రష్యాపై ఆర్ధిక ఆంక్షలు ఫలిస్తాయా?


Ruble

ఉక్రెయిన్ పై దాడి చేసిన రష్యాపై సైనికంగా ఎదుర్కోలేని పరిస్థితిలో ఉన్న అమెరికా, నాటో, ఈ‌యూ లు ఆర్ధికంగా రష్యా నాడులు తెంచేందుకు అనేక చర్యలు ప్రకటించాయి.

అంతర్జాతీయ చెల్లింపులు, కొనుగోళ్లకు అత్యంత ముఖ్యమైన స్విఫ్ట్ వ్యవస్థ నుండి రష్యాను బహిష్కరించడం దగ్గరి నుండి అధ్యక్షుడు పుతిన్, విదేశీ మంత్రి లావరోవ్ లపై వ్యక్తిగత ఆంక్షలు విధించడం వరకు అనేక ఆంక్షలు అవి విధించాయి.

అంతటితో ఆగకుండా ప్రతిరోజూ ఏదో ఒక దేశం, ఏదో ఒక ఆంక్ష లేదా ప్రతి చర్య ప్రకటించేలా అమెరికా, ఈ‌యూలు చేస్తున్నాయి.

ఇవేవీ రష్యా తన దాడి నుండి వెనక్కి మళ్లింపజేయడంలో పని చేయలేదు. నిజానికి ఈ ఆంక్షలను ఎదుర్కోవలసి ఉంటుందని రష్యాకు ముందే తెలుసు. ఆ మేరకు విదేశీ మంత్రి లావరోవ్ దాడి చేసిన రోజు ప్రకటించాడు కూడా. “మేము దాడి చేసినా, చేయకపోయినా వాళ్ళు ఆంక్షలు ఎలాగూ విధిస్తారు. మా లక్ష్యం నెరవేరే వరకు మా నిర్ణయం కొనసాగుతుంది” అని విదేశీ మంత్రి సెర్గి లావరోవ్ ప్రకటించాడు.

ఇప్పటివరకు ప్రకటించిన ఆంక్షలు అన్నీ రష్యా నేతలు ఊహించనావేనా అన్న విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వాళ్ళు ఊహించిన దాని కంటే ఎక్కువగా పశ్చిమ దేశాలు ఆంక్షలు ప్రకటించాయని కొందరు, అదేమీ లేదు, ఈ ఆంక్షలు ఎప్పటి నుండే అమెరికా చెబుతున్నవే అని మరికొందరు చెబుతున్నారు.

ఇంతకీ ఏయే ఆర్ధిక ఆంక్షలు ప్రకటించారు? ఎంతవరకు అవి ప్రభావం కల్పిస్తాయి? అమెరికా, యూరోపియన్ కమిషన్ తో పాటు బ్రిటన్, కెనడా దేశాలు ప్రధానంగా 4 ఆర్ధిక ఆంక్షలు ప్రకటించాయి.

  • ఎంపిక చేసిన రష్యన్ బ్యాంకులను SWIFT (Society for Worldwide Interbank Financial Telecommunications) పరిధి నుండి తొలగించాయి.
  • పశ్చిమ దేశాల బ్యాంకులు, ట్రెజరీల్లో మదుపు చేసిన రష్యా సెంట్రల్ బ్యాంకు రిజర్వ్ నిధులను ఆంక్షలకు విరుద్ధంగా ఉపయోగించకుండా పరిమితులు విధించారు. రూబుల్ పతనాన్ని అడ్డుకోకుండా ఫారెన్ కరెన్సీ రిజర్వ్ లను ఉపయోగించకుండా ఇది నిరోధిస్తుంది.
  • బడా రష్యన్ సంపన్నుల ఆర్ధిక కార్యకలాపాలను స్తంభింప చేసేందుకు నిర్ణయించారు. ముఖ్యంగా గోల్డెన్ పాస్ పోర్ట్ లు ఇవ్వొద్దని నిర్ణయించారు. పశ్చిమ దేశాల్లో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టినందుకు ప్రతిఫలంగా ఇలాంటి పాస్ పోర్ట్ లు ఇవ్వడం ఆ దేశాలు ప్రారంభించాయి.
  • అధ్యక్షుడు పుతిన్, విదేశీ మంత్రి లావరోవ్ తో సహా యుద్ధానికి దోహదం చేస్తున్న సంపన్న వ్యక్తుల కుటుంబాలకు చెందిన విదేశీ ఆస్తులను స్తంభింపజేయడం.

