
UN General Assembly
రష్యా ఉక్రెయిన్ లో సాగిస్తున్న మిలట్రీ ఆపరేషన్ ను వెంటనే ఆపాలని ఐక్యరాజ్య సమితి తీర్మానం ఆమోదించింది. 193 సభ్య దేశాలున్న ఐక్య రాజ్య సమితి (యూఎన్‌ఓ) జనరల్ అసెంబ్లీ బుధవారం జనరల్ అసెంబ్లీ సమావేశం జరిపింది.
ఉక్రెయిన్ అంశం ఎజెండాగా అత్యవసర జనరల్ అసెంబ్లీ సమావేశం జరపాలా లేదా అన్న అంశంపై ఐరాస భద్రతా సమితి నిన్న ఓటింగ్ నిర్వహించింది. 5 శాశ్వత సభ్య దేశాలతో పాటు 10 తాత్కాలిక సభ్య దేశాలు ఓటింగ్ లో పాల్గొనగా 11 – 1 తేడాతో తీర్మానం నెగ్గింది.
భద్రతా సమితి ఓటింగ్ లో ఇండియా పాల్గొనలేదు. యూఏఈ, చైనా కూడా ఓటింగ్ కు దూరంగా ఉన్నాయి. ఆరంభంలో రష్యాకు మద్దతు ఇస్తూ అమెరికా, నాటో వల్లనే దాడి యుద్ధం వచ్చిందని వాదించిన చైనా క్రమంగా వివాదం నుండి దూరం జరుగుతూ వచ్చింది. ఇరు పక్షాలు చర్చలు చేయాలని చెబుతూ తటస్థ వైఖరి తీసుకుంది.
భద్రతా సమితిలో జరిగిన నిర్ణయం మేరకు బుధవారం ఐరాస ప్రత్యేక ఎమర్జెన్సీ జనరల్ అసెంబ్లీ సమావేశం నిర్వహించింది. ఉక్రెయిన్ లో రష్యా నిర్వహిస్తున్న మిలట్రీ ఆపరేషన్ వెంటనే నిలుపు చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానాన్ని ఓటింగ్ కు పెట్టారు.
ఓటింగ్ లో తీర్మానానికి అనుకూలంగా 141 ఓట్లు వచ్చాయని బిబిసి తెలియజేసింది. వ్యతిరేకంగా ఎన్ని ఓట్లు వచ్చింది బిబిసి చెప్పలేదు. రష్యా వార్తా సంస్థ స్పుత్నిక్ న్యూస్ ఐరాస జనరల్ అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది అని చెప్పింది గాని తీర్మానానికి అనుకూలంగా, వ్యతిరేకంగా ఎన్ని ఓట్లు వచ్చింది చెప్పలేదు.
చానెల్ న్యూస్ ఏసియా ప్రకారం 35 సభ్య దేశాలు ఓటింగ్ నుండి ఉపసంహరించుకున్నాయి. వాటిలో ఇండియా, చైనాలు ఉన్నాయి. 5 దేశాలు వ్యతిరేకంగా ఓటు వేశాయి. మియాన్మార్, వెనిజులా, సిరియా, బెలారూస్, రష్యా లు వ్యతిరేక ఓటు వేశాయి.
తీర్మానం పదజాలంలో రష్యా దాడిని ఖండిస్తున్నామన్న పదజాలం ఉంటుందని భావించగా అలా లేదని తెలుస్తోంది. “ఉక్రెయిన్ పై రష్యా దూకుడు (aggression) పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాము” అని మాత్రమే తీర్మానం పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే అణ్వస్త్రాలను “హై అలర్ట్” లో ఉంచటాన్ని తీర్మానం ఖండించినట్లు తెలుస్తోంది.
ఐరాస రష్యా ప్రతినిధి వాసిలి నెబెంజియా ఓటింగ్ కు ముందు తీర్మానానికి మద్దతు ఇవ్వద్దని సభ్య దేశాలకు విజ్ఞప్తి చేశాడు. రష్యన్ మిలట్రీ ఆపరేషన్ ను ఖండించే తీర్మానాన్ని ఆమోదించవద్దని కోరాడు.
“తమ ప్రయోజనాలకు అనుకూలంగా ఉండేట్లుగా ఓటు వేయాలని పశ్చిమ దేశాలు సభ్య దేశాలపై పెద్ద ఎత్తున ఒత్తిడి తెచ్చిన సంగతి మాకు తెలుసు. బహిరంగంగానే సభ్య దేశాలను బెదిరించారు. వాటి గురించి మాకు తెలుసు” అని ఆయన తెలిపాడు.
