఐరోపా దేశాలు ఇలా నేరుగా కాకుండా పరోక్షంగా ప్రైవేటు కిరాయి సైన్యాన్ని ఉక్రెయిన్ కి పంపిస్తున్నాయి. వారంతా అమెరికా, బ్రిటన్ ఇతర దేశాలు అందజేసిన శక్తివంతమైన ఆయుధాలను (జావెలిన్ యాంటీ ట్యాంక్ మిసైళ్ళు, మ్యాన్-పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ మిసైళ్ళు విస్తృతంగా వినియోగిస్తున్నారని తెలుస్తోంది.

విదేశాల నుండి ఎవరు తొందర పడి ఇలా ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొనడానికి రావద్దని రష్యా బహిరంగంగా విజ్ఞప్తి చేసింది. తర్వాత జరిగే పరిణామాలకు తాము బాధ్యులము కాదని హెచ్చరించింది. యుద్ధంలో చనిపోతే వారిని కనీసం సొంతం చేసుకునేవారు ఎవరూ ఉండబోరని గుర్తు చేసింది. ఒకవేళ పట్టుబడితే ‘యుద్ధ ఖైదీలు’ అన్న స్థాయి కూడా దక్కదని హెచ్చరించింది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s