రష్యన్ సెక్యూరిటీ కౌన్సిల్ సభ్యులు, మరో 11 మంది పేర్లను వ్యక్తిగత ఆస్తుల స్తంభన జాబితాలో చేర్చారు. పుతిన్, లావరోవ్ లాంటి ప్రభుత్వ నేతల పేర్లను ఆంక్షల జాబితాలో చేర్చడం “అత్యంత అరుదైన చర్య” అని అమెరికా అధ్యక్షుడు బైడెన్ సగర్వంగా ప్రకటించాడు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిం-జోంగ్-అన్, బెలరూస్ అధ్యక్షుడు అలెక్సాండర్ లుకషెంకో, సిరియా అధ్యక్షుడు బషర్ ఆల్-అస్సాద్ లపై, అమెరికా, ఈ‌యూ లు వ్యక్తిగత ఆంక్షలు విధించారు.

SWIFT నుండి తొలగింపు!

పైన ఉదహరించిన ఆర్ధిక ఆంక్షలలో SWIFT నుండి రష్యాను తొలగించిన చర్య తీవ్రమైందని అమెరికా, ఐరోపా నేతలతో పాటు అనేక మంది విశ్లేషకులు చెబుతున్నారు. ఆర్ధిక వ్యవస్థను ఆర్ధిక వ్యవస్థను బలహీనం చేయడంలో శక్తివంతమైన చర్య అని పత్రికలు అదే పనిగా రాస్తున్నాయి.

కానీ ఇది కేవలం సంకేతాత్మకంగా మాత్రమే పని చేస్తుంది తప్ప రష్యన్ ఆర్ధిక వ్యవస్థకు నష్టం కలిగిస్తుందని చెప్పలేమని, ఈ చర్య దానికదే పెద్దగా ప్రభావం కలిగించదని, చెల్లింపు వ్యవస్థలో పని చేస్తున్న నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ఎందుకంటే SWIFT అన్నది కేవలం చెల్లింపులకు సంబంధించిన సమాచారాన్ని సందేశం (message) రూపంలో పంపించేందుకు ఉపయోగిస్తారు తప్ప అసలు చెల్లింపును ఎగ్జిక్యూట్ చేసేది కాకపోవడమే.

ఉదాహరణకి ఒక లండన్ బ్యాంకు రష్యన్ ఫెడరేషన్ లోని ఒక బ్యాంకుకు నిధులు పంపిస్తుంది అనుకుందాం. ఇంత మొత్తంలో నిధులు పంపిస్తున్నాం అని లండన్ బ్యాంకు, SWIFT ద్వారా రష్యన్ బ్యాంకుకు మెసేజ్ పంపుతుంది తప్ప సదరు నిధుల్ని చెల్లించే పనిని అది చేయదు. స్విఫ్ట్ చేసే పని సమాచారం అటు నుండి ఇటు పంపడమే.

అసలు చెల్లింపు ఇతర మార్గాల ద్వారా జరుగుతుంది. లండన్ బ్యాంకుకు లేదా కంపెనీకి అప్పటికే రష్యన్ బ్యాంకులో నిధులు ఉంటే వాటిని చెల్లించవలసిన వాళ్ళకు ట్రాన్సఫర్ చెయ్యొచ్చు. లేదా ఫారెన్ కరెన్సీ మార్కెట్ లో రూబుల్స్ కొనుగోలు చెయ్యొచ్చు. లేదా రష్యన్ ప్రభుత్వం రూబుళ్లలో జారీ చేసే  బాండ్లను కొనుగోలు చెయ్యొచ్చు… ఇలా. ఇవేవీ స్విఫ్ట్ పైన ఆధారపడి ఉండవు.

ఇతర మార్గాల్లో చెల్లింపులు చేస్తూ స్విఫ్ట్ ద్వారా పంపే మెసేజ్ ను ఇతర మార్గాల ద్వారా కూడా పంపవచ్చు. రష్యా స్వయంగా ఒక మెసేజింగ్ వ్యవస్థను (SPFS – రష్యా భాష పదజాలం) అభివృద్ధి చేసుకుంది. ఇది రష్యా దేశం లోపలి వరకు ఉపయోగపడుతుంది. విదేశీ చెల్లింపులకు చైనా సెంట్రల్ బ్యాంకు అభివృద్ధి చేసిన CIPS (Cross-border International Payment System) ని ఉపయోగించి చెల్లింపులు చెయ్యొచ్చు. (CIPS ని ఆంక్షల పరిధిలోకి తెనంతవరకూ). CIPS చెల్లింపులు రెన్ మిన్ బి (యువాన్) లలో చేయవలసి ఉంటుంది. చివరికి వాట్సప్ యాప్ ద్వారా కూడా మెసేజ్ పంపుకునే ఏర్పాట్లు చేసుకోవచ్చు.