అందరూ భావించినట్లుగానే రష్యాకు వ్యతిరేకంగా తీర్మానం నెగ్గింది. ఐరాస ఏర్పడ్డాక అత్యవసర ప్రత్యేక జనరల్ అసెంబ్లీ సమావేశం జరపడం ఇది 10వ సారి మాత్రమే అని తెలుస్తోంది.
అమెరికా అన్యాయంగా కుంటి సాకుతో ఆఫ్ఘనిస్తాన్ పై దాడి చేసినప్పుడు గాని, అబద్ధాలు చెప్పి ఇరాక్ పై దురాక్రమణ దాడి చేసినప్పుడు గాని, లిబియాపై నో-ఫ్లై జోన్ అమలు చేసి నాటో విమానాలు బాంబులతో ఆ దేశాన్ని సర్వనాశనం చేసినప్పుడు గాని, సిరియాపై ఇప్పటికీ అమెరికా, ఇజ్రాయెల్, ఫ్రాన్స్, బ్రిటన్ లు గుర్తుకు వచ్చినప్పుడల్లా ఇసిస్ ని సాకు చూపుతూ సిరియా ప్రభుత్వ సేనలపై బాంబు దాడులు కొనసాగిస్తున్నాప్పుడు గాని, లేదా ఇజ్రాయెల్ ఇప్పటికీ పాలస్తీనా భూభాగాలను, పాలస్తీనీయుల ఇళ్లను, వారి నీటి, ఖనిజ, వ్యవసాయ వనరులను కబళిస్తున్నా గానీ ఈ ఐరాస, ఐరాస భద్రత సమితి నోరు తెరిచి ఒక్క మాట అడిగిన పాపాన పోలేదు.
ఇజ్రాయెల్ సాగిస్తున్న వలస పాలనను కనీసం ఖండించిన పాపాన పోలేదు. యూదు దురహంకారంతో సాగిస్తున్న జాత్యహంకార పాలనను ఇప్పటికీ కొంసాగిస్తున్నప్పటికి నిలదీయడం అటుంచి కనీసం చర్చించి ఖండించిన పరిస్థితి లేదు.
ఇప్పుడు అమెరికా ఒత్తిడితో బలహీన దేశాలపై ఒత్తిడి తెచ్చి పశ్చిమ దేశాలు రష్యా వ్యతిరేక తీర్మానాన్ని ఆమోదించేశాయి. రష్యా దాడి ఆపాలని తీర్మానం చేయడంలో నిజానికి తప్పు లేదు. కానీ అదే గొంతుతో రెండు దశాబ్దాలుగా తూర్పు ఐరోపాలో నాటో సైనిక కూటమిని విస్తరిస్తూ, ఆ దేశాల్లో మిసైల్ రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తూ అంతకంతకూ ఉద్రిక్తతలు పెంచుతూ పోయిన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ లను కూడా ఖండించ గలిగితేనే రష్యాను దాడిని ఆపమని అడిగే నైతిక హక్కు జనరల్ అసెంబ్లీకి ఉంటుంది.
దాడికి ముందు కూడా తన భద్రతకు నాటో, అమెరికాలు తగిన గ్యారంటీలు ఇవ్వాలని రష్యా కోరినప్పటికి అమెరికా, నాటో లు తిరస్కరించాయి లేదా చూద్దాం, చేద్దాం, మరింత చర్చిద్దాం అన్నాయి తప్ప నిర్దిష్ట హామీ ఇవ్వలేదు. ఈ నేపధ్యాన్ని గూడా జనరల్ అసెంబ్లీ చర్చించి తగిన విధంగా తీర్మానం చేసినట్లయితే ఐరాస తీర్మానానికి అర్ధం ఉండేది. ఏకపక్షంగా బలవంతుడి ఒత్తిడి ప్రకారం ఆ బలవంతుడికి అనుకూలంగా, ఆ బలవంతుడు చెప్పినట్లు చేసిన తీర్మానం గనుక దానికి విలువ లేకుండా పోయింది.
ఐరాస జనరల్ అసెంబ్లీ తీర్మాణాలకు కట్టుబడి ఉండవలసిన అవసరం సభ్య దేశాలకు ఉండదు. కేవలం భద్రతా సమితి తీర్మానాలకు మాత్రమే అంతర్జాతీయ చట్టబధ్రత ఉంటుంది. కనుక జనరల్ అసెంబ్లీ తీర్మానం అలంకార ప్రాయం మాత్రమే.