అయితే స్విఫ్ట్ వ్యవస్థ ఎలాంటి ఆటంకాలు లేకుండా భద్రంగా వేగంగా సందేశాలు పంపేలా అభివృద్ధి చేశారు. దానికి మాత్రమే ప్రత్యేకమైన కమ్యూనికేషన్ వ్యవస్థను కేటాయించడం ద్వారా వేగాన్ని, ఎన్^క్రిప్షన్ సదుపాయం కల్పించడం ద్వారా భద్రతను సమకూర్చారు. సైబర్ దాడులకు గురయ్యే అవకాశాలు దాదాపు కేకుండా స్విఫ్ట్ కు కట్టుదిట్టమైన ఎన్^క్రిప్షన్ కల్పించారు.

రష్యా, చైనాలపై అమెరికా అడ్డదిడ్డమైన ఆంక్షలు విధించడం మొదలు పెట్టిన దగ్గర్నుండి ఆ దేశాలు స్వంత చెల్లింపుల వ్యవస్థను అభివృద్ధి చేసుకున్నాయి. అయితే స్విఫ్ట్ స్థాయిలో ఇవి ఇంకా అభివృద్ధి చెందలేదు. స్విఫ్ట్ ని 1973 లో బెల్జియం ప్రారంభించింది. టెలిఫోన్ ద్వారా, ఫ్యాక్స్ ద్వారా సందేశాలు పంపడం మొదలుకొని ఇప్పుడు ఇంటర్నెట్ ద్వారా సందేశాలు పంపడం వరకు అభివృద్ధి అయింది. 200 పైగా దేశాలు, ప్రాంతాలు ఈ సిస్టం ను ఉపయోగించి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.

కనుక ఆర్ధికంగా దెబ్బ కొట్టాలంటే స్విఫ్ట్ వల్ల పెద్దగా పని జరగదు. ఇతర చర్యలు మాత్రం పని చేస్తాయి. ఉదాహరణకి రష్యన్ ఫెడరల్ బ్యాంకు అంతర్జాతీయంగా చెల్లింపులు ఇతర ట్రాన్సాక్షన్ లు జరపకుండా అడ్డంకులు సృష్టించడం వల్ల రూబుల్ పై నమ్మకం తగ్గి విలువ పడిపోతుంది. దీనివల్ల రష్యన్ సెంట్రల్ బ్యాంకు వడ్డీ రేటును 9.5 శాతం నుండి అమాంతం 20 శాతానికి పెంచాల్సి వచ్చింది.

రష్యా ద్రవ్య సంస్థలు (financial institutions) చేసే అన్ని రకాల లావాదేవీల పైనా బ్రిటన్ ఆంక్షలు విధించింది. ఈ చర్య వలన రష్యా అంతర్జాతీయ వాణిజ్యం, మదుపు (investment) లపై భారీ ప్రభావం పడుతుంది. రష్యా విదేశాల్లో వివిధ ద్రవ్య వనరుల్లో నిల్వ చేసిన 650 బిలియన్ డాలర్ల నిధులను పశ్చిమ దేశాలు స్తంభిపజేశాయి. ఇది కూడా గట్టి చర్యే. స్వదేశీ కరెన్సీ పతనం అవుతున్నప్పుడు విదేశీ కరెన్సీలతో రూబుల్స్ కొనుగోలు చేయడం ద్వారా పతనాన్ని రష్యా సెంట్రల్ బ్యాంకు అడ్డుకుంటుంది. ఇప్పుడు ఆ సౌకర్యం లేకుండా చేశారు. అందువల్ల రష్యాలోని వాళ్ళు తమ విదేశీ ద్రవ్యాన్ని బైటికి పంపకుండా పరిమితి విధించడం ద్వారా రూబుల్ పతనాన్ని అడ్డుకునేందుకు రష్యా ప్రయత్నిస్తోంది. ఇప్పటికైతే ఆ ప్రయత్నం సఫలం అయినట్లు కనిపిస్తోంది.

అయితే ఆర్ధిక ఆంక్షలు ఎంత తీవ్రంగా ఉన్నప్పటికి అవి సుదీర్ఘకాలం పాటు కొనసాగితే తప్ప అనుకున్న లక్ష్యాన్ని సాధించడం కష్టం అని అనుభవం చెబుతోంది.

ఇరాన్, వెనిజులా, ఉత్తర కొరియాలు తమపై విధించిన ఆంక్షలను విజయవంతంగా ఎదుర్కొంటున్నాయి. ఒబామా ప్రభుత్వం 2011లో ఇరాన్ ప్రభుత్వం అమెరికాలో ఉంచిన ఆస్తులన్నింటిని స్తంభింపజేసింది. ఇరాన్ సెంట్రల్ బ్యాంకు తో పాటు ఇతర ఫైనాన్షియల్ కంపెనీల ఆస్తులను కూడా స్తంభింపజేసింది. ఆ తర్వాత ఇరానియన్ బ్యాంకులను స్విఫ్ట్ నుండి తప్పించింది.

అయినా ఇరానియన్ బ్యాంకులు ఇతర మార్గాల్లో అంతర్జాతీయ చెల్లింపులు చేస్తూ వచ్చాయి. ఇతర దేశాల్లోని బ్యాంకులను ఉపయోగించుకుంది. ప్రతిఫలంగా కొంత మార్జిన్ లాభాన్ని అందజేసింది. కొన్ని ఐరోపా బ్యాంకులు కూడా ఇరాన్ కు ఉపయోగపడ్డాయి. ఆ మేరకు అమెరికా ఆంక్షల మూల్యాన్ని ఇరాన్ భరించింది. ఇది అంతా తేలిక కాకపోయినప్పటికి అసాధ్యం మాత్రం కాదు. రష్యా కైతే ఇరాన్ కంటే మెరుగైన సాధనాలే అందుబాటులో ఉండగలవు, చైనా మద్దతు ఇవ్వగలిగితే.

ఆర్ధిక ఆంక్షలు నిజానికి రెండు వైపులా పదును ఉన్న కత్తి. రష్యాతో పాటు అమెరికా, ఐరోపాలు కూడా నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. నార్డ్ స్ట్రీమ్ 2 కి అనుమతులు ఇవ్వడాన్ని స్తంభించడం ద్వారా జర్మనీ ఉక్రెయిన్ కు మద్దతు ఇస్తోంది. కానీ ఆ మేరకు గ్యాస్ దిగుమతుల్ని కోల్పోతుంది. ఆంక్షల వల్ల గ్యాస్ ధర అమాంతం 1000 క్యూబిక్ మీటర్లకు 2200 డాలర్లు పైగా చేరుకుంది. స్పాట్ కొనుగోళ్లలో ఇంకా ఎక్కువ మొత్తం చెల్లించాలి. అమెరికా గ్యాస్ ఐరోపా చేరేందుకు ఇప్పటికిప్పుడు మార్గం లేదు, ట్యాంకర్లలో తెస్తే తప్ప. ఎంత కాదనుకున్నా రష్యన్ గ్యాస్ లేకుండా జర్మనీ ఇతర ఈ‌యూ దేశాలకు రోజు గడిచే అవకాశం లేదు. అందుకే గ్యాస్ ను ఆంక్షల నుండి తప్పించాలని ఇప్పటికే ఐరోపా దేశాలు అమెరికాను వేడుకుంటున్నాయి. అధికారికంగా కాకుండా ఇతర మార్గాల్లో గ్యాస్ వాణిజ్యాన్ని అనుమతించే అవకాశాలు లేకపోలేదు. దొంగచాటు మార్గాలు ఎలాగూ ఉంటాయి.

ఆర్ధిక నష్టాన్ని భరించైనా సరే నాటో తన ఇంటి ముందుకు తెచ్చి పెట్టిన భద్రతా ప్రమాదాన్ని తొలగించుకునేందుకే రష్యా సిద్ధం అయినట్లు ఇప్పటికే స్పష్టం అయింది. తెగించిన వారిని ఎవరూ ఏమి చేయలేరు. యుద్ధానికి తగిన రాజకీయ, ఆర్ధిక, దౌత్య వనరులను పుతిన్ గత దశాబ్దం పైగా సమకూర్చుకున్నట్లు ఇప్పుడు ఒక్కొక్కరికి అవగతం అవుతోంది. యుద్ధానికి వ్యతిరేకంగా అసమ్మతి, ఆందోళన తీవ్రం కాకుండా తన మాటకు ఎదురు చెప్పలేని ఆటోక్రటిక్ వ్యవస్థను పుతిన్ ఏర్పరుచుకున్నాడు. సొంత టి.వి చానెళ్ల ద్వారా పశ్చిమ దేశాల కుట్రలను వెల్లడిస్తు వచ్చాడు. ఈ కారణం వల్లనే రష్యన్ ఆంగ్ల వార్తా చానెళ్లు ఆర్‌టి, స్పుత్నిక్ లపై అమెరికా, ఐరోపా దేశాలు వివిధ ఆంక్షలు విధిస్తూ వచ్చాయి. ఇప్పుడైతే పూర్తిగా ఆపేశాయి.

ఉక్రెయిన్ పై రష్యా దాడిని సామాన్య ప్రజలు, ముఖ్యంగా శ్రామిక ప్రజలు సమర్ధించడానికి వీలు లేదు. అలాగని నాటో విస్తరణకు అవకాశం కల్పిస్తున్న ఉక్రెయిన్ ప్రభుత్వ చర్యలకు మద్దతు ఇవ్వడానికి వీలు లేదు. ఉక్రెయిన్ చర్యలకు ఉక్రెయిన్ కంటే అమెరికా, నాటో, ఈ‌యూ లే ప్రధాన బాధ్యులు. పుతిన్ వాదిస్తున్నట్లు రష్యా భద్రత కోసం ఉక్రెయిన్ పై దాడి చేయవలసిన ఆగత్యాన్ని నాటో కల్పించింది. యుద్ధం వల్ల మొదట నష్టపోయేది కార్మికవర్గ ప్రజలు, రష్యన్ కార్మికవర్గం, మధ్యతరగతి ప్రజలు కూడా తీవ్రంగా నష్టపోనున్నారు. రూబుల్ పతనం వల్ల నిత్యావసర ధరలు పెరిగి సామాన్యుడు భరించలేని స్థితి ఏర్పడింది. మధ్యతరగతి ప్రజలు దాచుకున్న సొమ్ముకు హఠాత్తుగా విలువ లేకుండా పోయింది.

కనుక దాడిని రష్యా విరమించాలి. దాడి విరమించే పరిస్థితిని అమెరికా, నాటో లు కల్పించాలి. నాటో విస్తరణను వెంటనే నిలిపివేయడం, కనీసం పాత సోవియట్ రష్యా దేశాలనైనా నాటో నుండి తొలగించడం, ఉక్రెయిన్ కు ఆయుధ సాయం నిలిపివేయడం, మిన్స్క్ ఒప్పందాలు అమలు చేసేలా ఉక్రెయిన్ కు మద్దతు ఇవ్వడం. ఇవి చేస్తే రష్యా దాడి విరమించుకునే అవకాశం ఉన్నది.

కానీ రెండో విడత చర్చలకు హాజరు కాకుండా ఉక్రెయిన్ పై అమెరికా ఒత్తిడి చేస్తున్నట్లు ఈ రోజు వార్తలు చెబుతున్నాయి. కనుక దాడి కొనసాగుతుంది. ఇరువైపులా శ్రామిక ప్రజలు నష్టపోతారు. ధన, ప్రాణ, ఆస్తి నష్టాలు వారు ఎదుర్కొంటారు. ఈ దాడి పైకి ఉక్రెయిన్ వరకే పరిమితం అయినట్లు కనిపిస్తున్నప్పటికి ఇది వాస్తవానికి రష్యా, నాటో ల మధ్య జరుగుతున్న యుద్ధం ఎన్నో ఒప్పందాలు జరిగితే తప్ప అందని 4 బిలియన్ డాలర్ల ఆయుధ సాయాన్ని అమెరికా, నాటోలు ఉక్రెయిన్ కి అందిస్తున్నాయంటే ఏమిటి అర్ధం? ఉక్రెయిన్ చేస్తున్న యుద్ధం నిజానికి ఉక్రెయిన్ చేస్తున్నది కాదు, నాటో చేస్తున్నది. ఉక్రెయిన్ భుజాలపై తుపాకి పెట్టి నాటో కాల్పులు సాగిస్తోంది.

కనుక ఉక్రెయిన్ యుద్ధంలో ప్రధాన దోషి అమెరికా మరియు నాటో!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s